సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ప్రత్యేకంగా ఇంధన సామర్థ్య పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఏపీఈఆర్‌సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలో దాదాపు 67,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అంచనా ప్రకారం ఏటా దీన్లో దాదాపు 25 శాతం అంటే 17 వేల మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇందులో కనీసం 10 శాతం లక్ష్యంగా పెట్టుకున్నా రూ.1,200 కోట్ల విలువైన 1,700 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించనుంది.
ఎందుకీ పాలసీ..
రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సరికొత్త ఇంధన సంరక్షణ, సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పాలసీని అమలు చేయనుంది. ఇంధన భద్రత సాధించేందుకు, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ పాలసీ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్–2001ని సమర్థంగా అమలు చేయడం, కర్బన ఉద్గారాల (గ్రీన్‌హౌస్ వాయువుల) తగ్గింపుతో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం, ఇంధన సామర్థ్యంపై అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వినూత్న ఫైనాన్సింగ్, మార్కెట్ వ్యూహాలను రూపొందించడం ఈ ఇంధన పాలసీ లక్ష్యం.
పరిశ్రమలు, భవనాలు, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాలను రూపొందించడం, నివాస, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో స్టార్ రేటెడ్ ఇంధన సామర్థ్య పరికరాల వినియోగంపై ఈ పాలసీ దృష్టి సారిస్తుంది. ఇందుకోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని, వివిధ రంగాలకు చెందిన విభాగాధిపతుల నేతృత్వంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
విద్యుత్ పొదుపులో మరో ముందడుగు
Published Mon, Apr 3 2023 9:06 AM | Last Updated on Mon, Apr 3 2023 9:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment