దానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా?
సందేహం
మా వదిన ఆరు నెలల క్రితం ప్రెగ్నెంట్ అయింది. నాలుగో నెలలో తనకు అబార్షన్ జరిగింది. ఎలా అంటే.. చెకప్‌కు వెళ్లినప్పుడు పాప గుండె ఆగిపోయిందని చెప్పారు డాక్టర్. దాంతో రెండు రోజుల తర్వాత అబార్షన్ చేశారు. రెండు నెలలుగా బాధ పడుతూనే ఉంది. త్వరగా ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటోంది. ఈసారి ఆరోగ్యకరమైన పాప కావాలనుకుంటోంది. దానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా? దయచేసి తనకు పరిష్కారం చెప్పండి.
- ప్రవీణ, చౌటుప్పల్
పీరియడ్స్ సక్రమంగా ఉన్నవారిలో గర్భం వచ్చిన ఆరు వారాలకు.. అంటే నెల తప్పిన రెండు వారాలకు పిండంలో గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు, తల్లిలో అదుపులో లేని మధుమేహం, థైరాయిడ్.. ఇంకా కొన్ని హార్మోన్ల అసమతుల్యత, తల్లి నుంచి బిడ్డకు రక్తం వెళ్లే రక్తనాళాలో సమస్య - అంటే రక్తం గూడుకట్టడం వంటి అనేక సమస్యల వల్ల 100లో 15 మందికి మొదటిసారి గర్భం అబార్షన్ అవ్వవచ్చు.
ఒకసారి అలా అయినప్పుడు, మరోసారి అలాగే అవుతుందని ఏమీ లేదు. మొదట మీ వదినను డిప్రెషన్‌లో నుంచి బయటకు వచ్చి, సంతోషంగా ఉంటూ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకుంటూ మళ్లీ ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేయమనండి. తన వయసు, బరువు, పీరియడ్స్ సక్రమంగా ఉన్నాయా? లేదా? ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న విషయాలను రాసి ఉంటే బాగుండేది. సాధారణంగా సమస్యలు ఏమీ లేకుండా, రెండు మూడుసార్లు అబార్షన్లు అయినప్పుడు మాత్రమే, భార్యాభర్తలిద్దరికి అనేక రకాల పరీక్షలు చెయ్యవలసి వస్తుంది. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
నాకు రెండుసార్లూ నార్మల్ డెలివరీలే. మొదటి కాన్పులో సమస్యలు లేవు. రెండోసారి నాలుగేళ్ల తర్వాత పాప పుట్టింది. కొన్ని కుట్లు పడ్డాయి. కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల అటూ ఇటూ బాగా కదలడంతో కుట్లు ఊడిపోయాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. నాలుగు నెలలు అయినా కడుపు నొప్పి తగ్గడం లేదు. ఐదు నెలల గర్భిణినిలా కనిపిస్తున్నాను. గర్భానికి ముందు నా బరువు 58 కిలోలు. డెలివరీ టైమ్‌లో 73 కిలోలు. ఇప్పుడు 66 కిలోలు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషనూ చేయించుకున్నాను.
డెలివరీ తర్వాత స్ట్రెయిట్‌గా పడుకొని, ఒక కాలుపై మరొక కాలు వేసుకొని పడుకోవాలని, గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కానీ కడుపు నొప్పి కారణంగా అలాంటి జాగ్రత్తలేమీ తీసుకోలేదు. గాలి లోపలికి వెళ్లడం వల్లే కడుపునొప్పి తగ్గట్లేదా? డెలివరీ తర్వాత పీరియడ్స్ కూడా అయిదు రోజులయ్యాయి. నా సమస్యకు పరిష్కారం తెలపండి.
- మణి, అనంతపురం
నార్మల్ డెలివరీ అయ్యి నాలుగు నెలలు అయినా... కడుపులో నొప్పి తగ్గడం లేదంటే, పొట్టలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ అయ్యిండొచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయ్యిందన్నారు కాబట్టి, దాని వల్ల ఏదైనా ఇన్‌ఫెక్షన్ లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు. లేదా ఆపరేషన్ వల్ల పొట్టలో కుట్లలో సమస్య లేదా పేగులు అతుక్కోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇన్ని రోజులు నొప్పి ఉండొచ్చు. పొట్టలో పెరిగే బిడ్డను ఇముడ్చుకోవడానికి, పొట్ట కండరాలు, చర్మం బాగా సాగుతాయి. అలాగే తల్లి బరువు పెరిగేకొద్దీ పొట్టలో కొవ్వు కూడా పేరుకొని, కాన్పు అవ్వగానే అవి సాధారణస్థితికి రావాలంటే కష్టం.
ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి కండరాలు సాగిన తీరు, పేర్కొన్న కొవ్వును బట్టి, కాన్పు తర్వాత పొట్ట పెద్దగా, మళ్లీ 5-6 నెలల గర్భవతిగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి సరైన వ్యాయామాలు, నడక వంటివి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో నేర్చుకొని, అనుసరించడం వల్ల పొట్ట చాలావరకు సాధారణ స్థితికి వస్తుంది. యోని భాగంలో వేసిన కుట్ల గురించి చూస్తే... మధ్యలో కుట్లు ఊడిపోతే, ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉంటే, వాటికవే మెల్లగా అతుక్కొని మానిపోతాయి. వాటివల్ల గాలి పోయి పొట్టనొప్పి రావడం లాంటివి ఏమీ ఉండవు. మళ్లీ ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కడుపులో నొప్పికి గల కారణాలను తెలుసుకొని, తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
నా వయసు 46. మూడేళ్ల క్రితమే నాకు పీరియడ్స్ ఆగిపోయాయి. కానీ పోయిన నెల రెండు రోజుల పాటు బ్లీడింగ్ కనిపించింది. మళ్లీ ఈ నెల కూడా దగ్గర దగ్గర ఆ తేదీలోనే బ్లీడింగ్ అయింది. అలా దేనివల్ల అవుతుందో అర్థం కావడం లేదు. నా గర్భసంచికి ఏదైనా సమస్య వచ్చిందా లేక మరెందువల్ల అవుతుందో దయచేసి చెప్పగలరు.
- అన్నపూర్ణ, కర్నూలు
ఆడవారిలో పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత కాలాన్ని మెనోపాజ్ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. గర్భాశయం లోపల పొరలో ఎండోమెట్రియల్ పాలిప్ ఏర్పడటం వల్ల గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్లు, పుండ్లు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, ఈస్ట్రోజన్ మాత్రలు వాడటం వల్ల ఎండోమెట్రియల్ పొర పెరగడం వల్ల, అండాశయాలలో గడ్డలు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవ్వవచ్చు.
దీనిని అశ్రద్ధ చెయ్యడం అంత మంచిది కాదు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే ‘డి అండ్ సి’ పరీక్ష చేసి ముక్కని ఎండోమెట్రియల్ బయాప్సీ, సెర్వికల్ బయాప్సీకి పంపించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత పరీక్షలో వచ్చే రిపోర్ట్‌ను బట్టి చికిత్స సరిపోతుందా? లేక గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుందా అనే నిర్ణయానికి రావొచ్చు.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్