సినిమా రక్తం | Sakshi Editorial On Cinema Violence | Sakshi
Sakshi News home page

సినిమా రక్తం

Published Mon, Dec 25 2023 4:16 AM | Last Updated on Mon, Dec 25 2023 4:16 AM

Sakshi Editorial On Cinema Violence

‘టప్‌’మంటూ లైట్‌ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్‌గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్‌లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు.

హిందీలో ‘దుష్మన్‌’ అనే సినిమా పెద్ద హిట్‌. రాజేష్‌ఖన్నా హీరో. లారీ డ్రైవర్‌. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్‌ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది.

ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్‌’గా తీస్తే హిట్‌ అయ్యింది. ఇదే రాజేష్‌ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్‌లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్‌ దక్కే అవకాశం లేదు. పోలీస్‌జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్‌’లో అమితాబ్‌ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు.

‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్‌ తీసిన బి.ఎన్‌.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్‌ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్‌ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. 

ఎన్‌.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్‌ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్‌ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్‌ నియమం ఉండేది. అంతెందుకు? 

చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్‌కు పంపితే క్లయిమాక్స్‌లో సంజీవ్‌ కుమార్‌ గబ్బర్‌ సింగ్‌ను ఎలా చంపుతాడు... సెన్సార్‌ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్‌ రీషూట్‌ చేసి గబ్బర్‌ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది?

రామ్‌గోపాల్‌ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్‌... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి.

సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్‌తోపాటు డైరెక్టర్, ఆర్ట్‌ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్‌లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్‌గన్‌లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి.

రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్‌బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి.

సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్‌ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్‌హాఫ్‌లో కాకపోతే సెకండ్‌ హాఫ్‌లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్‌’ పడవలసిందే కదా!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement