నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్‌లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్‌లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.
కళాత్మకమా? హింసాత్మకమా?
ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.
ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్‌తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్‌ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.
కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...
గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్‌గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి.
తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి.
ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్‌లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు.
విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.
మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్‌ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment