అధర్మాసుపత్రి | Fake hospital | Sakshi
Sakshi News home page

అధర్మాసుపత్రి

Published Wed, Sep 9 2015 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

అధర్మాసుపత్రి

అధర్మాసుపత్రి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి, ఇవే సమస్యలు. ఈ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు... రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ‘సాక్షి’ సోమవారం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించింది. ఆ వివరాలు సాక్షి పాఠకులకు ప్రత్యేకం. ప్రభుత్వ నిర్లక్ష్యం.. వైద్యుల అలసత్వం... అరకొర వసతులు రోగులపాలిట శాపంగా మారాయి. అందుకు నిదర్శనం... జిల్లాకేంద్రమైన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రే .

ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు అనేకమంది తీరిగ్గా ఉదయం 10 గంటల నుంచి రావటం కనిపించింది. అలా 11.30 వరకు వస్తూనే ఉన్నారు. వచ్చిన వైద్యులు వెంటనే విధుల్లోకి వెళ్తారా? అంటే అదీ లేదు. కొంతసేపు కాలక్షేపం చేసి ఆయా వార్డులకు వెళ్లారు. పట్టుమని గంట పని చేశారు. క్యాజువాలిటీ మినహా మధ్యాహ్నం 12.30 కంతా వైద్యులు బ్యాగులు సర్దుకుని వెళ్లటం కనిపిం చింది. ఇది ఒక్క నెల్లూరులోనే కాదు.. ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. నెల్లూరు ఆసుపత్రిలోని గుండెకు సంబంధించిన వార్డు 11.45కి తెరుచుకుంది. రోగులు మాత్రం ఉదయం 7.30 నుంచే ఆసుపత్రికి చేరుకోవటం కనిపించింది.

 ఓపీ ఫుల్.. సేవలు నిల్
 వివిధ ప్రాంతాల నుంచి నెల్లూ రు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వారు 1,030 మంది ఉన్నారు. అయితే చాలామంది వైద్యులు హాజరుకాలేదు. వచ్చి న వారు కూడా విధుల్లో ఉండకపోవటంతో... జూనియర్ డాక్టర్లే సేవలందించటం కనిపించింది. జిల్లావ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు జనం వైద్యం కోసం పెద్దఎత్తున రావటం కనిపించింది. అయితే వైద్యసేవలు మాత్రం అంతంత మాత్రమే. ఇకపోతే వైద్యులు ఆలస్యంగా రావటం తో అనేకమంది చికిత్సలు చేయించుకోకనే వెనుదిరుగుతున్నారు.అదెలాఅంటారా... రోగు లు ఓపీ కోసం 20 నిమిషాలు వేచి ఉంటారు. అక్కడి నుంచి డాక్టర్ వద్ద కెళ్తారు. అక్కడా అరగంట వేచి ఉంటారు.

ఆ డాక్టర్ పరీక్ష చేసుకురమ్మని పంపుతారు. అక్కడా మరో గంట. అన్నీ తీసుకుని వచ్చేసరికి సీట్లో డాక్టర్ ఉండరు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రా ల్లో అవసరమైన డాక్టర్లు లేకపోవటం కూడా మరో కారణం. చిల్లకూరు మండలం చింతవరం, విడవలూరు మండలం రామతీర్థం పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేకపోవటంతో స్టాఫ్‌నర్సులే అన్నీ తానై వ్యవహరించటం కనిపించింది. ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.

 పనిచేయని ల్యాబ్‌లు
 నెల్లూరు ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ పనిచేయటం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఎక్స్‌రేలు, స్కానింగ్ సెంటర్‌లు, ల్యాబ్‌లు పనిచేయటం లేదు. అదేవిధంగా రక్త పరీక్ష కేంద్రాలు కూడా అనేకచోట్ల తూతూమంత్రంగా పనిచేస్తున్నాయి. ఉన్న పరికరాలు కాలం చెల్లినవి కావటంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఒకవేళ పనిచేసినా.. సిబ్బంది లేకపోవటంతో పరీక్షల కోసం రోగులకు తిప్పలుతప్పటం లేదు. ప్రైవేటు పరీక్ష కేంద్రాలను ఆశ్రయిస్తూ.. జేబులకు చిల్లుపెట్టుకుంటున్నారు.

 ఆసుపత్రిలో మందుల్లేవ్..
 నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన రోగులకు మందులు ఇవ్వకుండా చీటీలు రాసి బయటకు పంపేస్తున్నారు. కొన్ని మందులు ఉన్నా సగమే ఇచ్చి వాటితో సర్దుకోమని చెప్పి పంపటం కనిపించింది. ముఖ్యంగా బీకాంప్లెక్స్, క్రిమాఫిన్, యానోబ్లిస్ ఆయింట్‌మెంట్ వంటి మందులు లేకపోవటం గమనార్హం. మందులని రోగులు అడిగితే ‘లేవ్ లేవ్ పో పో.. చెప్పేది నీకే.. వినపడట్లేదా’ అంటూ కసురుకుంటున్నారు. ఆసుపత్రిలో వీల్‌చైర్, స్ట్రెక్చర్ కావాలంటే రూ.50 ఇవ్వాలి. ఇస్తేనే సిబ్బంది రోగులను తీసుకెళ్తారు. రూ.10, రూ.20 ఇస్తే మేం బిచ్చగాళ్లమా అని సిబ్బంది కేకలు వేస్తున్నారు. ప్రసూతి కేంద్రంలో స్కానింగ్ పనిచేయకపోవటంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 ఆసుపత్రుల్లో దాహం దాహం
 జిల్లావ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో దాతల సాయంతో ఏర్పాటు చేసిన మినరల్‌వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. దీంతో రోగులు, సిబ్బంది నీళ్లబాటిల్ కొనుగోలు చేసుకుని రావటం కనిపించింది. అదే విధంగా గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి, సర్వేపల్లి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నీరులేక రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 అపరిశుభ్రంగా ఆసుపత్రులు
 ఆసుపత్రుల పరిసరాలన్నీ అపరిశుభ్రం గా దర్శనమిస్తున్నాయి. ఎక్కడచూసిన మురుగునీరు, పందులు, కుక్కలు,  వాడిపడేసిన సిరంజిలు, మాస్క్‌లు, గ్లౌజులు, సెలైన్ బాటిల్స్ కుప్పలు కుప్పలుగా ఉండటంతో ఆ ప్రాంతం దుర్వాస న వెదజల్లుతోంది. పెద్దాసుపత్రి మొత్తం వార్డులో దుర్వాసన ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బర్నింగ్ వార్డు మరీ అధ్వానంగా ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా ఆసుపత్రులకు నిర్లక్ష్యపు జబ్బు సోకటంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement