Cancer
-
క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా!
వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్‌గా మారనుంది. క్యాన్సర్ జబ్బు నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు జనరల్ డైరెక్టర్ అయిన అండ్రే కప్రిన్ ప్రకటించారు.చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలా పని చేస్తుందంటే.. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇదే తరహాలో పని చేయనుంది. అంటే..RNA(రిబోన్యూక్లియిక్ యాసిడ్) అనేది ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం. మెసేంజర్ ఆర్ఎన్ఏ పీస్‌ను వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్‌ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.ఏఐ పాత్ర కూడా.. కాగా, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లను రూపొందించడానికి.. AI-ఆధారిత న్యూరల్ నెట్వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అతిత్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్‌తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగానే.. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను జనాలకు.. అదీ ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
గంటలకొద్దీ కూర్చోవడం వల్ల కేన్సర్ వస్తుందా..?
ప్రస్తుతం చాలావరకు డెస్క్ జాబ్లే. అందరూ కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు. శారీరక శ్రమ లేని ఇలాంటి ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కవని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలా గంటలకొద్ది కూర్చొవడం అనేది ధూమపానం సేవించినంత హానికరం అని, దీనివల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇదేంటి కూర్చోవడం వల్ల కేన్సర్ వస్తుందా..?. అసలు ఈ రెండింటికి లింక్ అప్ ఏమిటి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.డెస్క్ జాబ్‌లు చేసేవారు, టీవీ బాగా చూసేవారు, పుస్తకాలు బాగా చదివేవారు, వీడియో గేమ్‌లు ఆడేవారు.. గంటలతరబడి కూర్చునే ఉంటారు. ఇలాంటి వాళ్లు వ్యాయామాలు చేసినా ..ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయమేనని చెబుతున్నారు నిపుణులు. అవి కాస్త కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, అండాశయాలు లేదా ఎండోమెట్రియల్ వంటి కేన్సర్లకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఎలా అంటే..మానవులు నిటారుగా నిలబడితేనే హృదయనాళ వ్యవస్థ, ప్రేగు కదలికలు, కీళ్లు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే శారీరకంగా చురుకుగా ఉండటమే గాక మొత్తం శక్తిస్థాయిలు సమంగా ఉండి.. బాడీకి కావాల్సిన బలాన్ని అందిస్తాయని అన్నారు. స్థిరంగా లేదా నిశ్చలంగా ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేయడం లేదా వీడియో గేమ్‌లు ఆడటం అనేది స్థూలకాయానికి దారితీసి.. కేన్సర్ ప్రమాదాన్నిపెంచే అవకాశం ఉందని అన్నారు. నడిస్తే కేన్సర్ ప్రమాదం తగ్గుతుందా..?వ్యాయామాలు చేయడం మంచిదే గానీ అదీ ఓ క్రమపద్ధతిలో చేయాలి. పెద్దలు కనీసం ప్రతివారం సుమారు 150 నిమిషాల పాటు శారీరక శ్రమపొందేలా తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలని చెప్పారు. ఎక్కువ వ్యాయామాలు చేస్తున్నాం కదా అని.. రోజులో దాదాపు ఎనిమిది గంటలు కూర్చొంటే పెద్దగా ఫలితం ఉండందంటున్నారు. ఎక్కువసేపు నిశ్చలంగా కూర్చోవడం అనేది ఆరోగ్యానికి ప్రమాదమేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..పనిప్రదేశంలో మీ వర్క్‌కి అంతరాయం కలగకుండా కూర్చోనే చేసే చిన్నచిన్న వ్యాయామాలు చేయండి. సాధ్యమైనంత వరకు మీకు కావాల్సిన ప్రతీది మీరే స్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకునే యత్నం చేయండి. ఆపీస్ బాయ్‌పై ఆధారపడటం మానేయండి. కొన్ని కార్యాలయాల్లో స్టాండింగ్ , ట్రెడ్మిల్ డెస్క్‌ల వంటి సామాగ్రి ఉంటుంది. కాబట్టి వాటిని మధ్యమధ్య విరామాల్లో వినయోగించుకోండి. అలాగే ఇంటిని చక్కబెట్టే పనులను కూడా కూర్చోవడానికి బదులుగా నిలుచుని సౌకర్యవంతంగా చేసుకునే యత్నం చేయండి. సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయండి. ఇలాంటి చిట్కాలతో అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూసుకోండి. స్క్రీన్ సమయాన్ని కూడా తగ్గించండి..పరిశోధన ప్రకారం..25 ఏళ్ల తర్వాత టెలివిజన్ లేదా స్క్రీన్‌ని చూసే ప్రతిగంట మీ ఆయుర్దాయాన్ని సుమారు 22 నిమిషాలకు తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎందువల్ల అంటే.. కూర్చొని టీవీ లేదా ఫోన్ చూస్తుంటే సమయమే తెలీదు. అదీగాక తెలియకుండానే గంటలకొద్దీ కూర్చుంటారు ఆయా వ్యక్తులు. దీన్ని అధిగమించాలంటే సింపుల్‌గా స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడమే బెటర్ అని అంటున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
కేన్సర్లను ముందుగా గుర్తించే 'రక్ష ఆధారిత పరీక్ష'..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్ స్పాట్‌గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్ కణితికి సంబంధించిన డీఎన్ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్ ప్రొఫైలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. రక్తంలో డీఎన్ఏ మిథైలేషన్ని గుర్తించడానికి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్ కట్టుబడి ఉంది. భారత్‌లో కేన్సర్ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది. ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ. అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్‌తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్‌ని జయించేలా ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్స్పాట్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ మాయం..!) -
నిమ్మరసం, పచ్చిపసుపుతో క్యాన్సర్‌కు చెక్? సిద్ధూకి రూ. 850 కోట్ల లీగల్ నోటీసు
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌కి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి భారీ షాక్ తగిలింది. అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందన్న వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వారం రోజుల్లోగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లీగల్ నోటీసులిచ్చింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చింది. అంతేకాదు సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని కోరింది.డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ సిద్ధూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ, నిమ్మరసం, పచ్చిపసుపు, వేప, తులసి లాంటి పదార్థాలతో కేవలం 40 రోజుల్లోనే తన భార్య వైద్యపరంగా క్యాన్సర్‌ను జయించిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా దీనిపై సివిల్ సొసైటీ తీవ్రంగా మండిపడింది. సిద్ధూ వాదనలు సందేహాస్పదమైనవి, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.కాగా పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధూ వ్యాఖ్యల్ని ఖండించారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ డైట్ ప్లాన్‌ను వైద్యులతో సంప్రదించి అమలు చేశామని ,"చికిత్సలో సులభతరం"గా పరిగణించాలని సోమవారం తెలిపాడు. మరి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదీ చదవండి: ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా? -
క్యాన్సర్‌కు కొత్త మందు.. డాక్టర్ రెడ్డీస్ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. తిరగబెట్టే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్స కోసం భారత్‌లో తొలిసారిగా టోరిపాలిమాబ్ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని విడుదల చేసింది. నాసోఫారింజియల్ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్‌కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటుచేసుకుంటుంది. పీడీ–1 ఔషధం అయిన టోరిపాలిమాబ్ సంప్రదాయ చికిత్సతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిందని రెడ్డీస్ వెల్లడించింది. భారత్‌లో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది. ఇమ్యునో–ఆంకాలజీ అనేది ఒక క్యాన్సర్ చికిత్స విధానం. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి, నియంత్రించడానికి, తొలగించడానికి రోగనిరోధక వ్యవస్థ శక్తిని ఉపయోగిస్తుంది. చైనా, యూఎస్ తర్వాత ఈ ఔషధం అందుబాటులోకి వచ్చిన మూడవ దేశం భారత్ కావడం విశేషం.ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ.. పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్సకై యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదించిన ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం ఇదేనని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. టోరిపాలిమాబ్ కోసం 2023లో కంపెనీ షాంఘై జున్షి బయోసైన్సెస్‌తో లైసెన్స్, వాణిజ్యీకరణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికాతో సహా 21 దేశాల్లో టోరిపాలిమాబ్‌ను అభివృద్ధి చేయడానికి, అలాగే వాణిజ్యీకరించడానికి డాక్టర్ రెడ్డీస్ ప్రత్యేక హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి తేవడానికి లైసెన్స్ పరిధి విస్తరణకు సైతం ఈ ఒప్పందం అనుమతిస్తుందని కంపెనీ వివరించింది. -
దండెత్తిన క్యాన్సర్‌పై ధ్యానమే సైన్యంగా...
నేను మూడుసార్లు క్యాన్సర్ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్ క్యాన్సర్. 2022లో బ్రెయిన్ క్యాన్సర్. 2024లో మళ్లీ బ్రెయిన్ క్యాన్సర్. నా వయసు 70 ఏళ్లు. క్యాన్సర్‌పై గెలుస్తూనే ఉన్నాను. యోగా, ధ్యానం మనలోని శక్తులను బయటకు తీసి స్థిరంగా ఉంచుతాయి. ధ్యానం నాకు ఆయుధంగా పని చేసింది. క్యాన్సర్ అనగానే కంగారు పడతారు. చికిత్స తీసుకుంటూ పోరాడొచ్చు.. గెలవొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పి కౌన్సెలింగ్ చేస్తుంటా’ అంటున్న హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నిర్మల పరిచయం.‘యోగా మన శరీరానికి ఉండే శక్తుల్ని వెలికి తీస్తే ధ్యానం మన మనసుని నిశ్చలం చేస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులను ఎదుర్కొనడానికి శరీర బలం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానసిక బలం అవసరం. క్యాన్సర్ అనగానే చాలామంది ఆందోళన చెందిన మనసును తద్వారా శరీరాన్ని బలహీన పరుచుకుంటారు. అప్పుడు వైద్యం అనుకున్నంత సమర్థంగా పనిచేయదు. అందుకే నేను నా జీవితంలో క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి యోగా, ధ్యానాలను ఆశ్రయించాను. చికిత్స సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కనుక అన్నిసార్లు యోగా చేయలేము. కాని ధ్యానం చేయవచ్చు. నేను ధ్యానం వల్ల చాలా మటుకు అలజడిని దూరం చేసుకున్నాను. అందుకే పల్లెల్లో స్త్రీలకు అప్పుడప్పుడు యోగా, ధ్యానం గురించి ప్రచారం చేశాను. ఇక ఇప్పుడు చేస్తున్నదేమిటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్లను కలిసి వారి ఆందోళన దూరం చేయడం. నన్ను వారికి చూపించి నేను ఎదుర్కొన్నానంటే మీరూ ఎదుర్కొనగలరని ధైర్యం చెప్పడం. యోగా, ధ్యానాలను ఎలా చికిత్సలో భాగం చేసుకోవాలో సూచించడం’ అన్నారు 70 ఏళ్ల నల్లూరి నిర్మల. ఆమెను చూసినా, ఆమెతో మాట్లాడినా తీవ్ర అనారోగ్యాలలో ఉన్న వారు కచ్చితంగా ధైర్యం తెచ్చుకోగలరని అనిపిస్తుంది. ఆమె అంత ప్రశాంతంగా, దిటవుగా కనిపిస్తారు.చిన్నప్పటి నుంచి సవాళ్లేనల్లూరి నిర్మలది ప్రకాశం జిల్లా. ఆమె తండ్రి నల్లూరి అంజయ్య ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని తమ గ్రామంలోనే ఒక ప్రైవేటు పాఠశాల స్థాపించాడాయన. అలా నిర్మల చదువుకొని జీవిత బీమా సంస్థలో, తర్వాత కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత కోటీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్‌గా పని చేశారు. 1977 నుంచి 2014 వరకు దాదాపు 37ఏళ్ళు అదే బ్యాంకులో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే నిర్మల చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ‘ఆ సమయంలో నా భర్త వ్యాపార పరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నా అనారోగ్యం. అయినా సరే ఆ ఒత్తిడిని, ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్రెస్ట్ క్యాన్సర్‌ని జయించాను’ అని చెప్పారు నిర్మల. మరో రెండుసార్లు దాడిక్యాన్సర్ను జయించానని భావించిన నిర్మలను మరలా ఆ జబ్బు వెంటాడింది. 2022 లో బ్రెయిన్ క్యాన్సర్ నిర్మల శరీరంలోకి ప్రవేశించింది. మొదటిసారి తట్టుకున్నంతగా నిర్మల గారి శరీరం రెండవసారి తట్టుకోలేకపోయింది. అయినా తన మానసిక శక్తితో దాన్ని ఎలా అయినా ఓడించాలన్న సంకల్పంతో క్యాన్సర్‌ను తోక ముడుచుకునేలా చేశారామె. కాని మూడవసారి 2024లో మరలా బ్రెయిన్ క్యాన్సర్ తిరగబెట్టింది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా నిర్మల దానితో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఒక ఆయుధంగా ‘ప్రకృతి యోగా అండ్ నేచర్ క్యూర్’ని నిర్మల ఎంచుకున్నారు. డాక్టర్ సరస్వతి దగ్గర నిర్మల యోగాలో శిక్షణ తీసుకున్నారు. దానివల్ల నిర్మల జీర్ణవ్యవస్థ మెరుగైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు నెమ్మదించాయి. నిర్మల పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో యోగా క్యాంపులు నిర్వహించారు. ఇంటి దగ్గర కూడా యోగా తరగతులు నడిపారు. అలా ‘క్యాన్సర్’పై పోరాడుతూ యోగా–ప్రకృతి–ధ్యానం సమన్వయంతో జీవితాన్ని మళ్ళీ ఆరోగ్య పథంలోకి మళ్లించారు. స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే‘స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే. ఆ సమస్యలను చూస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయొద్దని నేను కోరుతున్నాను. కుటుంబానికి సంబం«ధించి ఎన్ని బాధ్యతలున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మన్యూనతా భావం విడనాడి ధైర్యంగా మసలుకోవాలి, ధ్యానం మీకు దారి చూపిస్తుంది’ అంటారామె. -
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
ఆ బ్రెడ్‌తో కొలెస్ట్రాల్, కొలొరెక్టల్ కేన్సర్‌కి చెక్..!
బ్రెడ్‌ని చాలామంది స్నాక్స్ రూపంలోనో లేదా బ్రేక్ఫాస్ట్గానో తీసుకుంటుంటారు. అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు చెప్పడంతో కొందరూ ప్రత్యామ్నాయంగా గోధుమలతో చేసిన బ్రెడ్‌ని ఎంచుకుంటున్నారు. అయినప్పటకీ పరిమితంగానే తినమని నిపుణులు సూచించడం జరిగింది. అయితే బ్రెడ్ అంటే.. ఇష్టపడే ఔత్సాహికులు ఇలాంటి బ్రెడ్‌ని బేషుగ్గా తినొచ్చని నిపుణులే స్వయంగా చెప్పారు. పైగా ఆ సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.ఈ బ్రెడ్‌పై పరిశోధన చేసిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉటుందని తెలిపారు. స్పెయిన్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..ఆ దేశంలోని ప్రజలు ఏడాదికి సగటున 27.35 కిలోల బ్రెడ్‌ని తింటారట. వారికి ఈ బలవర్ధకమైన బ్రెడ్‌ని అందివ్వగా వారంతా బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ఈ బ్రెడ్ కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్నికూడా తగ్గిస్తుందట. దీని పేరు "రై బ్రెడ్"."రై బ్రెడ్" అనేది కేవలం రై ధాన్యంతో చేసిన రొట్టె. రై ఒక మట్టి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొద్ది మొత్తంలో ఇతర పిండిలతో కలిపి తయారు చేయడంతో రుచి చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. దీన్ని మొలాసిస్, కోకో పౌడర్ వంటి చేర్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు. కలిగే లాభాలు..దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌గా పిలిచే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ధమనుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగి హృదయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కణితులు పెరగకుండా సంరక్షిస్తుంది. ఇందులోని ఫైబర్ పేగు రవాణాను వేగవంతం చేసేలా మల ఫ్రీక్వెన్సీని పెంచి బ్యాక్టీరియా జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఫెరులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు రక్తప్రవాహంలోని చక్కెర, ఇన్సులిన్ విడుదలను నెమ్మదించేలా చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను 14 శాతం వరకు తగ్గిస్తుంది.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: 6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
ఢిల్లీ గాలి యమ డేంజర్
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.భారత్‌లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రొమ్ము క్యాన్సర్‌కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్‌ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్‌ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్‌గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్‌లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్‌లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్‌తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. -
నోటి దుర్వాసనా? కేన్సర్ కావచ్చు!
సాక్షి, హైదరాబాద్: నోటి దుర్వాసన దీర్ఘకాలంపాటు ఉంటే గ్యాస్ట్రిక్ కేన్సర్ సోకిందేమోనని అనుమానించాలని ఏఐజీ ఆస్పత్రులు చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. హెలికోబ్యాక్టర్ పైలోరి (హెచ్.పైలోరి) ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రిలో నూతనంగా స్థాపించిన బ్యారీ మార్షల్ సెంటర్ ఫర్ హెచ్ పైలోరీని నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్‌తో కలిసి నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని హెచ్.పైలోరీ స్ట్రెయిన్స్కు ప్రత్యేకమైన జన్యు లక్షణాలు ఉన్నాయని, దీంతో ఇన్ఫెక్షన్లపై ప్రత్యేక పరిశోధనలు అవసరమని అన్నారు. హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడమే కాకుండా, అది సోకకుండా నిరోధించడమే లక్ష్యంగా బ్యారీ మార్షల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిశోధనల్లో ప్రొఫెసర్ మార్షల్ పాల్గొనడం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో హెచ్.పైలోరీ విషయంలో కొత్త ప్రమాణాలు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. హెచ్.పైలోరీ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు వెంటనే బయటపడవని, ఎండోస్కోపీతో మాత్రమే దీనిని గుర్తించొచ్చని వివరించారు. దీర్ఘకాలంపాటు నోటి దుర్వాసన వస్తే ఈ బ్యాక్టీరియా సోకిందని అనుమానించవచ్చని, అలాంటి వారు ఎండోస్కోపీ చేయించుకుంటే దీన్ని గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. 60% మందిలో హెచ్ పైలోరీ భారత్‌లో హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్లు 50% నుంచి 60% మందిలో ఉన్నాయని ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ చెప్పారు. ఈ బ్యాక్టీరియా కారణంగా దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. మధుమేహంతో వచ్చే సమస్యల కన్నా దాదాపు 10 రెట్లు హెచ్. పైలోరీ వల్ల వస్తాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బ్యాక్టీరియాను కేన్సర్ కారకంగా వర్గీకరించిందని, దీన్నిబట్టే దీని తీవ్రత తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగానే దేశంలో ఉదర సంబంధ కేన్సర్ శాతం పెరిగిందని, దీన్ని లక్ష్యంగా చేసుకుని పరిశోధనలు జరగడం చాలా ముఖ్యమని సూచించారు. -
క్యాన్సర్‌ను జయించొచ్చు
క్యాన్సర్(రాచపుండు)కు ఇప్పుడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలతో ముందుకు సాగితే క్యాన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను కనిపెట్టిన పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ పుట్టిన రోజునే అవగాహన దినంగా నిర్వహించడం గమనార్హం.గుర్తించడం ఎలా?మానకుండా ఉన్న పుండ్లు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.కారకాలుసిగిరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటితోపాటు గుట్కా పాన్, మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల నోటి, పేగు, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, పాంక్రియాటిక్ క్యాన్సర్లూ వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది.మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలుతాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారాల్లో క్యాన్సర్ కణాలు అధికంగా ఉంటాయి. ఇవి తినేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును రోజూ తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్నాన్కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రాంలో గత ఏడాది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ము, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాల్లో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా రోజూ వీరి వద్ద 30 నుంచి 50 మంది వరకు రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. -
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
ఆరు నెలల పోరాటం.. చనిపోవడం ఖాయం అనుకున్నా: హీరామండి నటి
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలుగువారికి సైతం సుపరిచితమే. చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గతంలో మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను భరించలేని బాధను అనుభవించినట్లు తెలిపారు. చికిత్స తీసుకునే సమయంల తాను చనిపోతానని భావించినట్లు వెల్లడించింది. కొన్ని నెలల పాటు అమెరికాలో శస్త్రచికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన తల్లి నేపాల్ నుంచి రుద్రాక్షను తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. కాగా.. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు.మనీషా మాట్లాడుతూ..'2012లో నాకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నేను వైద్యులతో మాట్లాడినప్పుడు చనిపోతానని భావించా. ఇక లైఫ్‌కు ముగిసినట్లే అనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. చివరి స్టేజ్‌లో ఉందని తెలిసింది. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. దాదాపు 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన పునర్జన్మ' అని అన్నారు. -
నలిగిపోతున్ననాలుగో సింహం
పోలీస్ అధికారులు విధులకు ఒకవేళంటూ ఉండదు. లా అండ్ ఆర్డర్లో ఉండే సిబ్బందికి ఉరుకులుపరుగులు మరీ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, కేసుల దర్యాప్తు, కోర్టులకు హాజరుకావడం..ఉన్నతాధికారుల సమీక్షలకు వెళ్లడం..ఇలా బహుళ డ్యూటీలు చేస్తుండాలి. ఏఆర్, టీజీఎస్పీ సిబ్బంది విధుల్లోనూ తిప్పలు తప్పవు. పండుగలు, సభలు, సమావేశాలు, వీఐపీల బందోబస్తులంటూ గంటల తరబడి నిలబడక తప్పదు. ఇలా శారీరకంగా, మానసికంగానూ శ్రమ ఎక్కువే. ఈ ప్రభావం అంతా పోలీసుల ఆరోగ్యంపై వివిధ జబ్బుల రూపంలో చూపుతోంది. బీపీ, షుగర్‌తో మొదలై క్రమంగా పలు ప్రమాదకర జబ్బులకు దారితీస్తోంది. 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు ఆరోగ్య భద్రత అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..6,347 మంది కేన్సర్ చికిత్స తీసుకున్నారు. రెండో స్థానంలో కిడ్నీ రోగులు ఉన్నారు. 4,922 మంది నెఫ్రాలజీ చికి త్స తీసుకున్నారు. యూరాలజీ సమస్యలతోనూ ఎక్కువ మందే బాధపడుతున్నారు. గుండె జబ్బుల కారణంగా 2,875 మంది ఆస్పత్రులపాలయ్యారు. మానసిక ఒత్తిడిసైతం అధికంగానే ఉంటోంది. కొన్నిసార్లు బీపీ పెరగడంతో న్యూరో సమస్యలు వస్తున్నాయి. న్యూరాలజీకి సంబంధించి 1,937 మంది చికిత్స పొందారు. వేతనం నుంచి కార్పస్ ఫండ్‌కు నిధులు ఆరోగ్య భద్రత కార్పస్ ఫండ్ కోసంకానిస్టేబుల్ నుంచి ఎస్సై ర్యాంకు వరకుకేటగిరీ–1 కింద నెలకు రూ.200 చొప్పున,ఇన్స్పెక్టర్ నుంచి డీజీపీ ర్యాంకు వరకుకేటగిరీ–2 కింద అధికారుల వేతనంలో నెలకు రూ.250 చొప్పున జమ చేస్తున్నారు. ఇలా పోలీస్‌శాఖలోని 68 వేల మంది సిబ్బంది నుంచి ఈ కార్పస్ ఫండ్ నిధులు జమ అవుతుంటాయి. కేన్సర్..లేదంటే కిడ్నీ సమస్యలతో పోలీసుల సతమతంసాక్షి, హైదరాబాద్: కేన్సర్..లేదంటే కిడ్నీ జబ్బుల బారిన పడే పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే..ఈ విషయం స్పష్టమవుతోంది. పోలీస్‌శాఖలోని దాదాపు 40 శాతం మందికిపైగా సిబ్బందికి బీపీ, షుగర్ రావడం సర్వసాధారణంగా మారింది. పనిఒత్తిడి, సమయం తప్పిన ఆహారంతోనూ అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పోలీస్ అధికారులు, సిబ్బంది..వారి కుటుంబీలకు ఆరోగ్య భద్రత పథకం కింద పలు నెట్వర్క్ ఆస్పత్రులలో వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య భద్రత కింద 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది కలిపి మొత్తం 1,04,014 మంది పలు రోగాలకు చికిత్సలు పొందారు. వీరి వైద్యం కోసం రూ.446.3 కోట్లు ఖర్చు చేశారు. పోలీస్ సిబ్బంది తల్లిదండ్రుల్లో 45,923 మంది చికిత్సకు రూ.318.03 కోట్లు ఖర్చు చేశారు. వైద్యంతోపాటు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీస్‌శాఖ నుంచి ఆరోగ్య భద్రత కింద ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉచిత ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఓపీ పేషెంట్లకు సబ్సిడీ ధరలకే వైద్య పరీక్షలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రకాల డయాగ్నొస్టిక్ సెంటర్లతో ఆరోగ్య భద్రత ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆరోగ్య భద్రత కింద లబ్దిదారుల సంఖ్యతోపాటు వైద్యఖర్చులు పెరగడంతో ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం నుంచి రావా ల్సిన రీయింబర్స్మెంట్ నిధులు సైతం పేరుకుపోతున్నాయి. 2021 నుంచి రీయింబర్స్మెంట్ సకాలంలో జరగడం లేదు. దాదాపు రూ.200 కోట్ల వరకు ఆరోగ్య భద్రత నిధులు పెండింగ్ ఉండగా.. ఇటీవలే 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రీయింబర్స్మెంట్ నిధుల పెండింగ్ కారణంగా కొన్ని సార్లు ఆస్పత్రులు వైద్యం అందించేందుకు ఇబ్బంది పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటూ సిబ్బందికి సకాలంలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవీ జబ్బులకు ప్రధాన కారణాలు» పోలీస్ అంటే 24 గంటలపాటువిధి నిర్వహణ తప్పని ఉద్యోగం.పోలీస్స్టేషన్లలో శాంతిభద్రతల విధులు మొదలు ఏ ప్రత్యేక బలగంలో ఉన్నా.. ఒత్తిడి తప్పనిసరి అవుతోంది. » ఎండ, వాన, చలి,దుమ్మూధూళి, కాలుష్యంఇలా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం సైతం జబ్బులకు కారణమవుతోంది. » బందోబస్తు విధుల్లో ఉన్నా.. ట్రాఫిక్ విధుల్లో ఉన్నా..గంటల తరబడి నిలబడక తప్పని పరిస్థితి. » ఆహార నియమాలవిషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఉన్నా.. తీసుకునేలా పరిస్థితులు లేకపోవడం సైతం అనారోగ్యానికి కారణం అవుతోంది. » శాంతిభద్రతల విధుల్లో ఒక్కోసారి తగినంత విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితులుఉండడం సైతం శారీరకశ్రమను పెంచుతోంది. -
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
కోరలు చాస్తున్నక్యాన్సర్
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 2022 సంవత్సరంలో ఒక్క రొమ్ము క్యాన్సర్ కారణంగానే దేశంలో 98,337 మంది మహిళలు మృతి చెందినట్లు గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) నివేదిక వెల్లడించింది. అదే ఏడాది నోటి క్యాన్సర్ బారినపడి 79,979 మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇది కచ్చితంగా ప్రమాద సూచికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా హెచ్చరించింది. ముఖ్యంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో క్యాన్సర్ విజృంభణపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 33.6 శాతం, మరణాల్లో 36.9 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్ మరణాల్లో 42 శాతం ఈ దేశాల్లోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 12.8 శాతం పెరుగుదల 2020తో పోలిస్తే 2025లో దేశంలో 12.8 శాతం మేర క్యాన్సర్ కేసుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పొగాకు వినియోగం వల్ల పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి. వీటి కారణంగానే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ దేశాల్లో మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడైంది.మహిళలు 40 ఏళ్ల నుంచి జాగ్రత్తలు పాటించాలి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 10 శాతం రొమ్ము క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి. 90 శాతం కేసులు సాధారణంగా వస్తుంటాయి. కుటుంబంలో ఒక తరం స్త్రీకి 50 ఏళ్లలో క్యాన్సర్ బయటపడితే తర్వాతి తరంలోని ఆమె కూతుళ్లు, వారి సంతానం 10 ఏళ్లు ముందే అంటే 40 ఏళ్లకే జాగ్రత్త పడాలి. బ్రాకాజీన్ టెస్ట్ చేయించుకుంటే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమణను గుర్తించవచ్చు. మిగిలిన మహిళలైతే 40 ఏళ్ల నుంచే నెలసరి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లోనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. గడ్డలు ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 45 ఏళ్ల వయస్సు నుంచి రొమ్ము క్యాన్సర్‌కు మామోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌కు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే వైద్య రంగం అభివృద్ధి చెందింది. అధునాతన చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్టేజ్‌లో క్యాన్సర్ బయటపడినా చికిత్స చేయొచ్చు. – డాక్టర్ జె.విజయకృష్ణ, క్లినికల్ అంకాలజిస్ట్, విజయవాడ -
వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?
ఈ రోజుల్లో వెన్ను నొప్పి అత్యంత సర్వసాధారణం. కంప్యూటర్ల ముందు గంటలకొద్ది కూర్చొని చేసే ఉద్యోగాలు కావడంతో ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇవి ఎక్కువైపోయాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కాల్షియం లోపం వల్లనో లేక కూర్చొనే భంగిమ తేడా వల్లనో అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం అసలుకే తేడా వచ్చి ప్రాణాంతకంగా మారిపోతున్న కేసులు కోకొల్లలు. ఇవాళ ప్రపంచ వెనుముక దినోత్సవం పురుస్కరించుకుని అసలు ఇలాంటి సమస్యని ఎలా గుర్తించగలం? అందుకు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలేంటో సవివరంగా నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా..!.వెన్నుముక సమస్యలు లేదా తరచుగా వెన్నునొప్పి వేధిస్తుంటే తక్షణమే వైద్యుని సంప్రదించి ఎక్స్‌రే, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లు తప్పనిసరిగా తీయించుకోవాలి.అలాగు వీటి తోపాటు పెట్ సీటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు వెన్నుముక కణితులు వెన్నుపాము వెలుపల ఉన్నాయా..? దాని లోపలే ఉన్నాయా అనేది నిర్థారించాల్సి ఉంటుంది. వెన్నుముక కేన్సర్ లక్షణాలు..వెనుముకలోనే కేన్సర్ కణితులు ఉన్నట్లయితే ఎముక నిర్మాణ విస్తరించడం లేదా బలహీనపడటం జరుగుతుంది. అలాగే వెన్నుముక నరాలు కుదింపుకు గురై నొప్పి కలిగించొచ్చు.వెన్నుముక అస్థిరత వంటి కారణంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి క్రమంగా ప్రారంభమై కాలక్రమేణ తీవ్రమవుతుంది. విశ్రాంతితో సెట్ కాదు. పైగా రాత్రి సమయాల్లో మరింత తీవ్రమవుతుంది. అలాగే ఎగువ లేదా దిగువ భాగంలో షాక్‌లాంటి నొప్పిన కలిగిస్తాయి. కండరాల బలహీనతతిమ్మిరిజలదరింపుఉష్ణోగ్రత సంచలనంమూత్రాశయం లేదా ప్రేగు నియంత్రణ కోల్పోవడంలైంగికంగా బలహీనం కావడంనడవడంలోనూ సమస్యఎలా నిర్థారిస్తారంటే..వెనుముక కణితిని నిర్థారించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. వెన్నుముక కదలికలు గురించి తెలుసుకోవడానికి నరాల ద్వారా పరీక్ష చేసి గుర్తిస్తారు. వీటి తోపాటు కొన్ని ఇతర పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.రక్త పరీక్షలువెన్నెముక అమరికలుమూత్ర పరీక్షలుమాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా ఎంఆర్ఐమాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ లేదా ఎంఆర్ఎస్సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ లేదా స్పెక్ట్యాంజియోగ్రఫీమాగ్నెటెన్సెఫలోగ్రఫీకణజాల బయాప్సీలు(చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..?
వయసు పెరగడమన్నది అందరిలోనూ చాలా సహజంగా జరిగిపోతుంటుంది. చాలాకాలం పాటు యూత్‌ఫుల్‌గా కనిపించడం అందరూ కోరుకునేదే. అంతేగానీ... వయసు పెరగాలని ఎవరూ కోరుకోరు. కొందరు వయసుపరంగా చాలా పెద్దవారైనా... చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు. వయసు చెప్పగానే ఆశ్చర్యపోయేంత యౌవనంతో ఉంటారు. ఇలా వయసు తగ్గి యౌవ్వనంతో కనిపించడంతో పాటు, కేన్సర్‌ను కూడా నివారించే ఆహారాన్ని కాదనుకునేవారెవరు? అలా వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేయడంతోపాటు కేన్సర్‌ను నివారించే పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, వాటితో ఉండే ఇతర ప్రయోజనాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం. వయసు పెరగడంతో శారీరకంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉదాహరణకు చర్మం కాస్త వదులైపోడం, కళ్ల కింద, నుదుటి మీద గీతల వంటివి. ఇలా వచ్చే మార్పులనే ఏజింగ్‌తో వచ్చే మార్పులంటారు. కొన్ని రకాల ఆహారాలతో ఈ ఏజింగ్ ప్రక్రియ వేగవంతవుతుంది.ఉదాహరణకు ఎక్కువ తీపి ఉండే పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ వంటి జంక్‌ఫుడ్ తీసుకునేవారిలో ఏజింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఏజింగ్కూ, అలాగే కొందరిలో కేన్సర్‌కు దారితీసే ఫ్రీ–ర్యాడికల్స్ అనే పదార్థాలు కారణం. ఈ ఫ్రీ–ర్యాడికల్స్‌ను సమర్థంగా అరికట్టేవే యాంటీఆక్సిడెంట్స్. దేహంలో ప్రతినిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేటప్పుడు కొన్ని కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్ అన్నవి దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా గణనీయంగా దెబ్బతింటుంది.యాంటీ ఆక్సిడెంట్స్ అంటే...? ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్‌తో చర్య జరిపి, కణాలపై వాటి ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఫ్రీ–ర్యాడికల్స్లో ఉండే పదార్థాలు కణాల్లోని రసాయనాలతో ఆక్సిడేషన్ చర్య జరపడం ద్వారా కణాన్ని దెబ్బతీస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రీ–ర్యాడికల్స్‌ను అడ్డుకుని ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు ఆక్సిడేషన్ కానివ్వకుండా ఆపుతాయి. అలా ఫ్రీర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. అంటే ర్యాడికల్స్ ద్వారా జరిగే ఆక్సిడేషన్ను తటస్థీకరణ (న్యూట్రలైజ్) చేస్తాయి. అందువల్ల ఫ్రీ–రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆగిపోతాయి. దాంతో ఫ్రీ–రాడికల్స్ కణాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదు. మామూలు కణం కేన్సర్ కణంగా మారడమూ ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్ కారణంగా కణంలో ఆక్సీకరణ జరగకుండా ఆపేస్తాయి కాబట్టే ఆహార పదార్థాల్లోని ఆ పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు.యాంటీ ఆక్సిడెంట్స్‌తో లాభాలివి.. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జీవక్రియల ద్వారా కణంలో జరిగే విధ్వంసాన్ని (సెల్ డ్యామేజీని) ఆపేస్తాయి. సెల్ డ్యామేజ్ తగ్గడం వల్ల కణం చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సెల్ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం, అత్యధిక శారీరక శ్రమ, అల్ట్రావయొలెట్ కాంతి వల్ల జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ–ర్యాడికల్ వల్ల జరిగే అనర్థాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు. దాంతో చాలాకాలంపాటు యౌవనంగా కనిపిస్తారు. ఫ్రీ–రాడికల్స్ ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అప్పుడా మామూలు కణం కాస్తా... కేన్సర్ కణంగా మారిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. పోషకాల్లోని రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్... వాటితో ప్రయోజనాలుబీటా–కెరోటిన్ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్ గుణం ఉంటుంది. ఇవి పసుప్పచ్చ, నారింజరంగులో ఉండే అన్ని పండ్లు, కూరగాయల్లో, ఆకుకూరల్లో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్ మెంబ్రేన్)ను సురక్షితంగా కాపాడతాయి. దాంతో ఆ పొరను ఛేదించి ఏ హానికరమైన కాలుష్యాలూ కణంలోకి చేరలేవు. అందుకే పైన పేర్కొన్న రంగు పండ్లు తింటే క్యాన్సర్ నుంచి రక్షణతో పాటు కణం చాలాకాలం పాటు ఆరోగ్యంగా, యౌవనంతో ఉంటుంది. లైకోపిన్ అనే ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్ ఉండే ఆహారాల్లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. పుచ్చకాయలోనూ ఎక్కువే. లైకోపిన్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు కేన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్‌ను నివారించడంలో లైకోపిన్ చాలా సమర్థంగా పనిచేస్తుంది. అల్లిసిన్ అనే చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లిసిన్ రక్తంలోని కొలెస్టరాల్నూ తగ్గిస్తుంది. ఇది వెల్లుల్లి, ఉల్లిలో ఎక్కువగా ఉంటుంది.ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్ యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో పుష్కలంగా ఉంటాయి. అవి అనేక రకాల కేన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. యాంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్ నివారిస్తుంది. ఫ్లేవనాయిడ్స్ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్. వాటికి ఫ్రీ–రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. అందుకే వాటిల్లో సహజసిద్ధమైన క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువ. పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్–సి కూడా చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్–ఈ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్స్. చివరగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను తీసుకుంటే ఒక పక్కన మంచి యౌవ్వనాన్ని చాలాకాలం పాటు కాపాడుకోవడమే కాకుండా... ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారించినట్టూ అవుతుంది. (చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) అనేది తీవ్రమైన కేన్సర్ దశ. ప్రారంభ దశలో గుర్తిస్తే..చికిత్స చేయడం సులభం. పైగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు కూడా. అదే స్టేజ్4 దశలో నయం కావడం కష్టం. జీవితాంత ఆ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంటే ఈ దశలో బతుకున్నంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఈ దశలో కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇక్కడ రోగికి కావాల్సింది మానసిక బలం. ఏ వ్యాధినైనా ఎదుర్కోవాలంటే మానసిక స్థైర్యం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్. అందులోనూ కేన్సర్‌కి స్టేజ్ 4 దశకు ఇది మరింత అవసరం అని అన్నారు. అలాంటి పేషెంట్లు మానసిక ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ ఆటను కట్టించి..మీ ఆయువుని పెంచుకోగలుగుతారని చెప్పారు. అవేంటంటే..45 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలైన నీతా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ప్రారంచికిత్సలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవి ఆమె ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్నితీవ్రంగా ప్రభావితం చేశాయి. తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన ఎక్కువై కుంగిపోతుండేది. అప్పుడే ఆమె కేన్సర సపోర్ట్ గ్రూప్‌లో చేరి మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లతో ఆ వ్యాధితో బతకటం నేర్చుకుంది. ధైర్యంగా జీవించడం అంటే ఏంటో తెలుసుకోగలిగిందని తన పేషంట్ల అనుభవాలను గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ పాటిల్ అలాంటి రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా ఆవ్యాధిని నిర్వహించగలరో చెప్పారు . అందుకోసం ఏం చేయాలో కూడా సవివరంగా తెలిపారు. అందుకోసం ఏం చేయాలంటే..ఎలాంటి చికిత్స అయితే మంచిదో వైద్యునితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న చికిత్సకు అనుగుణంగా ఎదరుయ్యే పరిణామక్రమాలను తట్టుకునేందుకు మానసికంగా సిద్ధం కావాలి. ఈ స్థితిలో మానసికంగా ఎదురవ్వుతున్న కల్లోలాన్ని తట్టుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ల తీసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి చేయాలి. అలాగే మీలాంటి స్థితిలో ఉన్నవాళ్లతో మీ బాధను పంచుకోవడం వంటివి చేయాలి. ఇది ఎంతో స్టైర్యాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదు, మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. మానసిక ధైర్యం కూడగట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసుకునేలా యోగ, మెడిటేషన్ వంటి వాటిలో నిమగ్నం కావాలి. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఈ వ్యాధితో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించడంలో సహయపడుతుంది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి ఇవి మనసును ఉత్సాహపరుస్తాయి. అలాగే చికిత్సకు సంబంధించి ప్రతీది తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీ చికిత్సకు సంబంధించిన దాని గురించి వైద్యులతో మాట్లాడి, భరోసా తీసుకోండి తప్ప ఆందోళన చెందేలా ప్రశ్నలతో వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్.(చదవండి: ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!) -
అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!
ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. అవి ఎటువైపుకి తీసుకువెళ్తాయో కూడా చెప్పలేం. అలాంటి సమయాల్లో సరైన నిర్ణయాలతో అడుగులు వేసినవాళ్లే అసామాన్య వ్యక్తులుగా నిలిచిపోతారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి అసామాన్యురాలే ఈ అంబికా పిళ్లై. ఒకదాని వెంట ఒకటిలా కష్టాలు తరుముతున్న ఎక్కడ తన గమనం ఆపలేదు. తన అసామాన్య ప్రతిభతో దూసుకుపోయింది. చివరికి ప్రపంచమే మెచ్చే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుని ప్రశంసలందుకుంది.భారతదేశంలోని ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు అంబికా పిళ్లై. జీవితంలో కష్టాలనేవి సహజమే. కానీ ఎలాంటి కష్టానికైనా.. తలవంచకుండా ధైర్యంగా సాగిపోయేవాడికే ఈ ధూనియా సలాం కొడుతుంది. అదే మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్లై విషయంలో జరిగింది. కేరళకు చెందిన పిళ్లై నలుగురు సోదరిమణులలో రెండోవది. ఆమె 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. 22 ఏళ్లకు కవిత అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ తర్వాత 24 ఏళ్లకే వైవాహి జీవితంలో మనస్పర్థలు తలెత్తి విడాకులకు దారితీసింది. ఆ బాధను పట్టిదిగువున బిగపెట్టి కూతురే జీవితంగా కెరీర్‌పై దృష్టి పెట్టింది. అలా ఆమె తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిగ్గే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే ఆమె జీవితాన్ని ఉన్నతమైన స్థితికి వెళ్లేలా చేసింది. చిన్న మేకప్ ఆర్టిస్ట్ కాస్త 1999-2000లో FDCI ఇండియన్ ఫ్యాషన్ వీక్కి పనిచేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రోహిత్ బాల్, సుస్మితా సేన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజ నటులకు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో భయంకరమైన కేన్సర్ వ్యాధి బారినపడింది. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ పరంగా స్నేహితురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. రెండు కోలుకోలేని దెబ్బలతో తిరిగి కోలుకోలేనంతగా చతికిలపడింది అంబికా జీవితం. అంతా అంబికా అయిపోయింది అనుకున్నారు. కానీ ఆమె కష్టాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కేన్సర్‌ని జయించి మళ్లీ నెమ్మదిగా యథావిధిగా తన గమనం సాగించింది. ఇక స్నేహితురాలి మోసంతో తన సొంత పేరుతోనే స్వయంగా వ్యాపారం చేయడం ప్రారంభించింది. అలా ఆమె త్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా IIFA అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత 2019లో తన సొంత హెర్బల్ బ్యూటీ బ్రాండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు 70 ఏళ్లు. ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంటి నుంచే బిజినెస్ పనులన్ని నిర్వహిస్తోంది. ఆమెకు చిన్న చిన కథలు రాసే అలవాటు ఉందంట. అందుకని ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక పుస్తకం రాయాలను భావిస్తోందట అంబికా పిళ్లై. ఇంత భయానక కష్టాలను అవలీలగా జయించుకుని రావమే గాక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుని ప్రపంచం తనవైపు చూసేలా చేసింది. జీవించడమంటే ఇది కథా.! అనేలా జీవించి చూపించి స్ఫూర్తిగా నిలిచింది అంబికా పిళ్లై.(చదవండి: సాల్మన్ చేపలతో సౌందర్యం..!) -
క్యాన్సర్‌కు నమ్మకమే ఆన్సర్
బ్లడ్ క్యాన్సర్ సోకిన డాక్టర్ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్. అందునా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావడంతో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్ సోకిందేమో అనుకుంది. ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్ హాస్పిటల్లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి. డాక్టర్ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్‌నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్ సోకిందేమోనని మొదట అనుకుంది.తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్‌క్యాన్సర్... అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్ కౌంట్ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్‌కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్ హాస్పిటల్‌లోని హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అనే బ్లడ్ క్యాన్సర్‌గా తేలింది.నాకే ఎందుకిలా... డాక్టర్ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్. ప్రతి వీకెండ్‌కూ బెంగళూరు కబ్బన్ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్ క్యాన్సర్ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ ఆమె వెతలు ఆమె మాటల్లోనే...‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్’ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’డాక్టరే పేషెంట్ అయితే...‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్ నేత్రావతి. చివరగా...డాక్టర్ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్‌న్యాప్... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్ బ్లడ్ కౌంట్‌లో తెల్లరక్తకణాలు నార్మల్‌గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... ‘అక్యూ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అని పిలిచే ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు. -
World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ..
రోజ్ డే అనగానే ఎవరికైనా సరే ప్రేమ జంటలకు సంబంధించిన వాలంటైన్స్ వీక్ గుర్తుకువస్తుంది. అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రోజ్‌డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్‌లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.ఇది కూడా చదవండి: టీనేజ్‌లో ముఖ్యం.. మానసిక ఆరోగ్యం