కట్టుదిట్టంగా ఎన్నికల కోడ్‌  | Strict Election Code in state | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా ఎన్నికల కోడ్‌ 

Published Sun, Mar 17 2024 5:45 AM | Last Updated on Sun, Mar 17 2024 5:45 AM

Strict Election Code in state - Sakshi

బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ ఆస్తులపై హోర్డింగ్‌లు, కటౌట్లు, పోస్టర్లు ఉండకూడదు∙24 గంటల్లోగా వాటిని తొలగించండి 

ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో పీఎం, సీఎం, మంత్రుల ఫొటోలు ఉండకూడదు 

మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదు 

బడ్జెట్‌లో ప్రొవిజన్‌ ఉన్నా కొత్తగా శంకుస్థాపనలు, పనులు నిషేధం 

అధికారిక వాహనాలు, అతిధి గృహాలు, హెలికాప్టర్లు వినియోగించకూడదు 

పీఎం, సీఎం సహాయ నిధి కింద రోగుల చికిత్సలకు అభ్యంతరం లేదు 

ప్రభుత్వ సిబ్బంది నిష్పక్షపాతంగా ఉండాలి 

ఏ పార్టీకీ అనుకూలంగా ఉండకూడదు 

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చిందని, దీనిని రాష్ట్రమంతటా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సీఎస్‌ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల నియమావళిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించారు. అలాగే బహిరంగ ప్రదేశాలు, బస్‌ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్‌ స్తంభాలు, మున్సిపల్‌ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు, వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నీ తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్‌ ఇచ్చిన ఆదేశాల్లో ప్రధానమైనవి.. 

ప్రింట్, ఎల్రక్టానిక్, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల ప్రకటనలు నిలిపివేయాలి 
ప్రభుత్వ వెబ్‌సైట్లలో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ఫొటోలను వెంటనే తొలగించాలి 
మంత్రులెవరూ అధికారిక వాహనాలను, హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు. మంత్రుల ఎన్నికల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించకూడదు. 
ఎంపీ లేదా ఎమ్మెల్యే నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్‌ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండకూడదు 
ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండకూడదు.  
మంత్రులు అధికారులతో ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించకూడదు 
విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్‌ పాస్‌లు, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండకూడదు 
ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్‌ క్వార్టర్‌ విడిచి వెళ్ళడానికి వీల్లేదు. 
ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీల్లేదు 
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతరత్రా లబ్ధి పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనల ప్రకారం ఐపీసీ సెక్షన్‌ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123, 129, 134, 134 ఎ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. 
బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, రాయితీలు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధం 
వర్క్‌ఆర్డర్‌ ఉన్నప్పటికీ, కేత్రస్థాయిలో మొదలు కాని పనులు చేపట్టకూడదు. 
పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధం లేదు. 
పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్నీ, కేన్సర్‌ వంటి రోగులకు చికిత్సలకు  సకాలంలో నిధుల మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement