ఆ పుండుకు ఎన్నో కారణాలు...
నా వయసు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ట్యూబెక్టమీ అయిపోయింది. నాకు ఈమధ్య కొద్దికాలంగా పీరియడ్స్ ముగిశాక, అప్పుడప్పుడూ కొంచెం స్పాటింగ్ అవుతోంది. కొన్నిసార్లు కలయిక తర్వాత కూడా కనిపిస్తోంది. డాక్టర్‌ని సంప్రదిస్తే గర్భాశయ ముఖద్వారానికి పుండు ఏర్పడిందని అన్నారు. మందులు రాసిచ్చారు. అవి వాడి రెండు వారాల తర్వాత రమ్మన్నారు. పుండు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని తెలిసిన వారు భయపెడుతున్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- కల్పన, పాలకొల్లు
గర్భసంచి ముఖద్వారానికి పుండు అంటే సర్వైకల్ ఎరోజన్ అయి ఉండవచ్చు. అంటే అక్కడ ఉండే స్క్వామస్ ఎపిథీలియల్ పొర దెబ్బతిని దాని కింద ఉండే కాలమ్నార్ ఎపిథీలియల్ పొర, దాని రక్తనాళాలు బయటకు ఎర్రగా కనిపించడాన్ని సర్వైకల్ ఎరోజన్ ఉంటారు. కాలమ్నార్ ఎపిథీలియమ్‌లో మ్యూకస్ గ్రంథులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి నీళ్లలాగా వైట్‌డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. అక్కడ లోపలి పొర, అక్కడి రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటంతో ఏదైనా దెబ్బతగలడం వల్ల ఎర్రగా కందిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా స్క్వామస్ ఎపిథీలియల్ పొర దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫెక్షన్లు, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఎక్కువ మోతాదులో వెలువడటం, ఎక్కువకాలంపాటు గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల ఇలా జరగవచ్చు. ఇంకా ఎన్నో తెలియని కారణాలు కూడా ఉండవచ్చు. కొంతమందిలో సాధారణ కాన్పుల తర్వాత గర్భాశయ ముఖద్వారం దెబ్బతిని పుండు ఏర్పడవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే, పచ్చిగా ఉన్న పుండు వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి అంటే గర్భాశయంలోకి, అక్కడినుంచి పొత్తికడుపులోకి పాకి, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి వంటి ఇతర సమస్యలు రావచ్చు. పుండు ఉన్న ప్రాంతంలోని రక్తనాళాల మీద ఒత్తిడి పడటం వల్ల అప్పుడప్పుడూ స్పాటింగ్ కనిపించవచ్చు. ఇది చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్‌గా మారుతుంది. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్‌లోని ఆరంభదశలో పుండు కూడా ఒక భాగం. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అన్ని పుండ్లూ క్యాన్సర్ కాదు.
పుండు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేక క్యాన్సర్ వల్లనా అనేది నిర్ధారణ చేయడానికి పాప్‌స్మియర్ అనే చిన్న స్క్రీనింగ్ పరీక్ష చేయించడం తప్పనిసరి. ఈ పరీక్షలో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే సర్వైకల్ బయాప్సీ చేసి అది ఎటువంటిదో నిర్ధారణ చేసుకోవాలి. పాప్‌స్మియర్ రిపోర్టులో అది కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే అని వస్తే, దానికి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. భయపడనవసరం లేదు. కొంతమందిలో ఇది దానంతట అదే తగ్గిపోతుంది కూడా. మరికొంతమందిలో మందులు, ఇంజెక్షన్లతో నయం అవుతుంది. కాకపోతే క్రయోకాటరీ (ఐస్ ట్రీట్‌మెంట్) లేదా ఎలక్ట్రోకాటరీ వంటి చికిత్సలతో దీన్ని నయం చేయవచ్చు.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్,
మోతీనగర్, హైదరాబాద్
గైనకాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 16 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement