టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్‌కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty).
తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్
బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్‌లో స్టార్‌డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు.
బిగ్‌బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీ
అలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్‌కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్‌ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.
ఆడిషన్స్ ఇవ్వను
బిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్‌డ్ ట్రిప్‌ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది.
ఓపిక లేదు
హాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్‌లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది.
కుటుంబానికే ప్రథమ స్థానం
తాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..
చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్
Comments
Please login to add a commentAdd a comment