
ఆ దృశ్యాలను ఎందుకు తొలగించరు?
సెన్సార్ బోర్డు తీరును ప్రశ్నించిన గవర్నర్ నరసింహన్
సాక్షి, అమరావతి: పలు సినిమాలు మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నా.. సెన్సార్ బోర్డు అలాంటి దృశ్యాలను ఎందుకు తొలగించడం లేదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశ్నించారు. విజయవాడ సమీపంలో ని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలకు గవర్నర్ శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలను కొందరు ఫొటోలు తీస్తున్నారని, అలాంటి వాటిని మీడియాలో చూపించడం సరికాదని, ఇలా చూపించిన మీడియాను విచారిం చే పరిస్థితి రావాలని చెప్పారు.
మహిళలపై వేధింపుల కేసులను త్వరగా పరిష్కరిం చేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. 4 వారాల్లో ఆ కేసులు పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మారిన పరిస్థితుల్లో ఏ రంగంలోనూ మహిళలకు ఇబ్బందుల్లేవని, కొన్ని సంక్లిష్టమైన సమాజాల్లో మాత్రమే మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. క్రమంగా అవి తగ్గుతున్నాయని, కానీ అలాంటి పరిస్థితులను పూర్తిగా రూపుమాపా ల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలకు ధైర్య లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, అభయ లక్ష్మి, గృహ లక్ష్మి, మహా లక్ష్మి తదితర బహురూపాలున్నాయని చెప్పిన గవర్నర్.. తన పేరు లక్ష్మీ నరసింహన్ అని చమత్కరించారు.
మహిళలు అభివృద్ధి చెందకుండా సంక్షేమం సాధ్యం కాదని, ఒక రెక్కతో పక్షి ఎగరలేదనే వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు. మహిళా సాధికారిత ఉన్న ప్రాంతాల్లోనే ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరత, స్థిరమైన శాంతి నెలకొని ఉందని చెప్పారు. అనంతరం గవర్నర్‌ను సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల సన్మానించారు. మహిళా సాధికారితపై ముద్రించిన న్యూస్ బులెటిన్‌ను గవర్నర్ ఆవిష్కరించారు.