
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఆడంబర జీవనశైలికి అలవాటుపడి అప్పులపాలైన వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా ఆర్థిక స్థోమత హైలెవెల్‌లో ఉన్నప్పటికీ నిరాడంబరశైలిని అనుసరించే ధోరణి సంపన్నులలో పెరుగుతోంది. దీనికి ఉదాహరణ షాంగ్ సావెద్ర, అనీ కోల్... మిలియనీర్‌లు అయిన సావెద్ర, ఆమె భర్త ఇంద్రభవనంలాంటి ఇళ్లెన్నో నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉంది. అయినా సరే ఆ దంపతులు లాస్ ఏంజిల్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి విడి విడిగా కార్లు లేవు. ఇద్దరూ కలిసి సెకండ్ హ్యాండ్ కారును ఉపయోగించుకుంటారు.
పిల్లలు సెకండ్‌హ్యాండ్ బొమ్మలతో ఆడుకుంటారు. వృథా ఖర్చుకు దూరంగా ఉంటారు. ‘అఫ్‌కోర్స్, నేను కూడా లగ్జరీ ఐటమ్స్ చూసి టెంప్ట్ అవుతుంటాను. అయితే తొందరపడకుండా కొద్దిసేపు ఆలోచిస్తాను. వెంటనే కొనేయాలనే ఆలోచన నుంచి బయటపడతాను. మనసు పడ్డాం కాబట్టి కొనడం కాకుండా ఆ వస్తువు నిజంగా మనకు ఎంత అవసరమో అని ఆలోచిస్తే సమస్య ఉండదు’ అంటుంది షాంగ్ సావెద్ర.
రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అనీ కోల్ మిలియనీర్. అయితే ఆమె సంపాదనతో పోల్చితే చేసే ఖర్చు చా... లా తక్కువ! ఎన్నో సంవత్సరాల క్రితం కారును అమ్ముకుంది. ఇంట్లో పనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. వంట చేయడం నుంచి జుత్తు కత్తిరించుకోవడం వరకు తానే చేస్తుంది! సెలవు రోజుల్లో ఎంజాయ్ చేయడానికి ఖర్చు అవసరం లేని ఫ్రీ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలిని అనుసరిస్తోంది. దుస్తుల నుంచి వస్తువుల వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంపన్నులది పీనాసితనంగా అనిపించవచ్చుగానీ.. కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది వారి ఆచరణ ఎంత అనుసరణీయమో.
Comments
Please login to add a commentAdd a comment