వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంకానున్న ఐదు కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని సీఎం పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య శాఖలో పోస్టుల భర్తీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇతర కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్షించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
ఐఏఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు భర్తీ..
ప్రభుత్వాస్పత్రులను వేధించే ప్రధాన సమస్య మానవ వనరుల కొరత. దీనికి చెక్ పెట్టేలా ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టాం. ఈ నియామకాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుండాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయిన పోస్టులను గుర్తించి భర్తీ చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలి. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏదైనా పోస్టు ఖాళీ అయితే నాలుగు వారాల్లో భర్తీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
ఆరోగ్య పరిస్థితులపై ట్రాకింగ్
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలి. అప్పుడే ప్రివెంటివ్ కేర్‌లో ఆశించిన లక్ష్యాలను సాధించగలం. కార్యక్రమం అమలులో పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ఎంతో కీలకం. మధుమేహం, రక్తపోటు, ఇతర నాన్ కమ్యూనికబుల్, కమ్యూనికబుల్ జబ్బుల బాధితులకు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.
ఫ్యామిలీ డాక్టర్ వద్ద వీరికి చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. విలేజ్ క్లినిక్‌ల స్థాయిలో కంటి పరీక్షలు చేపట్టాలి. క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. టీబీ నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయడం ద్వారా బాధితులను గుర్తించాలి. వారికి మంచి చికిత్స అందించే దిశగా అడుగులు వేయాలి.
క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత పొందిన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ కార్డులు అందజేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టాలి. సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి చోటా ఫోన్ నంబర్లు ప్రదర్శించాలి. వాటిని సకాలంలో పరిష్కరించాలి.
1.39 కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ సేవలు
గతేడాది అక్టోబర్ 22 నుంచి ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 1,39,97,189 మందికి సేవలందించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 35,79,569 మంది రక్తపోటు, 24,31,934 మంది మధుమేహం బాధితులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్‌వో) శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ ఎయిడ్, పాముకాటు, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు.
సికిల్‌సెల్ అనీమియా నివారణలో భాగంగా ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దంత వైద్యులు ప్రతినెలా పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టీబీ నివారణపైనా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది మరో 3 మెడికల్ కాలేజీలు..
విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నందా్యలలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 కొత్త వైద్య కళాశాలలు పాడేరు, పులివెందుల, ఆదోనిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన కళాశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.
సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రఘురామరెడ్డి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి, డీఎంఈ నరసింహం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment