
నానాటికీ పెరిగిపోతున్న కేసులు, మరణాలు
దేశంలో క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా క్యాన్సర్ బారినపడుతున్నట్లు తెలియజేసింది.
భవిష్యత్తులో క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని హెచ్చరించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ–2022 అంచనాల ఆధారంగా గణాంకాలు రూపొందించారు. ఇందుకోసం 36 రకాల క్యాన్సర్లు, నాలుగు రకాల వయసు గ్రూప్‌లను పరిగణనలోకి తీసుకున్నారు.
→ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.
→ క్యాన్సర్ సంబంధిత మరణాల్లో చైనాది మొదటిస్థానం కాగా ఇండియాది రెండోస్థానం.
→ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికంగా ఉంటున్నారు.
→ పురుషులు, మహిళల్లో లంగ్ క్యాన్సర్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.
→ భారత్‌లో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు తక్కువగా కనిపిస్తోంది.
→ యువతీ యువకుల కంటే వృద్ధులకు క్యాన్సర్ ముప్పు అధికంగా పొంచి ఉంది.
→ ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగిపోనుంది. తద్వారా క్యాన్సర్ రేటు సైతం పెరగనుంది.
→ మధ్య వయసు్కలు, వృద్ధులతో పోలిస్తే చిన్నారులు, యువతకు క్యాన్సర్ ముప్పు అంతగా లేదు.
→ మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలు ప్రతిఏటా 1.2 శాతం నుంచి 4.4 శాతం పెరుగుతున్నాయి. పురుషుల్లో ఇది 1.2 శాతం నుంచి 2.4 శాతంగా ఉంది.
→ 2022 నుంచి 2050 వరకు క్యాన్సర్ సంబంధిత మరణాల రేటు 64.7 శాతం నుంచి 109.6 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
→ దేశంలో 2012 నుంచి 2022 వరకు క్యాన్సర్ కేసులు 36 శాతం పెరిగాయి. 2012లో 10.1 లక్షల కేసులు నమోదు కాగా, 2022లో 13.8 లక్షల కేసులు నమోదయ్యాయి.
→ అదే సమయంలో క్యాన్సర్ సంబంధిత మరణాలు 30.3 శాతం పెరిగాయి. 2021లో 6.8 లక్షల మంది, 2022లో 8.9 లక్షల మంది క్యాన్సర్ వల్ల మృతిచెందారు.
→ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఏకంగా 70% మంది మధ్య వయస్కులు, వృద్ధులే ఉంటున్నారు.
→ క్యాన్సర్ నియంత్రణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోందని పేర్కొంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment