రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’ | Air Pollution Linked To Nearly 2,000 Child Deaths A Day Report | Sakshi
Sakshi News home page

రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’

Published Thu, Jun 20 2024 11:56 AM | Last Updated on Thu, Jun 20 2024 11:56 AM

Air Pollution Linked To Nearly 2,000 Child Deaths A Day  Report

దేశ రాజధాని నగరం ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. గాలిలో  నాణ్యత అత్యంత ప్రమాదకరస్థాయిలకు పడిపోవడం ఇటీవలి కాలంలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళకరమైన అధ్యయనం  ఒకటి మరింత   ఆందోళన  రేపుతోంది. 
వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.  అంతేకాదు  ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాద కారకంగా వాయు కాలుష్యం నిలుస్తోందని కూడా ఈ నివేదిక  తేల్చింది.

అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్   ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం, 2021లో  ఏకంగా 81 లక్షలమంది చిన్నారు వాయు కాలుష్య భూతానికి బలైనారు. మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం.  అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది. మన నిర్లక్ష్యమే తదుపరి తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునిసెఫ్‌కు చెందిన కిట్టి వాన్ డెర్ హీజ్డెన్  తెలిపారు.

వాయు కాలుష్యంకారణంగా ఐదేళ్ల లోపు  ఉన్న 7 లక్షల మంది పిల్లల మరణించారు. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటం వలన సంభవించాయి.

తరువాతి తరంపై తీవ్ర ప్రభావం
యూనీసెఫ్‌తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని అధ్యయనం హెడ్ పల్లవి పంత్ వెల్లడించారు. ఇవి మనం పరిష్కరించగల సమస్యలేనని కూడా  ఆమె  పేర్కొన్నారు.  ప్రపంచంలోని దాదాపు ప్రతీ ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక  తెలిపింది. 

వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యంతో 2021లో  5 లక్షల మంది  ప్రాణాలు గాల్లోకి కలిసి పోయాయి. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి  చాలా సారూప్యమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని  పల్లవి వ్యాఖ్యానించారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల  కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్‌లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్‌లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200  పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement