చాలామంది తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలను తమ పిల్లలు అనుభవించ కూడదనే ఉద్దేశ్యంతో వారిని అతి గారం చేస్తుంటారు. తమకు ఉన్నా లేకున్నా, వారికి కావలసిన అన్ని వసతులూ, సౌకర్యాలూ సమకూర్చుతూ, వారికి కష్టం అనేది తెలియకుండా పెంచుతుంటారు. అయితే అది చాలా తప్పు. వారికి బాల్యం నుంచి బాధ్యతలు తెలియజేయాలి. అలాగని వారి నెత్తిమీద బాధ్యతల బరువు వెయ్యడం కాదు... వారి బాధ్యత వారికి తెలిసేలా చేయడమే బాధ్యతతో కూడిన పెంపకం.
పంచుకోవడం అన్నది పిల్లలకి తప్పనిసరిగా నేర్పాల్సిన వాటిలో ఒకటి. దానివల్ల ఇతరులతో స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరి అవసరం మరొకరికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు స్కూలు నుండి రాగానే, పుస్తకాల సంచీ అక్కడే ఏ సోఫాలోనో పారేసి, విడిచిన బట్టలని, చెప్పులని ఒకపక్కకి వదిలేస్తారు. అటువంటప్పుడు వారికి ఆ వస్తువుల విలువ, అవసరం తెలియజేస్తూ, క్రమపద్ధతిలో భద్రపరచుకునేట్లు వారికి అలవాటు చేయాలి. అంతేకాదు, వారు అడిగినవన్నీ వెంటనే తెచ్చి ఇవ్వకుండా మంచి మాటలతో బుజ్జగించి దారికి తేవాలి.
ఎదిరించి మాట్లాడుతుంటే...
పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడే పిల్లలని చూస్తుంటాం. మొదట తల్లిదండ్రులు తమ పెద్దలని గౌరవిస్తే, అదే బాటలో పిల్లలూ నడుచుకుంటారు. గురువులు, పెద్దలు, వృద్ధులను తల్లిదండ్రులు గౌరవిస్తే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు.
షాపింగ్
షాపింగ్‌కి వెళ్ళినపుడు, పిల్లలని తమతో తీసుకెళుతుంటారు. అక్కడ వారికి సెల్‌ఫోన్ చేతికిచ్చి ఒకచోట కూర్చోబెట్టి తాము షాపింగ్ చేసుకుంటారు. అలా కాక తమ పిల్లలని కూడా తమతో ఉంచుకుంటే ఒక వస్తువు కొనేటప్పుడు తమ తల్లిదండ్రులు ఆ వస్తువు నాణ్యతని ఎలా పరీక్షిస్తున్నారో, ఎలా ఎంచుకుంటున్నారో అన్న విషయాలు తెలుసుకోవటంతో పాటు అక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి, తమకు ఏమి కావాలి, ఏవి ఉపయోగం అన్నది గ్రహించుకోగల్గుతారు.
కలిసి భోజనం చేయడం
వారానికి ఒక్కరోజు అయినా అందరూ కలిసి భోజనం చేయాలి. అలా చేయటం వల్ల బయటకు వెళ్ళి, ఇతరులతో కలిసి భోజనం చేయాల్సొచ్చినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకు తినిపించాల్సిన అవసరం ఉండదు.
మంచి మాటలతో
సహజంగా పిల్లలు అల్లరి బాగా చేస్తుంటారు. ఆ అల్లరి మోతాదు మించి΄ోతుంటుంది. వస్తువులు పాడవటం, విరగటం, పగిలి పోవటం కూడా జరుగుతుంటుంది. ఆ సమయంలో ఎంత కోపం వచ్చినా, ఆ పాడయిన వస్తువు గురించే మాట్లాడాలి కాని పిల్లవాడి మనస్తత్వం గురించి మాట్లాడకూడదు. ఆ వస్తువు భద్రత గురించి చెప్పాలి. మరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండేలా చేయాలి.
పాకెట్ మనీ
సాధారణంగా పిల్లలు కొంచెం ఎదిగాక, వారికి వారి ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ము ఇస్తుంటారు. వారు ఎలా ఖర్చు పెట్టుకున్నా పట్టించుకోరు. ఇది సరి కాదు. వారు ఆ డబ్బును ఎందుకు... ఎలా ఖర్చు చేస్తున్నారో పద్దు రాయమనాలి. వాటిని చెక్ చేసి, అందులో అనవసర ఖర్చులుంటే వాటిని ఎత్తి చూపాలి. దీనివల్ల పిల్లలకి మనీ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.
టైమ్ మేనేజ్‌మెంట్
ఉదయం లేచే సమయం, భోజన సమయం, చదువుకునే సమయం, ఆటలాడే సమయం, పడుకునే సమయం.. ఇలా అన్నింటికీ ఒక టైం టేబుల్ తయారు చేయాలి. ఇది ఎంతో అవసరం. చదువు చదువు అని పోరాటం కాదు, ఎలా చదువుకోవాలో, చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలియపరిస్తే వారు చదువుని కష్టపడి కాకుండా, ఇష్టపడి చదువతారు.
థాంక్స్.. సారీ..!
ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినపుడు సారీ చెప్పటం, ఎవరి దగ్గరైనా ఏ వస్తువునైనా, లేదా సహాయాన్నైనా పొందితే,కృతజ్ఞత చెప్పటం అలవరచాలి. బాల్యం నుంచే పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం, ఇరుగు పొరుగుతో, తోటివారితో మర్యాదగా మెలగడం, ఉన్నదానిని కలిసి పంచుకోవడం వంటి వాటిని నేర్పిస్తూ, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.
Comments
Please login to add a commentAdd a comment