ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్‌లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది.
సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.
ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్
ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.
నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...
మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్‌లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment