ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్‌లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది.
సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.
నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.
నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment