బయాలజీ పీరియడ్ | special story to womens Periods | Sakshi
Sakshi News home page

బయాలజీ పీరియడ్

Published Tue, Oct 31 2017 12:23 AM | Last Updated on Tue, Oct 31 2017 10:36 AM

special  story to  womens Periods

కరకు సమాజం! రుతుచక్రం అనే చట్రంలో అమ్మాయిల్ని బిగించి కదలకుండా చేస్తోంది. నెలనెలా కష్టం. ఆ కష్టాన్ని దాచలేకపోతే పరువు నష్టం! అదొక బాధ.. ఇదొక బాధ. ఇంట్లో అమ్మ ఉంటుంది. కసరకుండా చెప్పొచ్చు కదా. స్కూల్లో బయాలజీ పీరియడ్‌ ఉంటుంది. ‘పీరియడ్స్‌ బయాలజీ’ ఏంటో.. టీచరమ్మ చెప్పొచ్చుకదా! కాన్‌ట్‌ వియ్‌ సెన్సిటైజ్‌ ది సొసైటీ? కరకు సమాజాన్ని సున్నితంగా మార్చలేమా? ‘మరక మామూలే’ అనే ఫీలింగ్‌ని ఆడపిల్లల్లో కలిగించలేమా?!
స్వేచ్ఛగా వాళ్లను ఎదగనివ్వలేమా?

‘‘అలేఖ్యా ... అలేఖ్యా... ఏమైంది నాన్నా.. ఒక్కసారి తలుపు తెరువమ్మా...’’ గాబరా, కంగారుగా కూతురి గది తలుపు తడుతోంది శ్రీవల్లి. టైమ్‌ కాని టైమ్‌లో స్కూల్‌ నుంచి వచ్చి నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది పిల్ల.  ఉలుకులేదు పలుకులేదు.. అలికిడి అసలే లేదు. ఏమైందో తెలియదు. అరగంట నుంచి గది తలుపు కొడుతూనే ఉంది. లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. చివరిసారిగా ఒకసారి ప్రయత్నించి తలుపు తెరవకపోతే భర్తకు ఫోన్‌ చేద్దామని నిర్ణయించుకొని తలుపు కొట్టింది శ్రీవల్లి. తలుపు తెరిచి ‘మమ్మీ’ అంటూ తల్లిని చుట్టేసుకొని ఏడ్వసాగింది అలేఖ్య.బిడ్డ ప్రవర్తన అయోమయంలో పడేసింది  శ్రీవల్లిని. అమ్మాయిని అలాగే పొదివి పట్టుకొని మంచం మీద కూర్చోబెడుతూ.. ‘‘ ఏమైందమ్మా.. చెప్పూ..’’ లాలనగా అడిగింది తల్లి. ఆ ఆర్తికి కరిగిపోయిన అలేఖ్య.. తల్లిని మరింత గట్టిగా వాటేసుకొని ఇంకొంత లోతుగా ఏడ్వడం మొదలుపెట్టింది. ‘‘ఎందుకేడుస్తున్నావ్‌? స్కూల్లో ఎవరేమైనా అన్నారా? ఫ్రెండ్స్‌తో గొడవ అయిందా?’’  అనునయిస్తూ అడిగింది శ్రీవల్లి.అమ్మను అలాగే పట్టుకొని కాదన్నట్టుగా అడ్డంగా తలూపింది.

‘‘మరి ఏమైంది తల్లీ...’’  అని కాసేపు ఆగి ‘‘టీచర్స్‌ ఏమైనా అన్నారా?... కంప్లయింట్‌ చేశారా?’’ అడిగింది. ఆ మాటతో తల్లి నుంచి వేరుపడి కళ్లు తుడుచుకుంది. అర్థమైంది తల్లికి.. పిల్ల ఏదో చేసుంటది.. టీచర్స్‌ చీవాట్లు పెట్టుంటారు అని. ‘‘మమ్మీ...’’ అంటూ బేలగా తల్లి వంక చూసింది.‘‘ఊ...చెప్పు’’ అంటూ మొహం మీదకు వచ్చిన బిడ్డ జుత్తును ఆప్యాయంగా వెనక్కి తోస్తూ అంది శ్రీవల్లి.మరక మంచిది కాదు‘‘నిన్న ఈవినింగ్‌ మనింట్లో అన్నయ్యవాళ్ల ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటుంటే.. నేను చూసుకోలేదు.. ’’ అంటూ ఆగిపోయింది అలేఖ్య.‘‘నీ స్కర్ట్‌ చూసి నానమ్మ కేకలేసింది అందరి ముందు. ‘ఈడొచ్చిన పిల్లవి.. అంత అజాగ్రత్త అయితే ఎలా? చూసుకోవద్దూ.. అయినా మగపిల్లలతో ఆ యికయికలు పకపకలు ఏంటి? ఒళ్లు తెలియనిఆ చేష్టలేంటి? అని చీవాట్లేసింది.. కదా..’ అని కూతురు చెప్పబోయేదాన్ని పూర్తి చేసింది శ్రీవల్లి.మౌనంగా తల్లి వంకే చూస్తూ అంతలోకే ఏదో చెప్పబోతుంటే... కూతురిని ఆగమన్నట్లు కుడి అరచేయి పైకెత్తి.. తను కొనసాగించింది శ్రీవల్లి.. ‘‘నానమ్మ చెప్పింది నీకు తప్పనిపించి ఉండొచ్చు.. నువ్వు బాధపడుండొచ్చు. కాని.. నాన్నమ్మ నీ మంచికే చెప్పింది. వయసొచ్చిన  ఆడపిల్ల పొందిగ్గా ఉండాలి.  ఆ టైమ్‌లో మరీ. ఇంకొకరితో చెప్పించుకునేలా ఉండకూడదు. ఎంత సిగ్గు? నీ స్కర్ట్‌ మీద మరక పడిందన్న విషయం కూడా గ్రహించకుండా అంతమంది మగపిల్లల మధ్య ఆడుతూనే ఉన్నావ్‌. అసలు మా చిన్నప్పుడైతే బయటకే వెళ్లనిచ్చేవాళ్లు కాదు. దూరంగా కూర్చోబెట్టేవారు. ఇప్పుడు నీకు ఆ బాధ లేదు. జాగ్రత్తగా మసలు కోవాలన్న కనీస జ్ఞానమన్నా ఉండాలి కదా!’’ అంది కాస్త గట్టిగానే.

నిస్సహాయంగా తల్లివంకే చూస్తూ ఉండిపోయింది అలేఖ్య. స్కూల్లో జరిగిన విషయం చెప్పీ వేస్ట్‌ అనుకుంది. ఆ పిల్ల మెదడు సరిగ్గా ఈ మాటను స్థిరపర్చుకుంటుండగానే  అడిగింది తల్లి.. ‘‘ఇంతకీ స్కూల్లో ఏం జరిగింది?ఎందుకలా  మధ్యలోనే వచ్చేశావ్‌?’’  అసలు విషయం గుర్తొచ్చినట్టు అడిగేసింది శ్రీవల్లి. ఏమీ కాలేదన్నట్టు తలూపింది అలేఖ్య.‘‘ఏం కాకపోతే ఎందుకొచ్చేశావ్‌? ఏదో జరిగి ఉంటుంది.. చెప్పు’’ తీవ్రంగా వినిపించింది శ్రీవల్లి స్వరం. చెబితే ఊరట కన్నా చీవాట్లు తథ్యమన్న నిశ్చయాన్ని ఇచ్చింది ఆ తీవ్రత. అందుకే మౌనం వహించింది అలేఖ్య. కూతురు అలా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం చిరాకు తెప్పించింది శ్రీవల్లికి. ‘‘నువ్‌ చెప్పకపోతే స్కూల్‌కి కాల్‌ చేసి కనుక్కుంటా’’ బెదిరించింది కూతురిని.  ‘‘మమ్మీ..’’ భయంతో అలేఖ్య. ‘‘ఊ.. చెప్పు.. నువ్వంతలా బాధపడుతున్న విషయమేంటో నాకు తెలియాలిగా..’’ గట్టిగానే  అంది అమ్మ. చెప్పక తప్పదని తెలుసుకుంది కూతురు.

‘‘నిన్నటిలాగే ఈ రోజూ స్కర్ట్‌కి.... ’’ అని ఆగింది. తల్లి మొహంలో భావాలు గమనించకూడదని తల దించుకుంది. ‘‘నేను చూసుకోలేదు మమ్మీ.. సోషల్‌ టీచర్‌ పిలిచి క్లాస్‌లో అందరి ముందూ ఇన్‌సల్టింగ్‌గా మాట్లాడింది. నిన్న నానమ్మ మాట్లాడినట్టుగానే. నిజంగా నాకు తెలియలేదు మమ్మీ.. తెలిస్తే ఎందుకు చూసుకోను? అదేదో నా మిస్టేక్‌ అయినట్టు.. చాలా ఘోరం చేసినట్టు... తిట్టింది. ‘మీ మమ్మీ ఏం నేర్పలేదా? ఇలాగేనా ఆడపిల్లల్ని స్కూల్‌కి పంపేది? ఇంత స్పృహ తెలియకుండా ఎలా పెరిగావ్‌? మగపిల్లల మధ్య ఎలా ఉండాలి? నైన్త్‌క్లాస్‌కొచ్చావ్‌.. ఇలాంటివి బయటపెట్టుకోకుండా.. గుంభనంగా ఎలా ఉండాలో  తెలియదా? ఎందుకు ఏళ్లొచ్చి?ఛీ.. ఛీ. నీట్‌గా ఉండడం చేతకాకపోతే ఆ మూడు రోజులూ స్కూల్‌కి రాకు. సెలవు తీసుకో. అంతేకాని వచ్చి ఇలా ఆడవాళ్ల పరువు తీయకు అంటూ’ ఇంకా ఏవేవో అన్నది మమ్మీ. అందులో కొన్ని మాటలు నాకసలు అర్థం కాలేదు!’’ అంటూ చేతుల్లో ముఖం దాచుకొని మళ్లీ ఏడ్వసాగింది.అలేఖ్య అనుకున్నట్టుగానే.. భయపడినట్టుగానే శ్రీవల్లి మొహం రంగు మారింది, ఎర్రబడింది. అత్తయ్య చెప్పినట్టే చేసింది.. సోయిలేని పిల్ల బయటకు వెళ్లి పరువు తీసింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. బిడ్డ చెంప చెళ్లుమనిపించింది శ్రీవల్లి.దెబ్బకు బిత్తర పోయింది అలేఖ్య. ‘‘సారీ.. మమ్మీ.. ఇంకోసారి ఎప్పుడూ ఇలా జరగదు. ఆ స్కర్ట్‌ నేనే ఉతుక్కుంటా. లోపలే ఆరేస్తా. అండర్‌ వేర్స్‌ కూడా’’ అమాయకంగా సంజాయిషీ ఇవ్వసాగింది.‘‘చెప్తూనే ఉన్నాం ఇంట్లో.. జాగ్రత్త జాగ్రత్త అని. పరువు తీశావ్‌ కదే! మగపిల్లల మధ్య చదువుకుంటున్నావ్‌.. రేపు ఆ పిల్లల మధ్యకు ఏ మొహం పెట్టుకుని వెళ్తావ్‌? నీతోటి అమ్మాయిలంతా ఇలాగే ఉంటున్నారా? చెప్తే వినవు... కనీసం చూసి తెలుసుకోవాలన్న ఇంగితం కూడా లేదా? నీతోపాటు నన్నూ ఇన్‌సల్ట్‌ చేశావ్‌’’ అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయింది శ్రీవల్లి.

చచ్చిపోతే సమస్యేలేదు
తన తప్పేంటో.. ఇంట్లో, స్కూల్లో ఎందుకు ఈ పెద్దాళ్లు.. తనను దోషిగా చూస్తున్నారో.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. బయటపడి తనను ఎందుకు చివాట్లు పెట్టిస్తోందో.. అర్థంకాలేదు అలేఖ్యకు.
నానమ్మ, టీచర్, అమ్మ.. మాటలకు చచ్చిపోవాలనిపిస్తోంది ఆ పిల్లకు. కుమిలి కుమిలి ఏడుస్తోంది.‘‘మగపిల్లల మధ్య చదువుకుంటున్నావ్‌.. రేపు ఆ పిల్లల మధ్యకు ఏ మొహం పెట్టుకొని వెళ్తావ్‌?’’ అన్న తల్లి మాటలు పదేపదే జ్ఞప్తికొస్తున్నాయ్‌. ‘‘అవును.. ఏ మొహం పెట్టుకొని వెళ్తుంది. అందుకే చచ్చిపోతే వెళ్లాల్సిన అవసరం ఉండదు. మమ్మీని ఇన్‌సల్ట్‌ చేసే పరిస్థితీ రాదు.. తను చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్‌ అవుతుంది’’ మనసులో నిర్ణయం తీసుకుంది. తల పంకించి లేచి వెళ్లి మళ్లీ గది తలుపేసుకుంది అలేఖ్య.

టీచర్‌ అవమానపరిచిందని..
ఈ యేడు ఆగస్ట్‌ నెలలో తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని ఓ ఊళ్లో ఏడో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి 25 అడుగుల ఎత్తున్న భవంతి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు.. రుతు సమయంలో ఉన్న తనను దానికి సంబంధించి టీచర్‌ అందరిముందు అవమానపరచడమే కాక టార్చర్‌ పెట్టిందని.. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని  సూసైడ్‌ నోట్‌ పెట్టి మరీ చనిపోయింది ఆ అమ్మాయి. ఈ వార్త దేశంలో సంచలనం రేపింది. రుతుచక్రం, దాని సమస్యల విషయంలో మనం ఎంత అజ్ఞానంలో, ఇంకెంత అంధవిశ్వాసాల్లో కూరుకుపోయామో అన్న నిజానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇదొక్కటే కాదు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో. అజ్ఞానంలోంచి దేశాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన నేతలు కూడా ‘రుతుచక్రం స్త్రీల శరీరాలను మలినపరుస్తుంది’ అని పబ్లిక్‌ స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ ప్రజలను మరింత మూఢత్వంలోకి నెట్టుతున్నారు.  కేరళకు చెందిన ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పై కామెంట్‌ చేసి తన మూర్ఖత్వాన్ని చాటుకున్నారు.

అవమానం కాదు.. ఆరోగ్యకరం
రుతుచక్రం.. ప్రతి ఆడపిల్ల జీవితంలో సంభవించే ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఈ ప్రకృతి ధర్మాన్ని అవమానకర విషయంగా, దాన్ని దాచి ఉంచాలనే ధోరణిలో పిల్లలకు చెప్పడం తప్పు. అలాగని అదే పనిగా దాని గురించి పబ్లిక్‌గా మాట్లాడాలని కాదు. అదొక రిప్రొడక్టివ్‌ ఇష్యూ అని, ఆ సమయంలో ఎలా ఉండాలి? శుభ్రత ఎలా పాటించాలో నేర్పాలి. అవగాహన కల్పించాలి. అంతేకాని సిగ్గుపడాల్సిన విషయంగా పిల్లలను అనవసర భయాందోళనల్లోకి నెట్టకూడదు. సైన్స్, ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా వివరించాలి. ఆడపిల్లలకే కాదు... మగపిల్లలకూ ఈ విషయం అవగతమయ్యేలా చెప్పాలి. పైన కేస్‌ స్టడీలో అలేఖ్యకు ఎదురైనట్టు స్కూల్లో కాని, బయటకు వెళ్లినప్పుడు కాని లేదా ఇంట్లో అయినా సరే ఏ ఆడపిల్లకైనా ఎదురైతే తిట్టడం, నవ్వడం, గుసగులాడ్డం లాంటివి చేయకూడదు. పెద్దవాళ్లుగా మనం.. ఇది చాలా సహజం.. ఏం పర్లేదు అని చెప్పాలి. అవమానిస్తే సున్నితమైన మనసున్న అమ్మాయిలు ఆత్మహత్యల దాకా వెళ్తారు. కాబట్టి మన ప్రవర్తన సహజంగా ఉండాలి. పిల్లల్నీ సహజంగానే పెంచాలి.
 – డాక్టర్‌ పద్మ పాల్వాయి చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌  
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement