దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.
నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్‌లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.
అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్‌లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది.
నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.
ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment