energy drinks
-
ఎనర్జీ డ్రింక్స్.. ఎంతవరకు సేఫ్
తక్షణ శక్తి, చురుకుదనం, ఏకాగ్రత పెంచే పానీయాలుగా ఎనర్జీ డ్రింక్‌కు పేరు. వీటిని ఎక్కువగా క్రీడాకారులు తాగుతుంటారు. ఇప్పుడిప్పుడే మిగిలిన వారూ వీటిని అలవాటు చేసుకుంటున్నారు. అయితే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్లు ఏదైనా మితం అయితేనే ఉపయోగకరం. అతిగా తీసుకుంటే అనవసర చిక్కుల్లో పడక తప్పదు. ఎనర్జీ డ్రింక్స్‌కు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ, కొందరు అదే పనిగా ఎనర్జీ డ్రింక్స్ తాగడానికి అలవాటు పడి ఉంటారు. ఇలా వ్యసనంగా మార్చుకోవడం వల్ల కలిగే నష్టాలు, బయటపడే మార్గాల గురించి తెలుసుకుందామిలా... ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫెన్, చక్కెర, బి–విటమిన్లు, ఎల్–టారిన్ లాంటి అమైనో ఆమ్లాల ఉత్పన్నాలు, ఆయుర్వేద మూలికా గుణాలు ఉంటాయి. అందువల్లే ఎనర్జీ డ్రింక్స్ శారీరక, మానసిక ఉత్ప్రేరక పానీయాలుగా పనిచేస్తాయి. అయితే, ఈ లాభాలతోపాటు ఇందులోని కెఫెన్, చక్కెర కలిగించే దుష్ప్రభావాలూ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి ఈ డ్రింక్స్‌ను తాగడాన్ని వ్యసనంగా మార్చుకోవడం, సహజశక్తిని నమ్ముకోకుండా వీటిపైనే ఆధారపడడం. వ్యసనం–లక్షణాలు ఏదైనా ఒక అలవాటు మనకు హాని చేస్తుందని తెలిసినా మానలేకపోవడమే వ్యసనం. ఇదొక మానసిక స్థితి. అతిగా తినడం, తాగడం, కంప్యూటర్ గేమ్స్‌కు అలవాటు పడడం.. తదితరం అన్నీ ఇలాంటివే. ఎనర్జీ డ్రింక్స్ వ్యసనం కూడా ఇలాంటిదే. మాదకద్రవ్యాల వ్యసనంలా ఇదంత హానికరం కాకపోయినప్పటికీ ఇది కూడా ప్రమాదకరమే. ఇలా ఎనర్జీ డ్రింక్స్ వ్యసనంగా మారడానికి అందులోని కెఫెన్, ఆర్ట్టఫియల్ స్వీట్నర్స్దే ప్రధాన పాత్ర. ఈ వ్యసన లక్షణాలు ఇలా ఉంటాయి. ∙ఎనర్జీ డ్రింక్స్‌ను తాగాలనే బలమైన కోరికలు ∙మనసులో ఎనర్జీ డ్రింక్స్ గురించే ఆలోచనలు ∙ఎనర్జీ డ్రింక్స్‌ను పరిమితి లోపు మాత్రమే తీసుకోవడంలో అదుపు కోల్పోవడం. ∙ఈ డ్రింక్స్‌కు తాగకుండా ఉన్నప్పడు తలనొప్పి, చిరాకు, అలసట వచ్చినట్లు అనిపించడం. దుష్ప్రభావాలు ఎనర్జీ డ్రింక్స్‌లో ఆమ్ల స్వభావం ఎక్కువ. అందువల్ల వీటిని ఎక్కువగా తాగినప్పుడు చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా దంత సమస్యలు వస్తాయి. అలాగే తరచూ వీటిని తాగడం వల్ల బరువు పెరిగే ప్రమాదమూ ఉంది. ఇది ప్రయోగాత్మక అధ్యయనంలోనూ నిజమని తేలింది. అలాగే షుగర్ శాతం అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలైన హృద్రోగాలు, టైప్ 2 డయాబెటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ షుగర్ లేని ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా అందులోని కెఫెన్, ఆర్టిఫియల్ స్వీటర్న్ సైతం టైప్ 2 డయాబెటిస్, జీర్ణక్రియ సమస్యలు సృష్టిస్తాయని అంటున్నారు. ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే రోజూ కనీసం ఒకటి రెండు ఎనర్జీ డ్రింక్స్ కొనడం ఆర్థిక పరిస్థితినీ ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అయితే, ఎనర్జీ డ్రింక్స్ వ్యసనం నుంచి బయటపడడం కూడా అంత సులభం కాదు. ఒక క్రమపద్ధతిలో దీని నుంచి దూరం కావడానికి ప్రయత్నం చేయాలి. హఠాత్తుగా మానేయాలని ప్రయత్నిస్తే కొన్ని రకాల చెడు ప్రభావాలు సైతం కనిపించే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టరును సంప్రదించి ఆ తర్వాత ఒక క్రమపద్ధతిలో ఈ వ్యసనం బారి నుంచి బయటపడడానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కాఫీ, లేదా డికాఫ్, పండ్ల రసాలు, గ్రీన్ టీ, ఆయుర్వేద టీలు తీసుకోవడం ద్వారానూ ఫలితం పొందవచ్చు. -
ఎనర్జీ డ్రింక్స్‌తో గుండె బేజారు!
కాలిఫోర్నియా: ఎనర్జీ డ్రింక్స్... ఇటీవల వీటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ డ్రింక్స్‌ని ఎక్కువగా తాగుతున్నారు. తక్షణం శక్తి పొందవచ్చనో లేదా స్టైల్‌గా భావించో చాలా మంది వీటిపైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి వీటిని తీసుకుంటే ఫర్వాలేదు కానీ... అదే పనిగా తాగితే మాత్రం గుండె బేజారవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయమై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ఇందులో భాగంగా 18 నుంచి 40 ఏళ్ల వయసు గల 34 మందిని ఎంపిక చేసుకుని వారితో 304 – 320 గ్రాముల కెఫిన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ను తాగించారు. ఆ డ్రింక్ తాగిన వారిలో హృదయ స్పందనలు 6 మిల్లీ సెకన్ల నుంచి 7.7 మిల్లీ సెకన్లకు పెరిగినట్లు గుర్తించారు. హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు జరిగితే అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎనర్జీ డ్రింక్‌లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. -
పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వవచ్చా?
ఇటీవల పది పన్నెండేళ్ల పిల్లలు టీవీలో వచ్చే యాడ్స్ చూసి ఎనర్జీ డ్రింక్స్ ఇప్పించమంటూ తల్లితండ్రుల్ని కోరుతుంటారు. మాల్స్‌కు వెళ్తే అక్కడి ఎనర్జీ డ్రింక్స్ కావాలని మారాం చేస్తుంటారు. ఆరోగ్యానికి అవి అంత మంచివి కావనే చెప్పవచ్చు. వాటిల్లో కెఫిన్ పాళ్లు చాలా ఎక్కువ. ఎంతగా ఎక్కువ అంటే... ఆ ఎనర్జీ డ్రింక్స్ తాలూకు ఇన్గ్రేడియెంట్స్లో 38.5 ఎమ్జీ అనీ, 72 ఎంజీ అనీ రాయడమే కాకుండా... అవి చిన్న పిల్లలకూ, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదంటూ ఆ ఉత్పాదనపై ప్రచురించి మరీ అది మంచిది కాదనే విషయాన్ని వారే చెబుతుంటారు. ఇక వాటి తయారీలో కృత్రిమమైన స్వీటెనర్స్ ఉపయోగిస్తారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ చాలా వేగంగా శరీరానికి శక్తిని ఇస్తాయి. శారీరక కార్యకలాపాలు చేసేందుకు తక్షణ శక్తిని సమకూర్చేందుకు గాను అధికమోతాదుల్లో క్యాలరీలు సమకూరేలా వాటిల్లో చాలా ఎక్కువగా ఈ తరహా చక్కెరలు (షుగర్స్) కలుపుతారు. ఆ కృత్రిమ చక్కెరలు ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. అందుకే వాటికి బదులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి– స్వాభావికమైన తాజా పళ్ల రసాలు, కూరగాయల రసాలు (క్యారట్ వంటి వెజిటబుల్ జ్యూసెస్) ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ తరహా స్వాభావికమైన తాజా పండ్లరసాలతో పోలిస్తే ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలేమీ ఉండవు. అందుకే పిల్లలకు తాజా పళ్లరసాలు, మజ్జిగ, లస్సీ, వెజిటబుల్ సూప్స్ వంటివి ఇస్తే మంచిది. ఇక పండ్ల రసాల విషయానికి వస్తే... ఎనిమిది నుంచి టీనేజ్ వయసు పిల్లలు పండ్లను కొరికి తినడం ఇంకా మంచిది. కొరికి తినలేని వారికోసమే జ్యూసెస్. కొబ్బరినీరు, నిమ్మ నీరు వంటి ద్రవపదార్థాలు ఇవ్వడం ఈ సీజన్లో పిల్లలకు ఎంతో మేలు చేసే అంశం. -
మార్కెట్లో విషతుల్య ఆహారోత్పత్తులెన్నో?
సాక్షి, న్యూఢిల్లీ : పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న 'రెస్ట్‌లెస్ జిన్సెంగ్' అనే ఎనర్జీ డ్రింక్‌లో ప్రమాదకరమైన 'కఫేన్, జిన్సెంగ్' మిశ్రమం ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రమాదకరమైన మిశ్రమం కారణంగా ఈ ఎనర్జీ డ్రింక్ తాగినవారికి ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదుగానీ గుండెపోటు, రక్తపోటు రావడం ఖాయమని వారు తేల్చిచెప్పారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకే ఆహార భద్రతా సంస్థ తరఫున శాస్త్రవేత్తలు స్పందించారనడం ఇక్కడ గమనార్హం. ఈ ఉత్పత్తిని అమ్ముతున్న కంపెనీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015, జూన్‌లో 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' జారీ చేసింది. ఆహార భద్రతా అధికారులతోపాటు వినియోగదారుల సంఘాలు గోల చేయడంతో విష రసాయనం వెలుగులోకి వచ్చిన ఏడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్పత్తికి ఎన్ఓసీని రద్దు చేసింది. ఈలోగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎనర్జీ డ్రింక్ స్టాక్‌నంతా పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ అమ్ముకోగలిగింది. ఈ ఏడు నెలలపాటు ఆ ఎనర్జీ డ్రింక్‌ను తాగిన వినియోగదారుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నాడన్న మాట. అవసరమైన ముందస్తు తనిఖీలు లేకుండా 'మా ఉత్పత్తులు సురక్షితం' అంటూ కేవలం కంపెనీలు ఇచ్చే భరోసాపైనా మార్కెట్లోకి విడుదలైన ఇలాంటి ఆహార ఉత్పత్తులు దాదాపు 800 రకాలు ఉన్నాయి. వాటన్నింటినిపై పరిశోధనలు జరిపితే ఎన్ని జబ్బులకు దారితీస్తున్న విష మిశ్రమాలున్నాయో! 'జిన్సెంగ్' ఉత్పత్తిని నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడు నెలలు పట్టడానికి కారణం అందులో ప్రత్యక్ష పాపం తనది కూడా కావడం. ఆహార పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేకనో లేదా చేతులు తడుపుకోవాలనే తహతహో తెలియదుగానీ ఆహార భద్రత ప్రమాణాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ 2012 నుంచి సడలిస్తూ వస్తోంది. ఇక కేంద్రంలోని ఆహార శాఖా కార్యాలయంలోని డాక్యుమెంట్ల ప్రకారం 2014, ఆగస్టు నెలలో కేంద్రంలోని ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా జోక్యం చేసుకొని సడలింపు పేరిట నిబంధనలను నీరుగార్చింది. ఆహార భద్రతా సంస్థ అధికారులతోపాటు, కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పారిశ్రామిక వర్గాలతో ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సమావేశమై కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. వీటిని అప్పటి ఆహార భద్రతా సంస్థ సీఈవో వైఎస్ మాలిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. అదే ఏడాది మే నెలలో ఈ ప్రమాణాలు ప్రమాదరమైనవంటూ నచ్చ చెప్పేందుకు పారిశ్రామికవేత్తలకు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. 'మా ఆహారోత్పత్తులు సురక్షితం' అంటూ కంపెనీలే భరోసా ఇస్తున్నప్పుడు మనకెందుకు అభ్యంతరమంటూ మాలిక్‌కు నచ్చచెప్పేందుకు ప్రధాని ప్రధాన కార్యదర్శి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో మాలిక్‌ను ఆహార భద్రతా సంస్థ నుంచి బదిలీ చేశారు. ఇంతకు ఆయన వ్యతిరేకించిన అంశాలేమిటీ? శుద్ధి చేసిన ఆహార పదార్థాలలో సాధారణంగా మూడు రకాల పదార్థాలు లేదా మిశ్రమాలు ఉంటాయి. ఒకటి ప్రొప్రైటరీ ఫుడ్స్, రెండు నావెల్ ఫుడ్స్, మూడు యాడింగ్స్. ప్రొప్రైటరీ ఫుడ్స్ అంటే, మనం తినే రకరకాలు దినుసులు. కెఫిన్, జిన్సెంగ్ కూడా ఈ రకం పదార్థాలే. విడివిడిగా ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటి మిశ్రమం వల్ల ప్రమాదరకమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇక రెండోది నావెల్ ఫుడ్స్. కొత్త రుచుల ఆహారం లేదా ఆహార మిశ్రమం. ఇక యాడింగ్స్ అంటే ఆ ఆహార పదార్థాలను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మిశ్రమాలు, రసాయనాలు. నావెల్ ఫుడ్స్..కంపెనీ యాజమాన్యం ఇష్ట ప్రకారం ఉంటాయి. ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ మాత్రం ఆహార భద్రతా సంస్థ శాస్త్రవేత్తలు సూచించిన ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. ఏయే పదార్థాలు, ఏయే మిశ్రమాలు ఏ స్థాయిలో ఉండాలో ఆహార సంస్థ భద్రతా ప్రమాణాలు సూచిస్తాయి. పారిశ్రామిక వర్గాల ఒత్తిడి ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ వల్ల అనవసరంగా తమకు కాలయాపన అవుతోందని, వీటిని సడలించాలని ఎప్పటి నుంచో పారిశ్రామిక వర్గాలు కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఆ ఒత్తిళ్లకు లొంగి 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణాలను కొంత సడలించగా, 2014లో అధికారంలోకి వచ్చిన బీజీపీ ప్రభుత్వం మరింతగా సడలించింది. అయితే పలు అవాంతరాలు, కోర్టు కేసుల కారణంగా సడలించిన నిబంధనలు 2016, జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆహార భద్రతకు సంబంధించి పీఎంవో ఆధ్వర్యంలో కేంద్ర ఆహార శాఖ తీసుకున్న నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం లేదన్న కారణంగా ముంబై హైకోర్టు కొట్టి వేయడం, దానిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరిగిందన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా భద్రతా ప్రమాణాలను నోటిఫై చేయకుండానే అమల్లోకి తెచ్చింది. సడలించిన ప్రమాణాలేమిటీ? సడలించిన ప్రమాణాల ప్రకారం ప్రొప్రైటరీ ఫుడ్స్ విషయంలో ఆహార సంస్థ ఆమోదించిన పదార్థాలు లేదా దినుసులు ఉపయోగించాలి. అయితే వాటిని వేటివేటితో కలుపుతారో, ఏ మోతాదులో కలుపుతారో ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ నిబంధన ఉండేది. ఇక్కడ కెఫేన్, జిన్సెంగ్ భారత ఆహార సంస్థ ఆమోదించినవే. అయితే వాటి మిశ్రమానికి ఆహార సంస్థ ఆమోదం లేదు. ఈ రెండింటిని కలపడం వల్ల జిన్సెంగ్ ప్రమాదకర డ్రింక్‌గా మారింది. అలాగే ఎక్కువ కాలం ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పదార్థాలు కూడా ఆహార సంస్థ ఆమోదించినవే ఉండాలి. అయితే అది ఏ మోతాదులో ఉండాలో యాజమాన్యం ఇష్టం. ఇంతకుముందు ప్రమాణాలు పాటించాల్సి వచ్చేది. ప్రజల ఆరోగ్యానికి అసలైన ప్రమాదకారి ఈ నిల్వ ఉంచే పదార్థమే. అయితే ఇది మోతాదు మించితే మనుషుల ప్రాణాలకే ముప్పు. వ్యాపారులు లాభాపేక్షతో తమ ఉత్పత్తులు మార్కెట్లో త్వరగా పాడవకుండా ఉండేందుకు ఈ పదార్థాల మోతాదును ఎక్కువ కలుపుతారనే విషయం ఎవరైనా గ్రహించగలరు. 'మ్యాగీ' నూడిల్స్‌లో మోతాదుకు మించి సీసం ఉందన్న కారణంగా కొంతకాలం వాటి ఉత్పత్తులను మార్కెట్లో నిలిపేసిన విషయం తెల్సిందే. ఇంకా అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నోటిఫై కాలేదు. గుడ్డిగా ప్రోత్సహించడంతోనే భారతీయ మార్కెట్లో ఆహారోత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలనే అత్యుత్సాహంతో కేంద్ర ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను సడలిస్తూ వస్తున్నాయి. 2025 నాటికి దేశంలో ఏటా 72 లక్షల కోట్ల ఈ ఆహరపదార్థాల వ్యాపారం నడుస్తుందని, వాటిలో ఏటా 60 లక్షల కోట్ల రూపాయలు లాభాలే ఉంటాయన్నది ఓ అంచనా. ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతా ప్రమాణాలను పణంగా పెట్టినప్పుడు ఇన్ని కోట్ల వ్యాపారం ఎవరి కోసం!? అమెరికా, యూరోపియన్ యూనియన్లు తమ ఆహార భద్రతా ప్రమాణాలను రోజురోజుకు కఠినం చేస్తూ వెళుతుంటే మన దేశం సడలిస్తూ రావడం విచిత్రం. -
ఆల్కాహాల్‌ను ఎనర్జీ డ్రింక్‌తో తాగుతున్నారా?
టొరంటో: మీరు ఆల్కాహాల్‌ను ఎనర్జీ డ్రింక్‌తో సేవిస్తున్నారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. మద్యాన్ని ఎనర్జీ డ్రింక్‌తో తాగితే అత్యంత ప్రమాదకరమైన గాయాలు అవుతాయని ఓ సర్వేలో తెలిసింది. కెనడాకు చెందిన విక్టోరియా యూనివర్సిటీ జరిపిన పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ఆల్కాహాల్, డ్రగ్స్ క్లాసిఫైడ్ జర్నల్‌లో పేర్కొంది. ఎనర్జీ డ్రింక్‌లో ఆల్కాహాల్ కలుపుకొని తాగితే రోడ్డు ప్రమాదాలు, గొడవలు జరిగేలా.. భౌతిక హింసకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. అంతేకాకుండా ఇలా తాగినవారు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తారని, ఇది అత్యంత ప్రమాదకరమని పరిశోదకులు హెచ్చరించారు. మాములుగా మధ్యం తాగిన వారు మత్తు ఎక్కువై ఇంటికి వెళ్తారు. కానీ ఎనర్జీ డ్రింక్‌తో తాగిన వారు ఇంకా ఎక్కువ మద్యం తీసుకుంటారని, వారికి మత్తు తెలియదని ప్రమాదకరకంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. -
'నిజం నాకు, దేవుడికే తెలుసు'
బెంగళూరు: తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనపై మారథాన్ రన్నర్ ఓపీ జైశా స్పందించింది. ఏఎఫ్ఐ ప్రతినిధులు అసలు తనకు దగ్గరకు రాకుండా ఎనర్జీ డ్రింక్స్ ఎలా ఆఫర్ చేశారని ఆమె ప్రశ్నించింది. రియో ఒలింపిక్స్ లో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని జైశా వాపోయింది. అయితే తాము ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా జైశా, ఆమె కోచ్ తీసుకోలేదని ఏఎఫ్ఐ తెలిపింది. దీనిపై జైశా స్పందిస్తూ... 'మాకు పానీయాలు ఇవ్వలేదు. నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా క్రీడా జీవితంలో ఇప్పటివరకు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వానికి లేదా ఏఎఫ్‌ఐకు వ్యతిరేకంగా నేను పోరాటం చేయలేను. కానీ నిజమేంటో దేవుడికి, నాకు తెలుసు. రియో ఒలింపిక్స్ లో నా పట్ల దారుణంగా వ్యవహరించారు. అలసట తీర్చుకోవడానికి నేను ఒప్పుకోలేదని ఇప్పటీకి ఏఎఫ్ఐ చెబుతోంద'ని జైశా వాపోయింది. -
కిడ్స్ పవర్ డ్రింక్
స్కూళ్లు తెరిచేశారు... పిల్లలకు స్కూల్ వర్క్‌తో పాటు హోమ్ వర్క్ కూడా మొదలైంది... ఇంటికి వస్తూనే నీరసం అంటూ వేళ్లాడిపోతుంటారు. టిఫిన్ తినే ఓపిక కూడా ఉండదు. అందుకే... వాళ్లకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వచ్చేలా... గ్లాసుడు ద్రవం ఇచ్చేస్తే వెంటనే బూస్ట్‌అప్ అయిపోతారు. అలాంటి కొన్ని ఎనర్జీ డ్రింక్స్ ఈ వారం మీకోసం... ద్రాక్ష బూస్ట్ స్మూతీ కావలసినవి: నల్ల ద్రాక్షలు - అర కప్పు; తెల్ల ద్రాక్షలు - అర కప్పు; చెర్రీలు - అర కప్పు; అరటిపండు - 1; బాదం పాలు - కప్పు; అవిసె నూనె - టీ స్పూను; తేనె - టేబుల్ స్పూను; దాల్చినచెక్క పొడి - కొద్దిగా తయారీ: ముందుగా ద్రాక్ష పళ్లను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి అరటి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి మిక్సీలో ముందుగా నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష పళ్లు వేసి మెత్తగా చేయాలి చెర్రీలు జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి అరటి పండు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు తిప్పాలి అవిసె నూనె, తేనె వేసి మరో మారు బ్లెండ్ చేయాలి. చివరగా బాదం పాలు వేసి అన్నీ కలిసేవరకు మిక్సీ పట్టి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి గ్లాసులలో పోసి పైన దాల్చిన చెక్క పొడి వేసి చల్లగా అందించాలి. గ్రీన్ తారా జ్యూస్ కావలసినవి: కొత్తిమీర - 5 కట్టలు; తులసి ఆకులు - గుప్పెడు; పుదీనా - కొద్దిగా; మెంతి ఆకులు - 5 కట్టలు; (ఆకు కూరలను శుభ్రపరచాలి) నిమ్మకాయ రసం - 2 టీ స్పూన్లు; దోసకాయ - 1 (తొక్క తీసి తరగాలి); తయారీ: అన్నిటినీ మిక్సీలో వేసి రసం తీసి, చల్లగా అందించాలి. డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ కావలసినవి: బాదం పప్పులు - పావు కప్పు; పిస్తా పప్పులు - పావు కప్పు (ఉప్పు లేనివి); జీడిపప్పులు - పావు కప్పు; కిస్మిస్ - పావు కప్పు; ఖర్జూరాలు - 8 (సన్నగా తరగాలి); కుంకుమ పువ్వు - చిటికెడు; పాలు - రెండున్నర కప్పులు (కాచి చల్లార్చాలి); పంచదార - తగినంత (పైన చెప్పిన డ్రైఫ్రూట్స్‌లో కొన్ని కొన్ని తీసి పక్కన ఉంచుకోవాలి) తయారీ: పావు కప్పు పాలకు డ్రై ఫ్రూట్స్ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి పంచదార, మిగిలిన పాలు జత చేసి, మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి గ్లాసులలో పోసి, పైన డ్రైఫ్రూట్స్ తరుగుతో అలంకరించి వెంటనే అందించాలి. ఓట్స్ డేట్స్ మిల్క్ షేక్ కావలసినవి: ఖర్జూరాలు - 10 (గింజలు తీసి సన్నగా కట్ చేయాలి); పాలు - 3 కప్పులు (కాచి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయినవి); ఓట్స్ - 3 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా తేనె - టేబుల్ స్పూను తయారీ: పావు కప్పు పాలలో ఖర్జూరాలను సుమారు అర గంట సేపు నానబెట్టాలి నూనె లేని బాణలిలో ఓట్స్‌ను కొద్దిగా వేయించి తీసి చల్లారనివ్వాలి నానబెట్టిన ఖర్జూరాలు, వేయించిన ఓట్స్, పంచదార మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు తిప్పాలి మిగిలిన పాలను జత చేసి సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. గార్డెన్ రిఫ్రెషర్ జ్యూస్ కావలసినవి: క్యారట్ - 1 (శుభ్రం చేసి సన్నగా తరగాలి); కొత్తిమీర - 1 కట్ట; రెడ్ క్యాప్సికమ్ - 1 (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); టొమాటోలు - 2; కీర