మెనోపాజ్ కేఫ్ వ్యవస్థాపకురాలు రేచెల్ వియస్ (స్కాట్లాండ్)
ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడకుండానే శతాబ్దాలు గడిచిపోయాయి. అలా మాట్లాడకుండా, చర్చించకుండా గుట్టుగా, రహస్యంగా ఉండిపోయిన విషయాల్లో స్త్రీలకు నడివయస్సుతోపాటే నడిచొచ్చే మెనోపాజ్ దశ కూడా ఒకటి.
తెల్లవారగానే కుండీల్లో బీర పాదుకి పూచిన పూలను లెక్కేయడం, అరటి చెట్టు మొదళ్లలో పిలకలను ప్రతిరోజూ కొత్తగా తడిమి చూడటం, కిటికీ పక్కన పెద్దకుండీలో మల్లెతీగకి వేసిన చిన్ని మొగ్గలను చూసి కూడా చిన్నపిల్లలా గంతులేయడం, నేను చూడాలనుకుని పెట్టుకున్న ఇంగ్లిష్ సినిమాని ఓ చేత్తో గరిట తిప్పుతూనే, నాతోపాటు హాల్లోకొచ్చి ఏ సీన్‌నీ మిస్ అవకుండా ఆసాంతం చూసిందాకా వదలకపోవడం.. అమ్మను చూసినప్పుడల్లా చిన్నపిల్ల తనా? నేనా? అనే అనుమానం కలిగేది.
ఓ రోజు అడిగాను!
అమ్మ ప్రతి ఆనందాన్ని ఆస్వాదిస్తూ పెరిగిన నేను ఇప్పుడు హఠాత్తుగా ఆమెలో కనిపిస్తున్న మార్పుని జీర్ణించుకోలేకపోతున్నాను. రెహ్మాన్ సంగీతం, చలం పుస్తకం, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏదీ ఆమె దృష్టిని కట్టిపడేయలేకపోతోంది. ఏదో తెలియని చిరాకు, ఉన్నట్టుండి ఒళ్లంతా మంటలు అంటుంది, అమ్మ మొహం పైన చిరుచెమటని కూడా చూసి ఎరుగను నేను. అలాంటిది శీతాకాలంలో సైతం తను నిలువెల్లా చెమటతో తడిసిపోవడం నాకాశ్చర్యంగా అనిపించింది. నిద్రలేని రాత్రులతో కళ్ల కింద చారలు అమ్మలో జీవకళనే మాయం చేశాయి. ఓ రోజు మెల్లిగా అడిగాను అమ్మని! అలా చిరాగ్గా ఉంటున్నావేంటమ్మా అని. ఆఫీసులో ఏదైనా ఇబ్బందా? అని కూడా అడిగాను. తల అడ్డంగా ఊపింది అమ్మ. చూసి చూసి ఓ రోజు కాలేజీ నుంచి రాగానే డాక్టరు దగ్గరికెళదామని ఒత్తిడి చేశాను. నా గోల భరించలేక ఆసుపత్రికి వచ్చింది. అప్పుడు బయటపడింది.. అమ్మ ఆందోళనకి మెడికల్ నేమ్ ‘మెనోపాజ్’!!
అంత సింపులేం కాదు
అదంత పట్టించుకోవాల్సిందేమీ కాదనీ, 45 ఏళ్లు దాటిన అమ్మ ప్రస్తుతం మోనోపాజ్ దశలో ఉందనీ, పీరియడ్స్ ఆగిపోయే దశలో శరీరంలో వచ్చే ఈ మార్పులనే మోనోపాజ్ అంటారనీ డాక్టర్‌గారు చాలా సింపుల్‌గా తేల్చేశారు. కానీ అసలు సమస్య అది కాదు. ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడకుండానే శతాబ్దాలు గడిచిపోయాయి. అలా మాట్లాడకుండా, చర్చించకుండా గుట్టుగా, రహస్యంగా ఉండిపోయిన విషయాల్లో స్త్రీలకు నడివయస్సుతోపాటే నడిచొచ్చే మెనోపాజ్ దశ ఒకటి. నిజానికి అది కొంత శారీరక సమస్యే అయినప్పటికీ అంతకన్నా ఎక్కువగా మనస్సుకి సంబంధించిన విషయం. అది ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన శారీరక మార్పులకు కారణం అవుతుంది. ఎంతో మానసిక అశాంతికీ గురిచేస్తుంది. అయితే ఎవరికి వారు దీన్ని చర్చకు అనర్హమైన విషయంగా భావించడం బాధాకరమైన విషయం అని అంటున్నారు రేచల్ వియస్.
‘డెత్ కేఫ్’లా మెనోపాజ్ కేఫ్
మెనోపాజ్‌పై ఇటీవల కొంత చర్చ జరుగుతున్నా యేడాది క్రితం మొదటిసారి బ్రిటన్‌లో స్త్రీల మెనోపాజ్‌ని అర్థం చేసుకొనేందుకు సరికొత్త విధానాన్ని అవలంబించారు. ఒంటరిగా కాకుండా సామూహికంగా ఎదుర్కొనేందుకు ఓ వేదికను ఏర్పాటు చేశారు. అదే మెనోపాజ్ కేఫ్. ఒక్కొక్కరుగా కాక, తనలాంటి ఎంతో మందితో కలిసి ఒక సమూహంగా సమస్యని అధిగమించాలనుకున్నారు. అందులో భాగంగానే 2017లో స్కాట్లాండ్‌లోని పెర్త్ అనే ప్రాంతంలో రేచెల్ వియస్ అనే మహిళ ఈ మెనోపాజ్ కేఫ్‌ని ప్రారంభించారు. డెత్ కేఫ్ (మరణాన్ని గురించి నిర్భయంగా మాట్లాడుకునే కేఫ్) మోడల్ క్రిస్టీవార్క్స్ తీసిన ‘మెనోపాజ్ అండ్ మి’ అనే బీబీసీ డాక్యుమెంటరీతో స్ఫూర్తి పొందిన రేచల్‌తో పాటు గెయిల్ జాక్, లోర్నా ఫాథరింఘమ్ తదితరులు స్కాట్లాండ్‌లోని పెర్త్‌లో తొలిసారిగా మెనోపాజ్ కేఫ్‌ని ఏర్పాటు చేశారు.
సాయంసంధ్యలో సెలబ్రేషన్
ఓ మంచి కాఫీని సిప్ చేస్తూనో, ఇష్టమైన చాక్లెట్ కేక్‌ని తింటూనో నడివయస్సులో కలిగే ఈ మార్పులను గురించి మెనోపాజ్ కేఫ్‌లో చర్చించొచ్చు. అక్కడికొచ్చేవాళ్లంతా ఆ విషయాన్ని గురించే మాట్లాడ్డానికి వస్తారు. మధ్య వయస్సులో వచ్చే మతిమరుపుకి కూడా కారణమయ్యే ఈ మెనోపాజ్ ఎన్నెన్ని రకాలో, వాటి పర్యవసానాలేమిటో, వాటిని ఎట్లా అధిగమించవచ్చో అక్కడ చర్చిస్తారు. కానీ ఈ కేఫ్‌కి వచ్చేవాళ్లంతా ఒక్క నిబంధన మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అదే... వ్యక్తిగత సమాచార గోప్యత. ఆ గోప్యతని పాటిస్తూనే తమ సమస్యని బహిరంగంగా చర్చించి అధిగమిస్తోన్న యూకే స్త్రీలంతా ఇప్పుడు మేం ఒంటరి వాళ్లం కాదని సగర్వంగా ప్రకటించుకొంటున్నారు. శనివారం సాయంసంధ్యని మెనోపాజ్‌పై లెక్చర్లతో ఫ్లష్ ఫెస్ట్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
– అత్తలూరి అరుణ
Comments
Please login to add a commentAdd a comment