పొగ చూరిన బతుకు! | Premature deaths with air pollution | Sakshi
Sakshi News home page

పొగ చూరిన బతుకు!

Published Sun, Sep 2 2018 1:27 AM | Last Updated on Sun, Sep 2 2018 1:28 AM

Premature deaths with air pollution - Sakshi

42 లక్షలు - వాయుకాలుష్యం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న ప్రిమెచ్యూర్‌ డెత్స్‌
25 లక్షలు - భారత్‌లో 2015లో సంభవించిన కాలుష్యకారక మరణాలు

సాక్షి, హైదరాబాద్‌: మెదడుకూ ‘పొగ’ పడుతోంది! మానవ మేధస్సునూ వాయు కాలుష్యం కాటేస్తోంది!! ఇప్పటివరకూ ఊపిరితిత్తులు, గుండెపైనే విషపు గాలులు ప్రభావం చూపుతున్నాయని అందరూ భావిస్తుండగా మెదడునూ అది క్రమంగా దెబ్బతీస్తున్నదనే విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. అత్యధికస్థాయిలోని విషపూరితమైన గాలి ప్రభావం ఓ ఏడాది విద్యాసంవత్సరం కోల్పోవడంతో సమాన స్థాయిలో ఉంటుందన్న విషయం వెలుగుచూసింది.

విద్యార్థుల ప్రతిభాపాటవాలపై వాయుకాలుష్యం ప్రభావం చూపుతోందని గతంలోనే వెల్లడైంది. అయితే తొలిసారిగా కాలుష్య ప్రభావం వివిధ వయసుల స్త్రీ, పురుషులపై ఏస్థాయిలో ఉంటోందన్న అంశం తెలిసింది. అమెరికాలోని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్, పెకింగ్‌ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో అధ్యయనం సాగింది. ఇందులో వెల్లడైన అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని యూకే పబ్లిక్‌ హెల్త్‌చారిటీ మెడాక్ట్‌ ప్రతినిధి రెబెకా డానియల్స్‌ పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలను ప్రతిష్టాత్మక ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌ ప్రచురించింది.

అధ్యయనంలో వెల్లడైన అంశాలివే...
ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది ప్రజలు కలుషిత వాయువును పీలుస్తున్నారు.
అధికమోతాదులో కాలుష్యం కారణంగా విద్యార్థుల్లో గణితం, భాషా సబ్జెక్టుల్లో ప్రతిభ తగ్గింది.
సగటున ఓ వ్యక్తి ఏడాది చదువు నష్టపోయినంత స్థాయిలో ఈ ప్రభావం పడుతోంది.
♦  వయసు పైబడిన (64 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్న) వారిపై వాయుకాలుష్యం ప్రభావం మరింత తీవ్రంగా పడుతోంది.
కాలుష్య ప్రభావం కారణంగా పెద్దవారు మాటల కోసం, చిన్న లెక్కలు పూర్తి చేయడానికి తడుముకోవడాన్ని ప్రస్తావించారు
మగవారిపై ముఖ్యంగా తక్కువ చదువుకున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది
బిజీరోడ్లకు సమీపంగా నివసించే వారిలో మతిమరుపు పెరుగుతోంది

పురుషులపైనే ఎక్కువ ప్రభావం...
ప్రజలు ఎంత ఎక్కువగా అపరిశుభ్రమైన గాలిని పీలుస్తారో, వారి తెలివితేటలపై అంత ఎక్కువ ప్రభావం పడుతోంది.
గణితంకంటే భాషాపరమైన సామర్థ్యానికి అధికనష్టం జరుగుతోంది.
మహిళలకంటే పురుషులకే ఎక్కువ నష్టం  వాటిల్లుతోంది.
♦  ఆడ, మగవారి మెదళ్లు పనిచేసే తీరు భిన్నంగా ఉండటమే దీనికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు.
కాలుష్య ప్రభావం ఎక్కువున్న రోజుల్లో ఏదైనా ముఖ్యమైన ప్రవేశపరీక్షకు విద్యార్థులు హాజరైనప్పుడు సరైన ఫలితాలు సాధించలేకపోయారు.

భారత్‌కూ హెచ్చరికలు...
చైనాలో జరిపిన ఈ పరిశోధన ప్రపంచంమొత్తానికి వర్తిస్తుంది. ముఖ్యంగా భారత్‌కు ఇందులో వెల్లడైన అనేక అంశాలు వర్తిస్తాయి. వాయుకాలుష్యం కారణంగా తలెత్తిన సమస్యలతో 2015లో మనదేశంలో 25 లక్షల మంది చనిపోయారు. చైనాలో వాయుకాలుష్యం ప్రభావంతో ఎదురైన పరిస్థితులే భారత్‌లోనూ ఉన్నాయి. అభివృద్ధిపథంలో సాగుతున్న విధంగానే కాలుష్య ప్రేరకాలు కూడా ఈ రెండుదేశాల్లో అంతేస్థాయిలో ఉన్నాయి. కాలుష్య ప్రభావం, తీవ్రతలో హెచ్చుతగ్గులున్నట్టే ఆరోగ్యంపై ప్రభావం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. – సునీల్‌ దహియా, గ్రీన్‌పీస్‌ ఇండియా ప్రచారకర్త  

కాలుష్యకారక వాహనాలను నడవనివ్వకూడదు...
మనుషుల ప్రతిభపై వాయుకాలుష్యం ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనంలో వెల్లడికావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. నివాస ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంకావడంవాయుకాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం. భారీస్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను రోడ్లపై నడవనివ్వకూడదు. – ఆరాష్‌ సలేహ్, యూకేలోని రెస్పిరేటోరీ
మెడిసిన్‌ రిజిస్ట్రార్, డాక్టర్స్‌ అగైనెస్ట్‌ డీజిల్‌ ప్రచార భాగస్వామి


అల్జీమర్స్‌కు దారితీయొచ్చు...
వాయుకాలుష్యం స్వల్పకాలికంగా కూడా తెలివితేటలపై ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. మేధస్సుపై పడిన ఈ కాలుష్య దుష్ప్రభావం క్రమంగా పెరుగుతుందని అంచనావేస్తున్నారు. మూడేళ్ల కాలంలో గాలిలో మిల్లీగ్రాము కాలుష్యం పెరిగితే నెలరోజులచదువు నష్టపోయిన దానికి సమానమని, సూక్ష్మస్థాయి కాలుష్య కణాలతో మరింత నష్టం వాటిల్లుతుందంటున్నారు. మెదడుపై ధూళి కణాల ప్రభావంతో ప్రతిభ తగ్గి అల్జీమర్స్, ఇతర రకాల డిమెన్షియా రావొచ్చని విశ్లేషిస్తున్నారు.

అధ్యయనం సాగిందిలా...
2010–14 మధ్య ‘చైనా ఫ్యామిలీ ప్యానెల్‌ స్టడీస్‌’భాష, గణితం సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో ఆ దేశంలోని 20 వేల మంది విద్యార్థులు రాసిన జవాబుపత్రాలను విశ్లేషించారు. ఈ ఐదేళ్ల కాలంలో 32 వేల మంది చైనీయులపై స్వల్ప, దీర్ఘకాలంలోపడిన వాయుకాలుష్య ప్రభావాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement