నా వయసు 35. ఇద్దరు పిల్లలు పుట్టాక ట్యూబెక్టమీ చేయించుకున్నాను.
నా వయసు 35. ఇద్దరు పిల్లలు పుట్టాక ట్యూబెక్టమీ చేయించుకున్నాను. ఆర్నెల్ల నుంచి పీరియడ్స్ సమయంలో విపరీతంగా రక్తస్రావం అవుతోంది. తగిన సలహా ఇవ్వండి.
- సునంద, అనంతపురం
ఇలా రుతుస్రావం సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా జరగడానికి కారణం ఏమిటో మొదట తెలుసుకోవాలి. కొందరిలో ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం జరుగుతున్నా... దాన్ని క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యగా అనుమానించి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో అయితే ఈ వయసు వారిని ఏడాదికోమారు పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకొమ్మని సలహా ఇస్తుంటారు. మన దేశంలో ఇంకా అంత అవగాహన పెంపొందలేదు. ఈ పరీక్ష వల్ల దాదాపు 10 ఏళ్ల తర్వాత రాబోయే సర్విక్స్ క్యాన్సర్‌ను ముందే కనుక్కోవచ్చు. మీ వయసు 35 ఏళ్లే కాబట్టి, క్యాన్సర్ ఉండే అవకాశం తక్కువ. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోండి. కారణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి హార్మోన్ల చికిత్స లేదా ఇతరత్రా మార్గాల్లో ఈ సమస్యకు చికిత్స అందించి, గర్భసంచి తొలగించే శస్త్రచికిత్స (హ్రిస్ట్రెక్టమీ) చేయకుండానే, మీ సమస్యను తగ్గించవచ్చు.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్