మళ్లీ అదే సమస్య
సందేహం
నా వయసు 18 ఏళ్లు. ఎత్తు 5.3, బరువు 43 కిలోలు. పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తున్నాయి. అయితే, ఆ సమయంలో బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఒళ్లు వేడెక్కినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను కన్సల్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి టాబ్లెట్స్ రాశారు. కొన్నాళ్లు వాడాక తగ్గింది. ఇటీవల రెండు నెలలుగా మళ్లీ ఇదే సమస్య మొదలైంది. పీరియడ్స్ సమయంలో బాడీ పెయిన్స్‌తో పాటు విపరీతంగా తలనొప్పి వస్తోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా? - సుచిత్ర, వైజాగ్
కొంతమందిలో పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో నీరు చేరడం, ఒంటి నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, వికారంగా అనిపించడం వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ల మోతాదును బట్టి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఈ ఇబ్బందుల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బ్లీడింగ్ ఆగిపోగానే ఈ ఇబ్బందులన్నీ తగ్గిపోయి తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పడం కష్టం. కాకపోతే, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల నొప్పులను తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే, ఈ నొప్పుల తీవ్రత తక్కువగా అనిపిస్తుంది. పీరియడ్స్ వచ్చే ఆ రెండు మూడు రోజుల్లో నొప్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే నొప్పి నివారణ మాత్రలను వాడుకోవచ్చు. కొందరి శరీర తత్వాన్ని బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నుంచి ఆరు నెలల పాటు పిల్స్ వాడి చూడవచ్చు.
నా వయసు 20. నేనిప్పుడు బీటెక్ చదువుతున్నాను. మొదటి నుంచీ నాకు పీరియడ్స్ 4-5 రోజులు అవుతుంది. ఆ సమయాల్లో కడుపు, నడుము నొప్పి బాగా ఉంటుంది. నా సమస్య ఏంటంటే... గత నాలుగు నెలలుగా పీరియడ్స్ సమయాల్లో, అలాగే పీరియడ్స్ అయిపోయిన వెంటనే... యోని, తొడల పై భాగంలో ర్యాషస్ అవుతున్నాయి. ప్యాడ్ పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది. ఏ క్రీమ్ రాసుకుంటే తగ్గుతాయో చెప్పండి. - పి.కోమలి, హైదరాబాద్
కొంతమందిలో పీరియడ్స్ సమయంలో వాడే న్యాప్‌కిన్స్ పడకపోవడం వల్ల, తొడల దగ్గర అలర్జీ ర్యాషెస్, దురద ఉండవచ్చు. కొన్నిసార్లు 4-5 రోజులు వరుసగా ప్యాంటీ, న్యాప్‌కిన్ పెట్టుకునే ఉండడం వల్ల గాలి ఆడక తొడల దగ్గర, బ్లీడింగ్‌తో చెమ్మగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ లేదా అలర్జీ ఏర్పడి ర్యాషెస్, దురద రావచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే న్యాప్‌కిన్స్ రోజంతా ఒకటే ఉంచుకోకుండా రెండు మూడు మార్చుకోవడం మంచిది. ఈ సమస్య నాలుగు నెలల నుంచే ఉంది కాబట్టి న్యాప్‌కిన్ వేరే కంపెనీ మార్చి చూడండి. పీరియడ్స్ సమయంలో లాక్టిక్ యాసిడ్ సొల్యూషన్‌తో యోని, తొడల దగ్గర కడుక్కోవడం మంచిది. న్యాప్‌కిన్ పెట్టుకునే ముందు క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ చల్లుకుంటే, అది చెమ్మను పీల్చుకుని చాలా వరకు ర్యాషెస్ రాకుండా తోడ్పడుతుంది. తర్వాత కూడా అలానే ఉంటే క్యాండిడెర్మాక్రీమ్ పెట్టుకుని చూడవచ్చు. అయితే అలాగే ఉంటే ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
మా పాప వయసు 11 ఏళ్లు. ఆరు నెలల క్రితం మెచ్యూరైంది. ఇంత త్వరగా అవ్వడమేంటో మాకు అర్థం కావడం లేదు. కడుపునొప్పి కూడా ఉంటోంది. పీరియడ్స్ సమయాల్లో బాగా డల్ అవుతోంది. ఏమీ తినడం లేదు. నేనైతే 16ఏళ్లకు మెచ్యూర్ అయ్యాను. పాప ఇంత త్వరగా అవ్వడమేంటి? - రమ్య, నెల్లూరు
ఆధునిక కాలంలో, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, టీవీలు, సినిమాలు, ఇంటర్‌నెట్‌ల ప్రభావం వల్ల మెదడు త్వరగా ప్రేరణకు గురయ్యి దాని నుంచి కొన్ని హార్మోన్లు తగిన మోతాదులో విడుదలై, అండాశయాలను ఉత్తేజపరచి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను విడుదల అవ్వటం ద్వారా అవి గర్భాశయం మీద ప్రభావం చూపి పీరియడ్స్ మొదలవుతాయి. ఇంతకు ముందు కాలంలో 13 నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అయ్యేవారు. ఇప్పుడు కొంతమంది 10-11 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. మీ అమ్మాయి సన్నగా ఉండడం వల్ల పీరియడ్స్ సమయంలో జరిగే మార్పులకు కొద్దిగా బలహీనపడి, ఇబ్బంది పడుతున్నట్టుంది. 11 సంవత్సరాలు అంటే... ఆడిపాడే చిన్నవయస్సు మరి. ఈ మార్పులకు అలవాటయ్యే వరకు పాపకి మీరు తల్లిగా ఎంతో మానసికంగా ఎంతో చేదోడు వాదోడుగా ఉండవలసి ఉంటుంది. మంచి పౌష్ఠికాహారం ఇవ్వండి. ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వేరే సమస్యలు ఏమన్నా ఉన్నాయో పరీక్ష చేయించి తెలుసుకోవడం మంచిది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పడం కష్టం. కాకపోతే, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల నొప్పులను తట్టుకునే శక్తి వస్తుంది.
డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్