కిడ్స్ పవర్ డ్రింక్
స్కూళ్లు తెరిచేశారు...
పిల్లలకు స్కూల్ వర్క్‌తో పాటు హోమ్ వర్క్ కూడా మొదలైంది...
ఇంటికి వస్తూనే నీరసం అంటూ వేళ్లాడిపోతుంటారు.
టిఫిన్ తినే ఓపిక కూడా ఉండదు.
అందుకే... వాళ్లకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వచ్చేలా...
గ్లాసుడు ద్రవం ఇచ్చేస్తే వెంటనే బూస్ట్‌అప్ అయిపోతారు.
అలాంటి కొన్ని ఎనర్జీ డ్రింక్స్ ఈ వారం మీకోసం...
ద్రాక్ష బూస్ట్ స్మూతీ
కావలసినవి:
నల్ల ద్రాక్షలు - అర కప్పు; తెల్ల ద్రాక్షలు - అర కప్పు; చెర్రీలు - అర కప్పు; అరటిపండు - 1; బాదం పాలు - కప్పు; అవిసె నూనె - టీ స్పూను; తేనె - టేబుల్ స్పూను; దాల్చినచెక్క పొడి - కొద్దిగా
తయారీ: ముందుగా ద్రాక్ష పళ్లను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి అరటి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి మిక్సీలో ముందుగా నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష పళ్లు వేసి మెత్తగా చేయాలి చెర్రీలు జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి అరటి పండు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు తిప్పాలి అవిసె నూనె, తేనె వేసి మరో మారు బ్లెండ్ చేయాలి. చివరగా బాదం పాలు వేసి అన్నీ కలిసేవరకు మిక్సీ పట్టి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి గ్లాసులలో పోసి పైన దాల్చిన చెక్క పొడి వేసి చల్లగా అందించాలి.
గ్రీన్ తారా జ్యూస్
కావలసినవి:
కొత్తిమీర - 5 కట్టలు;
తులసి ఆకులు - గుప్పెడు;
పుదీనా - కొద్దిగా;
మెంతి ఆకులు - 5 కట్టలు; (ఆకు కూరలను శుభ్రపరచాలి)
నిమ్మకాయ రసం - 2 టీ స్పూన్లు;
దోసకాయ - 1
(తొక్క తీసి తరగాలి);
తయారీ: అన్నిటినీ మిక్సీలో వేసి రసం తీసి, చల్లగా అందించాలి.
డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్
కావలసినవి: బాదం పప్పులు - పావు కప్పు; పిస్తా పప్పులు - పావు కప్పు (ఉప్పు లేనివి); జీడిపప్పులు - పావు కప్పు; కిస్‌మిస్ - పావు కప్పు; ఖర్జూరాలు - 8 (సన్నగా తరగాలి); కుంకుమ పువ్వు - చిటికెడు; పాలు - రెండున్నర కప్పులు (కాచి చల్లార్చాలి); పంచదార - తగినంత (పైన చెప్పిన డ్రైఫ్రూట్స్‌లో కొన్ని కొన్ని తీసి పక్కన ఉంచుకోవాలి)
తయారీ: పావు కప్పు పాలకు డ్రై ఫ్రూట్స్ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి పంచదార, మిగిలిన పాలు జత చేసి, మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి గ్లాసులలో పోసి, పైన డ్రైఫ్రూట్స్ తరుగుతో అలంకరించి వెంటనే అందించాలి.
ఓట్స్ డేట్స్ మిల్క్ షేక్
కావలసినవి: ఖర్జూరాలు - 10 (గింజలు తీసి సన్నగా కట్ చేయాలి); పాలు - 3 కప్పులు (కాచి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయినవి); ఓట్స్ - 3 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా తేనె - టేబుల్ స్పూను
తయారీ: పావు కప్పు పాలలో ఖర్జూరాలను సుమారు అర గంట సేపు నానబెట్టాలి నూనె లేని బాణలిలో ఓట్స్‌ను కొద్దిగా వేయించి తీసి చల్లారనివ్వాలి నానబెట్టిన ఖర్జూరాలు, వేయించిన ఓట్స్, పంచదార మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు తిప్పాలి మిగిలిన పాలను జత చేసి సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి గ్లాసులలో పోసి చల్లగా అందించాలి.
గార్డెన్ రిఫ్రెషర్ జ్యూస్
కావలసినవి: క్యారట్ - 1 (శుభ్రం చేసి సన్నగా తరగాలి); కొత్తిమీర - 1 కట్ట; రెడ్ క్యాప్సికమ్ - 1 (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); టొమాటోలు - 2; కీర దోస - 1 (తొక్క తీసి సన్నగా తరగాలి); పంచదార - తగినంత; తేనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా క్యారట్‌ను మిక్సీలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి కొత్తిమీరను మిక్సీలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి రెడ్ క్యాప్సికమ్, టొమాటోలను మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి దోస ముక్కలను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి అన్ని రసాలను విడివిడిగా వడ కట్టాలి తగినంత పంచదార, తేనె జత చేసి పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, గ్లాసులలో పోసి అందించాలి.
బొప్పాయి తేనె లస్సీ
కావలసినవి: బొప్పాయి ముక్కలు - రెండు కప్పులు; పెరుగు - అర కప్పు; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కమలాపండు రసం - 3 టేబుల్ స్పూన్లు; తేనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; ఐస్ క్యూబ్స్ - కప్పు
తయారీ: ముందుగా మిక్సీలో బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి పెరుగు, నిమ్మరసం, కమలాపండు రసం, తేనె, ఉపు జత చేసి మరోమారు తిప్పాలి ఐస్ క్యూబ్స్ జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి (లస్సీ చిక్కగా ఉండేలా చూసుకోవాలి) గ్లాసులలో పోసి చల్లగా అందించాలి.