
‘హోమ్‌వర్క్ చేయలేదేంటి?’ టీచర్ ప్రశ్న.
‘చెయ్యలా’... అన్నాడా స్టూడెంట్ తల వంకరగా పెట్టి.
‘నిర్లక్ష్యంగా బదులిస్తావేంటి... క్లాసయ్యే వరకు నిలబడు’
‘తగ్గేదేలే’ అంటూ విచిత్రంగా అభినయించాడు.
భుజం తిప్పుతూ వికారంగా ముఖం పెట్టాడు.
ఇది ఇప్పుడు స్కూళ్లను పట్టి పీడిస్తున్న జబ్బు.
ఆ జబ్బుకు విరుగుడు కూడా రోగం మొదలైన చోటే ఉంది.
‘మా స్కూల్‌లో సగం మంది విద్యార్థులు ‘ఫలానా’ సినిమా చూసిన తర్వాత చెడిపోయారు. విద్యార్థుల భాష మారిపోయింది, జుట్టు స్టైల్, డ్రెస్సింగ్ విచిత్రంగా ఉంటోంది. టీచర్‌లుగా వారికి మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. భాష మార్చుకోవాలని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారు.
ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్‌బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇస్తోంది?’ ఇటీవల విద్యాశాఖ కమిషనర్ మీటింగ్‌లో ఓ టీచర్ వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆమె ఒక్కరే కాదు, బయటకు చెప్పలేక ఎందరో టీచర్‌లు ఇలాగే ఆవేదన చెందుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
జాతీయోద్యమకాలం సినిమాలు
‘‘సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం. అది ప్రధానంగా వినోదసాధనమే. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యతతో కూడిన వినోదాన్ని అందించాలి. జాతీయోద్యమకాలంలో సినిమాలు ఈ పాత్ర పోషించాయి. జనంలో స్వాతంత్య్రపోరాట స్ఫూర్తిని రగిలించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన సినిమాలకు ఒక సామాజిక లక్ష్యం అనేది లేకుండా పోయింది.
సినిమా ప్రభావం పిల్లల మీద మంచి–చెడు రెండు వైపులా ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఏం ఉందో అదే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు. సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.
తల్లిదండ్రులు శృంగార దృశ్యాలున్న సినిమాలకు మాత్రమే పిల్లలను మినహాయిస్తున్నారు. హింస ఉన్న సినిమాల విషయంలో పట్టింపుగా ఉండడం లేదు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న మాధ్యమాల్లో సినిమాలతోపాటు టీవీ ప్రసారాలు, సోషల్ మీడియాను కూడా ప్రస్తావించాలి. పిల్లల క్షేమం దృష్ట్యా ఆలోచించి నప్పుడు మనదేశాల్లో పటిష్టమైన నియమాలు లేవు.’’ అన్నారు విద్యావేత్త రేఖారావు.
పాడైన విద్యార్థుల లెక్క తేలేదెలా?
పిల్లల మీద సినిమాల ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ఆ దుష్ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందని టీచర్లు ఆందోళనపడుతున్నారు. పిల్లలను సరిచేయడానికి మందలింపుగా ఒక మాట అంటే చాలా హింసాత్మకంగా స్పందిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సమాజానికి మంచి పౌరులను అందించలేమని ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్‌లు ఏం చేస్తున్నారు? సదరు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల గొప్పలు చెప్పడానికి ముందుంటారు.
కానీ తమ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పిల్లలు పాడయ్యారో లెక్కచెప్పే ధైర్యం వాళ్లకుంటుందా? ఒకప్పుడు సిగరెట్ గాల్లోకి ఎగరేసి పెదవులతో పట్టుకోవడం హీరోయిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం స్టయిల్ అనే భావనతో సిగరెట్ అలవాటు చేసుకున్న నాటి యువతరం ఇప్పుడు అరవైలు– డెబ్బైలకు చేరి క్రమం తప్పకుండా లంగ్స్ టెస్ట్‌లు చేసుకుంటోంది. హీరోలు తమ పిల్లలను కూడా ఈ మత్తులోనే ఉంచుతున్నారా? సమాజంలోని పిల్లల పట్ల వారికి బాధ్యత అక్కర్లేదా?
లేజీ పేరెంటింగ్ పరిణామాలివన్నీ
ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లలు ముఖాలు ఆవేశంగా, అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి, పగలు క్లాస్‌రూమ్‌లో కునికిపాట్లు పడుతుంటారు. దీనికి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేక వీడియో గేమ్స్‌కు అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పిల్లల తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లయింట్ చేస్తుంటారు. సినిమాలు చూసి పాడయిపోతున్న మాట నిజమే.
పిల్లల ఖాళీసమయాన్ని సద్వినియోగం చేస్తే కదా! పెద్దవాళ్లను, టీచర్లను గౌరవించాలనే బుద్ధి పుట్టించే కథలను వాళ్లకు చెప్పి ఉంటే తల్లిదండ్రులను, టీచర్లను ధిక్కరించే ఆలోచనే రాదు. కథలు చెప్పే ఓపిక చాలామంది పేరెంట్స్‌కు ఉండడం లేదు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఉన్న కథలు మనకెన్నో ఉన్నాయి. కాకి నీటి కోసం కుండలో రాళ్లు వేసిన కథ. నోటిమాటతో డోర్ ఓపెన్ అయ్యే కథల్లో టెక్నాలజీ దాగి ఉంది. ఎలుకలను అమ్మే కథలో స్టార్టప్ మార్గం ఉంది. పంచతంత్ర కథల్లో లేనిదేమిటి? పిల్లల్లో ఇలాంటి అవాంఛిత ధోరణికి సినిమా అనేది ప్రత్యక్ష కారణం అయితే లేజీ పేరెంటింగ్ పరోక్ష కారణం.
– రేఖారావు, విద్యావేత్త
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment