స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. పొద్దున లేచి స్కూలుకు వెళ్లాలంటే భయం, బాధతో బడికెళ్లమని మారాం చేస్తుంటారు చిన్నారులు. మరికొంతమంది అయితే మొండికేసి ఏడుపు అస్సలు ఆపరు. ఇలాంటి పిల్లలను నవ్వుకుంటూ స్కూలుకు పంపాలంటే ఈ నాలుగు పాటిస్తే సరి...
మానసికంగా సిద్ధం చేయాలి:
ముందుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తరగతి టీచర్, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో మాట్లాడి, వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడు అది దగ్గర నుంచి చూసిన పిల్లలు స్కూలు వాతావరణాన్ని కొత్తగా భావించరు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఉండాలి.
గట్టిగా అరవకూడదు :
పిల్లలు స్కూలుకు వెళ్లను అని మారాం చేసినప్పుడు గట్టిగా తిట్టడం, ఆరవడం, కోప్పడటం చేయకూడదు. ఇలా చేస్తే వాళ్లు మరింత భయపడతారు. ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో బుజ్జగిస్తూ కారణాలు తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి వాళ్లను స్కూలుకు వెళ్లడానికి అనుకూలంగా ఆలోచించేలా వివరిస్తూ, వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి.
అనుకూలంగా మాట్లాడాలి :
స్కూలు ప్రారంభంలో పిల్లలను స్కూలో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. వాళ్లకిష్టమైన టిఫిన్ పెట్టాలి. స్కూలు నుంచి వచ్చాక ‘‘స్కూల్లో ఎలా గడిచింది? ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ’’ అని అడగాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో పిల్లలకు తెలియకుండా టీచర్‌ను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. టీచర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించాలి.
ప్రోత్సహించాలి:
స్కూలుకు వెళ్లేందుకు ఆసక్తి కలిగేలా పిల్లలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుండాలి. స్కూల్లో స్నేహితులను ఏర్పర్చుకోమని చెబుతుండాలి. ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రులు కాస్త సహనం పాటిస్తే.. పిల్లలు సంతోషంగా స్కూలుకు వెళ్లి చదువుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment