Tyubektami
-
గైనకాలజీ కౌన్సెలింగ్
ఆ పుండుకు ఎన్నో కారణాలు... నా వయసు 30 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ట్యూబెక్టమీ అయిపోయింది. నాకు ఈమధ్య కొద్దికాలంగా పీరియడ్స్ ముగిశాక, అప్పుడప్పుడూ కొంచెం స్పాటింగ్ అవుతోంది. కొన్నిసార్లు కలయిక తర్వాత కూడా కనిపిస్తోంది. డాక్టర్ని సంప్రదిస్తే గర్భాశయ ముఖద్వారానికి పుండు ఏర్పడిందని అన్నారు. మందులు రాసిచ్చారు. అవి వాడి రెండు వారాల తర్వాత రమ్మన్నారు. పుండు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని తెలిసిన వారు భయపెడుతున్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - కల్పన, పాలకొల్లు గర్భసంచి ముఖద్వారానికి పుండు అంటే సర్వైకల్ ఎరోజన్ అయి ఉండవచ్చు. అంటే అక్కడ ఉండే స్క్వామస్ ఎపిథీలియల్ పొర దెబ్బతిని దాని కింద ఉండే కాలమ్నార్ ఎపిథీలియల్ పొర, దాని రక్తనాళాలు బయటకు ఎర్రగా కనిపించడాన్ని సర్వైకల్ ఎరోజన్ ఉంటారు. కాలమ్నార్ ఎపిథీలియమ్లో మ్యూకస్ గ్రంథులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి నీళ్లలాగా వైట్‌డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. అక్కడ లోపలి పొర, అక్కడి రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటంతో ఏదైనా దెబ్బతగలడం వల్ల ఎర్రగా కందిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా స్క్వామస్ ఎపిథీలియల్ పొర దెబ్బతినడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫెక్షన్లు, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఎక్కువ మోతాదులో వెలువడటం, ఎక్కువకాలంపాటు గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల ఇలా జరగవచ్చు. ఇంకా ఎన్నో తెలియని కారణాలు కూడా ఉండవచ్చు. కొంతమందిలో సాధారణ కాన్పుల తర్వాత గర్భాశయ ముఖద్వారం దెబ్బతిని పుండు ఏర్పడవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే, పచ్చిగా ఉన్న పుండు వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి అంటే గర్భాశయంలోకి, అక్కడినుంచి పొత్తికడుపులోకి పాకి, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి వంటి ఇతర సమస్యలు రావచ్చు. పుండు ఉన్న ప్రాంతంలోని రక్తనాళాల మీద ఒత్తిడి పడటం వల్ల అప్పుడప్పుడూ స్పాటింగ్ కనిపించవచ్చు. ఇది చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్‌గా మారుతుంది. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్‌లోని ఆరంభదశలో పుండు కూడా ఒక భాగం. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అన్ని పుండ్లూ క్యాన్సర్ కాదు. పుండు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేక క్యాన్సర్ వల్లనా అనేది నిర్ధారణ చేయడానికి పాప్‌స్మియర్ అనే చిన్న స్క్రీనింగ్ పరీక్ష చేయించడం తప్పనిసరి. ఈ పరీక్షలో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే సర్వైకల్ బయాప్సీ చేసి అది ఎటువంటిదో నిర్ధారణ చేసుకోవాలి. పాప్‌స్మియర్ రిపోర్టులో అది కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే అని వస్తే, దానికి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. భయపడనవసరం లేదు. కొంతమందిలో ఇది దానంతట అదే తగ్గిపోతుంది కూడా. మరికొంతమందిలో మందులు, ఇంజెక్షన్లతో నయం అవుతుంది. కాకపోతే క్రయోకాటరీ (ఐస్ ట్రీట్మెంట్) లేదా ఎలక్ట్రోకాటరీ వంటి చికిత్సలతో దీన్ని నయం చేయవచ్చు. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 35. ఇద్దరు పిల్లలు పుట్టాక ట్యూబెక్టమీ చేయించుకున్నాను. ఆర్నెల్ల నుంచి పీరియడ్స్ సమయంలో విపరీతంగా రక్తస్రావం అవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - సునంద, అనంతపురం ఇలా రుతుస్రావం సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా జరగడానికి కారణం ఏమిటో మొదట తెలుసుకోవాలి. కొందరిలో ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం జరుగుతున్నా... దాన్ని క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యగా అనుమానించి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో అయితే ఈ వయసు వారిని ఏడాదికోమారు పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకొమ్మని సలహా ఇస్తుంటారు. మన దేశంలో ఇంకా అంత అవగాహన పెంపొందలేదు. ఈ పరీక్ష వల్ల దాదాపు 10 ఏళ్ల తర్వాత రాబోయే సర్విక్స్ క్యాన్సర్‌ను ముందే కనుక్కోవచ్చు. మీ వయసు 35 ఏళ్లే కాబట్టి, క్యాన్సర్ ఉండే అవకాశం తక్కువ. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోండి. కారణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి హార్మోన్ల చికిత్స లేదా ఇతరత్రా మార్గాల్లో ఈ సమస్యకు చికిత్స అందించి, గర్భసంచి తొలగించే శస్త్రచికిత్స (హ్రిస్ట్రెక్టమీ) చేయకుండానే, మీ సమస్యను తగ్గించవచ్చు. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స... మహిళలతో పోలిస్తే పురుషులకే సులభం!
ఈజీ ‘ప్లానింగ్’ అనాదిగా మనలో చాలా అపోహలున్నాయి. పైగా సామాజికంగా పురుషత్వం ఒక గౌరవ, గర్వ సూచికగానూ ఉంటూ వస్తోంది. అందుకే ఈ అపోహలూ, ఈ వివక్షలూ కలసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎక్కువగా స్త్రీలకే పరిమితమయ్యేలాంటి సాంఘిక పరిస్థితులు మన సమాజంలో ఏర్పడ్డాయి. నిజానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మహిళలకు చేయడం కంటే పురుషులకు నిర్వహించడం చాలా సులభం. ట్యూబెక్టమీ అని పిలిచే మహిళలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌తో పోలిస్తే పురుషులకు చేసే వ్యాసెక్టమీ చాలా చిన్నదీ, సులభమైనది. దీనితో పోలిస్తే మహిళలకు చేసే ట్యూబెక్టమీయే పెద్ద (మేజర్) ఆపరేషన్. ఇందులో ఫెలోపియన్ ట్యూబులను కత్తిరించడమో లేదా క్లిప్ చేయడమో చేసి, యుటెరస్లోని అండాలతో పురుషుల వీర్యకణాలు కలవకుండా చేయడమో చేస్తారు. ఫలితంగా ఫలదీకరణ ప్రక్రియ జరగదు. కాబట్టి పిల్లలు పుట్టడం సాధ్యం కాదు. వ్యాసెక్టమీలో ఏం జరుగుతుంది? పురుషుల్లోని వీర్యకణాలు వృషణాల్లో తయారవుతాయి. ఇలా తయారైన ఈ వీర్యకణాలు వ్యాస్ అనే సన్నటి ట్యూబ్స్ ద్వారా ప్రయాణం చేస్తాయి. కాబట్టి వాటిని కత్తిరించి వీర్యకణాలు, వీర్యంతో పాటు బయటకు రాకుండా చేస్తారు. నిజానికి మనం వీర్యంగా భావించే ద్రవం ప్రోస్టేట్ గ్రంథిలో తయారవుతుంది. ఈ ద్రవంలో వీర్యకణాల పాళ్లు కేవలం ఒక శాతం కంటే తక్కువే. అపోహలు ఎన్నో... వ్యాసెక్టమీ చేయించుకుంటే మగతనం తగ్గిపోతుందనేది ప్రధాన అపోహ. కానీ పురుషత్వానికి కారణమైన ఏ అంశాన్నీ ఈ శస్త్రచికిత్స ప్రక్రియలో ముట్టుకోరు. కేవలం వీర్యకణాలు ప్రయాణం చేసే వ్యాస్ అనే ట్యూబ్‌లను మాత్రమే కత్తిరిస్తారు. కాబట్టి ఈ శస్త్రచికిత్స చేయించుకున్న పురుషుల మగతనానికి వచ్చే లోపమేమీ ఉండదు. ఇక ఈ ఆపరేషన్‌పై ఉండే మరో అపోహ ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత వీర్యం రాదనేది ఒక దురభిప్రాయం. కానీ ఈ ఆపరేషన్ తర్వాత కూడా పురుషుడు సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ముందులాగే వీర్యం విడుదల అవుతుంది. కాకపోతే అందులో వీర్యకణాలు/శుక్రకణాలు ఉండవు కాబట్టి... సెక్స్ తర్వాత గర్భం వచ్చేందుకు ఆస్కారం ఉండదు. ‘నో స్కాల్పెల్’ ప్రక్రియతో ఇప్పుడు మరింత సులువు మహిళల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మేజర్ శస్త్రచికిత్స కాగా... పురుషుల్లో చేసే వ్యాసెక్టమీ ఇప్పుడు మరింత సులువయ్యింది. ‘నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ’ (ఎన్ఎస్బవీ) ప్రక్రియ ద్వారా వృషణాలకు చిన్న గాటు పెట్టడం ద్వారా ఈ వ్యాసెక్టమీ ఇప్పుడు మరింత సులువయ్యింది. ఈ గాటుకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిరోజుల్లో చిన్నగాయం ఎలా మానిపోతుందో, ఈ గాట్లూ అలాగే మానిపోతాయి. - డాక్టర్ చంద్రమోహన్, యూరో సర్జన్, ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్