స్కూల్‌ల్లో చిన్నారులపై లైంగిక వేధింపులు
స్కూల్‌ను ధ్వంసం చేసిన స్థానికులు
ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన రైల్ రోకో
ప్రిన్సిపాల్ సహా ముగ్గురి సస్పెన్షన్.. ముగ్గురు పోలీసులపైనా వేటు
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ: డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్‌గార్టెన్ స్కూల్‌లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్‌ను అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది.
వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఆ ఆరోపణలు అవాస్తవం
కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు.
మంత్రి చెప్పినా ససేమిరా..
వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్‌గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.
చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో రైల్ రోకో కారణంగా అంబర్‌నాథ్–కజ్రట్ మార్గంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment