Periods
-
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధం
చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్‌లోని 79వ యుఎన్‌జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్‌ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు.. ఇదేమైనా సమస్యా?
నాకు 38 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు. ఇంతకుముందేమో హెవీ సైకిల్స్ ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే పీరియడ్స్ రాకపోవడం రిలీఫ్‌గానే ఉంది. కానీ మా ఫ్రెండ్సేమో ఇంత చిన్న వయసులో అలా పీరియడ్స్ ఆగిపోవడం కరెక్ట్ కాదు, డాక్టర్ని కన్సల్ట్ అవమని చెప్తున్నారు. ఇంతముందుగా మెనోపాజ్ వస్తుందా? – కె. పల్లవి, హైదరాబాద్ఎర్లీ లేదా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే 40–45 ఏళ్ల మధ్య నెలసరి పూర్తిగా ఆగిపోవడం. వీళ్లకి మెనోపాజ్ సింప్టమ్స్ అయిన హాట్ ఫ్లషెస్, చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్ వంటివీ ఉంటాయి. కానీ కొంతమందికి హఠాత్తుగా కొన్ని నెలలపాటు పీరియడ్స్ ఆగిపోతాయి. భవిష్యత్‌లో మళ్లీ స్టార్ట్ అవచ్చు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 40 ఏళ్లలోపు కనపడుతుంది.దీనిని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషన్సీ అంటారు. అంటే అండాశయాల నుంచి అండాలు విడుదల కాకుండా, బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. దీనికి సరైన కారణమేంటో తెలీదు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్తో బాధపడుతున్న వారిలోనూ కనిపిస్తుంది. జన్యుపరమైన కారణమూ ఉండొచ్చు. కొంతమందికి మంప్స్, టీబీ, మలేరియా తరువాత ఇలా పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది.మెనోపాజల్ సింప్టమ్స్తోపాటు జుట్టు ఊడిపోవడం, ఎముకలు బలహీనపడటం, బోన్ లాస్ వంటివీ ఉంటాయి. ఆస్ట్రియో పొరాసిస్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ బాడీలో ఈస్ట్రజన్ హార్మోన్స్ తగ్గటం వలన తలెత్తుతాయి. ఎప్పుడైనా వరుసగా మూడునెలలు పీరియడ్స్ మిస్ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కారణమేంటో త్వరగా కనుక్కొని వెంటనే చికిత్సను అందిస్తారు. ఒత్తిడి, డైట్లో మార్పులు, ఎక్సర్సైజ్ హాబిట్స్ వల్ల కూడా కొంత పీరియడ్ సైకిల్లో మార్పులు వస్తాయి.థైరాయిడ్, ఎఫ్ఎస్హెచ్ టెస్ట్‌లు, బోన్ స్కాన్ చేస్తారు. దేహానికి హార్మోన్స్ అవసరం చాలా ఉంటుంది. అలాంటిది చిన్న వయసులోనే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే రిస్క్ ఎక్కువవుతుంది. కాబట్టి కొంతమంది పేషంట్స్‌కి డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. 51 ఏళ్లకి సహజంగానే మెనోపాజ్ వస్తుంది కాబట్టి ఆ సమయం వరకు జాగ్రత్తగా చెకప్ చేయించుకుంటూండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
పీరియడ్స్‌లో భరించలేని నొప్పా? ఇవిగో చిట్కాలు
మహిళలు, యువతులు నెలసరి లేదా పీరియడ్ సమయంలో విపరీతమైన నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ నాలుగు రోజులు వారికి నరకం కింద లెక్కే. రక్తస్రావంకూడా ఎక్కువగానే ఉంటుంది. నొప్పి భరించలేక, ఏమీ తినలేక, నానాయాతన పడుతుంటారు. మరి కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే పీరియడ్‌కి ముందు కొన్ని వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో ఈ పెయిన్నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దామా.నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని నివారించేందుకు కొన్ని సాధారణ మందులతో పాటు, కొన్ని హోం రెమిడీస్ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే గైనకాలజిస్ట్ సలహా మేరకు కొన్ని నొప్పి నివారణ మందులు కూడా తీసుకోవచ్చు.అల్లం: పీరియడ్ క్రాంప్స్‌కు అల్లం బెస్ట్ ఆప్షన్. అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఇబ్బందిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో అల్లం రసం, కొద్దిగా తేనె కలుపుకుని ఉదయాన్నే తాగొచ్చు.పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే సహజ రసాయనం ఈ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్‌కు 7 రోజుల ముందు ,3 రోజుల తర్వాత ఒక కర్కుమిన్ క్యాప్సూల్‌ను తీసుకోవడం మంచిదని ఒక అధ్యయనంలో తేలింది. మహిళల్లో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి కర్కుమిన్ సహాయపడుతుంది. సోంపు: కాసిన్ని సోంపు గింజల్ని తిన్నా, లేదా వాటిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగొచ్చు. మొత్తం ఆహారాన్ని మానివేయడం కాకుండా, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరం తీసుకోవాలి.పండ్లు, ఆకుకూరల తోపాటు ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే నట్స్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి. ఉప్పు, కారం, షుగర్, మద్యం, కార్బోనేటేడ్ పానీయాలు, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.ఉపశమనంపొత్తికడుపుమీద వేడినీటితో లేదా హీటింగ్ ప్యాడ్‌తో కాపడం పెట్టుకుంటే కండరాలు వదులై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మసాజ్ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని రకాల యోగాసనాలను అలవాటు చేసుకుంటే ఫలితముంటుంది. -
Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు?
ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే సంస్థలు స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి మహిళలు ఏమంటున్నారు?సుజన సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఉదయం నుంచి పొత్తి కడుపులో నొప్పి, కూర్చోవడానికి వీలుకానంతగా నడుం నొప్పి. ప్రతి నెలా ఉండే సమస్యే ఇది. ఈ నెల మరీ ఎక్కువగా బాధిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు సెలవు పెట్టడానికి వీలు లేదని ఆఫీసులో ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధను పంటి బిగువున భరిస్తూనే ఆఫీసుకు బయల్దేరింది.మేరీ ప్రైమరీ స్కూల్ టీచర్. పిల్లలతో కలిసిపోతూ రోజంతా యాక్టివ్‌గా ఉండాలి. నెలసరి సమయం దగ్గర పడుతుందంటేనే లోలోపల భయపడుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు, అధిక రక్తస్రావం సమస్యతో ప్రతీసారీ ఇబ్బందే.కరుణ బట్టల షోరూమ్‌లో పనిచేస్తోంది. రోజంతా షాప్‌లో నిల్చొనే ఉండాలి. సేల్ సీజన్ కావడంతో సెలవులు పెట్టడానికి వీల్లేదని మేనేజర్ ముందే చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం. కానీ, నెలసరి సమయంలో విశ్రాంతి లేకుండా పని చేయడం అంటే మరింత అలసట కమ్ముకొచ్చేస్తుంది. నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. నెలసరి సెలవులు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా? అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతారా? నెలసరి అవసరం గురించి మహిళలు స్పందన.అవసరం ఉన్నవారికే!దాదాపు తొంభై శాతం మందిలో ఒకేలాంటి సమస్య ఉండదు. కాబట్టి అందరికీ సెలవు అవసరం లేదు. నెలసరి సమయంలోనూ సమస్యలేమీ లేకపోతే సెలవు ఎందుకు తీసుకోవాలి? పైగా పని పట్ల ఇష్టం ఉన్న నాకు లీవ్ తీసుకొని ఇంటి వద్ద ఉండటం బోర్ అనిపిస్తుంది. అందుకే సమస్య ఉన్నవారు, మెడికేషన్‌లో ఉన్నవారు డాక్టర్ ప్రిస్కిప్షన్‌తో లీవ్ తీసుకోవచ్చు. స్కూల్ టైమ్‌లో నెలసరి వస్తే ఇంటికి వెళ్లే వీలు ఉండదు. çస్కూల్లోనే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారు లీవ్ తీసుకుంటే సరిపోతుంది. – మృణాళిని, టీచర్ఉపయోగకరమైనదే! మహిళ ఇంటిని, ఆఫీస్ పనినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది. అయితే, పీరియడ్ సమయంలో అందరికీ అన్ని వేళలా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎవరికైతే అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, మైగ్రెయిన్, వాంతులు... వంటి సమస్యలు ఉంటాయో వారికి విశ్రాంతి అవసరం అవుతుంది. భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఎలాగూ పని మీద దృష్టి పెట్టలేరు. సమస్య ఉన్నవారికి సెలవు ఇవ్వడం మంచిదే. ఎందుకంటే నెలసరి నొప్పి భరించలేక ఉద్యోగాలు మానేసినవారూ ఉన్నారు. కొందరు ఉద్యోగినులు హెల్త్ చెకప్‌కి లీవ్ దొరకడం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి ఈ లీవ్ అవకాశం ఉపయోగపడుతుంది. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్విశ్రాంతి అవసరమే!మహిళలు కూర్చుని చేసే ఉద్యోగాల్లో సాధారణంగా నడుం నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో ఆ తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది. కానీ, మాకు కేటాయించిన పనిని మరొకరికి అప్పగించలేం. సెలవు పెడితే పనిభారం పెరుగుతుందని భయం. అదీ సమస్యే. పిరియడ్ లీవ్ తప్పనిసరి చేస్తేæ వర్క్‌లోడ్ పెరగడం, ప్రమోషన్స్‌పై ప్రభావం చూపడం జరగవచ్చు. మా ఆఫీసులో వాష్‌రూమ్‌లలో ΄్యాడ్స్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకొని, పనులను యధావిధిగా చేస్తుంటాం. పిరియడ్ లీవ్ అనేది అందరికీ అవసరం కాదు. సమస్య ఉన్నవారు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకోవచ్చు. – ఎస్.కె.బాజి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్– నిర్మలా రెడ్డి -
రొటీన్ చెకప్ స్కాన్‌లో రెండు ఓవరీస్‌లో సిస్ట్స్ ఉన్నాయి... ఏం చేయాలి?
నాకు 45 ఏళ్లు. రొటీన్ చెకప్ స్కాన్‌లో రెండు ఓవరీస్‌లో 3 సెం.మీ, 5 సెం.మీ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని భయంగా ఉంది. – రుబీనా, గాజులరామారంఆ వయసులో చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఓవరీస్‌లో సిస్ట్స్ ఫామ్ కావచ్చు. ఆ ఏజ్‌లో అంటే మెనోపాజ్‌కి ముందు క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ. సింపుల్ సిస్ట్స్ అయితే అసలు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆ సిస్ట్స్ 5 సెం.మీ కన్నా ఎక్కువుంటే చిన్న కీహోల్ సర్జరీ ద్వారా సిస్ట్ని మాత్రమే తీసేసి టెస్టింగ్‌కి పంపిస్తారు. ఓవరీస్ నుంచి 2– 3 సెం.మీ సైజులో ప్రతినెలా అండాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు ఇంకాస్త పెద్ద సైజులో కూడా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.3 సెం.మీ కంటే ఎక్కువ ఉంటేనే సిస్ట్ అంటాము. ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటాయి. అవి సింపుల్ సిస్ట్స్. కొంతమందికి బ్లడ్ ఫిల్ అయిన సిస్ట్స్ ఉంటాయి. వాటిని ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ అంటారు. డెర్మాయిడ్ సిస్ట్‌లో ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. మీరు ఇంటర్నల్ పెల్విస్ స్కాన్ చేయించుకోండి. అందులో సిస్ట్ సైజ్, దాని తీరు స్పష్టంగా తెలుస్తాయి. ఏ సింప్టమ్ లేకుండా ఈ సిస్ట్స్ చాలామందిలో స్కానింగ్‌లోనే తెలుస్తాయి. అప్పుడు వాటి నేచర్‌ని బట్టి సైజ్‌ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. పదిలో ఒకరికి మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది.కొంతమందికి కింది పొట్టలో నొప్పి, లైంగికంగా కలసినప్పుడు నొప్పి, యూరినరీ ప్రాబ్లమ్స్, మోషన్ డిఫికల్టీస్ ఉండవచ్చు. అలాంటి వారికి వెంటనే కొన్ని రక్తపరీక్షలు చెయ్యాలి. ఫ్యామిలీ హిస్టరీని కూడా డీటేయిల్డ్‌గా తీసుకుంటారు. సిస్ట్ వల్ల సమస్య ఉందని తేలితే క్లోజ్ ఫాలో అప్‌లో డాక్టర్ మీకు విషయాన్ని వివరిస్తారు. చాలా సిస్ట్‌లకు వెయిట్ అండ్ వాచ్ పాలసీయే సూచిస్తారు. మీకున్న సింప్టమ్స్, బ్లడ్ రిపోర్ట్స్, సైజ్‌ని బట్టి ఎంత తరచుగా స్కాన్స్ ద్వారా రీచెక్ చెయ్యాలో చెప్తారు. సిస్ట్ సైజ్ 5–7 సెం.మీ ఉన్నప్పుడు ఏడాదికి ఫాలో అప్ ఉంటుంది. ఏడాదికి మళ్లీ స్కాన్ చేయించుకోమని సూచిస్తారు. 7 సెం.మీ కన్నా ఎక్కువ ఉంటే ఎమ్మారై స్కాన్ చేయించుకోమంటారు. ఈ దశలో సర్జరీని సజెస్ట్ చేస్తారు.మీ వయసుకి ఓవరీస్ని పూర్తిగా తీసేయడం మంచిది కాదు. 50–52 ఏళ్ల వరకు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ చాలా అవసరం. అందుకే లాపరోస్కోపీ ద్వారా కేవలం సిస్ట్ని మాత్రమే తీసేస్తారు. ఒకవేళ ఆ సిస్ట్ మెలికపడి పక్కనున్న బవెల్, బ్లాడర్ మీదికి స్ప్రెడ్ అయిన కొన్ని అరుదైన కేసెస్‌లో ఓవరీస్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. మీరొకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. ఇంటర్నల్ స్కాన్ చేసి డీటేయిల్డ్‌గా చూస్తారు.ఇవి చదవండి: స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా? -
స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా?
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ పెయిన్ సివియర్‌గా ఉంటోంది. స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. వీటివల్ల ప్రమాదమేమైనా ఉంటుందా? – కునాలిక, వైజాగ్ఇవి కొన్నిసార్లు గర్భసంచి పొరలోని టిష్యూ పెల్విస్‌లో ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా మీద పెరుగుతాయి. పీరియడ్స్ టైమ్‌లో గర్భసంచిలో బ్లీడింగ్ అయినట్టే వేరేచోట కూడా బ్లీడ్ అయ్యి సిస్ట్స్ పెయిన్ వేస్తాయి. పీరియడ్స్‌లో పొట్టలో నొప్పి, యూరిన్‌లో, మోషన్లో లోయర్ బాడీ అంతా నొప్పి ఉండొచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణమేమీ లేదు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్స్‌కి సంబంధించిన కారణాలు ఉంటాయి.ఇవి పదిమందిలో ఒకరికి ఉంటాయి. ఎమ్మారై స్కాన్‌లో కన్ఫర్మ్గా ఇది ఎండోమెట్రియాసిస్ అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్‌ని వాడాల్సి వస్తుంది. పారాసిటమాల్, ట్రామడాల్ లాంటివి బాగా పనిచేస్తాయి. మీ ఏజ్ గ్రూప్ వారికి హార్మోన్ పిల్స్ బాగా పెయిన్ రిలీఫ్‌ని ఇస్తాయి. ఇవి ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ లేదా చాకొలేట్ సిస్ట్స్‌ని కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి. కంబైన్డ్ ఓరల్ కంట్రాసెప్టివ్ పిల్స్‌ని క్రమం తప్పకుండా నెలంతా వేసుకోవాలి.ఈ మాత్రలతో వికారం, తలనొప్పి వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. 3 నుంచి 6 నెలల్లో మినిమమ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాకొలేట్ సిస్ట్స్ సైజ్ 5 సెం.మీ కన్నా ఎక్కువున్నా, హార్మోన్స్ పనిచేయకపోయినా లాపరోస్కోపీ సర్జరీ సూచిస్తారు. ఈ సిస్ట్స్‌ని తీసేసిన తరువాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవుతుంది. కానీ రికరెన్స్ అంటే మళ్లీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. క్లోజ్ ఫాలో అప్ స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో కావాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.కొంతమందికి GnRH analogue ఇంజెక్షన్స్ ఇస్తారు. సర్జరీ తరువాత కూడా కొందరికి వీటిని సజెస్ట్ చేస్తారు. లాపరోస్కోపీ సర్జరీలో సిస్ట్స్‌ని తొలగించి.. ఏమైనా ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఉంటే వాటిని కూడా fulgurate చేస్తే పెల్విక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు క్లోజ్ ఫాలో అప్‌లో ఉండాలి.ఇవి చదవండి: ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా? -
ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. మక్కాలో చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ మాసం భారత్‌లో ఎప్పుడూ ప్రారంభమవుతుందనేది నిర్ణయిస్తారు ముస్లీం మత పెద్దలు. నెలవంక ఆకారంలో ఉండే చంద్రుడు ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం దర్శనం ఇచ్చింది. కాబట్టి మార్చి 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది మన దేశంలో ఇవాళ(మార్చి 12వ తేదీ (మంగళవారం)) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఎలా జరుపుకుంటారంటే.. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఈ నెలల్లో ముస్లీంలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్, ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్ అంటే తెల్లవారుజామున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉపవాస దీక్ష విరమించుకునే రోజు సాయంత్రం తమ కుటుంబం\ సభ్యులను బంధువులను పిలచుకుని ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటవి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం.. ఈ ఉపవాస సమయాలు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఉపవాస సమయం వ్యవధి చాలా విభిన్నంగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి నార్వేలోని ఓస్లోలో ముస్లింలు దాదాపు 15 గంటల 15 నిమిషాల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అదే లండన్‌లో దాదాపు 14 గంటల 11 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారని స్టాటిస్లా నివేదిక పేర్కొంది. ఇక జకర్తాలో ఉపవాసం నిడివి సుమారు 13 గంటల నుంచి 13 నిమిషాలు ఉంటుందని స్టాటిస్లా నివేదిక అంచనా వేసింది. #Ramadan starts on Sunday evening, with the first day of fasting on Monday, March 11 this year. While the number of days of Ramadan are equal for all Muslims observing it around the world, the length of the daily fast is not. — Statista (@StatistaCharts) March 8, 2024 (చదవండి: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం!) -
‘నెలసరి విషయం వారికి ఎందుకు తెలియాలి?’
ఢిల్లీ: నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అని.. అదేం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్‌లో మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెలసరి సమయంలో ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో పలువురు మహిళా నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన నెలసరి విషయం ఉద్యోగం చేసే చోటు సదరు సంస్థల యాజమనులకు ఎందుకు తెలియాలి? అని అన్నారు. ఇది మహిళలకు కొంత అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవుపై ఒక తప్పనిసరి విధానం తీసుకురాలేదని వెల్లడించారు. ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్న ఉద్యోగిని తాను ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే.. తాను వేధింపులను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. అధికారికంగా పెయిడ్ లీవ్ మంజూరు చేస్తే.. ఈ విషయాన్ని సంస్థల్లో హెచ్ఆర్, అకౌంట్స్ వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. అలా పలు సంస్థల్లో పని చేసే చోట తెలియకుండానే మహిళలపై ఒక వివక్షను పెంచినవాళ్లము అవుతుమని తెలిపారు. అయితే తాను పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం సంబంధించి ప్రశ్న మరోకటిని వెల్లడించారు. ఆ రోజు ఎంపీ మనోజ్ ఝా LGBTQIA+ కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా పీరియడ్ సెలవు విధానం ఉందా? అని అడిగారని తెలిపారు. గార్భాశయం లేని ఏ స్వలింగ సంపర్కుడికి రుత చక్రం ఉంటుంది? అని తాను చెసిన వ్యాఖ్యలపై మరోవిధంగా వ్యాప్తి చెంది వివాదం రేగిందని చెప్పారు. మరోవైపు మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. చదవండి: ధన్‌ఖడ్‌పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా? -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్‌గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్‌లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
హాట్‌టాపిక్‌గా 'పీరియడ్ లీవ్'! 'మాకొద్దు' అని వ్యతిరేకించటానికి రీజన్!
ప్రస్తుతం దేశంలో 'పీరియడ్ లీవ్' గురించే ప్రముఖులు, సెలబ్రెటీలు చర్చిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇది ఒక హాట్‌టాపిక్‌గా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అందరూ ముక్తకంఠంతో పీరియడ్ లీవ్‌ని వ్యతిరేకించడమే ఆసక్తికరంగా మారింది. దీనికి సెలబ్రెటీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. ఎందుకిలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ "పీరియడ్ లీవ్" అవసరమా? లేదా ఎందుకు వద్దు..? తదితరాల గురించే ఈ కథనం!. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్ సెలవు అంశమై నివేదిక కూడా పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ. అందుల్ల ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. WCD Minister @smritiirani sums it up perfectly - "Menstruation is not a handicap!" Menstrual leave demand by pseudo-feminists will infact put females at a disadvantage as compared to a males. As a woman, I personally don't expect any special treatment. Gender equality, please! pic.twitter.com/14NYcwZFMs — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) December 14, 2023 ఈ అంశంపై సోమవారం పార్లమెంట్లో నివేదక కూడా పెట్టారు. దీంతో బుధవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు మనోజ్ ఝా ఎగువ సభలో రుతుక్రమ పరిశుభ్రత విధానంపై, సెలవులపై ప్రశ్నలు లేవనెత్తడంతో స్మృతి ఈ విధంగా స్పందించారు. ఐతే ఇప్పటి వరకు పిరియడ్ సెలవులు తప్పనసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. స్మతీ ఇరానీ మాత్రం ఈ సెలవులను వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం పోరాడి కష్టపడి సంపాదించకున్న సమానత్వాన్ని విలువ ఉండదని అన్నారు. అంతేగాదు దీన్ని ప్రత్యేక నిబంధనలు అవసరమయ్యే వికలాంగులు కోణంలో పరిగణించకూడదని చెప్పారు. ఐతే కొద్దిమంది మహిళలు మాత్రమే ఈ టైంలో డిస్మెనోరియా వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని, వీటిని చాలా వరకు మందుల ద్వారా నయంచేసుకోవచ్చని అన్నారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు కూడా చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో, 10 నుంచి 19 ఏళ్లలోపు యుక్తవయస్సులో ఉన్న బాలికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న 'ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ (MHM)' పథకం గురించి కూడా ప్రస్తావించారు. అందరూ ఈ పీరియడ్స్‌ని సాధారణ దృక్పథంతో చూస్తే చాలు అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. స్మృతి అభిప్రాయంతో పలువురు సెలబ్రెటీ మహిళలు ఏకీభవించి మద్దతు పలకడం విశేషం. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చ We have fought for centuries for equal opportunities & women's rights and now, fighting for period leave might set back the hard-earned equality. Imagine employers factoring in 12-24 fewer working days for female candidates. A better solution? Supporting work from home for… — Ghazal Alagh (@GhazalAlagh) December 14, 2023 మహిళ చేయలేనిది ఏదీ లేదు..! ప్రముఖ బ్యూటీ బ్రాండ్ మామా ఎర్త్ సహ వ్యవస్థాపకుడు గజల్ అలగ్ మాట్లాడుతూ..స్మృతి పీరియడ్ లీవ్‌కి బదులుగా మెరుగైన పరిష్కారం సూచించారని ప్రసంసించారు. మహిళలు తాము ఏ పనై అయినా చేయగలమని నిరూపించారు. ఈ ఒక్క కారణంతో వారి సమానాత్వపు హక్కులను కాలరాయకూడదన్న ఆలోచన బాగుందని అన్నారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం స్మృతికి మద్దతు తెలిపారు. మానవజాతి చరిత్రలో ఒక్క పని కూడా చేయని మహిళ లేదు. పిల్లలను పెంచడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అన్నిపనులు చేస్తూనే ఉన్నారు. ఈ పీరియడ్స్ అనేది జస్ట్ శరీరంలో వచ్చే ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితే తప్ప అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు అవసరం లేదంటూ స్మృతి అభిప్రాయంతో ఏకీభవించారు కంగనా. సరికొత్త మార్పు.. ఇదంతా చూస్తుంటే మహిళా సాధికారతకు అసైలన అర్థం ఏంటో చెప్పారు. మాకు దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు. సాటి మనుషులుగా ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు తప్ప మాకదంతా అవసరంలేదని మహిళ ఆత్మివిశ్వాసాన్ని, ఔన్యత్యాన్ని చాటి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పురిటినిప్పిని పంటి కింద భరించగలిగే శక్తి ఉన్న స్త్రీకి ఇది ఒక లెక్క కాదు అని తేల్చి చెప్పింది. విమన్ పవర్ ఏంటో? వారి పంచ్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కదా. ద టీజ్ విమెన్ అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ఈ పేరుతో మా అవకాశాలను లాక్కొవద్దని, తాము ఎందులోనూ తక్కువ కాదు జస్ట్ ప్రకృతి సిద్ధంగా వచ్చే చిన్న ప్రక్రియ అని అందరూ తెలుసుకోండి తామెంటో చూపిస్తామని సగర్వంగా చెబుతున్నారు మహిళామణులు. -
కలబందతో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ..ఆ సమస్యలకు చెక్
పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్లో ప్యాడ్‌మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం. మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానీటరీ న్యాప్కిన్స్ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్‌ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్‌గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు. -
నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్ ఉంటే?
నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్‌గానే వస్తోంది. రొటీన్ స్కాన్‌లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? – సీహెచ్. కాత్యాయిని, విజయవాడ ఒవేరియన్ సిస్ట్లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్‌లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు. నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్‌లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్‌ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్‌ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్ రావడం లేదు కారణం?
మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. కారణం ఏంటంటారు? – వి. భావన, ఖమ్మం రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్‌లో చాలామందికి బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. అధి బీఎమ్ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్.. సిస్ట్లు వంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం. పీరియడ్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్ వంటి పెయిన్ రిలీఫ్ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒకసారి స్కాన్ చేసి సిస్ట్స్ ఏమైనా ఉన్నా అని చెక్ చేస్తాం. రెండు .. మూడు నెలలు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కావచ్చు. దీనికి ఒకసారి యూరిన్ .. థైరాయిడ్ టెస్ట్స్ చేస్తాం. నెలసరి 21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్ హార్మోన్స్ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్ని మేనేజ్ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది. నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్ ఫ్లషెస్ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్నేట్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? – గీత కురువెళ్లి, బెంగళూరు మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఆర్టీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్‌ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గినందువల్ల స్కిన్ చెంజెస్, వెజైనల్ డ్రైనెస్, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇష్యస్ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం. ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్‌గా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ , ఆండ్రోజెన్ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్ సింప్టమ్స్ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్ ఫ్లషెస్.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసి .. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్‌తో సింప్టమ్స్ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్‌కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్‌గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్‌కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
పీరియడ్స్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
పూర్వం 15 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్లు కాబట్టి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని ఆ సమయంలో నేతితో తయారు చేసిన స్వీట్లు ఎక్కువగా తినిపించేవాళ్లు. నిజానికి రజస్వల అయినప్పుడే కాదు, ఏ వయసు పిల్లలకయినా స్వీట్లు, నేతి పదార్థాలు ఎక్కువగా పెట్టకూడదు. పైగా రజస్వల అయిన పిల్లలను కొద్దికాలం పాటు ఇంటికే పరిమితం చేస్తారు కాబట్టి పిల్లలు ఆ కొద్దిరోజుల్లో విపరీతంగా బరువు పెరగటంతో పాటు ఆ ఆహార శైలికి అలవాటు పడి అలాగే కొనసాగుతారు. అధిక బరువు వల్ల హర్మోన్లలో అవకతవకలు మొదలవుతాయి. ఇది ప్రమాదకరం.రజస్వల సమయంలో హార్మోన్ల స్రావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రక్తస్రావం ఎక్కువగా ఉండి ఐరన్ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా ఇవ్వాలి. క్యాల్షియం, విటమిన్ డి లోపాలు రాకుండా పాలు ఇవ్వడంతో పాటు వేరుసెనగ పప్పు, బెల్లం, ఖర్జూరాలు, పప్పులు, అటుకులు, రాగులు, నువ్వులతో తయారుచేసిన చిరుతిళ్లు తినిపించాలి. -
పీరియడ్ లీవ్స్ కొరకు పిల్.. తిరస్కరణ
ఢిల్లీ: విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో ఋతుస్రావ సమయంలో.. సెలవులు మంజూరుచేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది తమ పరిధిలోని అంశం కాదంటూనే.. పిటిషనర్‌కు కీలక సూచన చేసింది ధర్మాసనం. ఇది మా పరిధిలోని అంశం కాదు. విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. కాబట్టి, పిటిషనర్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించడం సముచితంగా ఉంటుంది అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి నెలా మహిళా ఉద్యోగులకు ఋతు నొప్పి సెలవులు(పీరియడ్స్ లీవ్) మంజూరు చేయాలని కంపెనీలు/యజమానులపై ఒత్తిడి చేస్తే.. అది ఉద్యోగ నియామకాల్లో తీవ్ర ప్రభావం చూపెడుతుందని పిల్‌ను వ్యతిరేకించిన న్యాయవాది(లా స్టూడెంట్ ఒకరు) బెంచ్ ముందు వాదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిల్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా పిటిషనర్ కొన్ని కీలకాంశాలను లేవనెత్తారని.. కాకపోతే ఇది విధానాల రూపకల్పనకు సంబంధించి కావడంతో.. పిల్‌పై విచారణ ముందుకు సాగించలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి.. లాయర్ విశాల్ తివారీ ద్వారా ఈ పిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అన్ని రాష్ట్రాలు పాటించేలా కేంద్రం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని పిటిషనర్ కోరారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, స్పెయిన్(మూడు రోజులు.. వీలును బట్టి ఐదు రోజులకు కూడా పొడిగించొచ్చు), జాంబియా.. ఇలా చాలా దేశాల్లో పీరియడ్స్ లీవ్‌లను మంజూర చేస్తున్నారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961 ప్రకారం.. మహిళలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పెయిడ్ లీవ్ పొందే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి గర్భం దాల్చిన సమయంలో. అందునా.. ఆ నిబంధనల పర్యవేక్షణ కోసం సెక్షన్ 14 ప్రకారం ఒక ఇన్స్పెక్టర్ నియమించాల్సి ఉంటుంది కూడా. అయితే.. కేంద్ర ప్రభుత్వం అలాంటి పర్యవేక్షకులను ఇంతదాకా నియమించలేదు అని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాదు దేశంలో బీహార్ రాష్ట్రం మాత్రమే 1992 నుంచి రుతుస్రావ సమయంలో ప్రత్యేక సెలవులను రెండురోజులపాటు మంజూరు చేస్తూ వస్తోందని సదరు పిటిషనర్ బెంచ్‌కు తెలిపారు. అలాగే జొమాటో, బైజూస్, స్విగ్గీ కూడా పెయిడ్ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వికిపీడియా సమాచారం ప్రకారం.. కేరళ ప్రాంతంలో 1912 సంవత్సరంలో ఓ బాలికల పాఠశాలకు పీరియడ్స్ లీవ్స్ మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అంతేకాదు.. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కూడా. -
కరోనాతో ముందస్తు రజస్వల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ముందస్తు రజస్వల అవడానికి కూడా దారి తీస్తోందన్న దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా బయట పడింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. సాధారణంగా బాలికలు 13 నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, 8 ఏళ్ల బాలికలు సైతం ఉదంతాలు బయటపడ్డాయి. ‘‘ఒకమ్మాయి నా దగ్గరికొచ్చింది. ఆమె వయసు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలలు. అప్పుడే íపీరియడ్స్ మొదలయ్యాయి’’ అని ఢిల్లీలోని ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మన్‌ప్రీత్ సేథీ చెప్పారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10 వరకూ వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయని వెల్లడించారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. కారణమేమిటి?: ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం కోవిడ్–19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితయ్యారు. విద్యార్థులకు ఆటపాటలు కూడా లేవు. నెలల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితంగా వారిలో జీవక్రియలు(మెటబాలిజం) ప్రభావితమయ్యాయి. మన మెదడు మన శరీరం ఎత్తును పరిగణనలోకి తీసుకోదు. బరువును మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయి. ఇందులో హార్మోన్ల స్థాయి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటే ముందుస్తు రజస్వలను అరికట్టవచ్చని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. -
మన గడ్డపై 2,300 ఏళ్లనాటి టెర్రకోట బొమ్మ!
సాక్షి, హైదరాబాద్: సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల కంటే ముందు రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బొమ్మ తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డలో లభించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మను బుద్ధుడి కథల్లో ప్రాధాన్య మున్న బౌద్ధ హారీతి విగ్రహంగా భావిస్తున్నట్టు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. అన్నింటికన్నా ప్రాచీనమైనది తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో శాతవాహన కాలానికి చెందిన వస్తువులు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. కానీ, అంతకన్నా ముందునాటి.. అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే పాతవి బయటపడటం, అవి పాడైపోకుండా ఉండటం అత్యంత అరుదు. ఇప్పుడలాంటి బొమ్మ ఒకటి లభించింది. చేర్యాల పట్టణం శతాబ్దాల క్రితం మరోచోట విలసిల్లింది. ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయి పాటిగడ్డ దిబ్బగా మారింది. ఇప్పుడా దిబ్బగర్భంలో అలనాటి వస్తువులు బయటపడు తున్నాయి. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీనివాస్ సేకరించిన కొన్ని వస్తువుల్లో ఈ టెర్రకోట బొమ్మ కూడా లభించింది. బొమ్మ తల భాగంలో జుట్టును అలంకరించిన తీరు ఆధారంగా ఇది మౌర్యుల కాలం ముగిసిన సమయంలో క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిందిగా చరిత్ర పరిశో ధకుడు ఈమని శివనాగిరెడ్డి సహకారంతో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగో పాల్ పేర్కొ న్నారు. తలపై ప్రత్యేక అలంకారం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడు మున మేఖలతో ఉన్న ఈ శిల్పం అమ్మదేవతగా భావించే బౌద్ధ హారీతిదై ఉంటుందని చెప్పారు. గతంలో కొండాపూర్, పెద్దబొంకూరు, కోటలింగాలలో లభించిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఇది పోలిఉందన్నారు. మేలురకం బంకమట్టితో బొమ్మచేసి కొలిమిలో కాల్చిన తర్వాత దానికి ఎరుపురంగు అద్దినట్టుందని, శతాబ్దాల పాటు మట్టిలో కూరుకుపోయి ఉండటంతో ఏమాత్రం ధ్వంసం కాకుండా, ఇప్పటికీ కొత్తదానిలా ఉందని వివరించారు. దారం వడికే మట్టికుదురు, మట్టితో చేసి, మంటల్లో కాల్చి రూపొందించిన టెర్రకోట పూసలు దారం వడికే మట్టికదురు.. టెర్రకోట బొమ్మతోపాటు శాతవాహన కాలానికి చెందిన, ఉన్ని దారం వడికే మట్టి కదురు బిళ్ల కూడా లభించింది. బిళ్లకు రెండువైపులా ఉబ్బెత్తుగా ఉండి, మధ్యలో రంధ్రం ఉందని, ఆ రంధ్రం గుండా పొడవాటి కర్ర పుల్లను ఉంచి ఉన్ని దారం వడికేందుకు వినియోగించేవారని హరగోపాల్ తెలిపారు. బంగారం, వెండి, రాగి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరుధూపం వేసే మట్టిపాత్ర, మట్టి కంచుడు, టెర్రకోట పూసలు, చనుముక్కు గొట్టం, ఆకుల డిజైన్ ఉన్న పెంకులు లభించాయన్నారు. (చదవండి: ‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!) -
పీరియడ్ ప్రొడక్టులు ఫ్రీగా అందిస్తున్న తొలి దేశం
పీరియడ్ పావర్టీ.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఆర్థికంతో ముడిపడిన విషయం కావడంతో.. చాలామంది పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు.. అసలు వాటి గురించి అవగాహన, మాట్లాడేందుకు మొహమాటం ప్రదర్శించే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహిళలకు నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే రుతుక్రమ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తున్న తొలి ప్రపంచ దేశంగా నిలిచింది స్కాట్లాండ్. ఎడిన్బర్గ్: అవును.. యూరోపియన్ దేశం స్కాట్లాండ్ ఇవాళ్టి(ఆగష్టు 15వ తేదీ) నుంచి దేశం మొత్తం పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే ఈ చర్యకు ఉపక్రమించిన తొలి దేశంగా నిలిచింది. ఈ మేరకు ముందస్తుగా ఆదివారమే ఓ ప్రకటన చేసింది స్కాట్లాండ్ ప్రభుత్వం. స్కాట్లాండ్ ఉచిత పీరియడ్ ప్రొడక్ట్స్ చట్టం 2020లోనే తెర మీదకు వచ్చింది. శానిటరీ ఉత్పత్తులతో పాటు టాంపన్స్, శానిటరీ ప్యాడ్స్‌ను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 2020లో స్కాటిష్ పార్లమెంట్ ఏకగ్రీవంగా చట్టానికి ఆమోదం కూడా వేసింది. అయితే.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు ఇప్పటికే అందించబడ్డాయి, అయితే ఇప్పుడు బిల్లు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత మంత్రులకు ఇచ్చింది. తద్వారా దేశంలో శానిటరీ ఉత్పత్తులు ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఈ చట్టం అంత ఈజీగా ఆచరణలోకి రాలేదు. చాలా పోరాటాలే జరిగాయి. ఉచిత పీరియడ్ ఉత్పత్తులకు ప్రాప్యతను అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించింది. వాటిని మహిళలు అంగీకరించడం ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది అని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్ చెప్తున్నారు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజలు కష్టతరమైన ఎంపికలు చేస్తున్న సమయంలో.. ఇది(ఈ సమస్య) గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. ఇదీ చదవండి: బుజ్జి బుల్లిపిట్ట.. కానీ, నిలువెల్లా విషమే! -
Health: అయిదేళ్లుగా తీవ్ర వేదన.. హెవీ పీరియడ్స్.. పరిష్కారం?
Gynaecology Counselling: నాకు 40 సంవత్సరాలు. అయిదేళ్లుగా హెవీ పీరియడ్స్ అవుతున్నాయి. చాలా మందులు వాడాను. యుటెరస్‌లో ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఈ మధ్యే ఒక సీనియర్ డాక్టర్ Mirena Coil సజెస్ట్ చేశారు. ఇది సురక్షితమైనదేనా? వేయించుకోవచ్చా? గర్భసంచి తీయించుకోవడమొక్కటే బెస్ట్ ట్రీట్మెంట్ అని కొంతమంది చెప్పారు. నా సమస్యను అర్థం చేసుకొని సలహా ఇవ్వగలరు. – కె. నీలిమ, మిర్యాలగూడ Mirena అనేది లూప్ లాంటిది. ఈ మధ్య చాలామందికి వేస్తున్నాం. హెవీ పీరియడ్స్‌కి బాగా పనిచేస్తుంది. ఇది కాపర్టీ డివైస్ లాంటిది. కాకపోతే దీనిలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ పూత ఉంటుంది. అది రోజూ కొంచెం కొంచెంగా హార్మోన్‌ను విడుదల చేసి గర్భసంచి పొరను పల్చగా ఉంచుతుంది. దీంతో అధిక రక్తస్రావం తగ్గుతుంది. ఈ Mirena వేసిన 3–6 నెలల తర్వాత నెలసరి పెయిన్, రక్తస్రావం చాలా వరకు తగ్గుతాయి. దీన్ని గర్భసంచిలో అమర్చిన తర్వాత అయిదేళ్ల వరకు పనిచేస్తుంది. ఇది మీకు సరిపడుతుంతో లేదో అనేది వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారిస్తారు. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. అయిదేళ్ల తర్వాత తీసేసి.. మళ్లీ కొత్తది వేస్తారు. మామూలు గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే ఈ ప్రొసీజర్ చేస్తారు. దీనికి మత్తు అవసరం లేదు. అల్ట్రాసౌండ్‌లో గర్భసంచి ఎలా ఉందో చెక్ చేసి.. నెలసరి అయిపోయిన మొదటివారంలో వేస్తారు. దీనితో ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇది కాంట్రాసెప్టివ్లా కూడా పనిచేస్తుంది. ఇంటర్‌కోర్స్‌లో ఏ ఇబ్బందీ కలిగించదు. హార్మోన్స్ లోపం వల్ల హెవీ పీరియడ్స్ అవుతుంటే ఈ Mirena చాలా బాగా పనిచేస్తుంది. 35 – 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఇది మంచి ఆప్షన్. గర్భసంచి తీసేయడాన్ని నివారించొచ్చు. హిస్టెరెక్టమీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్‌ను ఈ Mirena మూలంగా తప్పించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
Health Tips: మెనుస్ట్రువల్ క్రాంప్స్.. ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ వల్ల..
What Is Menstrual Cramps: యువతులకు నెలసరి ఎంతోకొంత ఇబ్బందికరమైనదే. ఒకవేళ దాంతోపాటు మెనుస్ట్రువల్ క్రాంప్స్ గనక తోడైతే మరెంతో బాధకారం. ఉన్న ఇబ్బందికి తోడు, బాధ, వీపు, పొత్తికడుపు భాగాల్లో కండరాలు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పితో చెప్పుకోలేని విధంగా వేదనకు గురవుతుంటారు. ఇటీవలే చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ జెంగ్ క్విన్వెన్, న్యూజీలాండ్‌కు చెందిన గోల్ఫ్ ప్లేయర్ లైడియా కో వంటి క్రీడాకారిణులు ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడ్డారు. జెంగ్ క్విన్వెన్ అయితే... ‘‘నేనో యువకుణ్ణయితే బాగుండేదేమో’’ అని కూడా వ్యాఖ్యానించింది. చాలామంది యువతులను బాధపెట్టే ఈ ‘మెనుస్ట్రువల్ క్రాంప్స్’పై అవగాహన కోసం ఈ కథనం. ఓ బాలిక యుక్తవయస్కురాలయ్యాక దాదాపు మొదటి ఏడాదీ, రెండేళ్లు లేదా ఒక్కోసారి మొదటిబిడ్డ పుట్టే వరకు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో డిస్మెనూరియా అని పిలిచే ఈ సమస్య వల్ల... నొప్పితో పాటు పొత్తికడుపు, వీపు కింది భాగం కండరాలు కదలనివ్వనంతగా బిగుసుకుపోయి ఇబ్బంది పెడతాయి. ఈ ఇబ్బంది ఎంతగా ఉంటుందంటే... ఆ రోజుల్లో వారి జీవననాణ్యత పూర్తిగా దెబ్బతినడంతో... ప్రతినెలా వారి అమూల్యమైన రోజుల్లో కొన్ని ఈ బాధల వల్లనే పూర్తిగా వృథా అవుతాయి. ఎందుకిలా జరుగుతుంది...? ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలంటే... ముందుగా నెలసరి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మహిళల్లో ప్రతినెలా ఒక అండం విడుదలవుతుంది. ఒకవేళ అది ఫలదీకరణ చెందితే... దాని ఎదుగుదలకు తోడ్పడేందుకు గర్భసంచిలో ఎండోమెట్రియమ్ అనే పొర మందంగా మారుతుంది. ఒకవేళ అండం ఫలదీకరణ చెంది పిండంగా మారితే... మందంగా మారిన ఈ ఎండోమెట్రియమ్ పొరలోనే అది ఎదుగుతుంది. ఫలదీకరణం జరగనప్పుడు... ఈ పొర రాలిపోతుంది. అలా ఇది ఊడి బయటకు వచ్చే సమయంలో రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో ఈ పొర ఊడిపోయేందుకు వీలుగా బిగుసుకుపోయేందుకు ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ లాంటి జీవరసాయనం కారణమవుతుంది. ఇదే యువతుల్లో తీవ్రమైన నొప్పి, బాధతో పాటు కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ పుట్టేలా (ట్రిగర్) చేస్తుంది. ఫలితంగా చుట్టుపక్కల కండరాలూ బిగుసుకుపోయి తీవ్రమైన బాధకు గురిచేస్తాయి. అందుకే రుతుస్రావం సమయంలో ఈ బాధ, నొప్పి, కండరాల బిగుతు అన్నమాట. పై సమస్యతో మాత్రమే కాకుండా మెనుస్ట్రువల్ క్రాంప్స్‌కు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు... ►ఎండోమెట్రియాసిస్ : ఎండోమెట్రియమ్ అనే పొరకు కలిగే ఇన్ఫ్లమేషన్ వల్ల. ►యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ : యుటెరస్‌లో పుట్టే కొన్ని క్యాన్సర్ రకానికి చెందని (నాన్క్యాన్సరస్) గడ్డల వంటి వాటి వల్ల. ►అడెనోమయోసిస్ : యుటెరస్ చుట్టూ న్న పొర పొరుగున ఉన్న ఇతర కండరాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల. ►పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ : ఏవైనా కారణాల వల్ల మహిళల్లో పునరుత్పత్తికి చెందిన అవయవాలకు హానికరమైన బ్యాక్టీరియా సోకడం వల్ల వచ్చే జబ్బుల కారణంగా. ►సర్వైకల్ స్టెనోసిస్ : కొంతమంది మహిళల్లో వారి గర్భాశయ ముఖద్వారం ఎంత సన్నగా ఉంటుందంటే... అది రుతుస్రావాలను, రక్తస్రావాలను సాఫీగా పోనివ్వదు. దాంతో వ్యర్థాలు అక్కడ పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. ఎప్పుడు సాధారణం... ఎప్పుడెప్పుడు హానికరం... ►సాధారణంగా మెనుస్ట్రువల్ క్రాంప్స్ వల్ల ఆరోగ్యానికీ లేదా ఇతరత్రా ఎలాంటి హానీ, ముప్పూ ఉండవు. తీవ్రమైన బాధ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీటిపై సీరియస్‌గా దృష్టిసారించాల్సి ఉంటుంది. అదెప్పుడంటే... ►30 ఏళ్లు పైబడ్డాకా ఈ సమస్య వస్తుంటే. ►పదకొండు లేదా అంతకంటే చిన్న వయసులోనే యుక్తవయస్కురాలైతే. ∙ïపీరియడ్స్ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటే (మెనొరేజియా) ►రక్తస్రావం/రుతుస్రావం ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా అవుతుంటే (మెట్రోరేజియా) ∙కుటుంబంలో మెనుస్ట్రువల్ క్రాంప్స్ (డిస్మెనూరియా) ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంటే. ఏదైనా ప్రమాదమా : ఈ నొప్పి వల్ల ఎలాంటి పనులూ చేయలేకపోవడం, యుక్తవయసులోని పిల్లలు స్కూల్/కాలేజీకి వెళ్లలేకపోవడం, యువతులు ఆఫీసుకు వెళ్లడం కష్టమై... వారి పనులకు అంతరాయం కలగడం వంటి సాధారణ సమస్యలే తప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ►అయితే కొన్ని సందర్భాల్లో అంటే... అధికరక్తస్రావం లేదా సంతానలేమి వంటి సమస్యలతో పాటు ఈ కండిషన్ కూడా ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ►ఉదాహరణకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ దెబ్బతినడం, ఫలదీకరణం చెందిన అండం గర్భసంచి (యుటెరస్)లో చక్కగా ఒదగలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అవి మినహా మరే రకమైన ఇబ్బందీ ఉండదు. చాలా సందర్భాల్లో వయసు పెరగుతుండటంతోనూ, బిడ్డ పుట్టిన తర్వాతనో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. ఇవీ లక్షణాలు ►నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, బాధ. ►పొత్తికడుపులో ఎంతో ఒత్తిడి ఉన్న ఫీలింగ్. ►వీపు వెనక, నడుము, తొడ భాగంలో తీవ్రమైన నొప్పి (పొత్తికడుపు నుంచి బయలుదేరే ఇదే నొప్పి రేడియేటింగ్ పెయిన్ రూపంలో ఈ భాగాలకు విస్తరిస్తుంటుంది. ►కడుపులో వికారంగా ఉండటం. ఒక్కోసారి వాంతులు కావడం. ►కొంతమందిలో నీళ్లవిరేచనాలు, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చికిత్స : అయితే చికిత్సలోనూ నేరుగా మందులు వాడకుండా కొన్ని ప్రత్యామ్నాయ ప్రక్రియలు అవలంబిస్తారు. ఉదాహరణకు తొలుత... ►వ్యాయామం (ఎక్సర్సైజ్) హీట్ థెరపీ వార్మ్ బాత్ మసాజ్ కంటినిండా తగినంత నిద్ర ద్యానం, యోగా వంటి ప్రక్రియలతో చాలావరకు ఉపశమనం ఉంటుంది. వీటితోనూ తగినంత ఫలితం లేనప్పుడు కొన్ని నొప్పి నివారణ మందులు, హార్మోన్ ట్యాబ్లెట్లు, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటం వంటివి. ►ఒకవేళ ఈ సమస్యతో పాటు ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ఎడినోమయోసిస్ (గర్భసంచి పొర దాని తాలుకు కండరాల్లోకి లోపలికి పెరగడం) వంటి సమస్యలు ఉంటే నొప్పికి వాడే మందులతో పాటు అరుదుగా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. పరీక్షలు : సాధారణ నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి, క్రాంప్స్ సమస్యకు ఉపశమనం దొరకకపోతే అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్స్ పరీక్ష అవసరం కావచ్చు. ఈ సమస్యకు అరుదుగా లాపరోస్కోపీ అవసరం కావచ్చు. సూచన... నిర్దిష్టంగా నివారణ పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికీ... యువతులు రుతుస్రావం సమయంలో తాము కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యేందుకు ఐరన్ పుష్కలంగా ఉండే ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఖర్జూరాలు, పల్టీపట్టి (చిక్కీ) వంటి తినే పదార్థాలు తింటూ, ఖనిజలవణాలు భర్తీ అయ్యేందుకు ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం చాలావరకు మేలు చేస్తుంది. -డాక్టర్ శిరీష ప్రమథ, సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్