సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు.
వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో వైద్యులు దీర్ఘకాలం సెలవులో ఉండడం, అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం వంటివి సమర్థనీయం కాదని, అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. నూరుశాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా ఆస్పత్రుల వారీగా, సిబ్బంది వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపానల్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై క్వాలిటీ చెక్ చేయాలని చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించి ఉద్యోగులు నెలనెలా చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా సొమ్మును కూడా ప్రతి నెల సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమయ్యేవిధంగా చూడాలని ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్‌ను సీఎస్ ఆదేశించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని ప్రభుత్వ డాక్టర్లను గుర్తించి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, తదుపరి చర్యలకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఆరి్థకశాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి మంజుల, ఏపీవీవీపీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఈ నర్సింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment