ఈకాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం కష్టమే. ఇది చేయకు, అది చేయకు, అలా, ఇలా ఉండకూడదు అని చెబితే అస్సలు వినరు. పెద్దవాళ్లు చెప్పేది తమ మంచికే అన్న స్పృహ ఉండదు వారికి. అయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తపన పడుతుంటారు తల్లిదండ్రులు. మాట వినకుండా పెంకిగా ప్రవర్తించే పిల్లలను ఇలా మీ దారిలోకి తెచ్చుకోండి. అప్పుడు ఇక పిల్లలతో పాటు మీరూ సంతోషంగా ఉంటారు.
►మాట వినడం లేదని పిల్లలను తిట్టకూడదు. నువ్వు చెడ్డదానివి లేదా చెడ్డవాడివి అని వారిని నిందించకూడదు. నువ్వు పెద్దదానివి లేదా పెద్దవాడివు అవుతున్నావు కదా... అందుకే ఇలా చేస్తే బాగుంటుంది... అని లాలనగా చెప్పాలి.
► కోపంలో మనం అనే కొన్ని రకాల మాటలు పిల్లల మనసుకు గాయం చేసి, వారి మనసును విరిచేస్తాయి. కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతిస్తాయి. అందుకే వీలైనంత వరకు వారికి ఓపికగా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.
►పిల్లలు ఎంత విసిగించినప్పటికీ పెద్దగా అరవకూడదు. పైన చెప్పుకున్నట్టు సున్నితంగా పదేపదే చెబుతూ బుజ్జగించాలి. ఎంత చెప్పినా వినకుండా ఉంటే ముందు వాళ్ల కోపం తగ్గించాలి. తరువాత పిల్లలు విసుక్కోకుండా జాగ్రత్తగా చెప్పాలి.
► చెప్పేది ఏదైనా ప్రేమగా చెబితే ఎంత మొండి చేసేవారైనా తప్పకుండా వింటారు. నచ్చిన డ్రెస్ వేసుకోనివ్వడం, హోం వర్క్ అయిన తరువాత టీవీ చూడనివ్వడం, డాడీతో కలిసి బయటకు వెళ్లడానికి అనుమతించడం వంటివి. ఇలా పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగించి, తరువాత వారికి మంచి చెడులు వివరించాలి.
►ప్లీజ్, థ్యాంక్యూ, యూ ఆర్ వెల్‌కమ్ వంటి మర్యాదలు నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు అదే నేర్చుకుంటారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి.
► పిల్లలు వారికి హాని జరిగే పనులు కొన్నిసార్లు చేస్తుంటారు. వెంటనే కేకలేసి, లెక్చర్ ఇవ్వకూడదు. కాస్త దెబ్బలు తగిలినప్పటికీ... వాళ్లు తేరుకున్నాక, మీ మాటలు వినే మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి వివరించాలి. అప్పుడు వారు మరోసారి అటువంటి పనులు చేయరు.
Comments
Please login to add a commentAdd a comment