Satya babu
-
బుక్ సెల్ఫ్
నేడు వరల్డ్ బుక్ డే లంకంత ఇల్లు కట్టుకున్నా రాని ఆనందం లక్షణమైన లైబ్రరీని చూస్తే వస్తుంది అంటారు పుస్తక ప్రియులు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో గాలికే చోటు లేకుంటే ఇక లైబ్రరీలా..? అనే కొందరి ప్రశ్నకు అభిరుచి ఉంటే అన్నీ అవే వస్తాయి అనేది కొందరి సమాధానం. ఈ వాగ్వాదాల సంగతెలా ఉన్నా.. గృహమే కదా పుస్తక సీమ అన్నట్టు హోమ్ లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నవాళ్లు సిటీలో చాలా మందే ఉన్నారు. వారిలో ఇద్దరు నగర ప్రముఖులు పంచుకున్న తమ పుస్తక ఖజానాల పఠనాభిరుచుల విశేషాలివి.. ఇంట్రస్ట్ కొద్దీ పోగైన పుస్తకాలే లైబ్రరీని డిమాండ్ చేశాయంటారు యాడ్ కంపెనీ అధినేత , ప్రముఖ చిత్రకారుడు రమాకాంత్. ‘నా దగ్గర వేలాది పుస్తకాలున్నాయి’ అంటూ సంతోషంగా చెబుతారు. అందులో దాదాపు 80 శాతంపైగా చదివేశారు కూడా. ఆరో తరగతిలో ఉన్నప్పుడే 350 పేజీల ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ చదవడం ద్వారా చార్లెస్ డికెన్స్ వంటి గొప్ప రచయితను అవగాహన చేసుకోగలిగిన ఆయన ఆ తర్వాత ప్రతి దశలో తన పఠనాభిరుచికి పదును పెట్టుకుంటూనే వచ్చారు. ‘ఇంటర్‌లోనే ఫిలాసఫీ చదవడం మొదలుపెట్టా’నన్నారాయన నవ్వుతూ. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌లో తన భార్య సాయంతో లైబ్రరీలోని పుస్తకాలను కేటగారికల్‌గా తీర్చిదిద్దుకున్న రమాకాంత్.. కొత్తగా కట్టుకుంటున్న ఇంటిలో తొలి ప్రాధాన్యం లైబ్రరీకే ఇస్తానంటున్నారు. తానే కాదు పరిచయస్తులు ఎవరైనా సరే వచ్చి హాయిగా కొన్ని గంటల పాటు పుస్తకం చదువుకుంటూ కూర్చునేందుకు అనువుగా కొత్త ఇంట్లో ఒక పూర్తిస్థాయి హోమ్ లైబ్రరీ, రీడింగ్హాల్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. యూరోపియన్ సాహిత్యమంటే ఇష్టపడే రమాకాంత్.. తెలుగులో కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ దాకా విభిన్న శైలులున్న సుప్రసిద్ధ కవులు, రచయితల రచనలన్నీ ఓ పట్టు పట్టేశారు. రైటర్ కావాలనుకుని ఆర్టిస్ట్ అయ్యానంటున్న ఈ చిత్ర‘కాంతి’.. తన చిత్రలేఖన నైపుణ్యానికి సహజంగానే పుస్తక పఠనం దోహదపడిందని చెప్పారు. భవిష్యత్తులో రైటర్‌గా మారి తన కోరిక తీర్చుకోబోతున్న ఈ కాబోయే రచయిత.. చిత్రకళ మీదే తన తొలి రచన ఉంటుందన్నారు. సగటున రోజుకు 50 పేజీలు చదవనిదే నిద్రపోనంటున్న రమాకాంత్.. తన అభిమాన రచయితలు నగరానికి వస్తే కలవకుండా ఉండరు. దృక్పథాన్ని మార్చేసింది.. ‘చిన్నప్పుడు నా కోసం పేరెంట్స్ స్టోరీ బుక్స్ చదివేవారు. అలా నా జీవితంలో భాగమైపోయిన పుస్తకం.. నా జీవితాన్నే మార్చేసింది’ అంటారు సంధ్యారాజు. సంప్రదాయ నృత్యకారిణిగా నగరవాసులకు చిరపరిచితమైన సంధ్యారాజును బిజీ లైఫ్ నుంచి సేదతీర్చేది, పఠనంతో బిజీగా మార్చేదీ తన ఇంట్లో ఉన్న లైబ్రరీ. అమరచిత్రకథ వంటి పుస్తకాలు తన నృత్యసాధనలో సహకరిస్తే, ఇప్పుడు ఇంట్లో ఇచ్చే పార్టీలకు సైతం కొన్ని పుస్తకాలు సహకరించాయంటారు. రిచర్డ్ డాకిన్స్ రాసిన సెల్ఫిష్ బీన్.. తన జీవిత దృక్పథాన్ని అమాంతం మార్చేసిందంటూ కృతజ్ఞతగా చెబుతారు. కార్ల్ సెగాన్ రాసిన కాస్మోస్, కార్ల్ జిమ్మర్ ఎవల్యూషన్.. ఇలా లైఫ్‌ని చూసే తన వ్యూని మార్చిన పుస్తకాల జాబితాలో చేరేవి మరికొన్ని కూడా ఉన్నాయంటారామె. ‘పుస్తకాలు నాకు కాలక్షేపంగా మాత్రమే మిగిలిపోకుండా అంతకు మించినవిగా మారడానికి నేను చదివిన గొప్ప గొప్ప రచనలే కారణం’ అంటారామె. మహాభారతం, రామాయణం వంటివి అద్భుతమైన రీతిలో అందించిన మాధవ్ మీనన్ వంటి భారతీయ రచయితలూ ఆమె ఫేవరెట్ రైటర్స్‌లో ఉన్నారు. తనకే కాదు పక్షులను ఇష్టపడే తన హజ్బెండ్ కోసం, మూడేళ్ల తన కొడుక్కి కావల్సిన పుస్తకాలతో ఎప్పటికప్పుడు లైబ్రరీని అప్డేట్ చేసే సంధ్య.. లేటెస్ట్గా రిలీజైన వాటిలో బెస్ట్ సెల్లర్స్‌ను కొనడం కన్నా బాగా పాపులరైన బుక్స్‌ను తాను ఎంచుకుంటానన్నారు. ఆన్లైన్ ద్వారా కొంటే తక్కువ ధరలోనే నచ్చిన, యూజ్డ్ బుక్స్‌ను సొంతం చేసుకోవచ్చునంటూ బుక్లవర్స్కు సలహా ఇస్తున్నారు. అధికంగా చదివిన చాలా మందికి అనిపించినట్టే సంధ్యారాజు కూడా ప్రస్తుతం పుస్తకం రాయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే సహజంగానే అది నాట్యానికి సంబంధించిందే. - సత్యబాబు -
ఫిట్ టూ గేదర్
కాఫీ షాప్‌లు, క్లబ్‌లూ, పార్క్‌లూ, పబ్లూ... ఇవేనా... యువతీ యువకులు చిల్అవుట్ అవడానికి.. ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేయడానికి అంతకు మించిన హెల్దీ ప్లేస్‌లు ఏమీ లేవా? ఉన్నాయ్ అంటున్నారు సిటీ యూత్. వెల్నెస్ సెంటర్లూ, జిమ్‌లూ, ఫిట్నెస్ స్టూడియోలూ... యువతీ యువకులకు లేటెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్‌లుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ‘మాయ’ సినిమా షూటింగ్ గ్యాప్‌లో జూబ్లీహిల్స్‌లోని ఓ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న హీరో హీరోయిన్లు హర్షవర్ధన్, అవంతికా మిశ్రాలు ఫ్రెండ్షిప్నూ.. ఫిట్‌నెస్‌నూ కంబైన్డ్‌గా మనకు చూపిస్తున్నారు. మరోవైపు సరైన, నచ్చిన కంపెనీ ఉంటే వర్కవుట్స్.. మంచి రిజల్ట్స్ ఇస్తాయని ట్రైనర్లు చెబుతున్నారు. సరైన కంపెనీ ఉంటే తీరైన ఫిజిక్ ఎక్సర్సైజ్లు చేసేటైమ్లో మంచి కంపెనీ ఉండడం అవసరం. దీని వల్ల రెగ్యులారిటీ పెరుగుతుంది. ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఉత్సాహం రెట్టింపవుతుంది. ఎక్సర్సైజ్లు చేయడంలో క్వాలిటీతో పాటు టైమ్ కూడా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. అందుకే మేం కలిసి వర్కవుట్స్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తాం. - ఎమ్.శేఖర్‌రెడ్డి, హెలియోస్ జిమ్ అబ్డామినల్ వర్కవుట్కు ఆసరా... జిమ్బాల్ ఆధారంగా చేసే అబ్డామిన్ వర్కవుట్ ద్వారా పొట్ట భాగం చదునుగా మారుతుంది. అయితే తొలి దశలో ఈ వర్కవుట్ చేయడానికి మరొకరి సాయం తీసుకోవడం అవసరం. - సత్యబాబు -
పానీ.. పానీ.. పానీ..
‘ఆజ్ బ్లూ హై పానీ పానీ పానీ.. ఔర్ దిన్ బీ సాన్నీ సాన్నీ సాన్నీ’ హనీ సింగ్ స్వరాలు వింటూ యువత ‘పానీ’లో మునకలేశారు. శాటర్ డే శాటర్ డే పాటకు సండే డ్యాన్స్‌ను మిక్స్ చేశారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన ఆక్వా జుంబా క్లాస్ ఆద్యంతం ఆరోగ్యమంత్రం అన్నట్టుగా సాగింది. హోటల్ ఆవరణలోని స్విమ్మింగ్‌ఫూల్ వేదికగా సాగిన ఈ ఆరోగ్యానందాల నృత్యం అదరహో. స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈత కొట్టడం ఓ మంచి ఎక్సర్సైజ్. వర్కవుట్స్ చేయడం ఆక్వాటిక్స్. మరి నృత్యం చేస్తే..‘అదే ఆక్వా జుంబా’ అంటున్నారు నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ విజయ. ఆక్వా వర్కవుట్‌లో కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటే దీనిలో డ్యాన్స్ కూడా ఉంటుంది. సో.. ఫన్ కూడా ఎక్కువుంటుంది. జనరల్‌గా జుంబా కోసం లాటిన్ అమెరికన్ ట్రాక్స్ ఎక్కువ వినియోగిస్తాం. అయితే ఈ రోజు బాలీవుడ్, పాప్ ట్రాక్స్ పెట్టాం’ అంటూ చెప్పారామె. ఈ ఆక్వా జుంబా వర్కవుట్స్ ద్వారా గంటకు కనీసం 500 నుంచి 800 కేలరీలు ఖర్చు చేయవచ్చునని, నాన్ స్విమ్మర్లు కూడా దీనిలో పాల్గొనవచ్చునని ఆమె భరోసా ఇస్తున్నారు. ..:: ఎస్.సత్యబాబు -
గ్రీన్ ఇండోర్ (Green Indoor)
ఇపుడన్నీ ఇరుకిరుకు ఇళ్లే. ఫ్లాట్లు, మూడు, నాలుగు గదులున్న ఇళ్లు. అయితే మనసుండాలే కానీ ఇంట్లోనే పెరిగే ఇండోర్ ప్లాంట్స్‌కు ఇపుడు ఏ మాత్రం కొదవలేదని నిపుణులు చెప్తున్నారు. ఇండోర్ ప్లాంట్లలో వందల రకాల మొక్కలున్నాయి. రూ.150 మొదలుకుని రూ.1500 దాకా విభిన్న ధరల్లో ఉన్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి, అభిరుచిని బట్టి వారు ఎంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌ను కొంచెం జాగ్రత్తగా ఎంచుకుంటే అటు పచ్చదనానికి మన వంతు సాయపడడం మాత్రమే కాదు... ఇటు మన పిల్లలకు అద్భుతమైన వ్యాపకాన్ని అలవాటు చేసినట్టూ అవుతుందని నగరంలోని లోతుకుంటలో నివసించే నర్సరీ నిపుణురాలు సునీత అంటున్నారు. ఇంట్లో పెంచేందుకు అవకాశం ఉన్న కొన్ని మొక్కల రకాలివి... అగ్లోనీమా: నీడపట్టున పెరిగే ఈ మొక్కకు సరిపడా నీటిని అందిస్తే చాలు. అందంగా, రంగు రంగుల ఆకులతో పెరిగే ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. రసీనా: గ్రీన్, రెడ్... ఇలా విభిన్న రకాల రంగుల్లో ఆకులు రావడం దీని ప్రత్యేకత. దీనికి ఏ మాత్రం ఎండ అవసరం లేదు. పీస్ లిల్లీ: పెద్ద పెద్ద తెల్లని పూరేకులకు మధ్యలో జొన్న కంకి తరహాలో చారతో అందాల పత్రంలా ఉంటుందీ ఇండోర్ ప్లాంట్. వాయువుల్ని నిర్మూలించడంలో, దుమ్ముధూళిని సంహరించడంలో ఉపకరిస్తుంది. స్పాతీఫిల్లమ్: నాటిన కొద్ది రోజులకే పాము పడగ శైలిలో తెల్లని ఆకులతో విస్తరిస్తుంది. మొక్కలన్నీ హానికారక వాయువుల్ని, దుమ్ము, ధూళిని సంహరించి స్వచ్ఛమైన వాతావరణానికి దోహదం చేసే విషయంలో స్పాతీ ఫిల్లమ్ అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. మనీ ప్లాంట్: చాలా మందికి పరిచయం ఉన్న మొక్క ఇది. తక్కువ వెలుతురుతో పెరిగే ఈ ఇండోర్ ప్లాంట్ రోజురోజుకూ తీగలా అల్లుకుంటూ పెరుగుతూ అందంగా గోడల మీదో, గుమ్మానికి నలువైపులానో కొలువుదీరుతుంది. - సత్యబాబు