దోస - 1 (తొక్క తీసి సన్నగా తరగాలి); పంచదార - తగినంత; తేనె - రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా క్యారట్‌ను మిక్సీలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి కొత్తిమీరను మిక్సీలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి రెడ్ క్యాప్సికమ్, టొమాటోలను మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి దోస ముక్కలను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి అన్ని రసాలను విడివిడిగా వడ కట్టాలి తగినంత పంచదార, తేనె జత చేసి పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, గ్లాసులలో పోసి అందించాలి. బొప్పాయి తేనె లస్సీ కావలసినవి: బొప్పాయి ముక్కలు - రెండు కప్పులు; పెరుగు - అర కప్పు; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కమలాపండు రసం - 3 టేబుల్ స్పూన్లు; తేనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; ఐస్ క్యూబ్స్ - కప్పు తయారీ: ముందుగా మిక్సీలో బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి పెరుగు, నిమ్మరసం, కమలాపండు రసం, తేనె, ఉపు జత చేసి మరోమారు తిప్పాలి ఐస్ క్యూబ్స్ జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి (లస్సీ చిక్కగా ఉండేలా చూసుకోవాలి) గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. -
ఎనర్జీ డ్రింకులు..శక్తిని హరించి వేస్తున్నాయ్..!
‘ఎనర్జీ డ్రింకులు ఉన్నఫళంగా మీకు ఎనలేని ఓపికను, శక్తిని ఇస్తాయనేది ఒట్టిమాటే.. అవి మీకు సహజసిద్ధంగా ఉన్న శక్తిని కూడా హరించి వేస్తాయి’ అంటున్నారు హెల్త్ ఫుడ్ మ్యానుఫాక్చరర్స్ (హెచ్ఎఫ్ఎమ్ఏ) వారు. యూరప్‌కు చెందిన ఈ సంస్థ పరిశోధకులు మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ ఎనర్జీ డ్రింకులు, వాటిలోని పదార్థాల గురించి పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. ఎనర్జీ డ్రింకుల్లోని కంటెంట్‌ను బట్టి అవి శక్తిని ఇవ్వడం మాట ఎలా ఉన్నా... మనిషిని నిస్తేజపరచడం మాత్రం ఖాయమని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించి శాస్త్రీయమైన వివరణ కూడా ఇచ్చారు. ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింక్‌లోనే దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది! యుక్తవయసులోని మనిషికి రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవడమే ఎక్కువ. 500 మిల్లీగ్రాముల ఎనర్జీ డ్రింక్ క్యాన్‌లో దాదాపు 160 ఎమ్జీ కెఫిన్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధనల ప్రకారం ఎనర్జీ డ్రింకులకు అలవాటుపడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్‌పై ఆసక్తిచూపే అవకాశం ఉందని తేలింది. ఎనర్జీ డ్రింకులు యువతను ఆవిధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింకులను అతిగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్‌లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసి పోవడంతో పాటు రకరకాల దుష్పరిణామాలు ఉంటాయి. ఇవీ... ఎనర్జీ డ్రింకులను తీసుకోవడం వల్ల శరీరంపై పడే ప్రభావాలు. వీటిని బట్టి చూసుకొంటే ఎనర్జీ డ్రింకులు సేవించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో సులభంగా అర్థం అవుతుంది.