
సాక్షి, పాడేరు: జిల్లాలను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులతో శనివారం పాడేరు కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమలుజేయాల్సిన పనులు, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు.
సీఎస్ మాట్లాడుతూ అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాతాశిశు మరణాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ప్రసవ సమయానికి సకాలంలో ఆస్పత్రులకు తరలించాలని చెప్పారు. నెల రోజుల ముందుగా గర్భిణులను ఆస్పత్రులకు చేర్చి, సుఖ ప్రసవాలతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా చూడాలని సూచించారు.
కాగా, అల్లూరి, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్, నిశాంత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలన్నింటిని పారదర్శకంగా ఆమలుజేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రం పాడేరులో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ పనులను సీఎస్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment