నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. అయితే ఈ మధ్య నా ఎడమ చేయి బెణికింది. పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెబుతున్నారు. ఒకవేళ చేయికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే గర్భిణులు సర్జరీ చేయించుకోవచ్చా? – జి.శోభన, ములుగు
గర్భిణీ స్త్రీలు సర్జరీ చేయించుకోవచ్చు. కాకపోతే సర్జరీకి సంబంధించి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఎన్ని నెలల గర్భిణీ? మత్తు ఎలా ఇవ్వాలి? సర్జరీ తప్పనిసరిగా వెంటనే చేయాలా లేదా కొద్ది రోజుల తర్వాత చేయించుకోవచ్చా? అనే రకరకాల అంశాలను విశ్లేషించి, ఎంతవరకు రిస్క్ అనేది అంచనా వేయడం జరుగుతుంది. మొదటి మూడు నెలల్లో పిండం పెరిగి అవయవాలు ఏర్పడటం జరుగుతుంది. ఈ సమయంలో మత్తు ఎలా ఇస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. కేవలం చేతి వరకే మత్తు ఇవ్వడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. పూర్తిగా మత్తు ఇవ్వడం జరిగితే, మత్తుకి ఇచ్చే కొన్ని రకాల మందుల వల్ల, వాటి మోతాదునుబట్టి కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. చేతికి ఆపరేషన్ కాబట్టి పెద్దగా సమస్య కాకపోవచ్చు. నాలుగో నెల తర్వాత ఆపరేషన్ అయితే చాలావరకు సమస్య ఉండదు. కాకపోతే నొప్పికి నొప్పి నివారణ మాత్రలు వాడటం మంచిది కాదు. నొప్పి ఎక్కువగా ఉంటే, కొద్దిగా వేడినీళ్ల కాపడం లేదా ఐస్‌క్యూబ్స్ పెట్టుకోవచ్చు. అయితే పారాసెటమాల్ మాత్రలు వేసుకోవచ్చు. మీ చెయ్యి బెణికింది అంటున్నారు కాబట్టి కట్టు కట్టించుకుంటే సరిపోవచ్చు.
‘12 వీక్ ప్రెగ్నెన్సీ రూల్’ గురించి విన్నాను. అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంది. గర్భిణులకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో దయచేసి వివరంగా తెలియజేయగలరు.– కె.రజిని, ఏలూరు
గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం. ఈ సమయంలో పిండం ఏర్పడి గర్భాశయంలో మెల్లగా పెరుగుతూ శిశువుగా మారుతుంది. ఈ సమయంలో వందలో పదిహేను శాతం మందికి అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో అరవై శాతం వరకు జన్యుపరమైన సమస్యల వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగతావి హార్మోన్ల లోపాలు, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల మొదటి మూడు నెలల్లో అబార్షన్లు అవుతుంటాయి. పన్నెండు వారాలకు పిండం పెరుగుతూ చిన్న కాళ్లు, చేతులు, తల, శరీరం ఏర్పడి శిశువుగా రూపాంతరం చెందుతుంది. కొన్ని రకాల పెద్ద అవయవ లోపాలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు డబుల్ మార్కర్ పరీక్ష ద్వారా పన్నెండు వారాలకు కొంతమందిలో బయటపడతాయి. అందుకే చాలామంది గర్భం దాల్చినా కానీ మొదటి మూడు నెలల వరకు బయటకు చెప్పకుండా ఆగుతారు. దీన్నే 12 వీక్ ప్రెగ్నెన్సీ రూల్ అంటారు. మూడు నెలలు దాటిన తర్వాత పిండం ఎదుగుదల కొద్దిగా త్వరగా జరుగుతుంది. అంతా బాగుందని నిర్ధారణ అయిన తర్వాతే చాలామంది, గర్భం దాల్చిన విషయాన్ని అందరికీ చెబుతుంటారు.
‘పీరియడ్ పావర్టీ’, ‘పీరియడ్ సెక్స్’ అనే మాటల గురించి ఈ మధ్య విన్నాను. వీటి గురించి తెలియజేయగలరు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. చేపల కూర తినడం అంటే చాలా ఇష్టం. అవి తినేటప్పుడు ఒకవేళ ముళ్లు పొరపాటున కడుపులోకి వెళితే బిడ్డకు ప్రమాదం అని అందరూ చెబుతున్నారు. నాకేమో తినాలని ఉంది. ఇప్పుడు నేను చేపల కూరతో భోజనం చేయవచ్చా? – శ్రీలక్ష్మీ, ఐనాపురం
ప్రపంచంలో చాలామంది ఆడపిల్లలు, మహిళలకు పీరియడ్ సమయంలో ప్రతి నెలా నాప్‌కిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం వల్ల వచ్చే పరిస్థితిని పీరియడ్ పావర్టీ అంటారు. నాప్‌కిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక కొందరు వాడేసిన బట్టలు, సరిగా ఉతకని బట్టలు వాడటం జరుగుతుంది. దీనివల్ల వాళ్లకి అనవసరమైన ఇన్‌ఫెక్షన్స్, ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఆ సమయంలో తినడానికి ఖర్చు చేసే డబ్బును, తిండి సరిగా తినకుండా నాప్‌కిన్స్ కొనడానికి వాడుతుంటారు.పీరియడ్ సమయంలో సెక్స్ చేయడాన్ని పీరియడ్ సెక్స్ అంటారు. దీనివల్ల కొన్ని లాభాలు, కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్ అనే పదార్థాల వల్ల పీరియడ్ నొప్పి ఎక్కువగా ఉండేవాళ్లకి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కొందరిలో గర్భాశయ ద్వారం కొద్దిగా తెరుచుకుని బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కలవడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ మొదటగా గర్భాశయం తద్వారా పొత్తికడుపులోకి పాకే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు చేపలు తినేటప్పుడు పొరపాటున ముల్లును మింగడం వల్ల గొంతులో ఇరుక్కుంటే తల్లికి ఇబ్బంది ఉంటుంది. గొంతులో ఇరుక్కోకుండా కడుపులోకి వెళ్తే, అక్కడి నుంచి పేగులోకి వెళ్లి, అది చిన్న ముక్కలుగా మారి మలం ద్వారా వెళ్లిపోతుంది. దీనివల్ల కడుపులో (గర్భాశయంలో)ని బిడ్డకు ఎటువంటి హాని ఉండదు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్
హైదరాబాద్98853 46146,91009 49319
Comments
Please login to add a commentAdd a comment