Parenting Tips
-
పిలల్ల పెంపకంలో ఆ తప్పులు చెయ్యొద్దంటున్న మిచెల్ ఒబామా!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా సోషల్ మీడియా ఇంటర్యూలో పిలల్ల పెంపకం గురించి మాట్లాడరు. పిల్లలను చక్కగా పెంచడం అనేది ఓ యజ్ఞం లాంటిదని అన్నారు. ఎందుకుంటే మనం చెప్పేవి వాళ్ల మంచికేనని తెలియాలి, అదే టైంలో తల్లిదండ్రులు వాళ్లకు విలన్స్ కాదు శ్రేయోభిలాషులు అనే నమ్మకం కలిగించాలి. అంతేగాదు ఆమె పిల్లల పెంపకం అనేది చాలా కష్టమైన పని అని, అది కత్తి మీద సాములాంటిదని అన్నారు. ఏ మాత్రం మనం అజాగ్రత్తతతో లేదా నిర్లక్ష్యపూరితంగా వ్యహరిస్తే వారి భవిష్యత్తు నాశనమవ్వడం తోపాటు మనకు తీరని మనోవ్యధే మిగిలుతుంది అని చెబుతున్నారు మిచెల్. తాను ఈ విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న మెళుకువలే తన ఇద్దరి పిల్లల పెంపకంలో ఉపయోగపడ్డాయిని చెబుతోంది. అందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మిచెల్. అవేంటంటే.. పిల్లలు తమంతట తామే పెరుగుతారు. వారికి ఎదిగే క్రమంలో మన సాయం కావాల్సిన చోటల్లా భరోసా ఇస్తే చాలు. వారే చుట్టూ ఉన్న వాతావరణం, తమ స్నేహితులు, బంధువుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. పైగా తెలివిగా అభివృద్ధి చెందుతారు. ఆ క్రమంలో పిలల్లు కొన్ని తప్పులు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేంత మెచ్చూరిటీ లెవెల్స్ పిలల్లకు ఉండవు. మనం చేసే ఒక్కో పని సంక్రమంగా లేకపోతే ఎంత పెద్ద సమస్యను సృష్టిస్తుందనేది కూడా వాళ్లు అంచనా వేసేంత బ్రెయిన్ వాళ్లకు ఉండదు. కాబట్టి పిల్లలను తెలివిగా, సక్రమంగా పెంచాలంటే ఈ సింపుల్ మెళుకువలు పాటిస్తే ఎంతటి మొండి పిల్లలైనా తీరు మార్చుకుంటారు. కాస్త సమయ తీసుకున్నప్పటికీ మంచి పిల్లలుగా గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. మిచెల్ చెప్పే మెళుకువలు.. పిల్లలను నేరుగా విమర్శించొద్దు.. చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు ఇదే అని మిచెల్ అంటున్నారు. మీరు పిల్లలను మంచి కోరే నేరుగా వాళ్ల చేస్తుంది తప్పు అని చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్లు మనం అన్నమాటలు ఎలా తీసుకుంటున్నారనేది గమనించకపోతే పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య ఉండే బాండింగ్ దెబ్బ తింటుంది. మిమ్మల్ని శత్రువులుగా చూసే ప్రమాదం ఎక్కువగా ఉంది. పిల్లలు తమ తప్పును వాళ్లే గుర్తించేలా విడమర్చి చెబుతూ మిమర్శనాత్మకంగా చెప్పండి. అంతేగాదు పేరెంట్స్ మీరు క్షమించినా, బయట ఇలా చేస్తే వాళ్లను ఎలా చూస్తారనేది అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు పేరెంట్స వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా ఫ్రెండ్లీగా మెలుగుతారు. బాధ్యతలను తీసుకునేలా చేయాలి.. చాల మంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పులు చేస్తున్నారని మిచెల్ అంటున్నారు. పిల్లలు అమాయకులు, ఎంత ఎదిగినా చిన్నవాళ్లే అనే భావనల నుంచి పేరెంట్స్ ముందు బయటకు రావాలి. వారి వయసుకు తగ్గట్టు చిన్న చిన్న బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కారించాలనే ఆలోచన డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడే వాళ్లలోని దాగున్న ప్రతిభ, సామర్థ్యాలను బయటకు వస్తాయి. ఇక్కడ బాధ్యతలు అనగానే ప్రతీది కాదు వారు చేయగలిగేలా, ప్రయోజనం చేకూర్చేవి, తప్పక నేర్చుకోవాల్సిన బాధ్యతలు చిన్న చిన్నగా ఇవ్వండి. రాను పిల్లలకు తెలియకుండా నా కుటుంబం కోసం నేను ఇది చేయాలనే అవగాహన రావడమే గాక ఇది తన బాధ్యత అనే స్థాయికి చేరుకుంటారని అంటున్నారు మిచెల్. సమస్యలతో పోరాడనివ్వండి.. తల్లిదండ్రులుగా మనం రక్షణగా ఉన్నప్పటికీ వారు వ్యక్తిగతంగా ఏదోఒక సమయంలో వారికి వారే పోరాడాల్సి ఉంటుంది. అందువల్ల చిన్న సమస్యలను వాళ్లు ఎలా పరిష్కరించేందుకు యత్నిస్తున్నారో చూడండి. వెళ్తున్న దారి కరెక్టే అయితే ధైర్యం ఇవ్వండి. ఒకవేళ్ల తప్పుదోవలో సమస్య పరిష్కరించేందుకు చూస్తుంటే అడ్డుకుని వివరించండి. ఈ విధానం పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కెరీర్ పరంగా వచ్చే సమస్యలను, ఒత్తిడులను జయించగలిగే శక్తిని ఇస్తుంది . తప్పిదాల నుంచే విజయం పొందడం ఎలా..? ఒక పని చేస్తున్నప్పుడూ పదే పదే ఫెయ్యిల్యూర్లు వస్తుంటే.. అక్కడితో నిరాశగా ఢీలా పడిపోకుండా ముందుకు నడవడం ఎలా అనేది తెలియజేయండి. ఎన్ని ఓటములు ఎదురైనా.. పాజిటివ్ ఆటిట్యూడ్‌ని వదలకూడదు, ఓడిపోయానని చేతులెత్తేయకూడదని చెప్పండి. చివరి నిమిషం వరకు విజయం కోసం వేచి చూసే స్పూర్తిని నేర్పించండి. తప్పిదాలనే విజయానికి బాటలుగా చేసుకోవడం ఎలా అనేది వివరించండి. ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తుల గూర్చి కథకథలుగా చెప్పండి. అప్పుడూ వాళ్లకు సక్సెస్ అనేది అందుకోలేని బ్రహ్మపదార్థంలా కనిపించదు. అలాగే ప్రస్తుత పరిస్తుతలను చూసి చాలామంది తల్లిదండ్రులు మనోడు మంచిగా ఉంటాడా? అని ఆందోళన చెందకూడదు. నిజానికి బయట పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా మీరు వారితో వ్యవహరించే విధానం బాగుంటే ఆందోళనకి చోటు ఉండదనే విషయం గుర్తెరగాలి. అంతేగాదు చెడు అలవాట్ల జోలికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ మనసు లాగినా పేరెంట్స్ మీదున్న గౌరవం ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేస్తుంది అని చెబుతున్నారు. నిజంగా మిచెల్ చెప్పిన మెళుకువలు ప్రతి తల్లిదండ్రులు అనుకరిస్తే పిల్లలు మంచిగా పెరగడమే కాకుండా దేశానికి మంచి పేరు కూడా తెస్తారు కదూ. (చదవండి: ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!) -
పిల్లలను బాధ్యతతో పెంచుతున్నారా? అతి గారాబమా?
చాలామంది తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలను తమ పిల్లలు అనుభవించ కూడదనే ఉద్దేశ్యంతో వారిని అతి గారం చేస్తుంటారు. తమకు ఉన్నా లేకున్నా, వారికి కావలసిన అన్ని వసతులూ, సౌకర్యాలూ సమకూర్చుతూ, వారికి కష్టం అనేది తెలియకుండా పెంచుతుంటారు. అయితే అది చాలా తప్పు. వారికి బాల్యం నుంచి బాధ్యతలు తెలియజేయాలి. అలాగని వారి నెత్తిమీద బాధ్యతల బరువు వెయ్యడం కాదు... వారి బాధ్యత వారికి తెలిసేలా చేయడమే బాధ్యతతో కూడిన పెంపకం. పంచుకోవడం అన్నది పిల్లలకి తప్పనిసరిగా నేర్పాల్సిన వాటిలో ఒకటి. దానివల్ల ఇతరులతో స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరి అవసరం మరొకరికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు స్కూలు నుండి రాగానే, పుస్తకాల సంచీ అక్కడే ఏ సోఫాలోనో పారేసి, విడిచిన బట్టలని, చెప్పులని ఒకపక్కకి వదిలేస్తారు. అటువంటప్పుడు వారికి ఆ వస్తువుల విలువ, అవసరం తెలియజేస్తూ, క్రమపద్ధతిలో భద్రపరచుకునేట్లు వారికి అలవాటు చేయాలి. అంతేకాదు, వారు అడిగినవన్నీ వెంటనే తెచ్చి ఇవ్వకుండా మంచి మాటలతో బుజ్జగించి దారికి తేవాలి. ఎదిరించి మాట్లాడుతుంటే... పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడే పిల్లలని చూస్తుంటాం. మొదట తల్లిదండ్రులు తమ పెద్దలని గౌరవిస్తే, అదే బాటలో పిల్లలూ నడుచుకుంటారు. గురువులు, పెద్దలు, వృద్ధులను తల్లిదండ్రులు గౌరవిస్తే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. షాపింగ్ షాపింగ్‌కి వెళ్ళినపుడు, పిల్లలని తమతో తీసుకెళుతుంటారు. అక్కడ వారికి సెల్‌ఫోన్ చేతికిచ్చి ఒకచోట కూర్చోబెట్టి తాము షాపింగ్ చేసుకుంటారు. అలా కాక తమ పిల్లలని కూడా తమతో ఉంచుకుంటే ఒక వస్తువు కొనేటప్పుడు తమ తల్లిదండ్రులు ఆ వస్తువు నాణ్యతని ఎలా పరీక్షిస్తున్నారో, ఎలా ఎంచుకుంటున్నారో అన్న విషయాలు తెలుసుకోవటంతో పాటు అక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి, తమకు ఏమి కావాలి, ఏవి ఉపయోగం అన్నది గ్రహించుకోగల్గుతారు. కలిసి భోజనం చేయడం వారానికి ఒక్కరోజు అయినా అందరూ కలిసి భోజనం చేయాలి. అలా చేయటం వల్ల బయటకు వెళ్ళి, ఇతరులతో కలిసి భోజనం చేయాల్సొచ్చినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకు తినిపించాల్సిన అవసరం ఉండదు. మంచి మాటలతో సహజంగా పిల్లలు అల్లరి బాగా చేస్తుంటారు. ఆ అల్లరి మోతాదు మించి΄ోతుంటుంది. వస్తువులు పాడవటం, విరగటం, పగిలి పోవటం కూడా జరుగుతుంటుంది. ఆ సమయంలో ఎంత కోపం వచ్చినా, ఆ పాడయిన వస్తువు గురించే మాట్లాడాలి కాని పిల్లవాడి మనస్తత్వం గురించి మాట్లాడకూడదు. ఆ వస్తువు భద్రత గురించి చెప్పాలి. మరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండేలా చేయాలి. పాకెట్ మనీ సాధారణంగా పిల్లలు కొంచెం ఎదిగాక, వారికి వారి ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ము ఇస్తుంటారు. వారు ఎలా ఖర్చు పెట్టుకున్నా పట్టించుకోరు. ఇది సరి కాదు. వారు ఆ డబ్బును ఎందుకు... ఎలా ఖర్చు చేస్తున్నారో పద్దు రాయమనాలి. వాటిని చెక్ చేసి, అందులో అనవసర ఖర్చులుంటే వాటిని ఎత్తి చూపాలి. దీనివల్ల పిల్లలకి మనీ మేనేజ్మెంట్ అలవడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ ఉదయం లేచే సమయం, భోజన సమయం, చదువుకునే సమయం, ఆటలాడే సమయం, పడుకునే సమయం.. ఇలా అన్నింటికీ ఒక టైం టేబుల్ తయారు చేయాలి. ఇది ఎంతో అవసరం. చదువు చదువు అని పోరాటం కాదు, ఎలా చదువుకోవాలో, చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలియపరిస్తే వారు చదువుని కష్టపడి కాకుండా, ఇష్టపడి చదువతారు. థాంక్స్.. సారీ..! ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినపుడు సారీ చెప్పటం, ఎవరి దగ్గరైనా ఏ వస్తువునైనా, లేదా సహాయాన్నైనా పొందితే,కృతజ్ఞత చెప్పటం అలవరచాలి. బాల్యం నుంచే పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం, ఇరుగు పొరుగుతో, తోటివారితో మర్యాదగా మెలగడం, ఉన్నదానిని కలిసి పంచుకోవడం వంటి వాటిని నేర్పిస్తూ, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. -
పిల్లలు మాట వినకుండా బెట్టు చేస్తున్నారా?ఇలా దారికి తెచ్చుకోండి
ఈకాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం కష్టమే. ఇది చేయకు, అది చేయకు, అలా, ఇలా ఉండకూడదు అని చెబితే అస్సలు వినరు. పెద్దవాళ్లు చెప్పేది తమ మంచికే అన్న స్పృహ ఉండదు వారికి. అయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తపన పడుతుంటారు తల్లిదండ్రులు. మాట వినకుండా పెంకిగా ప్రవర్తించే పిల్లలను ఇలా మీ దారిలోకి తెచ్చుకోండి. అప్పుడు ఇక పిల్లలతో పాటు మీరూ సంతోషంగా ఉంటారు. ►మాట వినడం లేదని పిల్లలను తిట్టకూడదు. నువ్వు చెడ్డదానివి లేదా చెడ్డవాడివి అని వారిని నిందించకూడదు. నువ్వు పెద్దదానివి లేదా పెద్దవాడివు అవుతున్నావు కదా... అందుకే ఇలా చేస్తే బాగుంటుంది... అని లాలనగా చెప్పాలి. ► కోపంలో మనం అనే కొన్ని రకాల మాటలు పిల్లల మనసుకు గాయం చేసి, వారి మనసును విరిచేస్తాయి. కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతిస్తాయి. అందుకే వీలైనంత వరకు వారికి ఓపికగా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ►పిల్లలు ఎంత విసిగించినప్పటికీ పెద్దగా అరవకూడదు. పైన చెప్పుకున్నట్టు సున్నితంగా పదేపదే చెబుతూ బుజ్జగించాలి. ఎంత చెప్పినా వినకుండా ఉంటే ముందు వాళ్ల కోపం తగ్గించాలి. తరువాత పిల్లలు విసుక్కోకుండా జాగ్రత్తగా చెప్పాలి. ► చెప్పేది ఏదైనా ప్రేమగా చెబితే ఎంత మొండి చేసేవారైనా తప్పకుండా వింటారు. నచ్చిన డ్రెస్ వేసుకోనివ్వడం, హోం వర్క్ అయిన తరువాత టీవీ చూడనివ్వడం, డాడీతో కలిసి బయటకు వెళ్లడానికి అనుమతించడం వంటివి. ఇలా పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగించి, తరువాత వారికి మంచి చెడులు వివరించాలి. ►ప్లీజ్, థ్యాంక్యూ, యూ ఆర్ వెల్కమ్ వంటి మర్యాదలు నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు అదే నేర్చుకుంటారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ► పిల్లలు వారికి హాని జరిగే పనులు కొన్నిసార్లు చేస్తుంటారు. వెంటనే కేకలేసి, లెక్చర్ ఇవ్వకూడదు. కాస్త దెబ్బలు తగిలినప్పటికీ... వాళ్లు తేరుకున్నాక, మీ మాటలు వినే మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి వివరించాలి. అప్పుడు వారు మరోసారి అటువంటి పనులు చేయరు. -
స్కూల్‌కి వెళ్లనని పిల్లలు మారాం చేస్తున్నారా? ఇలా చేసి చూడండి
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్‌కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.... సమస్యను అర్థం చేసుకోవాలి.. ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి. సరిపోయిందా లేదా? స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. ప్రేమతో లేపాలి ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి. ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తున్నారా? ఇలా చేయండి
స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. పొద్దున లేచి స్కూలుకు వెళ్లాలంటే భయం, బాధతో బడికెళ్లమని మారాం చేస్తుంటారు చిన్నారులు. మరికొంతమంది అయితే మొండికేసి ఏడుపు అస్సలు ఆపరు. ఇలాంటి పిల్లలను నవ్వుకుంటూ స్కూలుకు పంపాలంటే ఈ నాలుగు పాటిస్తే సరి... మానసికంగా సిద్ధం చేయాలి: ముందుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తరగతి టీచర్, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో మాట్లాడి, వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడు అది దగ్గర నుంచి చూసిన పిల్లలు స్కూలు వాతావరణాన్ని కొత్తగా భావించరు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఉండాలి. గట్టిగా అరవకూడదు : పిల్లలు స్కూలుకు వెళ్లను అని మారాం చేసినప్పుడు గట్టిగా తిట్టడం, ఆరవడం, కోప్పడటం చేయకూడదు. ఇలా చేస్తే వాళ్లు మరింత భయపడతారు. ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో బుజ్జగిస్తూ కారణాలు తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి వాళ్లను స్కూలుకు వెళ్లడానికి అనుకూలంగా ఆలోచించేలా వివరిస్తూ, వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అనుకూలంగా మాట్లాడాలి : స్కూలు ప్రారంభంలో పిల్లలను స్కూలో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. వాళ్లకిష్టమైన టిఫిన్ పెట్టాలి. స్కూలు నుంచి వచ్చాక ‘‘స్కూల్లో ఎలా గడిచింది? ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ’’ అని అడగాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో పిల్లలకు తెలియకుండా టీచర్‌ను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. టీచర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించాలి. ప్రోత్సహించాలి: స్కూలుకు వెళ్లేందుకు ఆసక్తి కలిగేలా పిల్లలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుండాలి. స్కూల్లో స్నేహితులను ఏర్పర్చుకోమని చెబుతుండాలి. ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రులు కాస్త సహనం పాటిస్తే.. పిల్లలు సంతోషంగా స్కూలుకు వెళ్లి చదువుకుంటారు. -
పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి?
మూడేళ్ళ వయసులో పిల్లల్ని బడిలో చేర్పిస్తారు. అప్పటిదాకా , ఆ మాటకొస్తే ఆ తరువాత కూడా పిల్లల్ని పెంచడం లో చేయాల్సినవి .. చేయకూడనివి ఏంటి.? పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి. 1 . పిల్లల చేతికి ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఇవ్వొద్దు. అది వారి మెదడు ఎదుగుదలను దెబ్బ తీసి, వర్చ్యువల్ ఆటిజం (బుద్ధి మాంద్యత)ను కలిగిస్తుంది. సెల్ ఫోన్ కు అలవాటు పడిన పిల్లలకు మాటలు సరిగా రావు . చికాకు , అసహనం , కోపం , హింసాప్రవృత్తి , తిరుగుబాటు ధోరణి... నెలల్లో వచ్చేస్తుంది . అటు పై సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్లి, వేలల్లో ఖర్చు పెట్టినా, ఫలితం దక్కక పోవచ్చు. 2. పిజ్జా బర్గర్ , కోక్ , పెప్సీ, ప్యాకెట్లలో దొరికే పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్ కు పిల్లల్ని అసలు అలవాటు చేయకండి . చాకోలెట్లు, బిస్కెట్ లు లాంటివి కూడా ఎక్కువగా ఇవ్వొద్దు. పళ్ళు , వేరుశనిగ గింజెలు , బెల్లం తో చేసిన చిక్కీలు (వేరుశనిగె చిక్కి ,నువ్వుల చిక్కి), డ్రై ఫ్రూట్ లడ్డు తాటి నుంజెలు , పొత్నాలు (శనిగెలు) బటానీలు లాంటి వాటిని చిరు తిళ్ళుగా అలవాటు చేయండి . ఆకుకూరలు కాయగూరలు బాగా తినేలా చూడండి . 3. పిల్లలు ఆకలి వేస్తె అన్నం తింటారు. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయకండి. బాగా నమిలి తినేలా ప్రోత్సహించండి. 4 . ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండండి. మాటలు నేర్పించండి . దీనికి ఎంతో ఓర్పు - నేర్పు కావాలి . నిద్ర పోయేటప్పుడు తప్పించి వారితో, ఎవరో ఒకరు , ఎప్పుడూ, మాట్లాడుతూ ఉండాలి. ఎంత ఎక్కువ వారితో మాట్లాడితే, వారి మెదడు (న్యూరల్ కనెక్షన్స్) అంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. 5. మూడేళ్ళ లోపు, అంటే పిల్లలు బడికి వెళ్లేంత వరకు, ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉండాలి . వారు ఎప్పుడూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి . కేవలం భార్య- భర్త ఉన్న కేంద్రక కుటుంబాలలో పిల్లల ఎదుగుదల కుంటుబడుతుంది . నిజం నిష్ఠూరంగా ఉంటుంది . కానీ చెప్పక తప్పదు. తల్లి ఒక్కతే అస్తమానమూ, చంటి పిల్లలతో వ్యవహరించలేదు. మేలుకొన్నంత సేపు పిల్లలు , ముఖ్యంగా ఒకటి నుంచి మూడేళ్ళ లోపు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వుంటారు. తల్లి తాను చేస్తున్న పనికి లీవ్ పెట్టినా , ఇంత సమయం వెచ్చించ లేదు. బడికి వెళ్లే వయసు వచ్చే వరకు పిల్లలతో ఎవరో ఒకరిద్దరు తోడు ఉండాలి. వారు పిల్లలతో ఆడుతూ పాడుతూ మాట్లాడిస్తూ ఉండాలి . 6 . కదులుతున్నది , సౌండ్ వచ్చేది , రంగురంగుల్లో ఉండేది... ఇలాంటి వాటి పట్ల పిల్లలు సహజంగా ఆకర్షితులు అవుతారు. ఇది మానవ పరిణామ క్రమంలో పిల్లలకు సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం. పిల్లల్ని వీలైనంత ఎక్కువగా బయటకు తీసుకొని వెళ్ళాలి . ఆకాశం , చందమామ , నక్షత్రాలు , పక్షులు జంతువులు ఇలా ప్రకృతికి , చుట్టూరా ఉన్న మానవ ప్రపంచానికి ... ఎక్సపోజ్ చెయ్యాలి. నాలుగు గోడలకే పరిమితం చేస్తే వారి బుద్ది వికాసం మందగిస్తుంది . ఇంట్లో కదిలేది రంగురంగుల ను చూపేది సౌండ్ నిచ్చేది .. ఏది ? టీవీ . వారిని నాలుగు గోడలకు పరిమితం చేస్తే వారు ముందుగా టీవీకి, అటు పై సెల్ ఫోన్‌కు ఆకర్షితులు అవుతారు. ఈ కాలం పిల్లలు టెక్నాలజీ ని బాగా వాడేస్తారు అని మీరు మురిసి పోయే లోగా, వారికి సెల్ ఫోన్ అడిక్షన్ వచ్చేస్తుంది. ఆ తరువాత వారి జీవితం, మీ జీవితం నరకం. 6 . పిల్లలకు కథలు చెప్పండి . దీని వల్ల వారు మీ మాట వినడానికి చిన్నపటి నుంచే అలవాటు పడుతారు. కథల ద్వారా పిల్లల్లో క్రిటికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్, సహానుభూతి లాంటి స్కిల్స్ పాదుగొలపవచ్చు. శ్రవణ, గ్రహణ శక్తి కూడా పెంపొందుతుంది . లాలి పాటలు, జోల పాటలు పాడండి. చంటి బిడ్డ దగ్గర పాటలు పాడడానికి మీరేమీ సుశీల లేదా జానకి కానక్కర లేదు . ప్రతి తల్లిలో ఒక సుశీల, జానకి , లతా మంగేష్కర్ ఉన్నారు. తండ్రులు కూడా పాడొచ్చు. పిలల్లకు బెడ్ టైం స్టోరీస్ చెప్పొచ్చు . పిల్లల పెంపకం ఉమ్మడి భాద్యత . 7. చంటి పిల్లలు ముఖ్యంగా నడవడం నేర్చిన తరువాత, చుట్టూరా ఉన్న వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు . వాటిని తీసి పరిశీలించడం మొదలు పెడుతారు. కరెంటు వైర్, ప్లగ్ లాంటి ముట్టుకోకూడని వస్తువులు తప్పించి మిగతా వస్తువులను వారిని ముట్టుకోనివ్వండి. పరిశీలించనివ్వండి . వస్తువులను ఎలా హ్యండిల్ చేయ్యాలో, ఏమి చేయకూడదో వివరించండి . ఉదాహరణకు గాజు గ్లాస్.. " ఆమ్మో ! కింద పడితే పగిలి పోతుంది " అని వారికి అర్థం అయ్యేలా చెప్పండి . కరెంటు వైర్ కన్నా ... గ్యాస్ స్టవ్ కన్నా... వారు ముట్టుకోకూడని డేంజరస్ వస్తువు ఒకటుంది . అదే సెల్ ఫోన్ . " ఇది పెద్దలకు మాత్రమే . నువ్వు అసలు తాకకూడదు" అని కచ్చితంగా చెప్పండి. నిక్కచ్చిగా వ్యవహరించండి. 8. నెమ్మదిగా రెండేళ్ల వయసు నుంచి వారికి పుస్తకాల పట్ల మక్కువ పెంచండి. ముందుగా బొమ్మల పుస్తకాలు. బొమ్మల్ని చూపుతూ దాని గురించి వారితో మాట్లాడండి . ఈ ఫర్ ఎలిఫెంట్ .. చెప్పండి. E..L..E..P..H..A..N..T అని వారికి స్పెల్లింగ్ నేర్పడం కాదు. పాయింట్లు బట్టి కొట్టించడం కాదు. ఏనుగు ఏనుగు నల్లంగా .. ఏనుగు కొమ్ములు తెల్లంగా అని పాట పాడడం .. ఏనుగు అడవిలో ఉంటుంది . అడవంటే ఏంటి ? ఇలా బాతాఖానీ టైపు లో మాటలు ఉండాలి. పెద్ద వారు పక్కనున్న వారికి వినబడేలా కాస్త బిగ్గరగా పుస్తకాలు చదివితే మంచిదని, ఈ పద్దతి బిడ్డ గర్భం లో వున్నప్పుడే మొదలు కావాలని అమెరికన్ వైద్యులు గర్భిణీ స్త్రీలకు రెకమెండ్ చేస్తారు . 9 . పిల్లలు మనల్ని చూసి అనుకరిస్తారు . వారికెదురుగా బిగ్గరగా కొట్లాడుకోవడం , కోపం, అసహనం, ద్వేషం లాంటి నెగటివ్ ఎమోషన్స్ ను ప్రదర్శించడం , అదే పనిగా టీవీ చూడడం సెల్ ఫోన్ కు అంటుకొని ఉండడం లాంటివి చేయకూడదు. 10 . మీ ముద్దు మురిపెంతో పిల్లల్ని ఆటపట్టించడం , గేలి చెయ్యడం లాంటివి చెయ్యకండి . నవ్వుతూ వారితో సంయమనంతో వ్యవహరించండి. పిల్లల్ని పెంచడం ఒక కళ. ఒక సైన్స్ . పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు, గ్రామీణ జీవితాల వల్ల పైన చెప్పినవన్నీ సహజంగా జరిగి పోయేవి. నలభై లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి ఇలాగే ఎదిగాడు. అది ప్రకృతి ధర్మం. మానవ శరీర నిర్మాణం ఇలాగే జరిగింది . జంక్ ఫుడ్ , వాటిని ప్రమోట్ చేసే సినీ హీరోలు, క్రికెటర్లు.. సెల్ ఫోన్ .. ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం .. ఇదీ నేటి పిల్లల పెంపకం లో ఎదురయ్యే సవాళ్లు . సరైన రీతిలో పిల్లల్ని పెంచితే అదే కోట్ల ఆస్తి. ఇంట్లో బిడ్డ వర్చ్యువల్ ఆటిజం తో నో ADHD తో నో బాధ పడుతుంటే కోట్ల ఆస్తి ఉన్నా జీవితం నరకం . తస్మాత్ జాగ్రత్త. వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు
తల్లిదండ్రులుగా పిల్లలను చూసుకోవాల్సిన విధానాన్ని, తల్లిగా తన అనుభవాన్ని కళ్లకు కడుతూ యూ ట్యూబర్‌గా రాణిస్తోంది హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటున్న చిలుకూరి కృష్ణమాధురి, నాలుగు, ఏడాదిన్నర వయసున్న పిల్లలతో కలిసి, తన స్వీయ అనుభవాలను షేర్ చేస్తుంటుంది. మాధురి మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు... పిల్లల పెంపకంలో తను తీసుకునే జాగ్రత్తలు ఎంతోమంది తల్లులకు పాఠాలు అవుతున్నాయి. ఈ విషయాల గురించి మాధురి మాట్లాడుతూ ... ‘‘నేను పుట్టి పెరిగింది రాజమండ్రిలో. మావారిది గుంటూరు. మా వారి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాళ్లం. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను పిల్లల పుట్టడంతో ఇంటి దగ్గరే ఉండిపోయాను. పిల్లలపై తపన, వారి ఆరోగ్య జాగ్రత్తలు, పెంపకం విషయాలన్నీ తల్లిగా నాకు ప్రతిరోజూ ఓ పాఠమే. వీటిని నలుగురితో పంచుకుంటే కొంతమంది తల్లులకైనా ఉపయోగపడుతుంది కదా అని సరదాగా వీడియోలు తీసి, యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసేదాన్ని. వాయిస్ ఆఫ్ వసపిట్ట పిల్లల అల్లరి మాటలకు పెద్దవాళ్లు ముద్దుగా పెట్టే పేరు వసపిట్ట. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువగా మాట్లాడేదాన్ని. అందుకే, అందరూ నన్ను వసపిట్ట అని పిలిచేవారు. దీంతో ఛానెల్‌కి ఇదే పేరు బాగుంటుందని ఎంచుకున్నాను. మూడేళ్లు అవుతోంది ఇది స్టార్ట్ చేసి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాక నా పోస్ట్‌లు మరిన్ని పెరిగాయి. పెంపకాన్ని పరిచయం చేస్తూ.. అమ్మ తన పిల్లలను ఏ విధంగా పెంచుతుందనే విషయాల గురించి వెతికితే తెలుగులో ఎక్కువ బ్లాగర్స్ లేరు. ఉన్నా, వివరంగా చెప్పేవారు లేరు. పిల్లల పెంపకం అనగానే చాలా వరకు డాక్టర్లు, డైటీషియన్లు కనిపిస్తారు. వాళ్లు చెప్పేవి అందరూ ఆచరణలో పెడుతున్నారో లేదో తెలియదు. నేను డాక్టర్ దగ్గరకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అక్కడ వారిచ్చిన మందులు, జాగ్రత్తల నుంచి అన్నీ నా ఛానెల్ ద్వారా పరిచయం చేస్తుంటాను. రోజువారి పనులు చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో తల్లులందరికీ అనుభవమే. ఇల్లు పీకి పందిరేస్తారు అంటుంటారు. ఇలాంటప్పుడు చిన్నపిల్లలకు క్రమశిక్షణ ఎలా అలవాటు చేయాలి, దుమ్ము, కాలుష్యం నుంచి వారిని ఎలా కాపాడాలి, టీవీ చూడకుండా తినడం ఎలా అలవాటు చేయాలి, స్క్రీన్ టైమ్ ఎందుకు తగ్గించాలి.. ఇలాంటివి పిల్లలను ఇన్వాల్వ్ చేసి చెప్పడం వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంతేకాదు, వాళ్లంతట వాళ్లు పనులు చేసుకోవడం, వంటలో సాయం చేయడం.. వంటివి పిల్లలకు పెద్దవాళ్లు అలవాటు చేయాలి. వీటిని మా పిల్లలను చూపిస్తూ ‘హ్యాపీ పేరెంటింగ్’ అనేది తెలియజేయాలనుకున్నాను. అదే చేస్తున్నాను. ఆనందకరమైన లక్ష్యం మదర్ హుడ్, ఫాదర్ హుడ్ ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా మంచి ఫీలింగ్‌తో పెరగాలనేది నా ఆలోచన. మేం సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో కూడా చూపిస్తున్నాను. వీటిని చూడటానికి నాలుగు లక్షలకు పైగా వీక్షకులున్నారు. వీరిలో పిల్లలున్నవారు 70 శాతం మంది ఉన్నారు. నా వీడియోలు చూసి తాము కూడా బ్లాగ్స్ చేస్తున్నామని కొందరు చెబుతుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు... వీక్షకులలో చాలా మంది డాక్టరు చెప్పే జాగ్రత్తలు, కిడ్స్ ఫుడ్ గురించి సలహాలు సూచనలు అడుగుతుంటారు. పిల్లలు సరిగా తినరు అనేది పెద్దలు ప్రతిసారి చెబుతుంటారు. కానీ, ఎందుకు తినరు, ఎలా తింటారు.. అనే వివరాలను మా పిల్లలను ఉదాహరణగా చూపిస్తూ వివరిస్తుంటాను. వివిధ సమయాలలో పిల్లల ప్రవర్తన, మనం వారితో మాట్లాడటం, ్రపాక్టికల్గా చేస్తూ చెబుతుంటాను. పిల్లలు కూడా ఈ విధానాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మా పిల్లలకు ఓ సారి ర్యాషెష్ వచ్చాయి. వాటిని ప్రాక్టికల్‌గా చూపించి, డాక్టరు చెప్పిన సూచనలతో పాటు, నేను స్వయంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో చూపించాను. అలాగే.. డెంటల్ ట్రీట్మెంట్, గర్భిణిగా ఉన్నప్పుడు, తల్లిపాల ప్రాముఖ్యత.. ఆ సమయాల్లో నేనెలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను.. మరికొన్ని ఇతరుల ద్వారా సేకరించిన సూచనలూ ఇస్తుంటాను. మా నాన్న రైల్వేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ప్రతి విషయంలో నా అభిప్రాయాన్ని కూడా అడిగేవారు. అలా వారి నుంచే నాకు నా పిల్లల పెంపకాన్ని మరింతగా నలుగురికి తెలియజేయాలనే ఆలోచన పెరుగుతూ వచ్చింది’’ అని తల్లిగా తన అనుభవ పాఠాలను ఆనందంగా వివరించారు మాధురి. – నిర్మలారెడ్డి -
డిజిటల్ సర్పం.. విషానికి విరుగుడు
పదిమంది గుమిగూడే స్థలం... అంటే బస్టాప్, రైల్వేస్టేషన్, ఆఖరికి పార్కులకు వచ్చేవారిలో కూడా చాలామంది మొబైల్లోనో, ట్యాబ్‌లోనో తలలు దూర్చి కనిపిస్తారు. అవసరం మేరకు ఉపయోగించడానికి బదులుగా, అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ స్క్రీన్కు అతుక్కుపోవడాన్ని ‘డిజిటల్ అడిక్షన్’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది విషపదార్థాలను మెదడులోకి నింపుకోవడమేననీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆ వివరాలివి... పిల్లలతో పాటు పెద్దలు సైతం మొబైల్స్‌నూ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వంటి వాటిని వాడుతుంటారు. అయితే వారు పెద్దవాళ్లు కావడంతో కుటుంబ బాధ్యతలకూ, ఆఫీసు పనుల కోసం స్క్రీన్ నుంచి ముఖం తప్పించడం తప్పదు. స్క్రీన్కు అతుక్కుపోవడం టీన్స్‌లో ఎక్కువ... పిల్లల్లో అందునా టీనేజీ పిల్లల్లో ‘స్క్రీన్’ పట్ల అడిక్షన్ ఎక్కువ. తమ చదువుల కోసం, కాలేజీల్లో ఇచ్చే టాస్కులు, ప్రాజెక్టుల కంటే ఎక్కువగా సరదా అంశాలూ, సినిమాలు, గాసిప్స్ కోసమే స్క్రీన్ టైమ్‌ను వెచ్చిస్తుంటారు. అంతకంటే చిన్న పిల్లల్లోనూ... ఇక టీన్స్‌లోకి రాని ఎనిమిది, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల పిల్లలు సైతం డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో తలను ముంచేస్తారు. ఆఖరికి బయటికి వచ్చినప్పుడు కూడా మొబైల్లో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒక్కోసారి పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులే ‘మొబైల్స్’ను వాళ్ల చేతికి అందిస్తుంటారు. అదే అలవాటు వాళ్లు టీన్స్‌లోకి వచ్చాక మరీ ముదిరిపోతుంది. ఓ వయసుకు చేరేనాటికి అది ‘డిజిటల్ అడిక్షన్’గా మారిపోతుంది. దీని వల్ల వచ్చే మానసిక సమస్యల విశ్వరూపాల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మొబైల్లో గేమ్స్ ఆడవద్దన్నందుకు తల్లిదండ్రులతో పోట్లాటలు దగ్గర్నుంచి ఆత్మహత్యల వరకు ఈ దుష్పరిణామాలెన్నో. డిజిటల్ అడిక్షన్‌ను గుర్తించడమెలా? స్క్రీన్ ముందు చాలాసేపు గడపడం: సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తే చాలాసేపు గడపడం. దాంతో చదువూ, హోమ్‌వర్క్, వ్యాయామం, ఫ్రెండ్స్‌తో కలవడం వంటి కార్యకలాపాలకు దూరమవుతుంటారు. స్క్రీన్ ముందు నుంచి తప్పించడం చాలా కష్టం కావడం: పిల్లల చేతుల్లోంచి స్మార్ట్‌ఫోన్ లాగేసుకున్నా లేదా కంప్యూటర్ ఆఫ్ చేయమన్నా వాళ్లకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. బలవంతంగా మొబైల్ లాగేసినా లేదా కంప్యూటర్ ఆఫ్ చేసినా కోపం రగిలిపోవడంతో పాటు చేతుల్లో ఉన్న వస్తువుల్ని విసిరేసి, వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటారు. రోజువారీ పనుల్ని పూర్తి చేయకపోవడం: తాము రోజూ చేయాల్సిన క్లాస్వర్క్గానీ లేదా హోమ్వర్క్గానీ చేయకుండా వదిలేస్తారు. ఈ పెండింగ్వర్క్ను తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు అతిగా ఆందోళనపడుతుంటారు. ఒంటరిగా ఉండటం: వీరు స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్‌తో తప్ప ఇతరులతో కమ్యూనికేషన్లో ఉండరు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేనిపట్లా ఆసక్తితో ఉండరు సరికదా... గతంలో వారికి ఇష్టమైన పెయింటింగ్ లాంటి అభిరుచులకు దూరంగానూ, అనాసక్తితో ఉంటారు. మూడ్ స్వింగ్స్ : తాము చేసే పని పట్ల ఏకాగ్రత కోల్పోతుండటం, దేని పట్లా దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో పాటు త్వరత్వరగా వారి మూడ్స్మారిపోతుండటం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. అంతేకాదు... వారి ప్రవర్తన గమనించి పెద్దవాళ్లు ఫోన్ తీసుకోబోతుంటే దాన్ని దాచుకోవడం, అబద్ధాలు చెప్పడం వంటివీ చేస్తారు. చక్కదిద్దడానికి చిట్కాలివి... పిల్లలు అవసరానికి మించి ‘స్క్రీన్’ను వాడటాన్ని తగ్గించేలా చేయడం ఎలాగో మానసిక నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలివి... ముందు మారాల్సింది పేరెంట్సే: చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌తో చాలా సేపు గడుపుతూ... తమ పిల్లలు మాత్రం వాటికి దూరంగా, క్రమశిక్షణతో ఉండాలనుకుంటారు. ఈ విషయంలో ముందుగా మారాల్సిందీ, పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిందే తల్లిదండ్రులే. ఒకేసారి లాగేయకండి: అడిక్షన్‌కు లోనైన పిల్లల నుంచి స్మార్ట్‌ఫోన్ /ల్యాప్‌టాప్‌ను ఒకేసారి లాగేయకండి. స్విచ్నొక్కినట్టుగా పిల్లలు మారిపోరు. వారు రోజూ డిజిటల్ డివైజ్‌తో ఎంత టైమ్‌ను గడపదలచుకున్నారో వారినే నిర్ణయించుకొమ్మని సూచించండి. నిర్దిష్టంగా ఆ టైమ్‌లో వాళ్లను స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌తో ఆడుకోనివ్వండి. క్రమంగా ఆ టైమ్‌ను తగ్గిస్తూ రావాలి తప్ప ఠక్కున మారిపోవడం అంటూ జరగదు. పైగా అలా చేయడం ఇంకా మరికొన్ని దుష్పరిణామాలు దారితీస్తుంది. స్నేహితుల్ని వ్యక్తిగతంగా కలవమనడం: స్నేహితుల్ని ఫోన్లో లేదా వాట్సాప్‌లో పలకరించడానికి బదులు వ్యక్తిగతంగా కలిసి రమ్మనీ, కలిసి ఆడుకొమ్మని ప్రోత్సహించాలి. అంతేకాదు... పెళ్లిళ్లు, పండుగల వంటి సమయాల్లో వ్యక్తుల్ని, బంధువుల్ని ప్రత్యక్షంగా కలవమని, సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవడం ఎంత అవసరమో చెప్పాలి. వారీ అలవాటు నుంచి బయటకు వచ్చాక... డిజిటల్ ఉపకరణాలవల్ల వారు కోల్పోబోయిన అంశాలు, వాటి వల్ల కలిగిన నష్టాలతో పాటు... డీ–టాక్సికేషన్ తర్వాత ఇప్పుడు వారికి ఒనగూరిన/ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించవచ్చు. అప్పుడు వారు డిజిటల్ ఉపకరణాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో తెలుసు కుంటారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తారు. (క్లిక్ చేయండి: సోషల్ మీడియా పోస్ట్ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..) డిజిటల్ ఉపకరణాల దుష్ప్రభావాలు నిద్రలేమి, తరచు నిద్రాభంగం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం (లో సెల్ఫ్ ఎస్టీమ్), తరచు తలనొప్పులు, ఒకేచోట కూర్చుని అదేపనిగా గేమ్స్ ఆడుతుండటం వల్ల ఒబేసిటీ, కీళ్లనొప్పులు వంటి అనేక రూపాల్లో కనిపిస్తాయి. అందుకే వీటిని మనకు ఉపయోగపడే మేరకే విచక్షణతో, తెలివిగా వాడుతూ... వీటికి అడిక్ట్ కావడం నుంచి క్రమంగా బయటపడాలి. - డాక్టర్ చరణ్‌తేజ కోగంటి సీనియర్ సైకియాట్రిస్ట్ -
ఎదిగే క్రమంలో ఎన్నో మార్పులు.. పిల్లల కోసం తల్లిదండ్రుల కొత్త తీర్మానాలు
పిల్లల మానసిక స్థితి ఏయే దేశాల్లో ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి గత ఏడాది యునిసెఫ్ ఓ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 21 దేశాలలో 20,000 మంది పిల్లలు– పెద్దలతో ఒక సర్వే నిర్వహించింది. మిగతా దేశాలతో పోల్చితే భారతదేశంలోని పిల్లలు మానసిక ఆరోగ్య చికిత్సను పొందేందుకు ఇష్టపడరని తేలింది. విదేశాలలో మానసిక ఆరోగ్య సమస్యల పట్ల సగటున 83 శాతం మంది స్పందిస్తే, 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత 41 శాతం మాత్రమే మానసిక చికిత్సకు మద్దతునిచ్చారని తేలింది. ఇతరులను కలవాలనుకోరు.. మిగతా దేశాలతో పోల్చితే భారతీయ పిల్లలలో మానసిక రుగ్మతలను గుర్తించడం పెద్దవాళ్లకు కష్టంగా ఉంటుంది. అమ్మాయి లేదా అబ్బాయి పెరుగుతున్నప్పుడు అనేక శారీరక, మానసిక భావోద్వేగ మార్పులకు లోనవుతారు. అందుకు తగిన చికిత్స లేదా సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. 2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం, కరోనా మహమ్మారి రాకముందే 50 మిలియన్ల మంది భారతీయ పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నివేదించింది. వీరిలో 80 నుంచి 90 శాతం మంది చికిత్స తీసుకోలేదు. ఈ అసమానతలు ఉన్నప్పటికీ, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ 2017 ప్రకారం, భారతదేశం తన హెల్త్ బడ్జెట్లో ఏటా 0.05 శాతం మాత్రమే మానసిక ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తోంది. సరైన తీర్మానాలివే! ►ఎడిహెచ్డి, ఆందోళన, ప్రవర్తనా సమస్యలు, నిరాశ అనేవి పిల్లలు– యుక్తవయస్కులలో అత్యంత ప్రబలంగా ఉన్న న్యూరో బిహేవియరల్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. ►మానసిక నిపుణులు, మీరు.. పిల్లలతో కలిసి కూర్చుని, వారి నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించాలనుకుంటున్న లక్ష్యాలను చర్చించాలి. ►ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను గమనించాలి. ఇలాంటప్పుడు పిల్లలకి మానసిక బలం అవసరమని సూచించే అనేక సంకేతాలు కనిపిస్తాయి. ఇందులో స్నేహితులు, ►కుటుంబ సభ్యుల నుండి ఒంటరిగా ఉండటం, నిత్యకృత్యాలను పాటించకపోవడం, పిల్లలు సాధారణంగా ఆనందించే కార్యకలాపాల నుండి వైదొలగడం వంటి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ► పిల్లలు చెప్పేది ఓపికగా వినాలి. ఇబ్బందులు ఎదురైతే మద్దతుగా ఉంటానని భరోసా ఇవ్వాలి. ►పిల్లల పట్ల అధిక పర్యవేక్షణ, సానుభూతి చూపించడం తగ్గించాలి. అలాగే వారి మీద తక్కువ అంచనాలు ఉండాలి. ►రోజువారీ షెడ్యూల్లు, పనితీరు కారణంగా పిల్లలు తరచు అధిక స్థాయి ఒత్తిడి, ఆందోళన కు గురవుతారు. అందుకని, రోజువారీ దినచర్యలను అనుసరించడంలో ►పిల్లలకు సహాయపడాలి. చురుకైన జీవనశైలిని గడపడానికి ప్రోత్సహించాలి. ►పెద్దలు భావోద్వేగాలను వ్యక్తం చేసే విధానాన్ని పిల్లలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు. ►ఒత్తిడిని తగ్గించుకోవడానికి తరచుగా దీర్ఘ శ్వాస తీసుకోవడం, రంగులు వేయడం, పెయింటింగ్ చేయడం, నడవడం లేదా సంగీతం వినడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాం. ►మన పిల్లలు ఒత్తిడిని ఎదుర్కోవడంలో, వారి జీవన నైపుణ్యాలను బలోపేతం చేయడంలో సహాయపడటానికి చిన్నప్పటినుంచే ఇలాంటి వ్యూహాలను పరిచయం చేయవచ్చు. ►ఆటలు, పాటలు, నృత్యం వంటి బృంద కార్యకలాపాలలో పాల్గొనడం ఒత్తిడిని తగ్గిస్తుంది. భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అవకాశాలూ పెంపొందుతాయి. ►సానుకూల అభిప్రాయం, ప్రోత్సాహం సరైన ప్రవర్తనను పునరావృతం చేసేలా వారిని ప్రేరేపించడమే లక్ష్యంగా ఎంచుకోవాలి. మీరు సపోర్ట్ గా ఉన్నారని చేతల్లో చూపడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యం. చదవండి: అకస్మాత్తుగా గుండె పట్టేయడం.. గుండెపోటుతో చనిపోతాననే భయం! ఎందుకిలా? సమస్య ఏమిటంటే.. -
Parenting: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేదా?.. ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే!
ఈ రోజుల్లో పిల్లల పెంపకం అంటే సాధారణమైన విషయం కాదు. పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రుల మనసులో చాలా కోరికలు ఉంటాయి. తమ పిల్లలు అన్ని విషయాల్లో ఉత్తమంగా ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు. అయితే.. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో అమ్మాయిలును అయితే ఒకలా.. అబ్బాయి అయితే... మరోలా చూస్తూ ఉంటారు. ఈ వ్యత్యాసం చూపించడాన్ని చాలామంది తల్లిదండ్రులు సమర్థించుకుంటారు. అయితే అది తప్పేనని, అలా తేడా చూపించడం వల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు తప్పవని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం... చాలామంది ఇళ్లలో ఆడపిల్ల విషయంలో ఎక్కువగా ఆంక్షలు, నిబంధనలు విధిస్తూ, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు.. ఇది తప్పు, అది తప్పు... ఇతరుల నుంచి రక్షించుకోవాలి అలాంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇక అబ్బాయిలు ఉంటే... వంశాన్ని కాపాడాలి, తల్లిదండ్రులను పోషించాలి– లాంటి విషయాలు చెబుతూ ఉంటారు. అలా చెప్పడం తప్పని అనడం లేదు. అయితే అవే కాకుండా.. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. అవేంటో ఓసారి చూద్దాం... ►చాలా మంది మగ పిల్లలు.. తాము మగవారు అయినందుకు చాలా గొప్పగా ఫీలౌతూ ఉంటారు. ఇంట్లో వారి తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అందుకు కారణం కావచ్చు. కాబట్టి.. పిల్లలకు మగ పిల్లలు మాత్రమే గొప్ప అని ఎప్పుడూ చెప్పకూడదు. ఇద్దరూ సమానమే... అయితే ఆడపిల్లలతో పోల్చితే మగపిల్లలు శారీరకంగా మాత్రం కాస్తంత బలంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పాలి. మీతో పాటు ఈ సమాజంలో ఆడపిల్లలు కూడా సమానమే అనే విషయాన్ని వారికి అర్థం అయేలా చెప్పాలి. ►మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరుల సహాయం ఎలా తీసుకుంటామో.. ఎదుటివారికి అవసరమైనప్పుడు మనం కూడా అదేవిధంగా సహాయం చేయాలని పిల్లలకు నేర్పించాలి. వృద్ధులు, వికలాంగులు, మీకంటే చిన్నవాళ్లు ఎవరైనా రోడ్డు దాటడానికి సహాయం చేయడం లేదా సామాజిక కార్యకలాపంలో పాల్గొనడం వంటివి జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడతాయి అనే విషయాన్ని నేర్పించాలి. ►చిన్నా, పెద్ద, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న వయసు వారి నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉంటాయి అనే విషయాన్ని మనం పిల్లలకు చెప్పాలి. ►కోపం అందరికీ వస్తుంది. అది సహజం. అయితే... ఆ కోపాన్ని అదుపు చేసుకున్నవారే గొప్పవారు అవుతారు. చూపించాల్సిన సమయంలోనే కోపం చూపించాలి. అందరిపై చూపించకూడదు. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాలని మనం పిల్లలకు తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే.. కోపం ఎక్కువగా ఉండేవారికి అందరూ దూరంగా ఉంటారు. ప్రశాంతంగా... నవ్వుతూ ఉండేవారినే అందరూ ఇష్టపడతారు. ►ఇతరులను ఎఫ్పుడూ తక్కువ చేయవద్దు. ఏ వ్యక్తిని కించపరిచే హక్కు మనకు లేదని, తోటి వాళ్లతో ఎప్పుడూ ప్రేమతో వ్యవహరించాలనీ చెప్పండి. అవతలి వారిలో ఏవిధమైన ప్రత్యేకత లేనప్పటికీ, మీరు వారి పట్ల గౌరవం చూపించాలి. ఎదుటివారు ఏ విషయంలోనూ మీకంటే తక్కువ అని మీరు పిల్లలకు చెప్పకూడదు. ►అదేవిధంగా మీ పిల్లలకు సారీ, థ్యాంక్స్, ప్లీజ్ వంటి పదాలు ఎప్పుడు, ఎక్కడ అవసరం అయినా చెప్పడం నేర్పించండి. పిరికిగా ఉండటం మంచిది కాదు. ధైర్యంగా ఉండాలి. అందరితోనూ స్నేహం గా ఉండాలి అనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాలి. ఈ టిప్స్ పాటిస్తే పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతారు. చదవండి: Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? -
ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు
రాజంపేట టౌన్ : గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోవడంతో దసరా సెలవుల్లో విద్యార్థులు తమకు తోచిన రీతిలో ఆనందంగా గడపాలన్న ఉత్సుకతతో ఉంటారు. అయితే సంతోషం మాటునే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి వుంటాయన్న విషయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. పిల్లలు ఆనందంగా గడిపేందుకు వారికి స్వేచ్ఛను ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే వారిని ఒక కంటి కనిపెట్టి ఉంచాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఎంతైనా ఉందనే చెప్పాలి. సెలవుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారు. మరికొంత మంది విహార యాత్రల పేరిట వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు నీటిలో దిగి ఈతకొట్టడం, బైక్ నడపడం నేర్చుకొని.. బైక్ నడిపేందుకు ఎంతో ఇష్టపడతారు. సెలవుల్లో ఈ విషయాలపైనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండాలి. లేకుంటే ఆనందమయం కావాల్సిన సెలవులు విషాదమయం కాగలవు. సెలవుల సందర్భంగా విద్యార్థులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటనలు అన్నమయ్య జిల్లాలో అనేకం ఉన్నాయి. పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆడుకోవడానికి ఎక్కువ దూరం పంపకూడదు. ► సమీపంలో ఉండే క్రీడామైదానాల్లోకి వెళ్లినా, వారి వెంట పెద్దలు ఎవరో ఒకరు వెళ్లాలి. ► క్రీడామైదానాల సమీపంలో, ఆడుకునే ప్రాంతాల సమీపంలో చెరువులు, బావులు, తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వంటివి ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు కూడా పంపక పోవడమే మంచిది. ► ఎత్తయిన భవనాల పైన, శిథిలావస్థలో ఉండే భవనాల్లో ఆటలు ఆడకుండా చూడాలి. ► యువకులు చిన్నపాటి వీధుల్లో కూడా బైక్‌లను వేగంగా నడుపుతుంటారు. అందువల్ల పిల్లలు వీధుల్లోని రోడ్లపై ఆడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఓ మోస్తారు పిల్లలు బైక్‌లను నడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు బైక్‌లను తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడే ప్రమాదముంది. అందువల్ల పిల్లలు బైక్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు బైక్ తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి. ► ప్రస్తుతం చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌ను ఎక్కువ చూసే అవకాశమున్నందున, సెల్‌ఫోన్‌పై వ్యాపకం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. ఇలా చేస్తే మంచిది ► సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వంటి క్రీడలు ఆడుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలి. ► ఇరుగు, పొరుగున ఉన్న పిల్లలందరికీ కూడా క్యారమ్, చెస్ బోర్డులను అందుబాటులో ఉంచితే పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ► తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి సమయం ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు తీసుకెళ్లి క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేయిస్తే మరింత మంచిది. ఎందుకంటే ఈ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ► ఈతకు వెళ్లడం, బైక్‌లను నడపడం వంటివి చేస్తే చోటు చేసుకునే ప్రమాదాలగురించి పిల్లలకు సున్నితంగా తెలియజేయాలి. ► పిల్లలను ఎగ్జిబిషన్, పార్కులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలి. సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారికి సమీపంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలన్న ఆలోచనలు రావు. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన విషయాలను తెలియ చేయాలి. అలాగే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి విజయగాధలను విషదీకరించి చెప్పాలి. ఇవి పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. ► పడుకునే సమయంలో పిల్లలకు మంచి విషయాలను చెబుతుండాలి. పూర్వం ఉండిన ఉమ్మడి కుటుంబాలు, అప్పట్లో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలపై తెలియ చేయాలి. ఇవి సన్మార్గం వైపు నడిచేందుకు దోహద పడగలవు. (క్లిక్: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..) తల్లిదండ్రులు స్నేహితుల్లా వ్యవహరించాలి తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా వుండాలి. అప్పుడే ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా తల్లిదండ్రులకు నిర్భయంగా తెలపగలరు. అంతేకాక చెప్పిన విషయాలను కూడా చక్కగా ఆలకిస్తారు. ముఖ్యంగా సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు బయటికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది. సెలవుల సమయంలో పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – శివభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ, రాజంపేట -
Parenting Tips: పిల్లలందరూ బాగా రాయాలనే అనుకుంటారు! కానీ ఒక్కోసారి
How To Deal With Children When Scoring Low Marks: దసరా సెలవులు వచ్చేశాయి. పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాశారు.. కొందరు రాస్తున్నారు. అందరూ మార్కులు ఎన్నొచ్చాయో ఇంట్లో చెబుతారు. ఎక్కువ రావచ్చు.. తక్కువ రావచ్చు. పిల్లలతో ఎలా మాట్లాడాలి? మరో ఆరు నెలల కాలంలో వారు చదువులో ఎదగడానికి ఇప్పుడు మాట్లాడేదే ముఖ్యం.వారిని నొప్పించవద్దు. మరింత బాగా చదివేలా ఒప్పిద్దాం. వాటి గురించి పిల్లలు హుషారుగా ఎదురు చూసే ముందు పరీక్షలు వస్తాయని వారికి తెలుసు. అవి రాయాలి. మార్కులు తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల, టీచర్ల మెప్పు పొందాలి. ఆ తర్వాత సెలవుల్ని ఎంజాయ్ చేయాలి. తల్లిదండ్రులు కూడా పరీక్షలు బాగా రాయి... సెలవుల్లో ఫలానా చోటుకు తీసుకెళతాము అని చెబుతుంటారు. బాగా రాయడం అంటే బాగా రాయాలనే పిల్లలందరూ అనుకుంటారు. కాని సబ్జెక్ట్లన్నీ ఒకటి కాదు. పిల్లలందరూ ఒకటి కాదు. అన్ని సబ్జెక్టుల్లో అందరు పిల్లలూ ఒక్కలా తెలివి ప్రదర్శించలేరు. తెలివైన పిల్లలు కూడా ఇష్టపడని, సరిగా రాయని సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఇవాళ్టి పరీక్షలకు గత రెండు మూడు వారాల్లో ఏవైనా ఇంట్లో అవాంతరాలు, పిల్లలకు అనారోగ్యాలు వస్తే వాటి ప్రభావం ఉంటుంది. పరీక్షల సమయంలో తెలిసిన ప్రశ్నకు జవాబు తెలిసినా సరిగ్గా రాయకపోవడం ఉంటుంది. పరీక్షలు అయ్యాక పిల్లలు తెచ్చే జవాబు పత్రాలు, వాటిలో కనిపించే మార్కుల వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. కాని తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మార్కులు వందకు వంద, ఎనభైకు ఎనభై, యాభైకు యాభై, ఇరవై అయిదుకు ఇరవై అయిదు కనిపిస్తేనే ఆనందం. సంతోషం. బాగా చదివినట్టు లెక్క. మార్కులు మాత్రమే పిల్లలు బాగా చదివినట్టు నిరూపిస్తాయా? సంతృప్తికి హద్దు పూర్వం తల్లిదండ్రులు పరీక్షల్లో 60 శాతం మార్కులు వస్తే సంతోషపడేవారు. తర్వాత అది ఎనభైకి చేరింది. ఆ తర్వాత తొంభై శాతం మార్కులు తెచ్చిన పిల్లలను నలుగురికీ గర్వంగా చూపేవారు. ఇవాళ వంద శాతం తెచ్చుకుంటే తప్ప తల్లిదండ్రుల ముఖాలలో చిర్నవ్వు కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఎదుట ముఖం చెల్లుబాటు అయ్యేందుకు, తల్లిదండ్రుల తిట్లు (కొందరు కొడతారు) తప్పించుకునేందుకు ఆ సబ్జెక్ట్‌లు వచ్చినా రాకపోయినా మంచి మార్కులు తెచ్చుకోవాలనే వొత్తిడి పిల్లలు ఎలా తట్టుకోవాలి? టీచర్లు సమర్థులేనా? పిల్లలు మార్కులు తెచ్చారు. వాటిని తల్లిదండ్రులు చూశారు. కొన్ని పేపర్లలో మంచి మార్కులు వచ్చాయి. కొన్నింటిలో తక్కువ వచ్చాయి. వెంటనే ఇరుగింటి వారి ముందు పొరిగింటి వారి ముందు తిట్టడం మొదలుపెట్టకూడదు. ‘గ్రేడ్స్ షేమింగ్’... అంటే ఇతర పిల్లల మార్కులు కనుక్కొని మన పిల్లల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అవమానించవద్దు. వారికి ఎందుకు వచ్చాయి నీకు ఎందుకు రాలేదు అని దబాయించవద్దు. మొదట పిల్లలతో మాట్లాడాలి. స్నేహంగా కూచోబెట్టుకోవాలి. సమస్య ఏమిటో అడగాలి. కొన్ని సబ్జెక్ట్‌లు ఎందుచేతనో పిల్లలకు పట్టుబడవు. కొందరు ఇంగ్లిష్‌లో బాగా చదివి లెక్కల్లో పూర్‌గా ఉంటారు. కొందరు సైన్స్ బాగా చదివి తెలుగు తప్పులు రాస్తారు. ఏ సబ్జెక్ట్‌లో వారికి ఎటువంటి సమస్య ఉందో తెలుసుకోవాలి. స్కూల్లో ఆ సబ్జెక్ట్‌లు చెప్పే టీచర్లతో వారికి స్నేహం ఉందా లేదా ఆ టీచర్లు ఆసక్తిగా చెబుతున్నారా కటువుగా చెప్తున్నారా తెలుసుకోవాలి. వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌లు ఇంట్లోగాని ట్యూషన్ ద్వారా గాని చెప్పే అవకాశం గురించి ఆలోచించాలి. ఇవన్నీ లేకుండా మార్కులు తక్కువ వచ్చాయని దండనకు దిగడం పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. పిల్లలూ తప్పులు చేస్తారు పిల్లలు కూడా తప్పులు చేస్తారు. నిర్లక్ష్యంగా ఉంటారు. సరిగా చదవకుండా ఎలాగోలా రాయొచ్చులే అనుకుంటారు. తీరా పరీక్షలు రాశాక తెల్లమొఖం వేస్తారు. మార్కులు వచ్చాక చేసిన తప్పు తెలుసుకుంటారు. వారు కూడా తమకు వచ్చిన మార్కులకు సిగ్గు పడతారు. ఆ స్థితి గమనించి తల్లిదండ్రులు ‘పర్వాలేదు. ఈసారి జాగ్రత్త పడు’ అని చెప్పేలా ఉండాలి. ఇప్పుడు క్వార్టర్లీ రాశారు కనుక హాఫ్ ఇయర్లీ వరకూ ఇంప్రూవ్ కావాలని... యాన్యువల్ ఎగ్జామ్స్‌కు ది బెస్ట్‌గా ఎదగవచ్చని ధైర్యం చెప్పాలి. అందుకు తాము సాయం చేస్తామని భరోసా ఇవ్వాలి. తక్కువ మార్కులు వచ్చి అసలే ఇబ్బంది పడుతున్న పిల్లలను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. వాస్తవాన్ని అంగీకరించమని చెప్పాలి కష్టపడి చదివి రాయవలసినంత రాయి.. మార్కుల సంగతి ఆ తర్వాత అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లల ఆలోచనలు పరి పరి విధాలుగా పోయే అవకాశం ఉంది. తమ వాస్తవిక పరిస్థితిని వారు అంగీకరించి దానిని తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో ఉండాలి. ‘అమ్మో మార్కులు తక్కువ వచ్చాయి. తిడతారు. ఎక్కువ వచ్చాయని అబద్ధం చెబుదాం’ అని పిల్లలు అనుకుంటే ఆ తల్లిదండ్రులు ఫెయిల్ అయినట్టు లెక్క. ఒక్కోసారి మార్కులు తక్కువ వస్తే పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయారంటే ఆ తల్లిదండ్రులు ఇంకా దారుణమైన పెంపకం వహిస్తున్నట్టు. పిల్లలు ఎలాంటి ఇబ్బంది అయినా తల్లిదండ్రులతో చెప్పే స్నేహం అవసరం. అందుకు సమయం ఇస్తున్నామా లేదా అని తల్లిదండ్రులు పరీక్షించుకోవాలి. క్వార్టర్లీ పరీక్షలు మీ పిల్లల పరిస్థితిని, వారి పట్ల మీ అవగాహనను తెలియచేశాయి. వార్షిక పరీక్షలకు పిల్లలతో పాటు మీరు వారితో కలిసి ప్రయాణించడానికి ప్రేమతో, ఓర్పుతో, స్నేహంతో దారి వేసుకోండి. పిల్లలను ఉత్సాహపరిస్తే అద్భుతాలు చేస్తారు. బెదరగొడితే చతికిల పడతారు. గమనించండి. ప్రోత్సాహకాలు పిల్లలు బాగా చదివితే ప్రోత్సాహకాలు ఇచ్చి తల్లిదండ్రులు వారిని ఉత్సాహపరచాలి. రోజూ వారితో పాటు కాసేపు కూచుని వారు చదువుకుంటూ ఉంటే మెచ్చుకోవాలి. వారికి సందేహాలుంటే తాము తీర్చగలిగితే తీర్చాలి. లేదా వారి అనుమతితో (వారు వద్దంటే వద్దు) ట్యూషన్లు పెట్టాలి. అన్నింటి కంటే ముఖ్యం ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి దసరా సెలవుల వంటి సందర్భాల్లో కూచోబెట్టి బలవంతంగా చదవమని శిక్ష విధించకూడదు. పిల్లలు వారి సరదా సమయాలను ఎంజాయ్ చేయనివ్వాలి. అదే సమయంలో బాగా చదవడం వారి బాధ్యత అని వారికి తెలియచేయాలి. చదవండి: Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే.. -
మీ పిల్లలు చురుగ్గానే ఉంటారా? ఈ ఫుడ్ అయితే గుడ్! వ్యాయామం చేస్తే!
చిన్నతనంలో పిల్లలు ఆట, పాటల్లో మునిగి తేలడటం సహజం. అలా కాకుండా ఒకేచోట కదలకుండా కూర్చుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నతనంలో శారీరక వ్యాయామం చేయడం వల్ల పిల్లలు పెరిగి పెద్దయ్యాక శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా కౌమార దశ అంటే టీనేజ్‌లో పిల్లలు వ్యాయామం చేస్తే పెద్దయ్యాక కూడా వృత్తి రీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారు. అంతేకాదు, మిడిల్ ఏజ్‌లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయి. వ్యాయామం నేరుగా మెదడు పెరుగుదలను ప్రేరేపిస్తుంది కనుక వ్యాయామాన్ని పొట్ట తగ్గటానికి, లావు తగ్గటానికి అనే కాకుండా ఆరోగ్యం కోసమని చెప్పి వారికి అలవాటు చేయాలి తల్లిదండ్రులు. వాళ్లను వ్యాయామానికి పంపే బాధ్యత తీసుకోవాలి లేదా ఇంట్లో తల్లితండ్రులు వ్యాయామం చేసే సమయంలో వారిని జత చేసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... వ్యాయామం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతోందట. దీంతో వారు చదువుతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకుని పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే వారి ఆరోగ్యం కోసం నిత్యం సరైన సమయానికి పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందివ్వాలి. దీంతో వారు శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం ఎంతసేపు? ఎలా? యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పిల్లలపై పరిశోధనలు నిర్వహించారు. నిత్యం వ్యాయామం చేసే పిల్లలు, వ్యాయామం చేయని పిల్లలతో పోల్చి వారు చదువుల్లో ఎలా రాణిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వ్యాయామం చేసే పిల్లలు చురుగ్గా ఉండడంతోపాటు చదువులో కూడా రాణిస్తారని తెలుసుకున్నారు. అందువల్ల పిల్లల్ని రోజూ కనీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని, లేదా కనీసం ఆటలు ఆడుకునేందుకు పెద్దలు అనుమతించాలని వారు సూచిస్తున్నారు. అందువల్ల రోజు మొత్తంలో ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం మరో 30 నిమిషాల పాటు పిల్లలతో వ్యాయామం చేయిస్తే సరిపోతోంది. ఈ ఫుడ్ అయితే గుడ్ పిల్లలు యాక్టివ్‌గా ఉండాలంటే వ్యాయామం చేయించడంతోపాటు ఆహారం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాలు, పాల పదార్ధాలు వంటివి ఎక్కువగా పెట్టాలి. బయట దొరికే ఫుడ్ అస్సలు పెట్టకూడదు. ఇంట్లో మనం రోజువారీ పనులు చేసుకునేటప్పుడు చిన్న చిన్న సాయాలు చేయమని అడగాలి. అలా చేస్తే వాళ్లకు చిన్నప్పటి నుండే పరోపకార గుణం అలవాటు అవుతుంది. చివరగా ఒక్క విషయం.. . పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏది చేస్తే అదే నేర్చుకుంటారు. అందుకే ముందు మనలో మార్పు రావాలి. మీరు వాళ్ళ ముందు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి. అది చూసిన పిల్లలు తాము కూడా అదే చేసేందుకు ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళకి మంచి పద్ధతులు అలవాటు అవుతాయి. చదువులోనూ, ఆటపాటల్లోనూ కూడా చురుగ్గా ఉంటారు. చదవండి: Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే.. Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే! -
ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడితే..
సాధారణంగా ప్రతి తల్లీ తండ్రీ తమ పిల్లలను ప్రేమగా... అపురూపంగా పెంచాలనుకుంటారు. అదే సమయంలో వారు జీవితం లో ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుంటారు. వారికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం శక్తికి మించి కష్టపడతారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు వాళ్లకి కొన్ని విషయాలలో మితిమీరిన స్వేచ్ఛను ఇస్తుంటారు. మరికొంతమంది అందుకు పూర్తి విరుద్ధం. పిల్లలకు ఏ ఒక్క విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి విషయంలో తాము చెప్పినట్లే నడుచుకోవాలంటారు. తీవ్రమైన క్రమశిక్షణలో పెడుతుంటారు. అతి స్వేచ్ఛ వల్ల పిల్లలు పెద్దల మాటను వినకపోవడం లేదా అతి క్రమశిక్షణ వలన పంజరంలో బంధించిన పక్షుల్లా స్వేచ్ఛను కోల్పోయి ఏ పనీ చేతకాని వాళ్లలా తయారవడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకుందాం. సానుకూల భావాలకు పాదు తల్లిదండ్రులు చేయవలసిన మొట్టమొదటి పని పిల్లలలో పాజిటివిటీని పెంపొందించడం. ఏదీ తమకు లేదు, రాదు, తెలియదు, చేతకాదు, చెయ్యలేము అనుకోకుండా అన్నింటినీ పాజిటివ్ గా చూడగలగడాన్ని నేర్పించాలి. చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, ప్రేరణను తల్లిదండ్రులే పిల్లలకు అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఇది వారు జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరేందుకు చాలా ముఖ్యం. పరోపకార గుణం.. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే స్వార్థాన్ని నూరిపోస్తుంటారు. స్వార్థం ఉండటం తప్పు కాదు కానీ, పరోపకార గుణం లేకపోతే మాత్రం వారు నిస్సారంగా తయారవుతారు. అందువల్ల బాల్యం నుంచి వారిలో ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. తోటివాళ్లకు, చుట్టుపక్కల వారికి, పెద్దవాళ్లకు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు అడగనక్కరలేకుండానే స్పందించి సాయపడేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. తద్వారా వారిలో ఏదో సాధించాలనే ఆశయం, నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. చీటికిమాటికీ చిర్రుబుర్రులాడవద్దు మనం కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతాం. ఉదాహరణకు వారు మన కళ్ల ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో కోపం కన్నా సంయమనం చాలా అవసరం. వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. వారు చేసిన పని వలన జరిగే అనర్థాలను వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద చికాకు పడితే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడాన్ని వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. అలాగే పిల్లలను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం మంచిది కాదు. తల్లి/ తండ్రి మీద ప్రేమను పెంపొందించాలి భార్యాభర్తల మధ్య సఖ్యతలేని పిల్లలు చిన్నప్పటినుంచి అభద్రతాభావానికి లోనవుతారు. తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉంటే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. భార్యాభర్తల సఖ్యత పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. చాలామంది పిల్లలు అయితే అమ్మతో లేదా నాన్నతో మాత్రమే చనువు గా ఉంటారు. ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు. తమకు సంబంధించిన ఏ విషయం కూడా వారితో షేర్ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా అలవాటు చేయాలి. తమకు ఎటువంటి ఇబ్బంది కానీ, అవసరం కానీ వచ్చినా, కష్టం కలిగినా ధైర్యంగా చెప్పుకునేలా వారిని ప్రోత్సహించాలి సాధించే గుణాన్ని నేర్పాలి పిల్లలు ఏదైనా సాధించాలనే గుణాన్ని వారికి చిన్నప్పటి నుండి నేర్పించాలి. వారు ఎప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టకొని దాని మీద ఫోకస్ చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఎటువంటి సావాళ్లనైనా వారు భయపడకుండా ధైర్యంగా స్వీకరించేలా వారికి ప్రోత్సహించాలి. వారి ఏ పనినైనా కష్టంతోకాకుండా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇది వారిలో పోరాట పటిమను పెంపొందించి జీవితంలో ఏదైనా సాధించాలనే తపనను వారిలో చిన్నపటి నుండి బలంగా నాటుతుంది. మీ ఒత్తిడిని పిల్లల మీద వెయ్యవద్దు మనలో చాలామంది మన దైనందిక జీవితంలో ఉండే ఒత్తిడి తాలూకు ఫ్రభావాన్ని తమ కుటుంబసభ్యులపై ముఖ్యంగా పిల్లలపై చూపిస్టుంటారు. మనకు తెలియకుండా ఇది మన పిల్లలలో ఒకవిధమైన నెగిటివిటీని పెంచుతుంది. వారు క్రమక్రమంగా మనల్ని శత్రవుల్లా చూడటం ప్రారంభిస్తారు కాబటిట ఒత్తిడిని, కోపాన్ని వారి మీద చూపించకూడదు. మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా వారి దగ్గరకు వచ్చేటప్పటికి అవేమీ వారి మీద చూపించకూడదు. ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడటం అలవరచుకోవాలి. ఇలా చేయడం వలన వారు మనపై ఉండే భయాన్ని కోల్పోయి ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. దానితోపాటు మనకు తెలియకుండానే మన ఒత్తిడి కూడా ఎగిరిపోతుంది. తప్పును అంగీకరించడం నేర్పాలి చాలా సార్లు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను తిడతారనే భయంతో మరొకరిని నిందిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు అబద్ధం చెప్పకుండా ప్రతి చిన్న, పెద్ద తప్పును అంగీకరించడం నేర్పాలి. బుజ్జగించి చూడండి కొందరు పిల్లలు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ప్రతిదానికీ మారాం చేయడం, అలగడం వంటి వాటితో పెద్దలను విసిగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లలను తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వారిని బుజ్జగించి చూడాలి. దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి కానీ చేయి చేసుకోవడం లేదా తిట్టడం మంచిది కాదు. అలాగే పిల్లల మంచి అలవాట్లను అభినందించడం అవసరం. వారిని ప్రేమతో పెంచాలి. వారిలో ప్రేమను పెంపాలి. చిన్న చిన్న బాధ్యతలు అప్పగించాలి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి ఏ పనీ చెప్పరు. ఒకవేళ వాళ్లే ఏదైనా చేయాలని ఉత్సాహం చూపించినా, నీకెందుకు ఈ పనులు, చక్కగా చదువుకో పో.. అంటూ ఉంటారు. వారు ఎప్పుడూ చదువుకోవాలని, ఎంత చదివితే అంత ప్రయోజనం అని భావిస్తారు. అయితే పిల్లలకు చదువుతోపాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పజెప్పాలి. దీనివలన వారిలో కార్యదక్షత పెరిగి సంఘంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అందువల్ల రోజూ మన ఇంటిలో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి. చదవండి: స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం Dengue Fever- Prevention Tips: డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి? నివారణకు చర్యలేంటి? పిల్లలకు జ్వరం వస్తే! -
ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి
‘మా అమ్మ ముగ్గురు పిల్లలను పెంచింది. ముగ్గురం ఐఐటి చదివాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని ఉత్తమమైన సంతానంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నవి మీకు చెబుతాను. పనికొస్తాయేమో చూడండి’ అంటూ ఉత్తర ప్రదేశ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ రాసిన ట్విట్టర్ పోస్టు వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె చెప్పిన పాఠాలు ఏమిటి? ‘మా అమ్మ నుంచి నేను పిల్లల పెంపకం నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐ.ఐ.టికి వెళ్లాం. నేను ఐ.ఐ.ఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్‌లో ఐ.ఏ.ఎస్ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని నేను బాగా పెంచాలి. మా అమ్మ నుంచి నేర్చుకున్నవి, నాకు నేనై గ్రహించినవి మీకు చెప్తాను. ఉపయోగపడితే చూడండి’ అని ఉత్తరప్రదేశ్ ఐ.ఏ.ఎస్ అధికారి దివ్య మిట్టల్ రాసిన ట్విటర్ పోస్టు (వరుస) ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్‌గా గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న దివ్య మిట్టల్ అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా నలుగురికీ ఉపయోగపడే కిటుకులు, స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంటుంది. ఇటీవల ఆమె పేరెంటింగ్ గురించి రాసిన పోస్టు కూడా అలాంటిందే. ఆమె నమ్మి చెప్పిన విషయాలు చాలామందికి నచ్చాయి. అయితే వీటితో విభేదించేవాళ్లు ఉండొచ్చు. ఉంటారు కూడా. కాని ఎక్కువమంది ఇలాగే పెంచాలని భావిస్తారు కాబట్టి దివ్యను మెచ్చుకుంటూ పోస్ట్‌ను వైరల్ చేశారు. దివ్య చెప్పిన పెంపకం పాఠాలు ఇలా ఉన్నాయి. ఏదైనా చేయగలరు అని చెప్పండి: పిల్లలకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు అనే భావన వారిలో కల్పించాలి. నిన్ను నువ్వు నమ్ము అని తల్లిదండ్రులు పిల్లలకు తరచూ చెప్పాలి. ఆత్మవిశ్వాసమే వారిని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో చేరుకోవడంలో సాయం చేయగలదు. పడనివ్వండి పర్వాలేదు: పిల్లలకు చిన్న నొప్పి కూడా కలగకుండా పెంచాలని చూడొచ్చు. జీవితం పూలపాన్పు కాదు. పరిష్కార పత్రాలతో అది సమస్యలను తేదు. పడి లేచి అందరూ ముందుకెళ్లాల్సిందే. అందుకే పిల్లల్ని బాగా ఆడనివ్వండి. పడనివ్వండి. లేవనివ్వండి. వాళ్లు పడగానే పరిగెత్తి పోకండి. విఫలమైనప్పుడు లేవడం వారికి తెలియాలి. లేచాక సరే.. పద అని వారితో పాటు ముందుకు పదండి. పోటీ పడాలి: వాళ్లను రకరకాల పోటీలలో పాల్గొనేలా చేయండి. గెలవడానికి మాత్రమే కాదు. ఓటమితో తగినంత పరిచయం ఏర్పడటానికి, ఓటమి కూడా ఉంటుందని తెలియడానికి వారు పాల్గొనాలి. ఓటమి కంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ప్రమాదకరమైనది. ఓడినా పర్వాలేదు... పోటీ పడాలి అనేది నేర్పించాలంటే ఈ పని తప్పనిసరి. రిస్క్ కూడా ముఖ్యమే: పిల్లలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి సమయాలలో తప్పనిసరి పర్యవేక్షణ చేయండి. అంతే తప్ప అసలు రిస్కే వద్దు అనేలా ఉండొద్దు. అడ్వంచర్ స్పోర్ట్స్ ఆడతానంటే ఆడనివ్వండి. చెట్టు ఎక్కుతానంటే దగ్గరుండి ఎక్కించండి. అలాంటి సమయాలలో ప్రమాదం ఉందనిపిస్తే పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ అనుభవం వారికి నేర్పుతుంది. బోలెడన్ని అవకాశాలు: మా చిన్నప్పుడు ఇంత పేదగా ఉన్నాం... అంత పేదగా ఉన్నాం... కాబట్టి నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి... ఇలా కొందరు తల్లిదండ్రులు చెబుతుంటారు. అలా చెప్పక్కర్లేదు. ఈ లోకం చాలా పెద్దది... ఎక్కడ చూసినా అవకాశాలు ఉంటాయి... బోలెడంత సంపద ఉంది... నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది... ఏదో ఒకటి సాధించడం కష్టం కాదు. కాని ఆ సాధించేదేదో పెద్దదే సాధించు అనే విధాన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. మీరే ఆదర్శం: పిల్లలకు తల్లిదండ్రులకు మించి రోల్‌మోడల్స్ ఉండరు. వారికి మీరే ఆదర్శంగా ఉండండి. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటే పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక బాధ పడతారు. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో మీరు వారి ఎదుట అలా ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందలించండి: పిల్లలు తప్పు చేస్తే మందలించండి. ఇది సరిౖయెన పని కాదు అని గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మంచి నడవడిక అంటే ఏమిటో వారికి తెలియాలి. వారిని నమ్మండి: మీ అంచనాకు తగినట్టుగా పిల్లలు లేకపోతే నిరాశ చెందకండి. ‘నీ మీద నమ్మకం పోయింది’ అని పిల్లలతో పొరపాటున కూడా అనకండి. మీరే వారిపై నమ్మకం పోగొట్టుకుంటే ఇక వారిని నమ్మేదెవరు. పిల్లలు కుదేలైపోతారు. అందుకని వారికి అవకాశం ఇవ్వండి. ‘నిన్ను నమ్ముతున్నాం. నువ్వు చేయగలవు. పర్వాలేదు. మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పండి. భిన్న అనుభవాలను ఇవ్వండి: మీ పిల్లలకు లోకం చూపించండి. ఊళ్లు, కొత్త ప్రదేశాలు, అనాథ గృహాలు, సైన్స్ ల్యాబ్‌లు, భిన్న రంగాల పెద్దలు ఇలా మీకు వీలైనచోటుకు తీసుకెళ్లి వీలైన వారితో పరిచయం చేయించండి. తిరిగొచ్చేప్పుడు వారితో ఆ విషయాలను మాట్లాడండి. మీ పనుల్లో మీరు ఉండకండి. వారు చెప్పేది వినండి: పిల్లలు ఏదైనా చెప్పడం మొదలెట్టగానే నోర్మూయ్ నీకేం తెలియదు అనకండి. వాళ్లు శుంఠలనే భావన తీసేయండి. ముందు వారు చెప్పేది పూర్తిగా వినండి. వెంటనే రియాక్ట్ కావద్దు. ఆలోచించి అప్పుడు మాట్లాడండి. తాము చెప్పేది తల్లిదండ్రులు వింటారు అనే నమ్మకం పోతే పిల్లలు చెప్పడం మానేస్తారు. పోల్చకండి: మీ పిల్లలను ఇతర ఏ పిల్లలతో పోల్చకండి. అలాగే వారి తోబుట్టువులతో కూడా పోల్చకండి. మీరు మీ పిల్లల్లో ఒకరిని గారాబం చేస్తే వారు లోకంలో అంతా ఇంతే సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే వారు గుర్తింపు కోసం, అంగీకారం కోసం పాకులాడే స్థితికి వెళతారు. కాబట్టి రెండూ వద్దు. ఇవీ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ చెప్పిన పెంపకం పాఠాలు. ఇక నిర్ణయం మీదే. -
Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే..
పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆస్ట్రేలియాలోని లా ట్రోంబే యూనివర్సిటీ పరిశోధకులు కొన్ని సూచనలు చేశారు. ‘హౌ టు రైజ్ సక్సెస్ఫుల్ కిడ్స్’ అనే అంశం మీద వాళ్లు ప్రధానంగా ఐదు అంశాలను చెప్పారు. అందులో ఎమోషనల్ ఇంటలిజెన్స్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. వాటిని పరిశీలిద్దాం. బంధాల అల్లిక... పరిశోధకులు చెప్పిన మొదటి అంశం... కేర్... కేర్... కేర్. సెల్ఫ్ కేర్... తమను తాము సంరక్షించుకోవడం. అదర్స్ కేర్... ఇతరులను పట్టించుకోవడం. పెట్ కేర్... ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల సంరక్షణ. స్థూలంగా వాళ్లు చెబుతున్న విషయం ఏమిటంటే... పిల్లల్ని తమ పనులు తాము చేసుకునే విధంగా తయారు చేయాలి. అలాగే తల్లిదండ్రులకు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇతర కుటుంబ సభ్యులకు చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం వంటివి కూడా అలవాటు చేయాలి. పిల్లలను శ్రామికులుగా మార్చడం అని కాదు వాళ్లు చెబుతున్నది. పెద్దవాళ్లకు మందుల పెట్టె అందించడం, మందులు వేసుకునేటప్పుడు నీళ్లు తెచ్చి ఇవ్వడం వంటి పనులు చేస్తూ ఉంటే ఇతరులను పట్టించుకోవడం అనే మంచి లక్షణం పిల్లలకు ఒంటపడుతుంది. పెంపుడు జంతువు పట్ల ఇష్టం ఉండడం– పెట్ సంరక్షణ పట్ల బాధ్యత కలిగి ఉండడం రెండూ భిన్నమైనవి. పెట్‌ను ముద్దు చేయడంతోపాటు వాటి బాగోగులు పట్టించుకోవడం కూడా అలవాటు చేస్తే ప్రేమవాత్సల్య బంధాలను స్వయంగా అనుభవంలో తెలుసుకుంటారు. స్ఫూర్తిమంత్రం ... రెండవ అంశంగా మర్యాదపూర్వకమైన ప్రవర్తన గురించి చెప్పారు. ఇతరుల నుంచి సహాయం కోరేటప్పుడు వినయంగా అడగడం, సహాయం పొందిన తర్వాత చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలియచేయడం, ఇతరులకు సహాయం చేయడంలోనూ వినమ్రత పాటించడం వంటివి ఇంట్లో పదేళ్లలోపే అలవడాలని పరిశోధకుల నివేదిక సారాంశం. మూడవ అంశంగా ఎమోషనల్ ఇంటలిజెన్స్‌ను ప్రస్తావించారు. బాల్యంలో ఎమోషనల్ ఇంటలిజెన్స్‌ను వృద్ధి చేసుకున్న వాళ్లు చదువులో మందు ఉండడాన్ని గమనించినట్లు చెప్పారు. అలాగే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతోపాటు జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నట్లు పరిశోధకుల అధ్యయనం. రేచల్ కాట్జ్, హెలెన్ ష్వే హదానీ తమ అధ్యయనాల సారాంశాన్ని క్రోడీకరిస్తూ ‘ఎమోషనల్ ఇంటలిజెంట్ చైల్డ్: ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ పేరెంటింగ సెల్ఫ్ అవేర్, కో ఆపరేటివ్ అండ్ వెల్ బాలెన్స్డ్ కిడ్స్’ అనే పుస్తకం రాశారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ వృద్ధి చేసుకున్న పిల్లలు చదువులో చురుగ్గా ఉంటారని, ఒక సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించగలిగిన నేర్పు కూడా అలవడుతుందని వారి అభిప్రాయం. అదే విషయాన్ని మరింత వివరంగా చెప్పారు డాక్టర్ సుదర్శిని. ‘‘భావోద్వేగాలు చాలా విలువైనవి. వాటిని సరిగ్గా వ్యక్తీకరించడం కూడా చాలా ముఖ్యం. ఒక ఇంట్లో తల్లిదండ్రులు భావోద్వేగాల వ్యక్తీకరణ ఎంత సమర్థంగా చేయగలుగుతారో వాళ్ల పిల్లలు కూడా అదే ధోరణిని ఒంటపట్టించుకుంటారు. సంతోషాన్ని వ్యక్తం చేసే క్రమంలో ‘నిన్న పార్కులో చాలా సంతోషంగా ఆడుకున్నాను. ఈ రోజు సాయంత్రం పార్కుకు వెళ్తున్నాను, ఇప్పటి నుంచే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది’ అని చెప్పడం రావాలి. ప్రతి ఫీలింగ్‌నీ వ్యక్తం చేయడానికి ఒక పదం ఉంటుంది. ఆ పదాలను నేర్పించాలన్న మాట. అలాగే పాజిటివ్, నెగెటివ్ ఎమోషన్స్ రెండింటికీ తేడా వివరించాలి. కోపం నుంచి కామ్‌డౌన్ కావాలనే స్పృహను కలిగించాలి. కోపం లేదా దుఃఖభరితంగా ఉన్నప్పుడు దాన్నుంచి బయటపడడానికి జోక్స్ బుక్ లేదా డ్రాయింగ్ అండ్ కలరింగ్ కిట్ తీసి వాళ్ల ముందు పెట్టాలి. కామ్‌డౌన్ కావడానికి తనకు ఇష్టమైన వ్యాపకం దోహదం చేస్తుందని వాళ్లకు అర్థమవుతుంది’’ అన్నారామె. బుర్రకు పని ... యూరప్‌లో వేలాది మంది పిల్లల మీద నిర్వహించిన అధ్యయనంలో టీవీ స్క్రీన్కు అతుక్కుపోతున్న అలవాటు గురించి తల్లిదండ్రులకు గట్టి హెచ్చరికలే చేశారు. అయతే పరిశోధకులు ఈ విషయంలో వీడియో గేమ్‌లకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ చూస్తూ మెదడును బద్దకంగా ఉంచడంతో పోలిస్తే మెదడును పాదరసంలా స్పందింపచేసే వీడియో గేమ్‌లను కొంత వరకు ప్రోత్సహించారు. ఎప్పుడూ ఒకేరకమైన ఆటలకే పరిమితం కాకుండా కొత్త కొత్త ఆటలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే వీడియో గేమ్‌కు పరిమితమైన సమయం కేటాయించమనే సూచన కూడా చేశారు. అభిరుచి ... ఐదవ అంశం మరింత ప్రధానమైనది. అది పిల్లల అభిరుచిని గుర్తించడం, గౌరవించడం. పిల్లల్ని తమ అభిరుచులను వ్యక్తం చేయనివ్వాలి. వాళ్లు చెప్పడం మొదలు పెట్టగానే అడ్డు తగులుతూ అది మంచిదో చెడ్డదో నిర్ణయించేసి తీర్పు చెప్పడం సరికాదు. పిల్లల్లో ఒక విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటే పేరెంట్స్ కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిందే. క్రీడాకారులు అలా తయారైన వాళ్లేనన్నారు అధ్యయన కారులు. సక్సెస్‌కి దారి తీసే అనేక కారకాల్లో ప్యాషన్‌ను మించినది మరొకటి ఉండదు. ఏ రంగంలోనయినా కీలకంగా ఎదిగిన వాళ్లను పరిశీలిస్తే వాళ్లలో ఆ వృత్తి పట్ల ఉన్న అభిరుచి, అంకితభావాలు అర్థమవుతాయనేది పరిశోధకుల అభిప్రాయం. భావోద్వేగాల పరిచయం ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే... ఎదుటి వాళ్ల భావాలను గౌరవిస్తూనే మన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, పరిస్థితిని సానుకూల పరచడం అన్నమాట. పిల్లలు తమకు ఏదైనా కావాలంటే పేచీ పెట్టడం, ఏడవడం, నేలమీద దొర్లడం చూస్తుంటాం. ఎమోషనల్ ఇంటలిజెన్స్ ప్రాక్టీస్ అయిన పిల్లలైతే తమ భావాలను తల్లిదండ్రులకు చక్కగా మాటల్లో వివరించగలుగుతారు. భావోద్వేగాలను వ్యక్తం చేసే వొకాబులరీని పిల్లలకు నేర్పించాలి. అప్పుడు తమ అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన, సంతోషం, ఆనందాలను మాటల్లో వ్యక్తం చేయగలుగు తారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ ప్రాక్టీస్ ఉన్న వాళ్లు పర్సనల్ లైఫ్‌లోనూ, ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా సంతోషంగా, చలాకీగా దూసుకుపోగలుగుతారు. – డాక్టర్ సుదర్శిని, చైల్డ్ సైకాలజిస్ట్ --- వాకా మంజులారెడ్డి చదవండి: Best Tips: ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? బ్యాక్టీరియా ఎలా పోతుంది? -
Parenting Tips: మీ మైండ్‌లో ఆంక్షల బుక్ ఉందా?!
పిల్లలు నేను చెప్పిందే వినాలి. నేను గీచిన గీత ఎట్టిపరిస్థితుల్లో దాటడానికి వీల్లేదు. అప్పుడే పిల్లలు పద్ధతిగా పెరుగుతారు. అదే క్రమశిక్షణ అంటే.. అని మీరు భావిస్తున్నారా?! అయితే, ఈ తరహా పెద్దల ప్రవర్తన పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డంకి అవుతుందని మనస్తత్త్వ నిపుణులూ, పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల్ని అతిగా రూల్ చేసే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది అంటున్నారు ఎడిన్బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు. యుకెలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రతి రెండేళ్లకు ఒకసారి పుట్టిననాటి నుండి 17 సంవత్సరాల వయసు పిల్లల డేటాను సేకరిస్తుంది. ఈ సేకరణలో భాగంగా పిల్లల తల్లిదండ్రుల పెంపకంపైన దృష్టి పెడుతుంది. ఈ రెండేళ్లలో పిల్లలపై అరవడం, కొట్టడం, తిట్టడం, అతిగా రూల్స్ పెట్టే తల్లిదండ్రుల మానసిక స్థితిని అధ్యయనం చేశారు. ఇంట్లో అతిగా ఆంక్షల్లో ఉన్న పిల్లలు బయట చాలా విరుద్ధ ప్రవర్తనతో మెలుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు సామాజికపరంగా, భావోద్వేగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ గమనించారు. ఈ పరిశోధన చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్‌లో ప్రచురించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో భావోద్వేగ ప్రవర్తనల్లో చోటు చేసుకున్న విపరీత మార్పులకు వారి తల్లిదండ్రులు పాటించే కఠినమైన పద్ధతులే కారణం అని గమనించారు. కొట్టడం, అరవడం, తాము చెప్పిందే వినాలనే పంతం గల తల్లిదండ్రుల వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపైనా హానికరమైన ప్రభావాలను చూపుతాయని తెలుసుకున్నారు. ప్రసూతి సమయంలో, కుటుంబ సమస్యల్లోని ఒత్తిడి వల్ల కూడా తల్లుల్లో పిల్లలపై ‘విసుగు’కు కారణం అవ్వచ్చని రాశారు. మూడు రకాల పెంపకం ‘పిల్లల విపరీత ప్రవర్తన మనకు హైపర్యాక్టివిటీగా అనిపిస్తుంది. అయితే, కొన్ని లక్షణాలు పుట్టుకతో వచ్చినా కొన్నింటిపై ఇంటి వాతావరణమే ప్రభావం చూపుతుంది’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ గీతా చల్ల. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేసే తల్లిదండ్రులు ఉంటారు. ఇలాంటి వారు కొంచెం మొండితనంతో ప్రవర్తించే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు అతిగా ఆంక్షలు పెడతారు. వీరి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నా, బయటకు వచ్చినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కొందరు తల్లిదండ్రులు పెంపకంలో సమతుల్యత పాటిస్తారు. స్వేచ్ఛ ఇస్తారు, కానీ పరిధులు నిర్ణయిస్తారు. రూల్ బుక్ పేరెంటింగ్ ‘నేను చెప్పిందే వినాలి’ అనే నైజం గల తల్లితండ్రులు స్టేట్మెంట్స్ ఎక్కువ వాడతారు. పిల్లలనుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీని వల్ల తాము ఆశించినది పిల్లల నుంచి రాకపోతే అతిగా అరవడం, కొట్టడం, తిట్టడం చేస్తారు. వీళ్లకు మైండ్‌లో ఒక రూల్ బుక్ ఉంటుంది. నా పిల్లలు ఇలాగే ఉండాలి అని తీర్మానిస్తారు. వీరి పిల్లలకు స్వేచ్ఛ అనేది ఉండదు. తల్లిదండ్రులకన్నా పిల్లలు బలహీనంగా ఉంటారు కాబట్టి, తమ కన్నా బలహీనులను ఈ పిల్లలు హింసిస్తారు. ఈ ప్రవర్తన వల్ల భవిష్యత్తు లో సమాజానికీ హాని జరిగే అవకాశాలుంటాయి. జంతువుల పెంపకమూ మనకు పాఠాలే! డేగలా మారాలి.. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో డేగ (గ్రద్ద) ను చూసి నేర్చుకోవాలి అంటారు నిపుణులు. గద్ద ఒక ఎత్తైన ప్రదేశంలో ముళ్లు, గడ్డితో కలిపి ఒక గూడు అల్లుతుంది. గుడ్లు పొదిగి, పిల్లలయ్యాక ఒక దశలో వాటిని కిందకు తోసేస్తుంది. ఎగిరేవి ఎగురుతాయి. ఎగరకుండా పడిపోయే పిల్లని తండ్రి గద్ద పట్టుకొని మళ్లీ గూడు వద్దకు తీసుకువస్తుంది. ఇది గమనించిన తల్లి గద్ద గడ్డిని తీసేస్తుంది. తండ్రి గద్ద బిడ్డను ముళ్ల మీద ఉంచుతుంది. అవి గుచ్చుకోవడంతో త్వరగా ఎగరాలి, లేకపోతే ఇంకా ముళ్లు గుచ్చుకుంటాయనే ఆలోచనతో పిల్ల పక్షి ఎగురుతుంది. అంటే, పిల్లలకు మంచీ చెడూ రెండూ నేర్పించుకుంటూ పోతుంది. ప్రతి తల్లీదండ్రి తమ పిల్లల పెంపకంలో ఇదేవిధంగా శ్రద్ధ తీసుకోవాలి. సైకిల్ నేర్పించేట్టుగా ఉండాలి పేరెంటింగ్ అంటే. పడిపోతున్నప్పుడు పట్టుకొని, మిగతా సమయంలో వదలాలి. అప్పుడే స్వతంత్రంగా ఎదుగుతారు. పులిలా..ఆంక్షల నియమాలా? అమ్మానాన్న అంటే పులిని చూసి భయపడినట్టు ఉండాలనుకోకూడదు. దీనివల్లనే ‘ఏం చేస్తే ఏం దండనో’ అని ఏ పనీ సరిగ్గా చేయకపోగా పెద్దలకు తెలియకుండా తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. కంగారూ.. అతి జాగ్రత్త పుట్టినా తన కడుపు సంచిలోనే ఉంచి పెంచుతుంది కంగారూ. ఇలాగే అతి జాగ్రత్తగా పెంచే తల్లిదండ్రుల వల్ల పిల్లలు సొంతంగా ఏదీ ఆలోచించలేరు. పెద్దలు చెప్పిందే వేదం అనుకుంటారు. ఆస్ట్రిచ్ స్వభావం ఈ పక్షి తల మట్టిలోనే పెట్టి ఊరుకుంటుంది పిల్లలను అస్సలు పట్టించుకోదు. తనకేమీ పట్టనట్టుగా ఉండే ఈ స్వభావం వల్ల పిల్లల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది. పులిలా ఎవరికీ భయపడకుండా బతకాలి అనే స్వభావాన్ని తమ ఆంక్షలతో పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అతి జాగ్రత్తను, నిర్లక్ష్యాన్నీ చూపకూడదు. ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో, ఎలా ఎగరాలో నేర్పించే తల్లిదండ్రులు వల్ల పిల్లలు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. సమాజ బాధ్యతలో తామూ పాల్గొంటారు గెలవాలి.. గెలిపించాలి.. తమ మాటే నెగ్గాలి అనే ప్రవర్తన లేకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే పిల్లలు విజయావకాశాలను అందుకుంటారు. పిల్లలు గెలవాలి – అలాగే పేరెంట్స్ గెలవాలి. అంటే, ఉదాహరణకు.. పిల్లవాడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లాలి. హోమ్‌వర్క్ పూర్తి చేసి వెళ్లు అని చెప్పచ్చు. దీని వల్ల పేరెంట్ గెలుస్తారు, పిల్లవాడూ గెలుస్తాడు. దీనిని విన్ విన్ అప్రోచ్ అంటారు. ∙స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ, దానికీ ఒక హద్దు ఉండాలి. ఉదాహరణకు.. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లచ్చు, కానీ, రాత్రి చెప్పిన టైమ్ లోపల ఇంటికి వచ్చేయాలి. ∙నిర్ణయాలలో పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పార్టీ, హోటల్, వేసుకునే దుస్తులు.. . ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో పిల్లల అభిరుచులకూ ప్రాధాన్యత ఇవ్వాలి. ∙అవసరాన్ని బట్టి లైఫ్‌స్కిల్స్ నేర్పించాలి. ∙పిల్లల నుంచి ఆశించేవి ఉంటాయి. కానీ, అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. గెలిస్తే ఆనందం. గెలవకపోయినా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇవ్వడం లాంటివి. ఎమోషన్స్‌కి ప్రాముఖ్యం ఇవ్వాలి. బ్యాలెన్స్డ్గా ఉండే తల్లిదండ్రుల మైండ్ పిల్లలకు ఎప్పుడూ తెరిచిన తలుపులా ఉంటుంది. చర్చలకు మంచి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మానసిక వికాసం కలుగుతుంది. నిబంధనలు విధించే తల్లిదండ్రుల్లో పైన చెప్పినవేవీ ఉండవు. వీళ్ల మైండ్‌లో క్లోజ్ డోర్ ఉంటుంది. దీంతో పిల్లలు పేరెంట్స్‌తో ఏదీ పంచుకోరు. కేవలం యాంత్రికమైన షేరింగ్ ఉంటుంది. వాస్తవ విరుద్ధంగా ఉంటారు. ఇది ఎప్పుడూ అనర్థాలకు దారితీస్తుంది. – గీతా చల్లా, సైకాలజిస్ట్ -
'పేరెంటింగ్ అనేది ఒక మహాయజ్ఞం'.. ఇన్ఫోసిస్ సుధామూర్తి
పేరెంటింగ్ తల్లిదండ్రులకు పరీక్ష అంటే చాలా చిన్న మాట. పరీక్షకు ఒకసారి తప్పితే మరోసారి రాసుకునే అవకాశం ఉంటుంది. పేరెంటింగ్‌కి ఆ అవకాశం ఉండదు. ఉన్నది ఒక్కటే ఆప్షన్, ఆ ఒక్క అవకాశంలోనే ఉత్తీర్ణత సాధించాలి. అందుకే ఇది ఒక మహాయజ్ఞంతో సమానం. పేరెంటింగ్ మహాయజ్ఞంలో తల్లిదండ్రులను ఉత్తీర్ణులను చేయడానికి ఉపయోగపడే విషయాలను చెప్పారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. ఆమె పేరెంటింగ్ అంశంగా రెండు రచనలు, ఒక వీడియో చేశారు. ఆమె చెప్పిన పేరెంటింగ్ టిప్స్ ఆలోచింపచేస్తున్నాయి. మాటలే మార్గదర్శనం! ►ఎవరి కలలు వారివే. తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలు ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు గౌరవించాలి. ►వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి డబ్బు ప్రామాణికం కాదు. క్లాసులోని పిల్లల్లో కొందరు ఎక్కువ డబ్బు ఉన్న ఇంటి వాళ్లు ఉంటారు. కొందరు తక్కువ డబ్బు ఉన్న వాళ్లు ఉంటారు. అందరితో ఒకేరకంగా స్నేహంగా మెలగాలని పిల్లలకు నేర్పించాలి. ►పిల్లలు ఏదైనా కావాలని అడిగితే వారి మాట పూర్తి కాకముందే కొనివ్వడానికి సిద్ధం కాకూడదు. వాళ్లు అడిగిన వస్తువు అవసరం ఏంటో వారినే అడగాలి. నిజంగా అది తక్షణ అవసరమైనదే అయితే వెంటనే కొనివ్వచ్చు. కొన్ని అప్పుడే కొని తీరాల్సిన అవసరాలు కాకపోవచ్చు. వాటిని వాయిదా వేయడమే కరెక్ట్. ►మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. ఇన్నిసార్లు చెప్పడం ఎందుకంటే... పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ఎక్కువ సమయం గడిపితే, ఆ సమయంలో పిల్లలతో ఎంత స్నేహంగా మాట్లాడితే అంత మంచిది. పిల్లల ఆలోచనలను తల్లిదండ్రుల అర్థం చేసుకునే సమయం ఆ మాటల ద్వారానే. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠంలా కాకుండా మాటల్లో మాటగా చెప్పగలిగేది కూడా అప్పుడే. ►ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. ఒక వ్యక్తి వృత్తిని బట్టి, సమాజంలో ఆ వ్యక్తికి దక్కుతున్న హోదాను బట్టి గౌరవాలు పెరగడం తగ్గడం తప్పు. ఒక వ్యక్తి పెద్ద ప్రొఫెసర్ కావచ్చు, అతడి కారు డ్రైవర్ కావచ్చు, తోటమాలి కావచ్చు, ఇంటి ముందు చెత్త తీసుకువెళ్లే వ్యక్తి కావచ్చు... ఎవరి జీవితం వారిది. వారి పనులను బట్టి గౌరవాల్లో హెచ్చుతగ్గులు ఉండరాదు. అన్ని పనులూ గౌరవప్రదమైనవేనని తెలియచేయాలి. ►పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, వారిని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి. పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు తప్పుల తడకలా ఉంటూ పిల్లలు ఒప్పుల కుప్పలా పెరగాలంటే సాధ్యం కాదు. ►పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఎవరి బలాలు వారివే, ఎవరి బలహీనతలు వారివే. సుధామూర్తి జీవితాన్ని పలుకోణాల్లో పరిశీలించి, తన అనుభవాలతో విశ్లేషించి, ఆమె తన పిల్లల పెంపకంలో పాటించి చెప్పిన విషయాలివి. అలాగే పేరెంట్స్ ధోరణి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవిధంగా ఉండకూడదని మరో విషయాన్ని జత చేశారు చైల్డ్ సైకాలజిస్ట్ సుదర్శిని. ‘‘మరొకరి పిల్లలతో కానీ ఇంట్లో తమ ఇద్దరు పిల్లల మధ్య కానీ కంపారిజన్ చేయకూడదు. అలాగే పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకూడదు. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో ఒకరి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఒకరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంత ఘోరమైన తప్పు మరొకటి ఉండదు’’ అన్నారామె. పేరెంటింగ్ అత్యంత కేర్‌ఫుల్‌గా సాగాల్సిన యజ్ఞం. అమ్మానాన్నల భుజాల మీద కనిపించని బాధ్యత. అయితే ఈ బాధ్యత బరువుగా అనిపించదు. సంతోషంగా మోసే ఈ బాధ్యత అంతే సంతోషకరమైన ఫలితాలనివ్వడానికి నిపుణులు చెప్పిన సూచనలు తప్పకుండా ఉపయోగపడతాయి. – వాకా మంజులారెడ్డి ఎవరికి వారు ప్రత్యేకం ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకలా ఉండరు. అలాగే ఒక తల్లికి పుట్టిన పిల్లలిద్దరూ ఒకలా ఉండాలని కూడా లేదు. సన్నగా– కొంచెం బొద్దుగా, మేని ఛాయలో తేడా, ఎత్తులో తేడా, తెలివితేటల్లో తేడాగా ఉంటారు. అలాగే వారి ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగా ఉండచ్చు. ఈ తేడాల రీత్యా ఒకరిని ప్రత్యేకంగా, మరొకరి పట్ల నిరాసక్తంగా ఉంటూ పక్షపాతం చూపించడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం ఆ ఇద్దరు పిల్లలకూ నష్టమే. పిల్లల్లో ప్రతి ఒక్కరిలో తమకంటూ ‘ది బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ ఆ క్వాలిటీని గుర్తించాలి తప్ప తమ అభిరుచులను రుద్దకూడదు. – డాక్టర్ సుదర్శిని, చైల్డ్ సైకాలజిస్ట్ -
కళ్లల్లో కారం కొడితే గంజాయి మానరు.. కొట్టాలా? తిట్టాలా? ఎలా నచ్చజెప్పాలా?
చెడు అలవాటుకు బానిసైన తొమ్మిదో క్లాసు అబ్బాయినిస్తంభానికి కట్టేసి కంట్లో కారం పెట్టింది తల్లి. పాత రోజుల్లో తల్లిదండ్రులు ఇంతకుమించిన కఠిన శిక్షలే వేశారు. తాళ్లతో కట్టి బావుల్లో వదిలి భయపెట్టారు. భయంతో పరివర్తన వస్తుందా? ప్రేమతో వస్తుందా? నచ్చచెప్పడంతోనా? పెడత్రోవ పట్టిన వ్యసనాల బారిన పడిన పిల్లలను దారికి తెచ్చేది ఎలా? మన దేశంలో పిల్లలు ఇల్లు విడిచి పారిపోవడానికి ప్రధాన కారణం ఇద్దరు. – దండించే తల్లిదండ్రులు – దండించే స్కూల్ టీచర్లు. ∙∙ పిల్లల లోకం చాలా చిన్నది. వారి ఊహల్లో భయాలు చాలా పెద్దవి. ‘రేపు హోమ్‌వర్క్ చేసుకుని రాకపోతే డొక్క చింపుతా’ అనే వార్నింగ్ ఆ సంగతి మర్చిపోయి నిద్ర లేచిన పిల్లాడికి తీవ్ర భయం రేపుతుంది. స్కూల్‌కి వెళ్లనంటే ‘వీపు పగులుతుంది’ అనే తల్లిదండ్రులు సిద్ధం. అటు స్కూల్లో.. ఇటు ఇంట్లో దండన భాష తప్ప మరో భాష వినపడదు. పిల్లాడేం చేస్తాడు? పారిపోతాడు. ‘నాలుగు దెబ్బలేయండి సార్. దారికొస్తాడు’ అని తల్లిదండ్రులు స్కూల్లోకొచ్చి చెబుతారు. అంటే పిల్లాడికి స్కూల్లో రక్షణ లేదని అర్థమవుతుంది. ‘మీ పిల్లాడు మా మాట వినడం లేదు. నాలుగు తగిలించి దారిలో పెట్టండి’ అని తల్లిదండ్రుల్ని స్కూలుకు పిలిచి వార్నింగ్ ఇస్తాడు హెడ్మాస్టర్. అంటే.. ఇంట్లో కూడా కోటింగే. పిల్లాడు ఏం చేయాలి. పారిపోతాడు. కోదాడలో జరిగిన తాజా ఘటన ఇప్పుడు చర్చ లేవదీసింది. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు. తల్లి, తండ్రి ఎంత మందలించినా గంజాయి మానలేదు కానీ చదువు మానేశాడు. కొంతకాలం ఇంటిలోనుంచి ఎటో వెళ్లిపోయాడు. మొన్న గంజాయి తాగి ఇంటికొచ్చిన కొడుకును చూసి తల్లి రగిలిపోయింది. స్తంభానికి కట్టి కళ్లల్లో కారం కొట్టింది. ఆ మంటకు పిల్లవాడు ఆర్తనాదాలు చేశాడు. అందరూ అది వీడియో తీశారు. దానిని వైరల్ చేశారు. ‘మమకారం’ అని టైటిల్స్ పెట్టారు. ఆ పిల్లాడు రేపటి నుంచి ఎలా ఈ ‘చెడ్డపేరు’ను తట్టుకుంటూ వీధుల్లో తిరగాలో ఎవరూ ఆలోచించలేదు. ఆ దండించాలనుకున్న తల్లి ఆ పిల్లాడి ప్రైవసీని కాపాడాలి అనుకోలేదు. ఆ తల్లి మంచి పని చేసిందని కొంతమంది తక్షణం స్పందించారు. కాని లోతుగా ఆలోచిస్తే ఇలాంటి శిక్షలు ఏ మాత్రం మేలు చేయవు. హాని తప్ప. ∙∙ ఎంత చిత్రమో చూడండి. గతంలో సంతానం ఎక్కువగా ఉండేది. ఏ పిల్లాడు ఏం చేస్తున్నాడో పెద్దగా పట్టేది కాదు. లేదా బతుకు బాదరబందీలో మునిగి ఉండేవారు. కొందరు పిల్లలు స్కూల్ ఎగ్గొట్టడం, ఈతకు వెళ్లడం, సిగరెట్ల కాల్చడం, పేకాట, సినిమాలు... ఈ వ్యసనాలకు మరిగేవారు. ఎప్పుడో తెలిసేది. తండ్రి జుట్టు పట్టుకుని వచ్చి ఇంట్లో పడేసి బెల్టుతో తన్నేవాడు. తల్లి చీపురు తిరగేసేది. చేతులూ కాళ్లూ కట్టేసి ఎండలో పడేసేవారు. తాడు కట్టి బావిలో వదిలేవారు. ఊహించని శిక్షలు వేసి రికార్డులకెక్కిన తల్లిదండ్రులు ఉన్నారు. కాని చిన్నపిల్లలు వాళ్లు. వాళ్లకు ఎప్పుడూ అర్థమయ్యేది ప్రేమ భాషే. భయం అదుపు చేస్తుంది. ప్రేమ పరివర్తన తెస్తుంది. ఈ చిన్న విషయాన్ని నేటికీ చాలామంది తల్లిదండ్రులు, గురువులు తెలుసుకోరు. ∙∙ వ్యసనాలకు అలవాటు పడే వీలు తల్లిదండ్రులే కల్పిస్తారు. ఏది ఎంత వరకు అనుమతించారో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పరు. సెల్‌ఫోన్, గేమ్స్, ఫ్రెండ్స్‌తో చాటింగ్.. తమ జోలికి రావడం లేదు కదా అని వదిలేస్తారు. తీరా వారు అడిక్ట్ అయ్యాక దండనకు దిగుతారు. దాని బదులు వారి కోసం సమయం వెచ్చించాలి అనుకోరు. పిల్లల స్నేహితులు ఎవరు? వారు స్కూల్‌కు వెళుతున్నారా? స్కూల్ అయ్యాక ఎవరితో తిరుగుతున్నారు, ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారు తల్లిదండ్రులకు తెలియదు. ఏదో ప్రమాదం ఇంటి మీదకు వస్తే తప్ప. ఇవాళ పదో క్లాసులోనే స్మోకింగ్, ఆల్కహాల్ వరకూ వెళుతున్న పిల్లలు ఉన్నారు. పోర్నోగ్రఫీ బారిన పడుతున్నారు. ప్రేమ వ్యసనం ఒకటి ఎలాగూ ఉంది. కన్నదే ఒకరిద్దరు అయినప్పుడు వారికి తగినంత ఖర్చుకు ఇవ్వాలి కదా గారం చేయాలి కదా అని అనుకోవడం కూడా ప్రమాదంగా మారింది. ఏదీ తక్కువ వద్దు. ఏదీ ఎక్కువ వద్దు. అతి ప్రేమ... అతి కోపం ఏదీ వద్దు. పిల్లలతో చేసే ఎడతెగని సంభాషణే పిల్లల్ని, తల్లిదండ్రులని కాపాడుతుంది. పిల్లలు చాలామంచి రిసీవర్స్. వారు వ్యసనాలను ఎంత తొందరగా రిసీవ్ చేసుకుంటారో పరివర్తనను కూడా అంతే తొందరగా చేసుకుంటారు. వారితో సంభాషించాలి అంతే. కళ్లల్లో కారం కొట్టడం ద్వారా గంజాయి మానరు. అది తక్కువ మార్కులు వస్తున్నందుకు విధించిన దండన అయితే గనుక మార్కులూ రావు. నిపుణుల సహాయం తీసుకోవాలి. కౌన్సిలర్లు ఈ వ్యసనాల నుంచి ఎలా బయటపడాలో చెబుతారు. ట్యూషన్లు పెడితే మార్కులు ఎలా రావాలో వారు చెబుతారు. అంతే తప్ప మనం దండించడం వల్ల, కడుపు మాడ్చడం వల్ల, నలుగురి మధ్యలో అవమానించడం వల్ల ఫలితం ఉండదు. పిల్లలు ఇలా అయ్యారు అని దండించే ముందు వాళ్లు ఎందుకు అలా అయ్యారు ఎవరి పాత్ర ఎంత? వారిని సంస్కరించడంలో ఎవరి భాగస్వామ్యం ఎంత? అనేది పరిశీలించుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. ఇంట్లో పదహారు ఓటీటీలు మనమే పెట్టించి ‘ఎప్పుడూ టీవీ చూస్తుంటావేమిరా’ అని కారం డబ్బా అందుకుంటే ఆ కారం కొట్టాల్సింది ఎవరి కంట్లో. ప్రేమ, సంభాషణ... సమస్య, అవగాహన ఇవే తల్లిదండ్రులను, పిల్లలను కాపాడుతాయి. ఈ విషయాన్నే ఇప్పుడు వైరల్ చేయాల్సింది. -
మీ పిల్లలు సరిగ్గా తినడం లేదా? ఈ 5 చిట్కాలు పాటిస్తే సరి!
పిల్లలచేత ఆకుకూరలు తినిపించడం ప్రతి తల్లికీ సవాలే! కానీ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే అన్నిరకాల పోషకాలు అవసరమేకదా! మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం పిల్లలు తమకు తాముగా ఆహారం తీసుకుంటే చేకూరే ప్రయోజనాలు అనేకం. ఈ నైపుణ్యాలు జీవిత ఇతర భాగాల్లోనూ ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించింది. అలాగే తినే విధానం కూడా వారి ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందట. పిల్లలు ఇష్టంగా ఆహారం తింటే చిన్నతనం నుంచే ఉబకాయానికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవరచుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. ఆహారం బాగా నమలాలి ఆహారం బాగా నమిలి తింటే వేగంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. తద్వారా అవసరానికి మించి తినడాన్ని నిరోధించవచ్చు. ఆరోగ్యకరమైన తిరుతిండ్లు పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యానికి మేలు చేసే చిరుతిండ్లు తినే అలవాటు చేయాలి. ఇది మంచి ఆహార అలవాట్లను నేర్పడానికేకాకుండా జంక్, ఫ్రైడ్ ఫుడ్ తినకుండా నివారించవచ్చు. ఆహార ఎంపికలోనూ భాగస్తులను చేయాలి కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు మీ పిల్లలను కూడా మీతోపాటు తీసుకెళ్లండి. ఆరోగ్యానికి మేలుచేసే వస్తువులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో వారికి నేర్పండి. ఈ విధమైన భాగస్వామ్యం వల్ల పిల్లలు ఆహారంపై ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపడేలా వండాలి ప్రతి రోజూ ఒకే విధమైన ఆహారం తింటే మీకేమనిపిస్తుంది? బోర్ కొడుతుంది కదా! అందుకే ఎప్పటికప్పుడు రుచికరంగా ఉండేలా ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తో కొత్త వంటకాలు ప్రయోగం చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఆసక్తిగా, ఇష్టంగా తింటారని నిపుణులు సూచిస్తున్నారు. పంచేద్రియాలు అనుభూతి చెందేలా చూపు, వాసన, రుచి, స్పర్శ, వినికిడి.. ఈ పంచేంద్రియాలు అనుభూతి చెందేలా ఆహారం ఉండాలని ఎప్పుడూ నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిణామాలే పిల్లలకి ఆహారం పట్ల ఆసక్తి పెరుగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఏడేళ్ల కొడుక్కి మామ్స్ మనీలెసన్! మీరూ ట్రై చేయండి.. -
Cyber Crime: ఇదంతా చేసింది కొడుకే అని తెలిసి..
వాణీ, రఘురామ్ (పేర్లు మార్చడమైనది) దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్థులు. ఇద్దరికీ అయిదంకెల జీతం. ఒక్కగానొక్క కొడుకు. చింతల్లేని చిన్నకుటుంబం. నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్లు చూడగానే గుండెల్లో రాయిపడినట్టు అయ్యింది వాణీకి. తనకున్న రెండు ఖాతాల క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి ఐదు లక్షల పై చిలుకు బిల్లు చూసేసరికి షాక్ అయ్యింది. భర్త రఘురామ్‌కి ఈ విషయం చెప్పింది. సందేహం వచ్చిన రఘురామ్ తన క్రెడిట్, డెబిట్ కార్డు బిల్లులు చెక్ చేశాడు. ఆరు లక్షలపైనే ఖర్చు చేసినట్టుగా తన బ్యాంకు ఖాతాలు చూపించాయి. ఆన్లైన్లో అకౌంట్ తనిఖీ చేస్తే ఏవేవో సైట్లకు డబ్బు బదిలీ చేసినట్టుగా ఉంది. ఇద్దరికీ ఏం చేయాలో అర్ధం కాలేదు. తమ అకౌంట్ హ్యాక్ అయ్యిందని మాత్రం అర్థం అయ్యింది. వెంటనే సైబర్ క్రైమ్‌ను సంప్రదించారు. ఓటీపీ డెలిట్ విషయం తెలిసి వాణీ రఘురామ్‌లు ఆశ్చర్యపోయారు. స్మార్ట్‌ఫోన్ తమ జీవితాల్లో నింపుతున్న అల్లకల్లోలాన్ని తెలుసుకున్నారు. వాణీ రఘురామ్ల ఏకైక పుత్రుడు విక్రాంత్ (పేరుమార్చడమైనది) టెన్త్ క్లాసు చదువుతున్నాడు. వీడియో గేమ్స్ అంటే పిచ్చి. తమ ఫోన్లలో గేమ్స్ ఆడుతుంటే విసుగనిపించి, కొడుక్కి ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ప్రతీనెలా పాకెట్ మనీ కింద కొడుకుకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేవారు. విక్రాంత్ ఆ డబ్బు పెట్టి, ఆన్లైమ్ గేమ్స్ కొనుగోలు చేసి మరీ ఆడుతుండేవాడు. వాణీ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆర్నెల్లుగా ఇంటి వద్దే ఉంటోంది. కొడుక్కి పాకెట్ మనీ ఇవ్వడం తగ్గించింది. ఏమైనా ఫుడ్ కావాలంటే ఇంటి వద్దే చేసి పెడుతున్నాను కదా! అనేది. దీంతో తల్లితండ్రుల నుంచి మనీ ఎలా దొంగిలించాలా అని రకరకాల ప్రయత్నించాడు. నగదు కాకుండా తనకు ఆన్లైన్ పేమెంట్ అవసరం. అందుకు తల్లి, తండ్రి బ్యాంక్ కార్డులపై నెంబర్లు నోట్ చేసుకున్నాడు. వారికి తెలియకుండా వారి అకౌంట్ నుంచి, తనకు కావల్సిన సైట్ల నుంచి గేమ్స్ కొనుగోలు చేసి, ఆడటం మొదలుపెట్టాడు. బ్యాంకు నుంచి ఓటీపీ వచ్చే సమయంలో ఫ్రెండ్స్‌తో మాట్లాడాలనో, మరో అబద్ధమో చెప్పి ఫోన్ తీసుకునేవాడు. మనీ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ వివరాలను వెంటనే డిలీట్ చేసేవాడు. మొదట్లో తక్కువ మొత్తంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి పట్టించుకోని వాణీ, రఘురామ్‌లు ఆ తర్వాత నెలల్లో పెద్ద మొత్తంలో తేడా రావడంతో అకౌంట్స్ హ్యాక్ అయినట్టు గుర్తించారు. ఇదంతా చేసింది కొడుకే అని తెలిసి అయితే ఆ పని చేసింది తమ కొడుకే అని నిపుణుల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయారు. గేమింగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి ఎంతగా ఎడిక్ట్ అయ్యాడో తెలుసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించి, నిపుణుల కౌన్సెలింగ్‌తో కొడుకులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వ్యసనం (డిఎస్ఎమ్) డయాగ్నోస్టిక్ – స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ జాబితాలో చేర్చలేదు. కానీ, మానసిక నిపుణులు మాత్రం దీనిని జూదం, మాదకద్రవ్య వ్యసనాలతో పోల్చారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక పరిశోధన లో స్మార్ట్‌ఫోన్‌కి ఎడిక్ట్ అయినవారిలో ఏదో కోల్పోతున్నామనే భయం, ఆందోళన, అసంతృప్తి, సామాజిక ఆందోళన, ఒత్తిడి వంటివి అధికంగా ఉంటాయని స్పష్టం అయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ ను అధికంగా వాడే పిల్లలను గమనింపుతో గైడెన్స్ చేయడం అవసరం. వ్యసనం వైపుగా అడుగులు సౌలభ్యం, ఉపయోగం, రకరకాల ఆసక్తుల కారణంగా స్మార్ట్‌ఫోన్ మనపై ఆధిపత్యం వహిస్తున్నాయన్నది తెలిసిందే. వేలి కొసలతో చేసే పదే పదే ‘క్లిక్’ లు వ్యసనం వైపు మరుల్చుతున్నాయి. ఇటీవల మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యులు స్మార్ట్‌ఫోన్ వ్యసనం గురించి పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ వ్యసనం ఎంత దూరం వెళుతుందంటే తెలియకుండానే నేరం వైపుగా అడుగులు వేయిస్తుంది. విక్రాంత్‌ను గేమింగ్ యాప్స్ ఇలాగే ఆకర్షించాయి. తల్లీతండ్రీ తనకు ఇచ్చే పాకెట్‌మనీ సరిపోకపోవడంతో తనే ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఆదాయాన్ని పొందాలనుకున్నాడు. అందుకు ఆన్లైన్ గేమింగ్స్ ఇచ్చే పాయింట్స్ ద్వారా అయితే డబ్బును సులువుగా రాబట్టచ్చు అనుకున్నాడు. మొదట్లో గేమింగ్ యాప్స్ వినియోగదారుడికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చి, ఆకర్షిస్తాయి. దాంతో స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గంటల కొద్దీ గేమింగ్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ పాయింట్స్ పొందాంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో ఆ డబ్బును ఎక్కడి నుంచి రాబట్టాలా అని దారులు వెతుకుతారు. పిల్లలు వారి మానాన వారు ఫోన్లో ఉన్నారు కదా అనో, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు కదా అనో పర్యవేక్షణలో లోపం జరిగితే చివరికి కోలుకోలేనంత అనర్థాలు తలెత్తుతుతాయి. విక్రాంత్ లాంటి పిల్లలు మన మధ్యే ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్యం. డబ్బు ఒక్కటే కాదు అధికంగా వాడితే మానసిక, శారీరక స్థితిలోనూ గణనీయమైన హానిని డిజిటల్ ప్లాట్‌ఫామ్ కలిగిస్తుంది. ముందే గుర్తించి కట్టడి చేయడం మేలు చేస్తుంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: బ్లాక్‌మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను -
రంగు తగ్గితేనేం... చురుకు తగ్గదు
ఒకరి మేనిఛాయ ఉన్నట్లు మరొకరిది ఉండదు. అలాగే ఇంట్లో ఇద్దరు – ముగ్గురు పిల్లలుంటే అందరూ తెల్లగా ఉండకపోవచ్చు. ఇంట్లో అందరూ తెల్లగా ఉండి ఒకరు కాస్త రంగు తక్కువగా కాని నల్లగా కాని ఉంటే వారికి తెలియకుండానే న్యూనతకు గురయ్యే ప్రమాదం ఉంది. అది కూడా అమ్మాయిలైతే మరీ ఎక్కువ. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులకు పరిస్థితిని విచక్షణతో సమన్వయం చేసుకోవడం సున్నితమైన, కష్టమైన ఎక్సర్సైజ్. అలాంటి తల్లిదండ్రులకు కొన్ని జాగ్రత్తలు... ♦ పిల్లల దగ్గర రంగు గురించిన ప్రస్తావన తీసుకు రాకూడదు. ఇంటికెవరైనా వచ్చినప్పుడు కాని, ఎక్కడికైనా వెళ్లినప్పుడు కాని తెల్లగా ఉన్న పిల్లలు కనిపిస్తే తమకు తెలియకుండానే ‘అబ్బ! తెల్లగా... ఎంత అందంగా ఉందా అమ్మాయి’’ అంటూ పొగడడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు పక్కనే ఉన్న తమ పిల్లల మనసు చివుక్కుమంటుందన్న సంగతి మర్చిపోతారు. ♦ రంగు ముఖ్యం కాదని అందచందాలు ముఖ కవళికలను బట్టి ఉంటాయని పిల్లలకు తెలియచేయాలి. వీటన్నింటికంటే చదువు, సంస్కారం, అచీవ్మెంట్స్ ముఖ్యమని తెలియచెప్పాలి. బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్య ప్రాధాన్యతా తెలియజేయాలి. ♦ బంధువులు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్లు అయ్యో మీ అమ్మాయా? ఇంత నల్లగా ఉందేం పాపం? అంటూ తమ ఆశ్చర్యాన్ని ధారాళంగా ప్రకటించేస్తుంటారు. పిల్లల ఎదురుగా అలా అనడం తప్పని వాళ్లను సంస్కరించడం కష్టమే కాని అదే సమయంలో మీరిచ్చే సమాధానం మాత్రం మీ అమ్మాయి మనసు నొచ్చుకోని విధంగా ఉండాలి. మీ సమాధానం ఘాటుగా ఉంటే బంధువులు నొచ్చుకుంటారని రాజీపడడం కంటే మీ అమ్మాయి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండడమే ముఖ్యమని గుర్తించాలి. ♦ పిల్లలు చదువుతోపాటు మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యేటట్లు చూడా లి. వాళ్ల మనసు తాము సాధిస్తున్న అచీవ్మెంట్స్ మీదే కేంద్రీకృతమవుతుంది కాబట్టి అదే పనిగా రంగు గురించి బెంగ పడకుండా ఉంటారు. తమకంటూ ప్రత్యేకత సాధించుకోవడం ద్వారా తాము దేనిలోనూ తీసిపోమన్న ఆత్మవిశ్వాసం దృఢపడుతుంది. -
న్యూజిలాండ్ ప్రధానికి ఒబామా పాఠాలు
ఆక్లాండ్ : బరాక్ ఒబామా అంటే అమెరికా మాజీ అధ్యక్షుడి గానే కాకుండా గొప్ప తండ్రి అని ప్రపంచానికి తెలుసు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కుమార్తెలు మాలియా, సాశాలను సాధారణ తండ్రిలాగే పెంచారు. అధ్యక్షుని బిడ్డలమనే గర్వం కూడా వారిలో ఎప్పుడూ కనిపించలేదు. అంతేకాకుండా అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒబామా కూతుళ్లు ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఎలా పెంచాలో ఒబామాకు బాగా తెలుసని ఆయన సన్నిహితులు చెబుతూ ఉండేవారు. అధ్యక్ష పదవి కాలం ముగిసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న ఒబామా అప్పుడప్పుడు ప్రజలకు అవసరమయ్యే ప్రసంగాలు చేస్తుంటారు. తాజాగా ఓ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా న్యూజిలాండ్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒబామా.. ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్‌కు పిల్లల పెంపకంపై పాఠాలు చెప్పారు. జెసిందా గత జూన్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒబామా చెప్పిన సూచనలు తనకు, తన బిడ్డ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని కివీస్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. -
కేర్... ఇంత
పేరెంటింగ్ టిప్స్ వర్షాకాలంలో నేల చిత్తడిగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో పిల్లలకు తడి నేల మీద జారకుండా పట్టు దొరికే షూస్, చెప్పులు వేయాలి. అడుగు బాగం గరుకుగా, నొక్కులుండాలి. ఎగురుతూ, దూకుతూ ఉంటారు కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తప్పదు. దోమల నివారణకు వాడే కృత్రిమ పరికరాల నుంచి వెలువడే వాయువులు పిల్లలకు ఆరోగ్యకరం కాదు. రాత్రంతా అదే గాలి పీల్చడంతో ఆ దుష్పభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. వీటికి బదులుగా ఒక కప్పు నీటిలో ఒక ముక్క కర్పూరం వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రావు. పైగా దోమలను పారదోలే కృత్రిమ పరికరాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి వీటి వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవుతారు. చంటి పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మసాజ్ చేసే ఆయిల్‌ను గోరువెచ్చగా వేడి చేసి వాడాలి. ఫ్రిజ్‌లో ఉన్న వెన్నను బయటకు తీసిన తర్వాత నార్మల్‌గా మెత్తబడినప్పటికీ చల్లదనం ఎక్కువసేపు ఉంటుంది. ఉష్ణోగ్రత చూసుకుని అవసరమైతే మసాజ్‌కు కావలసినంత ఒక కప్పులోకి తీసుకుని వేడిగా ఉన్న పాలగిన్నెలాంటి దాని మీద పెట్టి ఆ తరువాత వాడాలి. చిన్న పిల్లలున్న ఇంట్లో ప్రతి పనినీ కేర్‌ఫుల్‌గానే చేయాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ... ఇంట్లో రోజంతా కేరింతలు ఉండాలంటే ఈ మాత్రం కేర్ తీసుకోవాల్సిందే. -
ఆంగ్లంతోపాటు ఆంధ్రమూ ...
పేరెంటింగ్ టిప్స్ ఇప్పటి పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకువచ్చేందుకు ఉగ్గుపాలతో ఇంగ్లిష్ చెబుతూనే, పనిలోపనిగా వాటిని తెలుగులోనూ చెబుతుంటే రెండు భాషల్లోనూ పిల్లలకు ప్రవేశం ఉంటుంది. ఏకకాలంలో రెండు భాషలనూ నేర్పడం మంచిది. ఉదాహరణకు... ఇంగ్లిష్‌లో ఉన్న రైమ్స్, టంగ్‌ట్విస్టర్స్, సామెతలు వంటివి తెలుగులో కూడా ఉన్నాయి. పిల్లలకు భాష నేర్పడం మొదట శరీరభాగాలను చెప్పడంతో ప్రారంభమవుతుంది. ఈమధ్య తల్లిదండ్రులు వాటిని ఇంగ్లిష్‌లోనే ‘నోస్, మౌత్, ఐస్...’ అంటూ నేర్పుతున్నారు. అలా కాకుండా... ‘ఇది ముక్కు, ఇది నోరు, ఇవి కళ్లు... ఏదీ... నువ్వు చూపించు నీ కళ్లు ఎక్కడ?’ అనడంతో ఇది మొదలవుతుంది. మీ పిల్లలకు ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ రైమ్‌తో పాటు - ‘చేత వెన్నముద్ద... చెంగల్వ పూదండ...’ కూడా నేర్పండి. మీ పిల్లలు సరదాగా ఇంగ్లిష్ టంగ్ ట్విస్టర్స్ చెప్పుకుంటూ ఉంటే అలాంటివి తెలుగులోనూ ఉన్నాయని ‘అడిగెదనని కడువడి జను అడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్...’ అన్న భాగవత పద్యమూ చెప్పండి. పిల్లల్ని చదివించే టైమ్‌లో వాళ్లు ఇంగ్లిష్ సామెతలు చదివేటప్పుడు వాటికి సమానమైనవి తెలుగులోనూ ఉంటాయని, ఉదాహరణకు ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనగానే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ వంటివి గుర్తుచేసుకుని ఎప్పటికప్పుడు చెబుతుండాలి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’, ‘కంచు మోగినట్లు కనకంబు మోగునా’ వంటివి మీ పిల్లలు పాఠ్యపుస్తకంలో చదివి చెబితే... ఒక పద్యపాదమే, నిత్యసత్యమైన సామెతలా నిలిచిపోయిందని వివరించి, ఆ పూర్తి పద్యం నేర్చుకొనేలా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. పిల్లలు కేవలం ఇంగ్లిష్ మాత్రమే చదువుతూ ఉంటే ఆ ఒక్క భాషలో మాత్రమే ప్రావీణ్యం ఉంటుందని, అదే ఇంగ్లిష్తో పాటు తెలుగు కూడా నేర్పుతుంటే బహుభాషలు అలవడతాయన్న దృక్పథాన్ని అలవరచుకోండి. మీ పుస్తకాల ర్యాక్‌లో పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలతో పాటు ‘వేమన శతకం’, ‘సుమతీ శతకం’లాంటి చిన్న చిన్న పలుచటి పుస్తకాలు కూడా ఉండేలా చూసుకోండి. ఇంగ్లిష్ మీడియంలోని పిల్లలకు తెలుగును ప్రయత్నపూర్వకంగా నేర్పేబదులు... ఇది సులువు కాదంటారా?