
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్‌నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.
అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్‌గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...
గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్‌కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.
అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్‌లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.
మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్‌ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్‌కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment