గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 20 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లు అయ్యింది. పెళ్లయిన ఆర్నెల్లకు గర్భం వచ్చింది. మూడో నెలలో కొంచెం బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాను. స్కానింగ్ చేసి ‘ముత్యాలగర్భం పెరుగుతోంది’ అని తీసేశారు. ఇంకోసారి స్కానింగ్ చేసి, మళ్లీ గర్భం దాల్చాలంటే కనీసం ఒక ఏడాదైనా ఆగాలన్నారు. అసలు ఈ ముత్యాల గర్భం ఎందుకు ఏర్పడుతుంది? మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- నీలిమ, మెదక్
గర్భాశయంలో పిండం నిర్మాణ లోపం వల్ల, నిర్వీర్యమైన అండంతో ఒక శుక్రకణం కలిసి ఫలదీకరణ చెంది ముత్యాల గర్భంగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు గర్భాశయంలో బిడ్డ ఏర్పడకుండా, బిడ్డకు ఆహారాన్ని అందించే మాయ (ప్లాసెంటా), చిన్న చిన్న ముత్యాల్లాంటి నీటి బుడగలుగా మార్పు చెందుతుంది. ఇవి పెరిగిపోతూ, గర్భాశయం మొత్తాన్ని ఆక్రమిస్తాయి. ఇలా పెరిగే గర్భాన్ని ముత్యాల గర్భం అంటారు. కొంతమందిలో మాయ కొంత భాగం ముత్యాలుగా మారుతుంది. వీరిలో బిడ్డ కూడా ఏర్పడుతుంది. కానీ అది సరిగా ఎదగకపోవచ్చు. అవయవలోపాలు ఉండవచ్చు. ముత్యాలగర్భం వచ్చినవారిలో 2-3 నెలల్లో కొంచెం లేదా ఎక్కువగా బ్లీడింగ్ లేదా నీటిబుగ్గలతో కలిసిన ద్రవం, దాంతోపాటు కొంచెం పలుచగా రక్తం చారికలు కనిపించవచ్చు. కాబట్టి దీనిని ముందుగానే అంటే 2-3 నెలల్లోనే స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని, సెక్షన్ క్యురెటాజ్ ద్వారా తీయించేసుకోవడం మంచిది. ఇందులో గర్భాశయం చాలా మెత్తబడి ఉంటుంది. అందువల్ల క్యురెటాజ్ చేసేటప్పుడు అధిక రక్తస్రావం, గర్భాశయానికి చిల్లు పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత కూడా కొందరిలో నీటిబుగ్గలు కొద్దిగా ఉండిపోయి, మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు డాక్టర్ పర్యవేక్షణలో మళ్లీ స్కానింగ్, బీటా హెచ్‌సీజీ రక్తపరీక్ష చేయించుకుంటూ, మూడు నెలల నుంచి ఆర్నెల్ల పాటు డాక్టర్ ఫాలోఅప్‌లో ఉండాలి. ఏడాదివరకు గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. మలిసారి గర్భందాల్చినప్పుడు రెండు శాతం మందిలో మళ్లీ ముత్యాలగర్భం రావచ్చు.
గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నెలల ముందునుంచే దంపతులు ఇద్దరూ మితాహారం, పౌష్టికాహారం తీసుకుంటూ, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. గర్భం వచ్చాక రెండో నెల చివర్లోనే స్కానింగ్ చేయించుకని, అది సాధారణ గర్భమా లేక ముత్యాల గర్భమా అని నిర్ధారణ చేసుకోని, తగిన తదుపరి చర్యలు తీసుకోవడం మంచిది.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్