
తోటి విద్యార్థుల చేతుల్లోనే పిల్లలకు వేధింపులు
క్లాస్‌లో ఒకరిని ఏకాకిని చేసి ఏడిపించే చర్యలు
బాధిత పిల్లల్లో కుంగుబాటు, మానసిక ఒత్తిడి, ఒంటరితనం
బులీయింగ్‌కు ఆజ్యం పోస్తున్న కొందరు టీచర్లు
చాపకింద నీరులా విస్తరిస్తున్న విషసంస్కృతి
పెంపకంలో లోపాలు కూడా కారణమంటున్న నిపుణులు
పిల్లల ప్రవర్తనను నిత్యం గమనించాలని సూచనలు
‘ఐ వాంట్ టు డై’.. ఐదో తరగతి చదివే ఒక బాలిక తన రెండు నోట్‌బుక్స్‌లో రాసుకున్న వాక్యం ఇది. హైదరాబాద్‌లోని అల్వాల్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆ బాలిక బాగా పేరొందిన పాఠశాలలో చదువుతోంది. నోట్‌బుక్స్‌లో రామకోటి రాసినట్లుగా ‘ఐ వాంట్ టు డై’అంటూ రాసి పేజీలు నింపేసింది. వాటిని చూసి తల్లిదండ్రులుహడలిపోయి, మానసిక వైద్యులను సంప్రదించారు.
కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు సకాలంలో స్పందించకపోతే పాప ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని తెలిపారు. ఆ బాలిక మాత్రమే కాదు.. చాలామంది స్కూల్ పిల్లలు తరగతి గదిలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరిద్దరు పిల్లలను టార్గెట్ చేసి అనేక రకాలుగా వేధిస్తున్నారు. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ఏడిపిస్తారు. మానసిక వైద్య పరిభాషలో ‘బులీయింగ్’గా పిలిచే ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలేజీల్లో ర్యాగింగ్ తరహాలో స్కూళ్లలో బులీయింగ్ భూతంపిల్లలను వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ విష సంస్కృతి 1.3 శాతం ఉంటే, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో 35 నుంచి 37 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్
ఏమిటీ బులీయింగ్?
ఐ వాంట్ టు డై అని రాసిన బాలిక తోటి విద్యార్థుల కంటే కాస్త లావుగా ఉంటుంది. దాంతో తరగతి గదిలో సహ విద్యార్థులు మొదట్లో ఆటపట్టించేవారు. క్రమంగా అంతా ఒక్కటై ఆమెను ఏకాకిని చేసి ఏడిపించడం మొదలుపెట్టారు. ఈ బులీయింగ్ అంతటితో ఆగలేదు. బాలిక చుట్టూ చేరి జడలు పట్టుకొని లాగుతూ ‘పిగ్‌టేల్’అంటూ ఏడిపించేవారు. ఈ వేధింపులపై క్లాస్ టీచర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఆ బాలికనే తిట్టింది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఫిర్యాదును పట్టించుకోలేదు.
దీంతో ఆ బాలిక డిప్రెషన్‌లోకి వెళ్లింది. పైకి చూడ్డానికి ఇది సాధారణంగా ఏడిపించడం (బులీయింగ్)గానే కనిపిస్తుంది. కానీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో కొందరు టీచర్లే బులీయింగ్‌కు ఆజ్యం పోస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల రంగు, రూపు, ఆకృతి, నడక వంటి శారీరక అంశాలను లక్ష్యంగా చేసుకొని ‘బాడీషెమింగ్’కు పాల్పడుతున్నారు. ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల టీన్స్ వరకు బులీయింగ్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆధిపత్య పెంపకం
తరగతిలో ఉన్న పిల్లలంతా ఒకేవిధమైన బులీయింగ్ స్వభావాన్ని కలిగి ఉండరు. వారిలో ఒక్కరో, ఇద్దరో కలిసి మిగతా వాళ్లందరినీ ఒక గ్రూపుగా సంఘటితం చేస్తారు. టార్గెట్ చేసిన బాలిక లేదా బాలుడిని ఏకాకిని చేస్తారు. మిగతా పిల్లలు తమ ప్రమేయం లేకుండానే ఆ జట్టులో చేరి ఏడిపిస్తుంటారు. తరగతిలో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఆ ఒకరిద్దరు పిల్లల ప్రవర్తన మిగతా పిల్లలను ప్రభావితం చేస్తుంది.
తోటివారికంటే తామే గొప్పవాళ్లమనే భావన పిల్లల్లో కలగడానికి వారి తల్లిదండ్రుల ఆధిపత్య పెంపకమే (అథారిటేరియన్ పేరెంటింగ్) కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి గురించి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బులీయింగ్‌ను అరికట్టాల్సిన టీచర్లే బాధితులను మరింత ఏకాకులను చేస్తున్నారు.
స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని తల్లిదండ్రులు కచి్చతంగా ఆరా తీయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బులీయింగ్‌కు గురయ్యే పిల్లలు సరిగ్గా తినకపోవడం, మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంట్లోనూ ఒంటరిగా గడపడం వంటి లక్షణాలతో బాధపడుతారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
కలిసికట్టుగా ఎదుర్కోవాలి
పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా డామినేటింగ్ కల్చర్‌లో పిల్లలను పెంచుతారు. దీంతో సహజంగానే ఆ పిల్లలకు అదే సంస్కృతి అలవడుతుంది. తాము అలా ఏడిపించడం వల్ల తోటి విద్యార్థి మనస్సును గాయపరుస్తున్నామనే భావన ఆ పిల్లల్లో ఏ మాత్రం కనిపించదు. ఒక సర్వే ప్రకారం తరగతి గదిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక విధమైన బులీయింగ్‌కు గురవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ యాజమాన్యం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. బులీయింగ్ లక్షణాలు ఏ రూపంలో కనిపించినా అరికట్టాలి. లేకపోతే పిల్లల భావి జీవితాన్ని ఇది కబళిస్తుంది. – డాక్టర్ సంహిత, మానసిక వైద్యనిపుణులు, సికింద్రాబాద్.
Comments
Please login to add a commentAdd a comment