energy
-
పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం.. ఎంతంటే..
పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంస్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు. -
ఇంధన పరివర్తనపై జాగ్రత్త అవసరం
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా దీన్ని సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన పేరుతో వృద్ధిని పక్కన పడేయకూడదు. వృద్ధి అనేదే లేకపోతే, పర్యావరణ మార్పులను నియంత్రించడం కోసం పెట్టుబడులు పెట్టేందుకు వనరులు కూడా ఉండవు‘ అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ విషయాలు వివరించారు. పారిశ్రామిక విద్యుత్ ధరలు ఒక్కసారిగా ఎగిసి యూరప్ ఆర్థికంగా సంకట స్థితిలో పడటానికి .. పునరుత్పాదక విద్యుత్, ఇంధన పరివర్తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం కూడా పాక్షికంగా కారణమన్నారు. ఈ అంశం కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పెద్ద సవాలని, భారత్‌తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలపైనా ప్రభావం చూపుతోందని నాగేశ్వరన్ చెప్పారు. దేశీయంగా మందగమనం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5–7 శాతం వృద్ధిని సాధించే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. -
నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే ఎందుకు జరుపుకుంటారు?
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శక్తి (ఎనర్జీ) వినియోగం తగ్గించడానికి విధా నాలు, వ్యూహాల అభివృద్ధికి సహాయపడే రాజ్యాంగ పరమైన సంస్థ. భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ద్వారా శక్తి ప్రాముఖ్యం గురించి ప్రజలు తెలుసు కోవటానికి, అలాగే తక్కువ శక్తిని ఉపయోగించడం ద్వారా ఎక్కువ శక్తిని ఆదా చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రజా జీవితంలో శక్తి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడం; శక్తి పరిరక్షణ దినోత్సవం లక్ష్యాలుగా చర్చలు, సమావేశాలు, పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇంధన పరిరక్షణ ప్రక్రియను ప్రోత్సహించడం... వంటి ప్రధాన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తూంటుంది. శక్తిని అనవసరమైన వాటికి వాడటాన్ని నివారించడంతో పాటు, తక్కువ శక్తిని ఉపయోగించడం భవిష్యత్తుకు చాలా అవసరం. ప్రతి ఏడాదీ ‘జాతీయ శక్తి వినియోగ దినోత్సవం (నేషనల్ ఎనర్జీ కన్జ ర్వేషన్ డే)’న్ని డిసెంబర్ 14న భారతదేశం అంతటా జరుపుకొంటారు.2013 నుండి మొత్తం ప్రాథమిక ఇంధన వినియోగంలో చైనా, అమెరికా తరువాత ప్రపంచంలో మూడవ స్థానంలో భారత్ ఉంది. అలాగే అమెరికా, చైనా తరువాత 2017లో 221 మిలియన్ టన్నుల చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉంది. మొత్తం ప్రాథమిక శక్తిలో దాదాపు 45% నికర శక్తి దిగుమతిదారుగా మన దేశం ఉంది. 2017లో 294.2 మెట్రిక్ టన్ను లతో భారత్ బొగ్గు ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో దాదాపు 80% బొగ్గు నుంచి వస్తుంది. ఇది దేశ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగంలో భారతదేశంరెండవ స్థానంలో ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచ ఇంధన వినియోగంలో 3.4% వాటా కలిగిన భారత్ 6వ స్థానంలో ఉంది. భారతదేశం తన ఇంధన డిమాండ్లను తీర్చడానికి ఎక్కువగా శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశ విద్యుత్ ఉత్ప త్తిలో 80% శిలాజ ఇంధనాల నుండే జరుగుతోంది. చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో మన దేశం ఒకటి. 2035 నాటికి... ప్రపంచ ఇంధన డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 18% పెరుగుదలకు కారణమవుతుంది. భారతదేశపు పెరుగుతున్న ఇంధన డిమాండ్లు పరిమిత దేశీయ చమురు, గ్యాస్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని దేశం తన పునరుత్పాదక, అణు విద్యుత్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రతి ష్ఠాత్మక ప్రణాళికలను చేపట్టింది. మన దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్‌ను కలిగి ఉందన్న సంగతి ఇక్కడ గమనార్హం. శిలాజ ఇంధనాలకు బదులుగా వాడటా నికి ఏ ఒక్క శక్తి వనరూ సిద్ధంగా లేదు.చదవండి: ఇది మాయ కాక మరేమిటి?అందుకే కనీసం గృహ అవసరాలకు వినియోగించే శక్తి పరిమాణాన్ని తగ్గించడం, ఆదా చేయడం వంటి చర్యలతో శక్తి వనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. రోజువారీ అనవసర వాడకాన్ని తగ్గించడం, తగిన సమయములో బల్బులను మార్చడం, స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించడం, శక్తి సామర్థ్య నీటి తాపన ఖర్చులను తగ్గించడం, కార్యాలయ పరికరాలు, ఉపకరణాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటిని ఇన్సులేట్ చేయడం మొదలయిన పద్ధతులు ఇందుకోసం పాటించవచ్చు. - డాక్టర్ పిఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్(డిసెంబర్ 14న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే) -
పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదునయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, కెసని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్‌లోని వడినార్‌లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్‌లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్‌లున్నాయి. -
మార్కెట్లో దండిగా ఉసిరి : ఇలా ట్రై చేస్తే.. ఆరోగ్యసిరి!
