Satyababu
-
కిలో బియ్యం.. రూ. 2,200!
రూపాయికే కిలో బియ్యం సంగతి తెలుసు. కాని కిలో రూ.2,200కు దొరికే బియ్యం గురించి విన్నారా? పాతిక రూపాయలకు దొరికే కోలాల గురించి తెలుసు.. రూ.8 వేలు పలికే సాఫ్ట్ డ్రింక్ గురించి తెలుసా? పదో ఇరవయ్యో పెడితే పొట్ట నింపేసే రొట్టెముక్కలు చూసే ఉంటారు. కానీ రూ.300 ఖర్చు చేయించే బ్రెడ్ గురించి విన్నారా? పర్స్ వీకైనా.. స్ట్రాంగ్ బాడీ కావాలనుకునే నగరవాసులు.. డైట్ సప్లిమెంట్స్‌కు ‘రైట్ రైట్’ అంటున్నారు. దీంతో ఒకప్పుడు బాడీబిల్డర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న ఈ ఉత్పత్తులు ఇప్పుడు సిటీలో ఫిట్నెస్ ఫీవర్‌ని, ‘ప్యాక్’ ఇష్టులనూ టార్గెట్ చేస్తున్నాయి. - ఎస్.సత్యబాబు వ్యక్తి బాడీ వెయిట్లో ప్రతి కిలోకూ అవసరమైన 1.2 కి.గ్రాల ప్రొటీన్ రెగ్యులర్ ఫుడ్ ద్వారా అందకపోతే, దేహానికి అత్యంత అవసరమైన ఒమెగా 2, ఒమెగా 6 ఫ్యాట్స్ ఆహారం ద్వారా లభించకపోతే.. ఉదయపు ఎండ అందించే డి విటమిన్ సరిపడా దక్కకపోతే... సప్లిమెంట్ తప్పదు. విటమిన్లు, పోషక లోపాలను వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్స్‌తో భర్తీ చేసుకోవడం సహజమైన విషయమే. అయితే షేప్ కోసం సప్లిమెంట్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్. సప్లిమెంట్.. గిఫ్ట్ ‘ప్యాక్’ సిక్స్‌ప్యాక్ కోరుకున్నవాళ్లు తినే అన్నం, తాగే నీళ్లు సైతం నియంత్రించుకుంటున్నారు. దీంతో పోషక లోపాల భర్తీకి సప్లిమెంట్స్ తప్పడం లేదు. సాధారణ రీతిలో అయితే దాదాపు 6 నెలలు పట్టే శారీరక సామర్థ్యాన్ని వారంలోనే సంతరించుకోవడానికి వీటిపై ఆధారపడుతున్నారు. వ్యక్తికి 50 గ్రాముల ప్రొటీన్ సమకూరాలంటే కనీసం 200-300 కి.గ్రా. బాయిల్డ్ చికెన్ తినాలి. దీని కన్నా సప్లిమెంట్స్ వాడకమే తేలికని ‘ప్యాక్’ ప్రియులు భావిస్తున్నారు. ఇవి చాక్లెట్, స్ట్రాబెర్రీ, వె నీలా తదితర ఫ్లేవర్స్‌తో రుచికరంగా దొరుకుతున్నాయి కూడా. సాధనానంతరం ప్యాక్-పోషణలో కూడా సప్లిమెంట్స్ అవసరమే. మితిమీరితే...అనర్థాలే... ఈ ఆహార ప్రత్యామ్నాయాలు శరవేగంగా శక్తిని అందించినా, అలవాటైతే వదలడం అంత తేలికకాదని వైద్యులు అంటున్నారు. పరిమితికి మించిన వినియోగం హార్మోన్ల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నర్స్ను అధిక మోతాదులో వాడడం ప్రమాదకరం. వైద్య, నిపుణుల పర్యవేక్షణలో, ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పరిమిత స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాస్ట్లీ ‘ప్యాక్స్’... ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ప్రొటీన్ రైస్ క్వినోరైస్ కిలో రూ.1800. అదే ఆర్గానిక్ అయితే రూ.2200. రోజుకి 100 గ్రాములు సరిపోతుందట. ఓట్స్లా ఉండే పుష్కుష్ కిలో రూ.600 పలుకుతోంది. 20 రోజులు సరిపోయే ప్యూర్ ప్రొటీన్ టిన్ ఒక్కోటి రూ.8000 దాకా, హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ బ్రెడ్ రూ.300 ధరల్లో లభిస్తున్నాయి. కూల్‌డ్రింక్‌లా అనిపించే ప్రీ-వర్కవుట్ డ్రింక్ నైట్రిక్ ఆక్సైడ్ టిన్ రూ.4,000. పౌడర్ రూపంలోని క్రియేటిన్ ఎనర్జీ లెవల్స్‌ని శరవేగంగా పెంచుతుంది. ఇవేకాక మాస్ గెయినర్స్, వెయిట్ గెయినర్స్ కూడా లభిస్తున్నాయి. కొన్ని మాల్స్, బేకరీల్లో వెల్నెస్ స్టోర్స్‌లలోనే ఈ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. జిమ్‌లు, ఫిట్నెస్ స్టూడియోస్, స్పాలకు సప్లయర్లే సరఫరా చేస్తుంటే, బంజారాహిల్స్, పంజగుట్ట, అబిడ్స్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టోర్స్ వెలిశాయి. వీ షేప్, సిక్స్‌ప్యాక్ వంటి ప్రత్యేక లక్ష్యాలతో హెవీ వర్కవుట్స్ చేసేవారికి ఇవి అవసరమవుతాయంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్. వీటి వాడకానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరని చెబుతున్నారు. ప్రొటీన్ రొటీన్ ఇదీ... హెవీ ఎక్సర్సైజ్లకు ఆహారం ద్వారా లభించే న్యూట్రిషన్స్ సరిపోవు కాబట్టి సప్లిమెంట్స్ భాగం చేశా. మార్నింగ్ ప్రీ వర్కవుట్ డ్రింక్, వర్కవుట్ తర్వాత 2 స్కూప్స్ ప్రొటీన్ 200 మి.లీ నీటితో తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్‌గా ఎగ్‌వైట్స్, 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, లంచ్‌గా 100 గ్రా.చికెన్, క్వినో రైస్, రెండుగంటలు ఆగి ఒక ప్రొటీన్ స్కూప్, లైమ్జ్యూస్తో తీసుకుంటాను. గ్రిల్డ్ ఫిష్‌తో డిన్నర్ పూర్తి చేసి, 1 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్, నిద్రపోయే ముందు తిరిగి 1స్కూప్ ప్రొటీన్. ఇది నా రెగ్యులర్ డైట్ విత్ సప్లిమెంట్స్. - రఘు -
డస్కీ బ్యూటీ..
సిస్టరాఫ్ డిస్కోశాంతి ‘నాపేరు సుచిత్రా ఆనందన్’ అని పరిచయం చేసుకునే ఆమెని చూస్తే నిన్నటి తరం ఐటమ్ బాంబ్ డిస్కో శాంతి చెల్లెలు అని చెబితే నమ్మడం అంత సులభం కాదు. జఫా, రుషి లాంటి సినిమాల ద్వారా ఇప్పుడిప్పుడే తెరపై మెరుస్తోన్న ఈ డస్కీ బ్యూటీ రియల్ స్టార్ శ్రీహరికి స్వయానా మరదలు అనే విషయం చాలా మందికి తెలియదు. ఓ రెస్టారెంట్ ప్రారంభానికి వచ్చిన ఈ బ్లాక్ బ్యూటీని సిటీప్లస్ పలకరించింది. ఈ సందర్భంగా సుచిత్ర చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే.. - సత్యబాబు మాది పూర్తిగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అనేది తెలిసిందే కదా. నాన్న, ఇద్దరు అక్కలు.. ఇలా ఇంట్లో అంతా సినీనటులే. ఏడుగురు తోబుట్టువుల్లో ముగ్గురు ఆడపిల్లలం ఉన్నాం. నేను చివరి దాన్ని. మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేశాను. సినీరంగంపై ఎప్పుడూ ఆసక్తి లేదు. జర్నలిస్ట్ కావాలనుకున్నా. అయితే నా కలర్ నచ్చిన ఓ డీజే ఫ్రెండ్ ఫొటోగ్రాఫర్‌కి పరిచయం చేయడం, నేను మోడల్‌గా మారడం జరిగిపోయాయి. అలా పూణెలో చదువుతున్నప్పుడే, కాలేజ్ డేస్‌లోనే మోడల్నయ్యాను. చెన్నైలో వందకు పైగా మోడలింగ్ అసైన్మెంట్స్లో పాల్గొన్నాను. చెట్టినాడ్ శారీస్ వంటివి బాగా పేరు తెచ్చాయి. అయితే సినిమా రంగంలో ఈ కలర్‌కి ఇంకా అంత క్రేజ్ రాలేదనుకోండి. సిస్టర్ ఒప్పుకోలేదు.. నేను సినిమాల్లోకి రావడం శాంతికి మొదట్లో ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ టెన్త్ క్లాస్ దాటలేదు. అందుకే అందరూ నేను చదవాలని కోరుకున్నారు. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓకే అంది. చిన్నప్పుడు కొంతకాలం భరతనాట్యం నేర్చుకున్నా గానీ అక్క అంత మంచి డ్యాన్సర్‌ని కాదు. నిజానికి అక్కలా డ్యాన్స్ చేయాలంటే బాబోయ్.. చాలా కష్టం. అప్పట్లో అమీర్‌పేటలో అక్క డ్యాన్స్ స్కూల్ పెట్టింది కదా అప్పుడు కొన్ని నెలలు తన దగ్గర ట్రైనింగ్ అయ్యా. అయితే ఇటీవల కన్నడ సినిమా గణపలో ఐటమ్ సాంగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తే ఐటమ్ సాంగ్స్ చేయడానికీ అభ్యంతరం లేదు. అక్కకి తోడుగా.. ఎంతో ప్రేమించే భర్తను కోల్పోయిన అక్కకు ధైర్యం చెప్పేందుకు మా కుటుంబం అంతా చెన్నై నుంచి వచ్చేశాం. తనతోనే ఉంటున్నాం. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగించే జ్ఞాపకాలు గుర్తొస్తే చెన్నై తీసుకెళ్తున్నాం. తనకు తోడుగా ఉండాలనే కోరికతోనే సినిమా ఆఫర్లపై ఇప్పటిదాకా సీరియస్‌గా ఆలోచించలేదు. ఇక దృష్టి పెట్టాలి. జనవరిలో నేను నటించే తమిళ సినిమా ప్రారంభం అవుతోంది. నాగార్జున, కమల్, అర్జున్ వంటి సీనియర్ హీరోలతో నటించాలని ఉంది. అక్క కొడుకులు శశాంక్, మేఘాంశ్ చాలా కష్టపడుతున్నారు. సినిమాల్లో తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. శశాంక్ ఆప్పుడే షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాడు. వారిద్దరూ బావ పేరు నిలబెడతారనే విషయంలో సందేహం లేదు. -
మాట్లాడుకుందాం రా..!
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు.. ఇన్‌డెప్త్‌గా ఈ సినిమా డైలాగ్‌లో మానసిక ఆరోగ్యానికి కావాల్సినంత మెడిసిన్ దొరుకుతుంది. మంచి ఉద్యోగం.. చక్కటి సంపాదన.. కుటుంబం.. ఇన్నీ ఉన్నా చాలామంది హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కామన్‌మ్యాన్ నుంచి కరోడ్‌పతి వరకు మనసులోని బాధలకు బందీలైపోతున్నారు. ఎదను తొలిచే బాధను మొహమాటంతోనో.. ధైర్యం చాలకో.. ఇతరులతో పంచుకోకుండా అందరిలో ఉన్నా ఒంటరైపోతున్నారు. నాలుగు మాటలతో మానసిక బలాన్ని తిరిగి పొందొచ్చని చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు. ఒత్తిడిని జయించడానికి కౌన్సెలింగ్‌కు మించిన మందు లేదంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా నాలుగు మంచి మాటలు. - సత్యబాబు ఒక సమస్య తీవ్రమైన మానసిక క్షోభకు దారితీయడానికి దానిని ఇతరులతో పంచుకోకపోవడమే ప్రధాన కారణం. కుటుంబసభ్యులకో.. దగ్గరి స్నేహితుడి కో.. మీ సమస్యలు చెప్పుకుంటే.. గుండె బరువు కాస్త దిగుతుంది. అయితే ఇప్పటి బిజీ లైఫ్‌లో మనలోని బాధలు చెప్పుకునే వ్యక్తులు కనబడరు. ఒకవేళ చెప్పినా మనల్ని ఎలా అంచనా వేస్తారోనన్న భయంతో చాలా మంది సమస్యలను పెదవి దాటనివ్వడం లేదు. ఏ ఎమోషనైనా షేర్ చేసుకోవడం వల్లే మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు. రిలేషన్ బ్రేకప్స్.. చాలా వరకు తీవ్రమైన మానసిక సమస్యలకు కారణం రిలేషన్షిప్ మెయింటనెన్సే. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్.. చినికి చినికి గాలివానలా మారి తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. ఆఫీస్ టెన్షన్స్ ఇంటి కంపౌండ్లోకీ చొరబడి భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతున్నాయి. టీనేజర్స్‌లో లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్‌కు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్స్‌కు వస్తున్న వారిలో చాలా మంది లవ్ ఫెయిల్యూర్సే ఉంటున్నారు. పియర్ ప్రెషర్స్.. వేగంగా ఎదిగే అవకాశాలున్న ఐటీ వంటి రంగాల్లో పనితో పాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. మిగతావాళ్లు ఎదిగిపోతున్నారన్న కంపారిజన్ పియర్ ప్రెషర్‌కు కారణం అవుతోంది. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టొచ్చని అంటున్నారు వైద్యులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి దశలవారీగా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త డెవలప్ అయిన తర్వాత ఎలాంటి టెన్షన్ అయినా అధిగమించే శక్తి వస్తుంద ంటున్నారు. కౌన్సెలింగ్ క్యాప్సుల్... మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం నగరంలో ఎన్నో కౌన్సెలింగ్ సెంటర్లు వెలిశాయి. అలా ఏర్పా టైందే ‘సేవ’ సంస్థ. ఐటీ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న త్యాగరాజన్ ఈ సంస్థ నెలకొల్పారు. పదహారేళ్లుగా నాలుగు మాటలతో ఎందరికో ఉచితంగా మానసిక బలాన్నిస్తున్నారు. ‘పద్మారావునగర్‌లో మా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మానసిక సమస్యలతో వ్యక్తిగతంగా కలసిన వారికి ఇక్కడ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే గాంధీ ఆస్పత్రి వంటి పలు హాస్పిటల్స్‌లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామ’ని ఆయన తెలిపారు.