
ఎనర్జీ డ్రింకులు..శక్తిని హరించి వేస్తున్నాయ్..!
‘ఎనర్జీ డ్రింకులు ఉన్నఫళంగా మీకు ఎనలేని ఓపికను, శక్తిని ఇస్తాయనేది ఒట్టిమాటే.. అవి మీకు సహజసిద్ధంగా ఉన్న శక్తిని కూడా హరించి వేస్తాయి’ అంటున్నారు హెల్త్ ఫుడ్ మ్యానుఫాక్చరర్స్ (హెచ్‌ఎఫ్‌ఎమ్‌ఏ) వారు. యూరప్‌కు చెందిన ఈ సంస్థ పరిశోధకులు మార్కెట్‌లో లభ్యమవుతున్న వివిధ ఎనర్జీ డ్రింకులు, వాటిలోని పదార్థాల గురించి పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. ఎనర్జీ డ్రింకుల్లోని కంటెంట్‌ను బట్టి అవి శక్తిని ఇవ్వడం మాట ఎలా ఉన్నా... మనిషిని నిస్తేజపరచడం మాత్రం ఖాయమని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించి శాస్త్రీయమైన వివరణ కూడా ఇచ్చారు.
ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింక్‌లోనే దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది!
యుక్తవయసులోని మనిషికి రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవడమే ఎక్కువ. 500 మిల్లీగ్రాముల ఎనర్జీ డ్రింక్ క్యాన్‌లో దాదాపు 160 ఎమ్‌జీ కెఫిన్ ఉంటుంది.
యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధనల ప్రకారం ఎనర్జీ డ్రింకులకు అలవాటుపడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్‌పై ఆసక్తిచూపే అవకాశం ఉందని తేలింది. ఎనర్జీ డ్రింకులు యువతను ఆవిధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
ఎనర్జీ డ్రింకులను అతిగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్‌లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసి పోవడంతో పాటు రకరకాల దుష్పరిణామాలు ఉంటాయి.
ఇవీ... ఎనర్జీ డ్రింకులను తీసుకోవడం వల్ల శరీరంపై పడే ప్రభావాలు. వీటిని బట్టి చూసుకొంటే ఎనర్జీ డ్రింకులు సేవించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో సులభంగా అర్థం అవుతుంది.