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్‌గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.ఆమ్లా జ్యూస్ కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్‌కి దివ్యమైన ఔషథం.ఆమ్లా కాండీ కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు.తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. హనీ ఆమ్లా డ్రింక్ ఒక గ్లాసు డ్రింక్‌కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది. గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు. -
అమెరికా ఇంధన మంత్రిగా క్రిస్ రైట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని పనిలో నిమగ్నమయ్యారు. అమెరికా ఇంధన శాఖ మంత్రిగా క్రిస్ రైట్ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. టంప్ర్నకు క్రిస్ రైట్ భారీగా విరాళాలు అందజేశారు. ఆయన ప్రచారానికి సహకరించారు. డెన్వర్‌లోని లిబర్టీ ఎనర్జీ అనే సంస్థకు క్రిస్ రైట్ సీఈఓగా పని చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆయన ప్రోత్సహిస్తుంటారు. చమురు, గ్యాస్ ఉత్పత్తకి గట్టి మద్దతుదారుడు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు.కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ప్రపంచమంతా శిలాజేతర ఇంధన వనరుల వైపు పరుగులు తీస్తుండగా, ట్రంప్ మాత్రం శిలాజ ఇంధనాలకే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇంధన మంత్రిగా క్రిసరైట్ను నియమించడంతో అమెరికా శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే శిలాజ ఇంధనాల వాడకం మరింత పెరగాలని క్రిస్ రైట్ వాదిస్తున్నారు. ఆయన గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వంలో పని చేసిన అనుభవం ఆయనకు లేదు. క్రిస్ రైట్ను ఇంధన శాఖ మంత్రిగా ట్రంప్ నియమించడం వెనుక అమెరికాలోని చమురు లాబీ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇంధన భద్రతకు సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గాక ఇంధన భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేవ్ మూడో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియా కల్లోలానికి తోడు రెండేళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ఇంధన అవసరాలు 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిలో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తుంది.ఈ కల్లోల పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ అన్నారు. అంతర్జాతీయ సమాజంలో మనకు పెరుగుతున్న ప్రతిష్టకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ‘‘సైన్స్, టెక్నాలజీ మొదలుకుని ఇన్నొవేషన్ల దాకా ఆకాశమే హద్దుగా భారత్ సాగుతోంది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ నినాదంతో దూసుకుపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు తీసుకొచ్చాం. ఎన్డీఏ పదేళ్ల పాలనలో భారత ఆర్థిక ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశాం. మన ఆర్థిక వృద్ధిపై ప్రపంచ నేతలంతా ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లోనూ సంస్కరణలను కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు. -
ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరం
దేశీయంగా 2030 నాటికి 440 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరమని ఇక్రా తెలిపింది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) ఈమేరకు నివేదిక విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధన రంగం ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదికలో తెలిపింది.ఇక్రా గ్రూప్ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వి.విక్రమ్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారతదేశం 440 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించింది. అందుకోసం ఏటా రూ.మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 200 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వచ్చే ఆరేళ్లలో రెట్టింపు అవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఈ రంగంలో ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 25 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, బస్సులు వరుసగా 40 శాతం, 30 శాతంగా ఉంటాయి. వీటి కోసం భవిష్యత్తులో విద్యుత్ వినియోగం పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చదేశీయంగా పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా తయారీ ఊపందుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో విద్యుత్తు తయారీకి ఇప్పటికీ అధికం శాతం భారత్‌లో బొగ్గునే వినియోగిస్తున్నారు. క్రమంగా దీన్ని పునరుత్పాదక ఇంధనంతో భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ దిశగా ఏటా బడ్జెట్లో కేటాయింపులు పెంచుతున్నారు. దేశంలో కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేసి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రణాళికలు ఏర్పాటు చేసింది. -
‘మిషన్ లైఫ్’తో భవిష్యత్తు!
సాక్షి, అమరావతి: వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని భావితరాలు భూమిపై మనుగడ సాగించడమే కష్టమయ్యే అవకాశముంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. నీరు, ఇంధనం తదితరాలన్నీ పొదుపుగా వినియోగించాలి. ప్లాస్టిక్‌ను విడనాడాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ‘మిషన్ లైఫ్’కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి పలు నగరాలు ఎంపికవ్వగా.. అందులో రాజమహేంద్రవరం కూడా చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషితో.. భావితరాలకు ఇంధన వనరులను అందించడం కోసం.. పర్యావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. బీఈఈ నేతృత్వంలో జరిగే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాలకు చేయూతనందించింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇంధన సంరక్షణ, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విడనాడడం, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం, చెత్త, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బీఈఈ శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు నగరాలను బీఈఈ ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి సారించింది. విస్తృత ప్రచారం.. మిషన్ లైఫ్‌లో భాగంగా విస్తృత ప్రచారం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాప్‌లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్‌లను బీఈఈ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్ల ద్వారా.. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్లను ఆపివేసేలా ప్రత్యేక ప్రచారం, కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతోంది.స్కూళ్లల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించేలా కృషి చేస్తోంది. దీని కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(సీసీసీ)ను రూపొందించింది. ఇందులో నిపుణులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి, రవాణా తదితర విభాగాలను భాగస్వాములను చేసింది. ఈ సెల్ వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంటుంది.వంద కోట్ల మందికి భాగస్వామ్యమే లక్ష్యం మిషన్ లైఫ్‌కు ఏపీలోని ఆరు నగరాలను ఎంపిక చేసుకున్నాం. ప్రజలు, వివిధ సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ క్షీణతను అధిగమించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా వేస్తున్నాం. 2027–28 నాటికి వంద కోట్ల మంది భారతీయుల్ని మిషన్‌లైఫ్‌లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మిలింద్ దేవ్రా, బీఈఈ కార్యదర్శి మనం మారితేనే..» ట్రాఫిక్ లైట్లు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాల ఇంజన్లను ఆపితే ఏటా దాదాపు 22.5 బిలియన్ కిలోవాట్స్ ఇంధనం ఆదా చేయొచ్చు. » షాపింగ్‌లకు క్లాత్ బ్యాగులను వినియోగిస్తే 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా నివారించవచ్చు. » వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడం వల్ల 15 బిలియన్ టన్నుల ఆహారం వృథా కాదు. » నీటి కుళాయిలను సకాలంలో ఆపివేయడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు. » పని చేయని ఎలా్రక్టానిక్ గాడ్జెట్లను రీసైకిల్ చేయడం ద్వారా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయొచ్చు. » ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం, ఎల్రక్టానిక్ పరికరాలను ఇంధన పొదుపు మోడ్‌లో వాడడం, తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయడం, గ్రామీణ నీటి వనరుల రీచార్జ్‌ను ప్రోత్సహించడం, ఎల్ఈడీ లైట్లను వినియోగించడం, ప్రజా రవాణా తదితర మంచి విధానాలను ఉపయోగిస్తే.. మిషన్ లైఫ్ లక్ష్యాలను చేరుకోవచ్చు. » బీఈఈ ఇంధన సామర్థ్య పథకాలు, కార్యక్రమాల ద్వారా.. 2022–23లో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్, 24.68 మిలియన్ టన్నుల చమురు సమానమైన థర్మల్ శక్తితో సహా సుమారు 306.40 మిలియన్ టన్నుల ఉద్గారాల్ని తగ్గించింది. -
విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు
ముంబై: విద్యుత్, ఇంధన రంగాల్లో ఈ ఏడాది నియామకాలు సానుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య) ఈ రంగాల్లో నియామకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 9 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్’ నివేదిక తెలిపింది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల (నెట్ జీరో) లక్ష్యం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తాయని ఈ నివేదిక పేర్కొంది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన రంగం గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. 23 రంగాలకు చెందిన 1,417 కంపెనీల ప్రతినిధులను అడిగి టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించింది. ఢిల్లీలో అధికం ఇంధన, విద్యుత్ రంగాల్లో ప్రస్తుత ఉపాధి అవకాశాల పరంగా ఢిల్లీ 56 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరు 53 శాతం, ముంబై 52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల పరంగా జైపూర్ 14 శాతంతో ముందుంది. బెంగళూరు, చెన్నై, వదోదర 13 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెట్రోల్లో వృద్ధి అవకాశాలను గుర్తు చేస్తూనే, ద్వితీయ శ్రేణి పట్టణాలు కొత్త అవకాశాలు వేదికగా నిలుస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలు, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వృద్ధికి మద్దతు.. ‘‘విద్యుత్, ఇంధన రంగాల్లో 9 శాతం మేర ఉపాధి అవకాశాల విస్తరణ అన్నది పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది. 62 శాతం పరిశ్రమ ప్రతినిధులు తమ సిబ్బందిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ 4.0, క్రమానుగతంగా కర్బన రహితంగా మారాలన్న లక్ష్యాలు విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దుతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ తెలిపారు. విద్యుత్, ఇంధన రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టీమ్‌లీజ్ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం వృద్ధి అవకాశాల గుర్తించి ప్రస్తావించారు. ఆ తర్వాత సేల్స్ (అమ్మకాలు) విభాగంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక వసతులు, ప్రీమియమైజేషన్ (ఖరీదైన ఉత్పత్తుల వినియోగం) ధోరణితో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది. -
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్‌ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్‌చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్‌సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్‌ఫోలియో బిజినెస్‌కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. విద్యుత్ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడంతోపాటు భవిష్యత్ తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్ధాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటునందించింది. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో, ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విద్యుత్ రంగ ప్రగతి ► రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ సీవోడీ పూర్తి చేసుకుని అందుబాటులోకి వచి్చంది. ఈ 1,600 మెగావాట్లతో కలిపి జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. ► ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ► దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8,025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. ► వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్ల పాటు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను కొనసాగించడం కోసం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్ధ్యం పెరిగింది. ► చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు కొత్తగా వచ్చాయి. ► పట్టణ ప్రాంతాల్లో పోగయ్యే చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులనూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2021లో గుంటూరులో 15 మెగావాట్ల ప్లాంటు, 2022లో విశాఖలో 15 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంటు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్ధాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ► 2023 మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సష్టించే అవకాశం ఉంది. ► గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్లు విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన రంగంలో ఎన్నో అవార్డులు ఇంధన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఏపీ ట్రాన్స్‌కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. ‘కన్సూ్యమర్ సరీ్వస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. వీటన్నిటి సాధన వెనుక సీఎం జగన్ ముద్ర, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. -
ఐటీ, ఇంధన షేర్లకు డిమాండ్
ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది. ► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది. -
కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గాను ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం తన నివాసానికి వెళ్తున్న సమయంలో పీఎం మోదీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీ శ్రీరాముడి కాంతితో ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. అయోధ్యలో రాల్ లల్లా పవిత్ర ఉత్సవం తర్వాత దేశ ప్రజలంతా.. తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలి. దాని కోసం ఈ పథకాన్ని ప్రారంభించనున్నాం’ అని నరేంద్ర మోదీ తన ‘ఎక్స్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలో సుమారు కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం పేద, మధ్యతరగతి చెందినవారికి కరెంట్ బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్ రంగంలో భారత దేశ స్వావలంబనను పెంచుతుందని పేర్కొన్నారు. ఇక.. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్ రూఫ్ టాప్ సిస్టం ప్యాలెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं। आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो। अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV — Narendra Modi (@narendramodi) January 22, 2024 చదవండి: శ్రీరాముడి ర్యాలీలో ఘర్షణ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్ -
అదానీ గ్రీన్‌కు టోటల్ ‘ఎనర్జీ’
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్‌కు ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్‌కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది. టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. -
మెటల్, ఇంధన షేర్లలో కొనుగోళ్లు
ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. మోటిసన్స్ లిస్టింగ్ భళా మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 98 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. -
సీమెన్స్ ఎనర్జీ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ఎనర్జీ బిజినెస్‌ను విడదీసే ప్రతిపాదనను పూర్తి చేసేందుకు దేశీయంగా సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం సీమెన్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు తెలియజేసింది. ఎనర్జీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను పూర్తి చేయవలసిందిగా సీమెన్స్ లిమిటెడ్ బోర్డును ప్రమోటర్ సంస్థలు సీమెన్స్ యాక్టింగిసెల్షాఫ్ట్(జర్మనీ), సీమెన్స్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ బీవీ, సీమెన్స్ ఎనర్జీ హోల్డింగ్ బీవీసహా ప్రధాన ప్రమోటర్ సీమెన్స్ ఎనర్జీ యాక్టింగిసెల్షాఫ్ట్ కోరినట్లు కంపెనీ పేర్కొంది. ప్రతిపాదనపై పరిశీలన, విలువ నిర్ధారణ, తదితర అవసరమైన చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. వెరసి వెనువెంటనే పూర్తి అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు నిర్ణయించినట్లు వివరించింది. ఎనర్జీ విడదీత వార్తలతో సీమెన్స్ షేరు ఎన్ఎస్ఈలో 6% జంప్‌చేసి రూ. 4,138 వద్ద ముగిసింది. -
పరగడుపున ఖర్జూరాలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఏ పని చేయకపోయినా నీరసంగా అనిపిస్తుందా? చిన్న పని చేసినా వెంటనే అలసిపోతున్నారా? రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసత్వంగా అనిపిస్తుందా? ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ►అరటిపండులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు కలిగిన అద్భుతమైన పండు అరటి పండు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలసట, బద్ధకం దూరం అవుతుంది. ►శరీరానికి తగినంత నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. హైడ్రెటెడ్‌గా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. అదేవిధంగా అలసట, నీరసం కూడా దూరమవుతాయి. ► రోజుకో కొబ్బరి బోండం తాగండి. ఇది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ► అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది. ► ఖర్జూరం ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి మంచి బలం చేకూరుతుంది. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీళ్లను తాగితే శరీరానికి మంచి రక్తం పట్టి ముఖం కాంతిమంతంగా మారుతుంది. ► రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలసట, నీరసాన్ని కూడా దూరం చేస్తుంది. ► గ్రీన్ టీ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎనర్జీ రావడమే కాకుండా బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ► రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది. ► తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి శక్తి అందుతుంది. ► తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును.దీన్నే నీర అని అంటారు. రోజుకో వెలగపండు తింటే నీరసం పోయి శరీరానికి బలం చేకూరుతుంది. ► ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.ఇక క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వల్ల శరీరానికి మంచి బలం వస్తుంది. -
2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు
శిలాజ ఇంధనాల క్షీణత, ముడిచమురు ధరల్లో అస్థిరత, కఠినమైన పర్యావరణ నిబంధనలు వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు, బొగ్గుకు గరిష్ఠ స్థాయిలో డిమాండ్ నెలకొనడం చరిత్రలో ఇదే మొదటిసారి. గ్లోబల్‌గా శిలాజ ఇంధన డిమాండ్ 2030 నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) 2023 నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అణు, సౌర, పవన విద్యుత్తుకు అధిక గిరాకీ ఉంటుందని నివేదిక తెలియజేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, అణుశక్తి తరిగిపోయే శక్తివనరులు. వాటిని ఒకసారి వినియోగిస్తే, మళ్లీ ఉపయోగించడం కుదరదు. నీరు, గాలి, సూర్యరశ్మి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి తదితరాలు ఎన్నటికీ తరిగిపోనివి. అందుకే వాటిన సంప్రదాయేతర లేదా తరిగిపోని ఇంధన వనరులు అంటారు. శాస్త్రవిజ్ఞానం, నవీన ఆవిష్కరణల ద్వారా వాటి వినియోగాన్ని పెంచుతున్నారు. (ఇదీ చదవండి: రూ.240కే ‘ఎక్స్’ సబ్స్క్రిప్షన్.. ఫీచర్లు ఇవే..) తగ్గుతున్న శిలాజ ఇంధన డిమాండ్ బొగ్గు, చమురు, సహజ వాయువులను శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలవారీగా వీటి డిమాండ్ ఆధారపడుతుంది. అనేక దశాబ్దాలుగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక అవసరాలకు వీటిని వాడుతున్నారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా వీటికి మరింత డిమాండ్ పెరిగింది. కానీ వీటిని మండించడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. 2030 నాటికి శిలాజ ఇంధనాలకు గరిష్ట స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంచనా. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కొన్ని విధానల ద్వారా క్రమంగా వీటి వాడకం తగ్గనుంది. వీటిస్థానే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీవైపు అడుగులు వేసే అవకాశం ఉంది. క్షీణిస్తున్న బొగ్గువాడకం ప్రపంచ బొగ్గు డిమాండ్ అనేది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ఆధారపడుతుంది. ఇతర మార్గాల ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంటే క్రమంగా బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 65శాతం బొగ్గును ప్రస్తుతం కరెంట్ తయారీకే వాడుతున్నారు. థర్మల్‌పవర్ ప్లాంట్లు సిస్టమ్ సేవలు ఉపయోగిస్తున్నాయి. దాంతో బొగ్గు వినియోగం కొంతమేర తగ్గుతుంది. అయితే పారిశ్రామిక డిమాండ్, ఉక్కు తయారీ, సిమెంట్ పరిశ్రమల కోసం వాడే బొగ్గు వినియోగం స్థిరంగా ఉంది. పునరుత్పాదక వనరులపై మక్కువ సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, సముద్ర తరంగాల శక్తి, భూతాపశక్తి, జీవశక్తి వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. వాటిని వినియోగించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 140కి పైగా దేశాలు వీటిని విరివిగా వాడుతున్నాయి. 2010తో పోలిస్తే 2022 వరకు సౌరశక్తి వల్ల 90శాతం, పవనశక్తి ద్వారా 70శాతం, ఆఫ్‌షోర్ విండ్ ద్వారా 60శాతం విద్యుత్ ధరలు తగ్గాయి. (ఇదీ చదవండి: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..) క్లీన్ ఎనర్జీ వైపు..ప్రపంచం చూపు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ విస్తరణ వల్ల సౌర, పవన శక్తి వాడకం ఎక్కువైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు తగ్గనున్నాయి. 2030 వరకు సోలార్‌ఎనర్జీ వల్ల దాదాపు 3 గిగాటన్నుల ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డుపై ఉన్న అన్ని కార్ల నుంచి వెలువడే ఉద్గారాలకు సమానం. పవన శక్తి వల్ల మరో రెండు గిగాటన్నుల ఉద్గారాలు తగ్గనున్నాయి. -
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్‌లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్‌కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
రూ.1,440 కోట్ల డీల్, వేదాంత చేతికి మీనాక్షి ఎనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉన్న మీనాక్షి ఎనర్జీని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేసేందుకు వేదాంత తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నుంచి ఆమోదం పొందింది. రుణ భారంతో ఉన్న మీనాక్షి ఎనర్జీని విక్రయించడానికి పిలిచిన టెండర్లలో విజయవంతమైన బిడ్డర్‌గా వేదాంతను ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో మీనాక్షి ఎనర్జీకి 1,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఉంది. ఈ పవర్ ప్లాంట్‌ను స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిర్వహించాలని వేదాంత యోచిస్తోంది. అలాగే వినియోగదారులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. కొనుగోలు ప్రక్రియలో భాగంగా రుణదాతలకు ముందస్తుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్‌ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ ఈపీడీసీఎల్‌లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్‌లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు తెలిపారు. -
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు.