premature deaths
-
WHO: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది. డబ్లూహెచ్ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే 2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చాలా దేశాలు సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు 1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి. 2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి. 3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి. 4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది. చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్.. టేకాఫ్ క్యాన్సిల్ -
భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు. గంగా మైదానంలో అధికం భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది. -
పొగ చూరిన బతుకు!
42 లక్షలు - వాయుకాలుష్యం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న ప్రిమెచ్యూర్ డెత్స్ 25 లక్షలు - భారత్‌లో 2015లో సంభవించిన కాలుష్యకారక మరణాలు సాక్షి, హైదరాబాద్: మెదడుకూ ‘పొగ’ పడుతోంది! మానవ మేధస్సునూ వాయు కాలుష్యం కాటేస్తోంది!! ఇప్పటివరకూ ఊపిరితిత్తులు, గుండెపైనే విషపు గాలులు ప్రభావం చూపుతున్నాయని అందరూ భావిస్తుండగా మెదడునూ అది క్రమంగా దెబ్బతీస్తున్నదనే విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. అత్యధికస్థాయిలోని విషపూరితమైన గాలి ప్రభావం ఓ ఏడాది విద్యాసంవత్సరం కోల్పోవడంతో సమాన స్థాయిలో ఉంటుందన్న విషయం వెలుగుచూసింది. విద్యార్థుల ప్రతిభాపాటవాలపై వాయుకాలుష్యం ప్రభావం చూపుతోందని గతంలోనే వెల్లడైంది. అయితే తొలిసారిగా కాలుష్య ప్రభావం వివిధ వయసుల స్త్రీ, పురుషులపై ఏస్థాయిలో ఉంటోందన్న అంశం తెలిసింది. అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్, పెకింగ్ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో అధ్యయనం సాగింది. ఇందులో వెల్లడైన అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని యూకే పబ్లిక్ హెల్త్చారిటీ మెడాక్ట్ ప్రతినిధి రెబెకా డానియల్స్ పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలను ప్రతిష్టాత్మక ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రచురించింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలివే... ♦ ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది ప్రజలు కలుషిత వాయువును పీలుస్తున్నారు. ♦ అధికమోతాదులో కాలుష్యం కారణంగా విద్యార్థుల్లో గణితం, భాషా సబ్జెక్టుల్లో ప్రతిభ తగ్గింది. ♦ సగటున ఓ వ్యక్తి ఏడాది చదువు నష్టపోయినంత స్థాయిలో ఈ ప్రభావం పడుతోంది. ♦ వయసు పైబడిన (64 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్న) వారిపై వాయుకాలుష్యం ప్రభావం మరింత తీవ్రంగా పడుతోంది. ♦ కాలుష్య ప్రభావం కారణంగా పెద్దవారు మాటల కోసం, చిన్న లెక్కలు పూర్తి చేయడానికి తడుముకోవడాన్ని ప్రస్తావించారు ♦ మగవారిపై ముఖ్యంగా తక్కువ చదువుకున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ♦ బిజీరోడ్లకు సమీపంగా నివసించే వారిలో మతిమరుపు పెరుగుతోంది పురుషులపైనే ఎక్కువ ప్రభావం... ♦ ప్రజలు ఎంత ఎక్కువగా అపరిశుభ్రమైన గాలిని పీలుస్తారో, వారి తెలివితేటలపై అంత ఎక్కువ ప్రభావం పడుతోంది. ♦ గణితంకంటే భాషాపరమైన సామర్థ్యానికి అధికనష్టం జరుగుతోంది. ♦ మహిళలకంటే పురుషులకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ♦ ఆడ, మగవారి మెదళ్లు పనిచేసే తీరు భిన్నంగా ఉండటమే దీనికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. ♦ కాలుష్య ప్రభావం ఎక్కువున్న రోజుల్లో ఏదైనా ముఖ్యమైన ప్రవేశపరీక్షకు విద్యార్థులు హాజరైనప్పుడు సరైన ఫలితాలు సాధించలేకపోయారు. భారత్‌కూ హెచ్చరికలు... చైనాలో జరిపిన ఈ పరిశోధన ప్రపంచంమొత్తానికి వర్తిస్తుంది. ముఖ్యంగా భారత్‌కు ఇందులో వెల్లడైన అనేక అంశాలు వర్తిస్తాయి. వాయుకాలుష్యం కారణంగా తలెత్తిన సమస్యలతో 2015లో మనదేశంలో 25 లక్షల మంది చనిపోయారు. చైనాలో వాయుకాలుష్యం ప్రభావంతో ఎదురైన పరిస్థితులే భారత్‌లోనూ ఉన్నాయి. అభివృద్ధిపథంలో సాగుతున్న విధంగానే కాలుష్య ప్రేరకాలు కూడా ఈ రెండుదేశాల్లో అంతేస్థాయిలో ఉన్నాయి. కాలుష్య ప్రభావం, తీవ్రతలో హెచ్చుతగ్గులున్నట్టే ఆరోగ్యంపై ప్రభావం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. – సునీల్ దహియా, గ్రీన్‌పీస్ ఇండియా ప్రచారకర్త కాలుష్యకారక వాహనాలను నడవనివ్వకూడదు... మనుషుల ప్రతిభపై వాయుకాలుష్యం ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనంలో వెల్లడికావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. నివాస ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంకావడంవాయుకాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం. భారీస్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను రోడ్లపై నడవనివ్వకూడదు. – ఆరాష్ సలేహ్, యూకేలోని రెస్పిరేటోరీ మెడిసిన్ రిజిస్ట్రార్, డాక్టర్స్ అగైనెస్ట్ డీజిల్ ప్రచార భాగస్వామి అల్జీమర్స్‌కు దారితీయొచ్చు... వాయుకాలుష్యం స్వల్పకాలికంగా కూడా తెలివితేటలపై ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. మేధస్సుపై పడిన ఈ కాలుష్య దుష్ప్రభావం క్రమంగా పెరుగుతుందని అంచనావేస్తున్నారు. మూడేళ్ల కాలంలో గాలిలో మిల్లీగ్రాము కాలుష్యం పెరిగితే నెలరోజులచదువు నష్టపోయిన దానికి సమానమని, సూక్ష్మస్థాయి కాలుష్య కణాలతో మరింత నష్టం వాటిల్లుతుందంటున్నారు. మెదడుపై ధూళి కణాల ప్రభావంతో ప్రతిభ తగ్గి అల్జీమర్స్, ఇతర రకాల డిమెన్షియా రావొచ్చని విశ్లేషిస్తున్నారు. అధ్యయనం సాగిందిలా... 2010–14 మధ్య ‘చైనా ఫ్యామిలీ ప్యానెల్ స్టడీస్’భాష, గణితం సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో ఆ దేశంలోని 20 వేల మంది విద్యార్థులు రాసిన జవాబుపత్రాలను విశ్లేషించారు. ఈ ఐదేళ్ల కాలంలో 32 వేల మంది చైనీయులపై స్వల్ప, దీర్ఘకాలంలోపడిన వాయుకాలుష్య ప్రభావాన్ని పరిశీలించారు. -
ఆ కార్లతో గర్భస్థ శిశు మరణాలు
బోస్టన్(యూఎస్ఏ): వోక్స్వ్యాగన్ కార్ల నుంచి విడుదలయ్యే హానికారక పొగ కారణంగా యూరప్, అమెరికాలో గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, ఆ కార్లు వెదజల్లిన కాలుష్యం బారిన పడినవారిలో ఒక్కో వ్యక్తి ఆయుర్ధాయం సగటున పదేళ్లు పడిపోయినట్లు ఆ అధ్యయనం వివరించింది. వివిధ దేశాల పరిశోధకులతోపాటు యూఎస్‌లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు చేపట్టిన అధ్యయనంపై ‘ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ లెటర్స్’ జర్నల్‌లో ప్రచురితమైన వివరాలివీ.. 2008-15 మధ్య కాలంలో జర్మనీకి చెందిన వోక్స్వ్యాగన్ కంపెనీ 11 మిలియన్ల డీజిల్ కార్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రమాణాల మేరకే వాటిని తయారు చేసినట్లు సంస్థ అప్పట్లో ప్రకటించింది. అయితే, కార్ల నమూనాపై పలు సందేహాలు రావటంతో నిపుణులు పరిశీలించారు. ఆ పరిశీలనలో వోక్స్వ్యాగన్ కార్లు ఈయూ ప్రమాణాలు నిర్దేశించిన వాటికంటే నాలుగు రెట్లు ఎక్కువ నైట్రిక్స్ ఆక్సైడ్లు, ఇతర కాలుష్యాలను వాతావరణంలోకి వెదజల్లినట్లు తేలింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తటంతో అమెరికా, యూరోప్‌లలో ఉన్న కార్లను వోక్స్వ్యాగన్ సంస్థ వెనక్కి తీసేసుకుంది. అయితే, అప్పటికే ఆ కార్లు పర్యావరణంతోపాటు జనంపై చెడు ప్రభావం చేయగలిగినంతా చేశాయని అధ్యయనాల్లో తేలింది. ఈ కార్ల కాలుష్య ప్రభావంతో యూరప్‌లో సుమారు 1,200 గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్టు వెల్లడయింది. యూఎస్ఏలో 60, జర్మనీలో 500 వరకు గర్భస్థ శిశు మరణాలు సంభవించినట్లు గుర్తించారు. జర్మనీ పొరుగు దేశాలైన పోలండ్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో సంభవించిన గర్భస్థ శిశు మరణాల్లో 60 శాతం వరకు 2008-15 కాలంలో తయారైన ఈ కార్ల కాలుష్యం ఫలితమేనని తేల్చారు. వెనక్కి తీసేసుకున్న కార్లకు తిరిగి వోక్స్వ్యాగన్ కాలుష్య కారకాలను తగ్గించే పరికరాలను అమర్చి 2017 చివరికల్లా మార్కెట్లోకి తీసుకువస్తే మరో 2,600 వరకు గర్భస్థ శిశుమరణాలను తగ్గించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈయూ దేశాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలపై వెచ్చించే 4.1బిలియన్ యూరోలను ఆదా చేసినట్లవుతుందని వెల్లడించింది.