నా వయసు 27 ఏళ్లు. పెళ్లైన రెండో నెలలో నాకు పీరియడ్ మిస్సయింది. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయింది. కానీ రెండో నెల చివర్లో కాస్తంత బ్లీడింగ్ కనిపించింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి స్కానింగ్ చేయించుకుంటే నాకు ‘బైకార్నేట్ యుటెరస్’ ఉందని చెప్పారు. పదిహేను రోజుల తర్వాత పూర్తిగా అబార్షన్ అయింది. ఈ బైకార్నేట్ యుటెరస్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. నాకు మళ్లీ ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – స్రవంతి, మెయిల్
గర్భాశయం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. ఈ గర్భాశయం సాధారణంగా రెండు భాగాలుగా దగ్గరకు వచ్చి అతుక్కుంటాయి. ఆపైన మధ్యభాగంలో ఉన్న గోడ కరిగిపోతుంది. అలా గర్భాశయం మొత్తం ఒక్కటిగా ఏర్పడుతుంది. రెండు భాగాలు దగ్గరకు వచ్చే ప్రక్రియలో, అలాగే కరిగిపోయే ప్రక్రియలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యలో ఉన్న పొర అలాగే ఉండిపోయి బైకార్నేట్ యుటెరస్‌గా ఏర్పడుతుంది. అది గుండె ఆకారంలో ఉంటుంది. ఇందులో గర్భాశయం పై భాగం మధ్యలో చీలినట్లు లోపలికి ఉంటుంది. దీనివల్ల కొందరిలో గర్భాశయం మామూలు గర్భాశయంలాగా శిశువు పెరిగేకొద్దీ విచ్చుకోలేదు, ఎక్కువగా సాగలేదు కాబట్టి పిండం బరువు ఎక్కువగా పెరగకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, బిడ్డ పొజిషన్ సరిగా లేకుండా ఎదురుకాళ్లతో ఉండటం లాంటివి జరుగుతాయి. దీనివల్ల నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సిరావడం, అందులోనూ ఆపరేషన్ ద్వారానే కాన్పు చేయాల్సి రావడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండటం వల్ల అయిదో నెల, ఆరో నెలలోనే కాన్పు అవ్వవచ్చు. కొందరిలో బైకార్నేట్ యుటెరస్‌లోని మధ్య పొర పైన గర్భం పాతుకోవడం వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బైకార్నేట్ యుటెరస్ వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండేందుకు మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇలాంటి వాళ్లు జాగ్రత్తగా చెకప్‌లు, తరచూ స్కానింగ్‌లు చేయించుకోవాలి. అవసరమైతే అయిదో నెలలో గర్భాశయానికి కుట్లు వేయించుకోవడం, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడటం జరుగుతుంది. పౌష్టికాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.
అవయవ లోపం లేని మహిళలతో పోల్చితే... ఆ లోపం ఉన్న మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? తల్లి శారీరక అవయవ లోపం, పుట్టబోయే బిడ్డ మీద ఏ మేరకు ఉంటుంది? – ఎం.జయ, విజయనగరం
పిల్లల్లో అవయవ లోపాలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తల్లిలో కానీ, తండ్రిలో కానీ జన్యుపరమైన సమస్యలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల ముందులు వాడటం, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌లు సోకడం, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పుట్టబోయే పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడవచ్చు. అవయవ లోపాలు ఉన్న మహిళలకు... ఏ అవయవాలలో లోపం ఉందన్న దాన్నిబట్టి వారు గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. తల్లిలో అవయవ లోపాలు ఉన్నప్పటికీ తండ్రిలో ఎటువంటి సమస్య లేనప్పుడు కొందరి పిల్లల్లో ఆ లోపాలు లేకుండా ఉండవచ్చు. కొందరి పిల్లల్లో మాత్రం తల్లిలో ఉన్న అవయవ లోపం కొంతమేరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది ముందే చెప్పడం కష్టం. అవి వారి జన్యువులను బట్టి, ఇంకా ఇతర కారణాలను బట్టి అవయవ లోపం ఏ శాతం మేరకు రావచ్చు అనే ఒక అంచనా వేయడం జరుగుతుంది. దీనిని జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది.
నా వయసు 24 ఏళ్లు. పెళ్లై ఏడాది కావస్తోంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ మధ్య నాకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ‘జెస్టేషనల్ ఏజ్’ అనే మాట వినబడుతోంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది. దయచేసి దీని గురించి తెలియజేయగలరు. – జె.కవిత, మదనపల్లి
గర్భం దాల్చిన తర్వాత గర్భం ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ఉందని తెలియడానికి జెస్టేషనల్ ఏజ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. గర్భం నిర్ధారణ అయిన తర్వాత, ఆఖరుగా వచ్చిన పీరియడ్ మొదటి రోజు నుంచి జెస్టేషనల్ ఏజ్‌ని లెక్కపెడతారు. ప్రెగ్నెన్సీ పూర్తిగా తొమ్మిది నెలలు నిండి వారం దాటిన తర్వాత.. దాన్ని నలభై వారాల జెస్టేషనల్ ఏజ్ అంటారు. పీరియడ్స్ సక్రమంగా వచ్చే వాళ్లలో అయితే ఆఖరు పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతివారం లెక్కకట్టి, రెండు నెలలకు అయితే ఎనిమిది వారాల జెస్టేషనల్ ఏజ్ అని, మూడు నెలలు అయితే పన్నెండు వారాల జెస్టేషనల్ ఏజ్ అని చెబుతారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు.. మొదటిసారి గర్భంలో ఏమైనా సమస్యలు ఉండి ఉంటే, అవి ఏ జెస్టేషనల్ ఏజ్‌లో వచ్చాయని చెప్పడానికి, ఆ సమస్యలు ఈ గర్భంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ జెస్టేషనల్ ఏజ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది.
నేను బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కాస్త ఎక్కువగానే వాడతాను. అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వాడకూడదంటున్నారు. వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? బొటాక్స్ చేయించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం ఉంటుందని విన్నాను. ఇది నిజమేనా? – పి.గాయత్రి, మంచిర్యాల
కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వాడే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, లెడ్ వంటి మెటల్స్, ఇంకా కొన్ని పదార్థాలు తల్లి చర్మం నుంచి రక్తం ద్వారా బిడ్డకు 40–60 శాతం చేరే అవకాశాలు ఉంటాయి. ఈ పదార్థాలు తరచూ వాడటం వల్ల కొందరి పిల్లల్లో కొన్ని రకాల అవయవ లోపాలు, కొన్ని చర్మ సమస్యలు ఇంకా కొన్ని తెలియని సమస్యలు వచ్చే అవకాశాలు 5–10 శాతం ఉంటాయి. బొటాక్స్ అనేది కళ్ల కింద ముడతలు, ముఖం మీద ముడతలు రాకుండా ఇచ్చే టాక్సాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం, కొందరిలో ఇది ముఖం మీద కనిపించే కండరాలకు ఇవ్వడం వల్ల, కండరాలు ముడుచుకోకుండా ఉండి, ముడతలు లేకుండా ఉంటాయి. ఇవి కొద్ది డోస్‌లో కేవలం కొందరికే ఇస్తారు కాబట్టి చాలావరకు ఇది రక్తంలోకి చేరి బిడ్డకు చేరే అవకాశాలు తక్కువ. అయినా కానీ నూటికి నూరు శాతం సురక్షితం అని చెప్పలేం. డోస్ ఎక్కువై రక్తం ద్వారా శిశువుకి చేరితే, అబార్షన్లు, శిశువుకు అవయవ లోపాలు వచ్చే అవకాశాలు 0.5 శాతం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో వాటిని తీసుకోకపోవడం మంచిది. సౌందర్య సాధనాలు కూడా వీలైనంత వరకు ప్రకృతి సహజమైన ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు వాడుకోవడం మంచిది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment