పుష్ప2 అనూహ్య విజయం తర్వత బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్, దక్షిణాది సినిమాలపై ఒక్కసారిగా ఒకరొకరుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణం... గత కొంత కాలంగా అనూహ్య స్థాయిలో టాలీవుడ్, దక్షిణాది చిత్రపరిశ్రమ ఊపిరి సలపనివ్వని రీతిలో భారతీయ బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టడం అత్యధిక శాతం మంది బాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని విషయంగా మారడం..
కొన్నేళ్లకు ముందు.. ఉత్తరాది చిత్ర పరిశ్రమ... సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కనీస స్థాయిలో కూడా గుర్తింపు లేదు.... సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి సైతం ఉత్తరాదిలో మనకు విలువ లేదని బహిరంగంగా వాపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కాస్త ఆలస్యంగానైనా బాహుబలితో మొదలైన ఊచకోత...సాహో, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కల్కి(Kalki 2898AD) ... ఇలా వరుస పెట్టి తెలుగు సినిమాలు అస్త్రశస్త్రాలతో కొనసాగిస్తూ వచ్చాయి. అయినా సరే, జవాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను చూపిస్తూ బాలీవుడ్ జబ్బలు చరుచుకుంది.
కానీ పుష్ప2(Pushpa 2) తో ఆ మిణుకు మిణుకు మంటున్న వెలుగు కూడా ఆరిపోయింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన సుకుమార్ అండ్ టీం... బాలీవుడ్ లోని అన్ని రికార్డుల్నీ ఉతికి ఆరేశారు. అత్యధిక కలెక్షన్లు సాదించిన హిందీ చిత్రం అనే రికార్డ్‌తో పాటు రేపో మాపో బాలీవుడ్‌కి తనకంటూ మిగిలిన ఏకైక దంగల్ రికార్డ్‌ను కూడా మట్టికరిపించే దిశగా దూసుకుపోతున్నారు.
దీంతోప్రస్తుతం టాలీవుడ్ విజయాల ముట్టడిలో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మిగిలిన తెలుగు సినిమాల విజయాల సంగతెలా ఉన్నా... పుష్ప 2 విజయం హిందీ చిత్రపరిశ్రమను ఉలిక్కిపడేలా చేసి బాలీవుడ్ హీరోల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా కుదుపు కుదిపింది అనేది నిజం.
‘‘మా హీరోలకు సిక్స్‌ప్యాక్స్ చూపించడం తప్ప నటించడం చేతకాదు. పుష్ప 2 లాంటి సినిమాలు తీయడం మా వల్ల కాదు’’ అంటూ బాలీవుడ్ నటి కంగన రనౌత్ వ్యాఖ్యానించడం, అల్లు అర్జున్ తనకు అభిమాన నటుడు అంటూ సాక్షాత్తూ అమితాబ్ బచ్చన్ కితాబివ్వడం... వంటివి బాలీవుడ్‌కి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు నాగవంశీ ..ప్రస్తుతం బాలీవుడ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందంటూ మూలిగే నక్కమీద తాటిపండు అది కూడా బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమక్షంలోనే వేసేశారు.
ఈ నేపధ్యంలో ఒకరొకరుగా బాలీవుడ్ చిత్ర ప్రముఖులు టాలీవుడ్‌పై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సీనియర్ నటుడు, నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి... రాకేష్ రోషన్(Rakesh Roshan) పుష్ప2 సహా దక్షిణ భారత చిత్రాల విజయం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘‘దక్షిణాది సినిమాలు చాలా గ్రౌన్దేడ్ (మూలాలకు కట్టుబడిన సాదాసీదా)గా ఉన్నాయి, అవి పాతదైన పంధాలో వెళుతూ.. పాట యాక్షన్‌డైలాగ్‌భావోద్వేగాలు... ఇలా ఏళ్లనాటి ఫార్ములా సంబంధితంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి పురోగమించడం లేదు. ఏ పాత మార్గాన్ని విచ్ఛిన్నం చేయనందున వారు విజయవంతమవుతున్నారు’’ అంటూ తీసిపారేశారు.
సింపుల్‌గా చెప్పాలంటే దక్షిణాది వాళ్లు రొడ్డకొట్టుడు కధలతోనే విజయాలు సాధిస్తున్నామని, బాలీవుడ్ మాత్రం కొత్త పంధాలో వెళుతున్నామనేది ఆయన హేళన. దీనికి ఉదాహరణ గా ... తాను కహో నా...ప్యార్ హై సినిమా చేసిన తర్వాత రొమాంటిక్ సినిమాలు తీయాలని అనుకోలేదనీ.ఆ తర్వాత తాను కోయి... మిల్ గయా చేశాననీ ఆయన గుర్తు చేశారు. ఇలా తాము సవాళ్లకు ఎదురొడ్డి సినిమాలు కొత్త పంధాలో వెళుతున్నామన్నారు.
అయితే టాలీవుడ్ తదితర సౌత్ ఇండియా వాళ్లు ఇలాంటి సవాళ్లు తీసుకోరని వారు సేఫ్ గేమ్ ఆడతారని అంటున్న ఆయన... బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప2, కల్కి, సాహో... వంటి ఒకదానికొకటి సంబందం లేని వైవిధ్యభరిత కధా నేపధ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ సాగిస్తున్న జైత్రయాత్రను చూడట్టేదనుకోవాలా? ఇది గమనిస్తున్న వాళ్లు హృతిక్ రోషన్ తండ్రి మాట్లాడుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేయగలరు అనే ఇంగితం కూడా రాకేష్‌కు లేకపోవడం దురదృష్టకరం.
Comments
Please login to add a commentAdd a comment