పరిశ్రమల స్థాపనకు క్రెడిట్ ఫెసిలిటేషన్ సమావేశం
కాకినాడ కలెక్టరేట్ (కాకినాడ రూరల్) : కొత్తగా పరిశ్రమలు స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు రుణాలు మంజూరుకు క్రెడిట్ ఫెసిలిటేషన్ సమావేశం ఈ నెల 21, 22 తేదీల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో బుధవారం సాయంత్రం జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో సింగిల్‌విండో ఆమోదంలో పెండింగ్ సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను ఆయన సమీక్షించారు. ఆరు ఎస్సీ, ఎస్టీ కేసులకు వాహనాల రుణాల రాయితీలను ఆమోదించారు. మూడు సాధారణ పరిశ్రమలకు సబ్సిడీలు మంజూరు చేశారు. పరిశ్రమల శాఖ డీడీ డేవిడ్ సుందర్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన పరిశ్రమల్లో 243 యూనిట్లు గ్రౌండ్ చేశామన్నారు. ఏడు పరిశ్రమలు భూ కేటాయింపులు దరఖాస్తు చేయగా వాటిని పరిశీలించి త్వరగా మంజూరు ఇవ్వాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎస్‌వీ పటేల్, డీడీ సిహెచ్ గణపతి, చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.