Jawahar reddy
-
సీఎస్ మా భూముల వద్దకు రాలేదు..
విశాఖ సిటీ: అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై బురద జల్లడానికి ప్రయత్నించిన ఎల్లో మీడియా యత్నాలు బెడిసికొట్టాయి. సీఎస్‌పై విశాఖ జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడైంది. సీఎస్ ఎన్నడూ తమ భూముల వద్దకు రాలేదని, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే సమయంలో రోడ్డు మీదుగా మాత్రమే వెళ్లారని జనసేన, టీడీపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు కుండబద్ధలు కొట్టారు. విశాఖలో 800 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ రైతుల నుంచి బలవంతంగా రాయించుకొని ఫ్రీ హోల్డ్ అనుమతులు పొందినట్లు పీతలమూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. దీన్ని ఆధారాలతో నిరూపిస్తానని బీరాలు పలికిన ఆయన శుక్రవారం టీడీపీ కార్యాలయంలో రైతులు చిట్టెమ్మ, అప్పన్న, నారాయణతో ప్రెస్‌మీట్ నిర్వహించి చివరకు తెల్లమొహంవేశారు. అగ్రిమెంట్లు చేయలేదన్న రైతులు తమ భూములను ఎవరికీ అగ్రిమెంట్ చేయలేదని మీడియా సమావేశంలో రైతులు స్పష్టం చేశారు. సీఎస్ ఎప్పుడైనా మీ భూములు ఇవ్వాలని బలవంతం చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అసలు జవహర్‌రెడ్డి ఎన్నడూ తమ భూముల వద్దకే రాలేదని రైతులు స్పష్టం చేశారు. ఇటీవల భోగాపురం విమానాశ్రయం పనుల పరిశీలన నిమిత్తం వచ్చినప్పుడు ఇటుగా వెళ్లడంతో అలా భావించామనడంతో టీడీపీ నేతలు, జనసేన కార్పొరేటర్ కంగుతిన్నారు. 700 ఎకరాలకే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ గత ఎనిమిది నెలల్లో విశాఖ జిల్లాలో 700 ఎకరాల అసైన్డ్ భూములకు మాత్రమే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యల్పంగా అనుమతులు ఇచ్చిన జిల్లాల్లో విశాఖ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.1 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలుస్తోంది. దళితులకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో జీవో 596 ఇచ్చింది. ఇరు గ్రామాల మధ్య ఐదేళ్లుగా వివాదం టీడీపీ, జనసేన నేతలు తీసుకొచ్చిన రైతుల మధ్య భూ వివాదాలు ఐదేళ్లుగా నలుగుతున్నాయి. భీమిలి మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం పంచాయతీల మధ్య అసైన్డ్ భూముల వివాదాన్ని సీఎస్‌కు అంటగట్టేందుకు ప్రయత్నించి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ భంగపడ్డాడు. రైతులు మాట్లాడుతుండగా సీఎస్ పేరు చెప్పాలని ఆయన గదమాయించడం గమనార్హం. జవహర్‌రెడ్డి పేరు కూడా తెలియని వారంతా తడబడుతూ జవర్ అని పేర్కొన్నారు. పార్టీకి సంబంధం లేదు.. సీఎస్‌పై పీతల మూర్తి యాదవ్ ఆరోపణల గురించి జనసేన విశాఖ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను ఇటీవల మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఆయన బయట చేసే వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం సీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని మూర్తి యాదవ్‌ను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని సీఎస్ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరోపణలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రిల్‌లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహానికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆదివారం కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లానని సీఎస్ తెలిపారు. ఆ మరుసటి రోజు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు అసైన్డ్ భూములు కొట్టేసినట్లు యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీలో 2023 అక్టోబర్‌లో సభ ఆమోదం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసైన్డ్ భూములపై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్ పేర్కొన్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపాదించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడి ద్వారా విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్ చేసినట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకున్నాననడంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.మరో 400 ఎకరాలను రిజిస్రే్టషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవాస్తవమని సీఎస్ తెలిపారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు. -
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
-
వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
-
చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
సాక్షి, అమరావతి: ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి. అది రాజకీయ దురుద్ధేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు. జవహర్ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు. తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పరాజయానికి సాకులు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘వన్స్ మోర్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు. ఓ వైపు చంద్రబాబు, లోకేశ్.. మరోవైపు పురందేశ్వరి, పవన్ కల్యాణ్.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా. బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫిల్మ్ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం. పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సీఎస్ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్.ఎస్. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు. తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు. కాదనడానికి మీరెవరు రామోజీ? దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు. కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి. -
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు
సాక్షి, అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలుస్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని, కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఉన్న కేంద్రాలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానమై ఉంటాయని, వాటిలో పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. జనవరి నుండి ఇప్పటివరకు రూ.78 కోట్ల నగదు, రూ.41 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, రూ.30 కోట్ల విలవైన వివిధ డ్రగ్స్ వంటివి మొత్తం రూ.176 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన గత నాలుగు రోజుల్లోనే వివిధ రూ. 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు సహా 121 చెక్ పోస్టులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 1.50 లక్షల మంది రాష్ట్ర పోలీసులు, 522 కంపెనీల స్టేట్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, 465 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డు తదితర స్థాయి పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది, వాహనాలు సిద్ధం: మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 4,09,41,182 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు, పోలింగ్ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరమని చెప్పారు. 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్ ఎఆర్ఓలు, 5,067 మంది సెక్టోరల్ అధికారులు, 5,067 మంది సెక్టోరల్ పోలీస్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,48,814 మంది పోలింగ్ అధికారులు, 46,165 బూత్ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించామన్నారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గాల పరిధిలో మోడల్ కోడ్ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో హోం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు హరీశ్ కుమార్ గుప్త, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, విద్యా శాఖ కమిషనర్ సురేశ్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, సీడీఎంఏ శ్రీకేశ్ బాలాజీ రావు, అదనపు సీఈవో హరీంద్ర ప్రసాద్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవి ప్రకాశ్ పాల్గొన్నారు. -
కట్టుదిట్టంగా ‘కోడ్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ని కట్టుదిట్టంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లన్నింటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియోలు కూడా వెంటనే తొలగించాలని సీఎస్ స్పష్టంచేశారు. అంతేకాక.. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను, ఫ్లెక్సీలతోపాటు ప్రభుత్వ ఆస్తులపైనున్న రాజకీయ ప్రకటనలన్నీ కూడా తొలగించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోడ్ అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. చాలావరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్నందున వారంతా కోడ్ మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలి. కోడ్‌కు సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో కార్యదర్శులందరూ నివేదిక ఇవ్వాలి. పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరంలేదు : ముఖేష్ కుమార్ మీనా ♦ ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. ♦ బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు నిషిద్ధం. ♦వర్క్ఆర్డర్ ఉండి క్షేత్రస్థాయిలో మొదలు కాని పనులను చేపట్టకూడదు. పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధంలేదు. ♦ అలాగే, వివిధ రకాల పించన్లపంపిణీకీ ఎలాంటి అభ్యంతరంలేదు. ♦ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్డ్ లబ్ధిదారులకు యధావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చు. కోడ్ అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. కానీ, టెండర్లను ఖరారు చేయడానికి వీల్లేదు. ♦ కోడ్ అమలులోకి వచ్చాక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించకూడదు. ♦ పీఎం, సీఎం సహాయ నిధి కింద రోగుల చికిత్స నిమిత్తం నిధులు మంజూరు చెయ్యొచ్చు. అన్ని రకాల ప్రకటనలనూ నిలిపివేయాలి.. ఇక కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ వెంటనే తొలగించాలి. అలాగే, వివిధ పబ్లిక్ ఆస్తులు అంటే.. బహిరంగ ప్రదేశాలు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైలు..రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు.. వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నింటినీ వెంటనే తొలగించాలి. అదే విధంగా.. ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేయాలి. మంత్రులెవరూ అధికారిక వాహనాలు వాడరాదు.. ఎన్నికల ప్రకటన వచ్చేసినందున ఇక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు. ఎంపీ లేదా ఎంఎల్ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ప్రజాప్రతినిధుల ఫొటోలు కూడా ఉండరాదు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలూ ఉండకూడదు. అలాగే, విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై కూడా ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి కూడా ఉండకూడదు. ప్రభుత్వోద్యోగులెవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర ఏ రకమైన లబి్ధపొందినా అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, వై. శ్రీలక్ష్మి, కె. విజయానంద్, వర్చువల్‌గా.. ఎం.టి. కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్‌కుమార్, హరీశ్‌కుమార్ గుప్తా, ప్రవీణ్‌ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీమోహన్, పలువురు కార్యదర్శులు, కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ కీలక ఆదేశాలు
-
ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : గత ఏడాది అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జనన, మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికెట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. పాస్‌పోర్టు, ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటరు, వివాహ నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పసరి చేసిందని సీఎస్ స్పష్టంచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని, ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీల్లో కలిపి మొత్తం 14,752 జనన, మరణాల నమోదు యూనిట్లు ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి.. ఇక కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉందని సీఎస్ చెప్పారు. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్ రిజి్రస్టార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన, మరణాల డేటాను నిర్వహిస్తారన్నారు. ఏ అథారిటీకైనా ఈ డేటా కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరముంటుందని ఆయన తెలిపారు. జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్టు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ల డేటాబేస్లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అన్ని జననాలను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు నివేదించాల్సి ఉందని, ఇందులో జాప్యంలేకుండా సమీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎస్ కలెక్టర్లను కోరారు. -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారన్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులకు సూచించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
కట్టుదిట్టంగా ఎన్నికల కోడ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిందని, దీనిని రాష్ట్రమంతటా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సీఎస్ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల నియమావళిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించారు. అలాగే బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నీ తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ ఇచ్చిన ఆదేశాల్లో ప్రధానమైనవి.. ♦ ప్రింట్, ఎల్రక్టానిక్, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల ప్రకటనలు నిలిపివేయాలి ♦ ప్రభుత్వ వెబ్సైట్లలో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ఫొటోలను వెంటనే తొలగించాలి ♦ మంత్రులెవరూ అధికారిక వాహనాలను, హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు. మంత్రుల ఎన్నికల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించకూడదు. ♦ ఎంపీ లేదా ఎమ్మెల్యే నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండకూడదు ♦ ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండకూడదు. ♦ మంత్రులు అధికారులతో ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించకూడదు ♦ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండకూడదు ♦ ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళడానికి వీల్లేదు. ♦ ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీల్లేదు ♦ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతరత్రా లబ్ధి పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123, 129, 134, 134 ఎ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ♦ బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, రాయితీలు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం ♦ వర్క్ఆర్డర్ ఉన్నప్పటికీ, కేత్రస్థాయిలో మొదలు కాని పనులు చేపట్టకూడదు. ♦ పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధం లేదు. ♦ పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్నీ, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకు సకాలంలో నిధుల మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు. -
AP: ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి: సీఎస్
సాక్షి, విజయవాడ: లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన యాడ్లు, వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని సీఎస్ స్పష్టం చేశారు. మంత్రుల ఎన్ని కల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండ రాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు. అదే విధంగా మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీలు లేదని సీఎస్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఏ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. అలాగే పీఎం,సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకై సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ ధ్రువ పత్రాల నియంత్రణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: జనన, మరణ నమోదు (సవరణ చట్టం–2023)పై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ పత్రాలను నియంత్రించేందుకు పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన కోసం తగిన సమాచారాన్ని అందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిస్టర్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన, మరణ రిజిస్ట్రేన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు జాబితా సవరణ, వివాహ రిజిస్ట్రేషన్, పాస్‌పోర్టు జారీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్(ఆర్టీఐ) ప్రశంసించింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం, రోగ నిర్ధారణ పరీక్షల సేవల పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పీహెచ్సీ, వీహెచ్సీల కంటే ఫ్యామిలీ డాక్టర్ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ పరీక్షలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలిచ్చింది. అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ, రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్ తదితరులున్నారు. -
ఆ 982 పోస్టులను త్వరగా భర్తీ చేయండి
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలెక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైన 982 పోస్టులను త్వరగా భర్తీచేసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈసీ) ముఖేశ్‌కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. ఇప్పటికే పీఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంతమేర బదిలీలు జరగ్గా మిగాతా బదిలీలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. చెక్‌పోస్టుతో అక్రమ రవాణాకు కళ్లెం.. ఇక ఎన్నికల్లో పటిష్ట నిఘా నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 105 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటుచేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులని.. పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా 9, అటవీశాఖ ద్వారా 14 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. గత నెలరోజుల్లో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ద్వారా రూ.2.35 కోట్ల నగదు, 51,143 లీటర్ల మద్యం, 1,323 కిలోల వివిధ మాదకద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ చెక్ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అలాగే, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపుల ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరగా ఏర్పాటుచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎస్ చెప్పారు. లాజిస్టిక్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోండి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లకు ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ కోటేశ్వరరావు, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సూర్యకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలతో సంబంధం ఉన్న .. అధికారులను 25లోగా బదిలీ చేయండి
సాక్షి, అమరావతి: ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని ఈ నెల 25వ తేదీలోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్ల కోసం ర్యాంపులు వంటివి కల్పించాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరగా చర్యలు తీసుకోవాలని సీఈవో, సీసీఎల్ఏను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ బదిలీ చేయాల్సిన అధికారులు, సిబ్బందిని గుర్తించామని, ఇప్పటికే కొందరిని బదిలీ చేశామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్), పోలీస్ శాఖల్లో మూడు రోజుల్లోగా బదిలీలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఈవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి పాల్గొన్నారు. ఆ ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపాలి: సీఎస్ సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్దిష్ట అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని సీఎస్ డా. కేఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, బడ్జెట్, ప్రాజెక్టు పనులు, సవరించిన అంచనాలు, విధానపరమైన అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇటీవల ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తరువాత ఆర్థిక శాఖకు ఫైళ్లు పంపిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బడ్జెట్ మంజూరు, నిధుల విడుదల, అదనపు నిధులు, ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్టులు, పనులు, సర్వీసెస్ పరిపాలన అనుమతులు, సవరించిన అంచనాలు, కార్యక్రమాలు, పథకాలు, ఇన్స్టిట్యూషన్స్, విధానపరమైన అంశాలు, చట్టాలు, జీవోలు, విధివిధానాల మార్గదర్శకాలకు సంబంధించిన ఫైళ్లను తప్పనిసరిగా ఆర్థిక శాఖకు పంపి, అనుమతి పొందాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు పంపే ఫైళ్లపై తగిన సిఫార్సులు కూడా చేయాలని, నిబంధనల మేరకు సంబంధిత అథారిటీ అనుమతి మేరకే ఫైళ్లు పంపుతున్నారా లేదా అనే విషయాలను కూడా ఫైళ్లలో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చే ముందు అందుకు తగిన నిధులు ఉన్నాయా లేదా, సంబంధిత ఫైళ్లకు సంబంధించిన అంశాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు నెరవేరుతాయా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. శాఖలు పంపే ప్రతిపాదనలు ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఉన్నాయా లేదా, బడ్టెట్ కేటాయింపులున్నాయా లేదా అనే విషయాలను ఆ ర్థికశాఖ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. -
AP: 25 నుంచి 31 వరకు ఈ–ఆఫీస్‌లు పనిచేయవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. -
పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడంతోపాటు వాటిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను అదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ, కలెక్టర్లు, వివిధ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పోలింగ్ స్టేషన్లలో శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష తొలుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డితో సమావేశమైన జవహర్‌రెడ్డి అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాట్లు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలో ఉన్న కేసులకు సంబంధించి త్వరలో చార్జిïÙట్లు దాఖలు చేయడంపై సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్దఎత్తున నియమించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. అడిషనల్ సీఈవో హరేందిరప్రసాద్, అడిషనల్ డీజీ బాగ్చి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, ఎస్ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: రానున్న సాధారణ ఎన్నికల సక్రమ నిర్వహణకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న వివిధ విభాగాల అధికారుల ఖాళీల భర్తీతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాతో సీఎస్ జవహర్‌రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. ఇక రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర అధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించాలని.. దీనిపై ఒడిశా సీఎస్‌తో తాను మాట్లాడతానన్నారు. అలాగే, ఎన్నికలు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన ప్రక్రియని.. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా సంబంధిత శాఖలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9న రాష్ట్రానికి రానుందని తెలిపారు. 10న విజయవాడలో సీఎస్, డీజీపీ, సీఈఓ సహా ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్ అండ్ బీ, అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని.. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దృష్టికి తీసుకొచ్చి వీటిపై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేయాల్సి ఉందని సీఎస్‌కు చెప్పారు. అలాగే, వివిధ పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటుచేయాల్సిన సౌకర్యాలపైనా ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించాల్సి ఉందని సీఈఓ చెప్పగా.. వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సీఎస్ జవహర్‌రెడ్డి కోరారు. ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గిరిజాశంకర్, అదనపు పీసీసీఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్, రవాణా శాఖ కమిషనర్ మణీష్కుమార్ ఎస్ఎల్బీసీ కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆదే విధంగా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి. రాజశేఖర్, రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్, సీడీఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. చెక్‌పోస్టులో నిఘా మరింత ముమ్మరం.. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులున్నాయని, వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీసు చెక్‌పోస్టులు, 14 అటవీ చెక్ పోస్టులున్నాయని వీటన్నింటి ద్వారా నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు ముఖేష్‌కుమార్ చెప్పారు. -
ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఆక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ. హోం స్పెషల్ సెక్రటరీ జి.విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీజిపీ ఆఫీస్ డీఐజీ మోహనరావు.. సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న ఆకే రవికృష్ణ, జయలక్ష్మి ఉన్నారు. -
15న మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. తొలుత ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా, 15వ తేదీకి మార్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు మంత్రివర్గ సమావేశంలో ఉంచే ప్రతిపాదనలను 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. -
రైతులను ఆదుకుంటాం
కొత్తపేట: మిచాంగ్ తుపాను, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల–పల్లిపాలెం రోడ్డులో పడిపోయిన వరి పంటను, తడిసిన ధాన్యాన్ని సీఎస్ శనివారం పరిశీలించారు. తుపాను వల్ల నియోజకవర్గంలో వరి, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సీఎస్ జవహర్‌రెడ్డికి వివరించారు. పూజారిపాలెం, చౌదరిపురం ప్రాంతంలో పొలాల ముంపునకు కారణమైన గోరింకల డ్రైన్‌ను సీఎస్‌కు చూపించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలతో పాటు రైతులకు నష్టపరిహారం, పంటల బీమా తదితర విషయాల్లో చేపట్టిన చర్యలను సీఎస్‌కు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో తుపాను నష్టాన్ని చాలా వరకు నివారించినట్లు చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించిందని వివరించారు. పంట తడిసిపోవడం వల్ల ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం, నూకలవ్వడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, మిల్లర్లకు నిబంధనలు సడలించి.. వారికి తోలిన ధాన్యం ఎగుమతులకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుతో పాటు మిల్లర్ల నుంచి ఎగుమతుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పంట నష్టాల నమోదు అనంతరం సాయం అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ ఎం.ముక్కంటి, ఎంపీపీ మార్గన గంగాధరరావు, జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, మాజీ జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, తహసీల్దార్ జీడీ కిషోర్‌బాబు, ఎంపీడీఓ ఇ.మహేశ్వరరావు, వ్యవసాయ అధికారి జి.పద్మలత తదితరులు పాల్గొన్నారు -
పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడి