నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.
సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్‌చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలో పంచుకున్నారు.
ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.
‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్‌తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.
‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.
అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్.
Comments
Please login to add a commentAdd a comment