నా వయసు 22. నేను ఫుడ్ లవర్‌ని. చిరుతిండ్లు కూడా ఎక్కువగానే తింటాను. పీరియడ్స్ సమయంలో కూడా నాకు బాగానే ఆకలేస్తుంది. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు ఏది పడితే అది తినకూడదని ఫ్రెండ్స్ హెచ్చరించారు. అసలు పీరియడ్స్ టైమ్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేది తెలియజేయగలరు. – టిఆర్, రావులపాలెం
పీరియడ్స్ సమయంలో ఆహారంలో ఇది తినకూడదు, అది తినకూడదు అని ఏ నియమాలు లేవు. ఉండవు. కానీ ఆ సమయంలో బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంతమందిలో నీరసం, రక్తహీనత ఎక్కువగా ఉంటాయి. దాంతో బలహీనంగా ఉంటారు. కాబట్టి తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పండ్లరసాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవటం మంచిది. వీటిలో ఉండే ఐరన్, విటమిన్స్ వంటి పోషకాలు.. బలహీనంగా లేకుండా శక్తిని ఇస్తాయి. జంక్‌ఫుడ్స్ పీరియడ్స్ సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. జంక్‌ఫుడ్ తీసుకోవటం వల్ల, బరువు పెరగడం, హార్మోన్లలో మార్పులు, దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పటం వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కావున జంక్‌ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
రొమ్ము క్యాన్సర్ రోగులు సోయా ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే మంచిదని విన్నాను. సోయా ఉత్పత్తులతో పాటు ఇంకా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి తెలియజేయగలరు. ఇది అధికమైతే ప్రమాదమని విన్నాను. దీన్ని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో చెప్పగలరు. – జానకి, వరంగల్
సహజంగా దొరికే సోయా ఉత్పత్తులు అంటే సోయా బీన్స్, సోయా పాలు వంటి వాటిలో ప్రొటీన్స్, ఫైబర్, ఫైటోఈస్ట్రోజన్ వంటి ఎన్నో పోషకపదార్ధాలు ఉంటాయి. ఇవి మితంగా తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ రోగులకు, క్యాన్సర్ ఇంకా పెరగకుండా, మళ్లీ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. వాటితో పాటు ఆకుకూరలు, తాజాకూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారిలో ఎన్నో రసాయనక్రియలకు, ఎముకల బలానికి, అవయవాల పనితీరుకు, చురుకుదనానికి, పీరియడ్స్ సక్రమంగా రావటానికి అవసరం. ఇది చాలావరకు అండాశయాల నుంచి విడుదల అవుతుంది. కొద్దిశాతం మాత్రమే కొవ్వు నుంచి తయారవుతుంది. ఈస్ట్రోజన్ సరైన మోతాదులో విడుదల అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో అధిక బరువు వల్ల, లేదా పీసిఓడి సమస్య వల్ల హార్మోన్ చికిత్సలో భాగంగా ఈస్ట్రోజన్ మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల కంతులు, ఇంకా ఇతర కారణాల వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా రక్తంలో ఉన్నప్పుడు, ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి రొమ్ము కాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రక్తం గడ్డ కట్టడం, దాని వల్ల గుండె జబ్బులు, బీపి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ హార్మోన్ ఎందుకు ఎక్కువగా ఉందనే దానినిబట్టే నియంత్రించడానికి మార్గాలు చెప్పవచ్చు. అధిక బరువు ఉంటే వ్యాయామాలు, ఆహారనియమాలను పాటించి తగ్గటం, డాక్టర్ పర్యవేక్షణలో కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవటం మంచిది.
మా బంధువుల అమ్మాయికి రీసెంట్‌గా పెళ్లైంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అట. అయితే తను tokophobia సమస్యతో బాధ పడుతున్నారని విన్నాను. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. ఇది గర్భిణి స్త్రీలకు మాత్రమే వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? నివారణ చర్యలు ఏమిటో తెలియజేయగలరు. – కె.అశ్విని, పొద్దుటూరు
కొంతమంది ఆడవారిలో గర్భం దాల్చడమన్నా, కాన్పు నొప్పులన్నా చచ్చేంత ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి గురవుతారు. దానినే టోకోఫోబియా అంటారు. ఇది ప్రైమరీ, సెకండరీ టోకోఫోబియా అని రెండు రకాలుగా విభజించబడుతుంది. ప్రైమరీ టోకోఫోబియా అంటే... అసలు అప్పటిదాకా కాన్పుకానివారిలో ఉంటుంది. వీరిలో కొందరిలో లైంగిక వేధింపులకు గురైనవారు, కొందరి క్లిష్టమైన కాన్పు గురించి విన్నవారు, లేదా చూసినవారు ఉంటారు. దాని వల్ల భయపడి, కాన్పు అంటే ఇష్టంలేకుండా వారికి కూడా అలానే ఉంటుందేమోనని భయపడుతుంటారు. సెకండరీ టోకోఫోబియా అంటే మరలా కాన్పు అంటే భయపడుతుంటారు. టోకోఫోబియా ఉన్నవారిలో కొంతమంది గర్భం కోసం ప్రయత్నించరు. గర్భం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది కలయికకి కూడా దూరంగా ఉంటారు. గర్భం దాల్చిన తర్వాత ఆందోళన, టెన్షన్‌కు గురవ్వటం, నిద్రపట్టకపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లడం, సాధారణ కాన్పుకి ఇష్టపడకపోవడం, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వారికి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, డాక్టర్ దగ్గర కాన్పు గురించి ముందుగానే తెలియజెప్పడం ఎంతో అవసరం. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment