Thrift
-
ఎక్కువ పొదుపు చేస్తుంది.. వ్యవసాయ కుటుంబాలే
దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. భారత్‌లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి -
మితభాషణం
మనిషిని జంతుప్రపంచం నుండి వేరు చేసేది భాష, దానికి కారణమైన ఆలోచన, ఆలోచనకి మూలస్థానమైన మెదడు. ఇంతటి విలువైనదానిని సద్వినియోగం చేసుకోటం తెలివిగలవారి లక్షణం. కాని, దానిని దుర్వినియోగం చేసే వారిని ఏమనాలి? అన్నింటి వలెనే మాటని కూడా పొదుపుగా వాడుకోవాలి. ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అని నానుడి. ఇది మాటలకి కూడా వర్తిస్తుంది. అతిగా మాట్లాడటాన్ని వాగటం అంటారు. జల్పమన్నా అదే. అవి పేరుకి మాటలే కాని, వాస్తవానికి శబ్దాల సముదాయాలు మాత్రమే. అతిగా మాట్లాడుతూ ఉంటే అనవసర విషయాలు ప్రసక్త మౌతూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలనే తపన వల్ల అసత్యాలు దొర్లవచ్చు. కొన్నిసార్లు అప్రయత్నంగా నోరు జారి బయటపెట్ట కూడని విషయాలు బహిర్గతం అవుతాయి. ఆ సంగతిని గుర్తించక పోవచ్చు, కాని, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవటం కుదరదు. దాని వల్ల ఇబ్బందులు, కొండొకచో ప్రమాదాలు కూడా కల్గవచ్చు. శతృత్వాలు పెరిగితే మనశ్శాంతి కరువు అవుతుంది. కొంచెం నోరు సంబాళించుకుంటే ఎంత బాగుండేది? అని తరవాత ఎంతగా పశ్చాత్తాప పడినా ఏం లాభం? గతం గతః అతిగా మాట్లాడటం కూడా ఒక వ్యసనం. వ్యసనం అంటే వదిలి పెట్టలేని అలవాటు. చేస్తున్నది తప్పని తెలిసినా, చేయకుండా ఉండలేని బలహీనత వ్యసనం. వాగటం అనే బలహీనత ఉన్న వారు అవతలి వాళ్ళు విసుక్కుంటున్నారు, వినటం లేదు అని గుర్తించినా మాట్లాడటం ఆపలేరు. ఈ లక్షణం చిన్నపిల్లలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పెద్దవాళ్లు మాట్లాడ వద్దన్నా, చివరకు చేతితో నోరు మూసినా, వేళ్ళసందులలో నుండి తాము చెప్పదలచిన దానిని చెప్పేస్తారు. పిల్లలని వాగుడుకాయ అని తేలికగా తేల్చేస్తాం. పెద్దలని ఊరుకోమని అనలేం. పెద్దవారిని ఎదురుగా అనకపోయినా వాచాలుడు, వ్యర్థప్రసంగి, అధికప్రసంగి అంటూ తేలికగా మాట్లాడుతారు. నోరు అదుపులో ఉంటే ఈ చెడ్డ పేరు రాదు. కుటుంబ సభ్యుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, సహోద్యోగుల మధ్య, దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి సత్సంబంధాల బదులు తగాదాలు, యుద్ధాలు రావటానికి కారణం చాలా వరకు అధిక ప్రసంగాలే. ‘‘మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు’’ అని సరసంగా మొదలయిన సంభాషణ చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఏకైక మార్గం వీలైనంత తక్కువగా మాట్లాడటం. అందుకే ‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’’ అనే సామెత వచ్చింది. అవతలివారి రహస్యాలను కూపీ తియ్యటానికి చేసే మొదటి పని, ఉత్తమమైన పద్ధతి వారిని మాటల్లోకి దించటం. మాటల ధోరణిలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి వాగి, వాగి తమ వ్యక్తిగత విషయాలను, గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలను, చివరకు దేశరక్షణకు సంబంధించిన రహస్యాలను కూడా బయట పెట్టిన సందర్భాలు చరిత్రలో కనపడతాయి. ఆలోచనతో పాటు విచక్షణని కూడా ఉపయోగిస్తే దేనిని వృథా చేయటం ఉండదు. మాటని వృథా చేయటం అంటే ప్రకృతి మనకి ఇచ్చిన దానిని సరిగా వాడుకోక ప్రకృతి పట్ల అపచారం చేయటం. ఎందుకంటే మాట్లాడటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. వినే వారి సమయం వృథా అవుతుంది. అందుకే అతి వాగుడు ఆయుః క్షీణం అంటారు. నోరు చేసుకుని, నోరు పెట్టుకుని బతికేవాళ్ళు తగు జాగ్రత్తలని తెసుకోకపోతే ఆయువు తరిగే ప్రమాదం ఉంది సుమా! మునుల దీర్ఘాయువు రహస్యం కూడా ఇదే. కాళిదాసు పేర్కొన్న రఘువంశ రాజుల లక్షణాలలో మితభాషణం ఒకటి. అది సత్ప్రవర్తనలో ప్రధానాంశం. మనకి నోరు ఉన్నది మాట్లాడటానికే కదా! ఎందుకు పరిమితం చేసుకోవాలి? అన్న ప్రశ్నకి మహాకవి కాళిదాసే సమాధానం కూడా చెప్పాడు – ‘‘సత్యాయ మితభాషిణాం’’ అని. సత్యాన్ని పలకటానికి మాత్రమే పెదవి విప్పేవారట. -
AP: మన పొదుపు.. మేలి మలుపు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిక్కచ్చిగా అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల పాలనలోనే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల విషయంలో అద్భుత ఫలితాలు రాబట్టారు. సంఘాల పొదుపు విషయంలో, క్రెడిట్ లింకేజీలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, సంఘాల పనితీరుపై నాబార్డు 2021–22 వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాల పొదుపు ఏపీలోనే ఉందని, ఈ విషయంలో ఏపీ పొదుపు సంఘాలు నంబర్ వన్ స్థానంలో నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో (2020–21) కూడా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల వల్లే, బాబు హయాంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలు మళ్లీ ఇప్పుడు ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా.. దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల పొదుపు సొమ్ము 2021–22 (మార్చి) ఆర్థిక ఏడాదిలో రూ.47,240.48 కోట్లు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లోని సంఘాల పొదుపు రూ.24,060.43 కోట్లు కాగా, మన రాష్ట్రంలోని సంఘాల పొదుపు రూ.11,668.22 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద మన సంఘాల పొదుపే 24.69 శాతం ఉండటం విశేషం. తగ్గిన పరపతి పెరిగింది.. ► గత చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి దిగజారిపోయింది. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన రుణ మాఫీ మాయ మాటలు నమ్మి మోసపోయారు. ఓట్లు వేయించుకుని, అధికారం చేపట్టగానే రుణ మాఫీ చేయబోనని చెప్పడంతో దగాకు గురయ్యారు. సంఘాల అప్పులు పెరిగి పోయి.. ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. దీంతో బ్యాంకులు రుణాల మంజూరుకు వెనకాడాయి. ► 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు.. ఎన్నికల తేదీ నాటికి ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తానని చెప్పడమే కాకుండా ఇప్పటికే ఆసరా పేరుతో రెండు విడతల్లో సగం అప్పులను తిరిగి సంఘాలకు ఇచ్చేశారు. బాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని సీఎం జగన్ పునరుద్దరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది. ► చంద్రబాబు హయాంలో అంటే 2018–19లో ఏపీ పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ కేవలం 43.6 శాతం ఉండింది. ఇప్పుడు ఏకంగా 90 శాతం క్రెడిట్ లింకేజీతో దేశంలోనే తొలి స్థానంలో మన పొదుపు సంఘాలు నిలిచాయి. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏడాదికి పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ పెరుగుతూనే ఉంది. 2019–20లో 61.9 శాతం, 2020–21లో 69.12 శాతం క్రెడిట్ లింకేజీ ఉంది. ఇప్పుడు ఏకంగా 90 శాతానికి చేరుకుని, దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకులు రూ.28,497.51 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం ► సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక పేర్కొంది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని రీయింబర్స్ చేస్తోందని తెలిపింది. దీంతో పొదుపు సంఘాలు బలోపేతం అవ్వడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని స్పష్టం చేసింది. ► సంఘాల్లోని మహిళల జీవనోపాధి మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని నివేదిక తెలిపింది. ఆసరా, చేయూత, ఇతర పథకాల కింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాల చేసుకోవడం ద్వారా ప్రభుత్వం వారికి చేదోడుగా నిలుస్తోంది. ► రాష్ట్రంలో పొదుపు సంఘాల సగటు రుణం మంజూరు ఏటేటా పెరుగుతోంది. చంద్రబాబు హయాంలో సంఘాల సగటు రుణం రూ.3 లక్షల వరకు మాత్రమే ఉండింది. 2021–22లో అది రూ.4.80 లక్షలకు పెరిగింది. తగ్గిన నిరర్థక ఆస్తులు ► చంద్రబాబు రుణ మాఫీ చేస్తానని మోసం చేయడంతో స్వయం సహాయక సంఘాలు అప్పట్లో అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా సంఘాల నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. ఇప్పుడు సంఘాల పనితీరు మెరుగు పరిచేలా గత మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. ► బాబు హయాంలో 5.86 శాతం మేర నిరర్థక ఆస్తులు ఉండగా, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల రుణాల్లో నిరర్థక ఆస్తులు కేవలం 0.50 శాతమే ఉన్నాయి. కాగా, ప్రైవేట్ సెక్టార్‌లోని బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు 0.06 శాతమే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కొత్తగా 27,432 సంఘాలు పొదుపు చేసే సంఘాల సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. 2020–21 ఆర్థిక ఏడాది నాటికి 10,58,053 పొదుపు సంఘాలు రూ.10,933.04 కోట్ల మేర పొదుపు చేశాయి. 2021–22 నాటికి 10,85,485 సంఘాలు రూ.11,668.22 కోట్లు పొదుపు చేశాయి. అంటే కొత్తగా 27,432 సంఘాలు వచ్చాయి. -
AP: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు
సాక్షి, అమరావతి: మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.42 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో ఆసక్తి, ఉత్సాహం ఉన్న ఇద్దరేసి చొప్పున మొత్తం 16,84,026 మంది మహిళలను గుర్తించి, వారిని పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తలుగా తయారుచేసేలా ప్రణాళికను రూపొందించింది. ఇలా గుర్తించిన వారికి ‘రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్యూడీఎస్ఈటీ)లో శిక్షణ పొందిన నిపుణుల ద్వారా ఆరు ప్రధాన అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మహిళల్లో పూర్తిస్థాయి ఆర్థిక చైతన్యం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలకు సుస్థిర ఆదాయం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చి, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది. రూ.30 వేల కోట్ల రుణ లక్ష్యం ఇక సకాలంలో రుణాలు చెల్లించిన 5.34 లక్షల పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి రూ.30 వేల కోట్ల రుణం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లక్ష్యంగా నిర్ధేశించుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంకర్ల సంఘం ఆమోదం తెలిపింది. మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.9,800 కోట్లు దాకా పొదుపు చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న తమ డబ్బును మహిళలు నామమత్రం వడ్డీ వచ్చే పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుని.. అదే బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. కానీ, అలాకాకుండా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును అవసరాల మేరకు తీసుకుని ఆ తర్వాత అదనంగా అవసరమయ్యే మొత్తాన్ని బ్యాంకు రుణం పొందడం ద్వారా పెద్దగా అప్పుచేయాల్సిన అవసరం ఉండదని.. బ్యాంకులు ఇందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ బ్యాంకర్ల సమావేశంలో ప్రతిపాదించారు. ఇందుకు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
సీఎం చిత్ర పటాలకు క్షీరాభిషేకం
సాక్షి నెట్వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం కర్నూలు నగరంలోని స్థానిక కేవీఆర్ గార్డెన్స్‌లోని సచివాలయంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గంలోని నందనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం ఐకేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గోకరాజు రామరాజు ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు చెక్కులు పంపిణీ చేశారు. -
పొదుపు సంఘాల మహిళల్లో ఆనందోత్సాహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మహిళల సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా చొరవ తీసుకున్న ప్రభుత్వం.. వీరు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని తాజాగా జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా మూడో ఏడాది సొమ్మును వారి ఖాతాల్లో నేరుగా వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, పాణ్యం, గడివేముల మండలాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. మహిళలకు చెక్కులు అందజేశారు. -
పండుగలా వైఎస్సార్ సున్నా వడ్డీ ఉత్సవం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ సున్నా వడ్డీ ఉత్సవాలు శనివారం రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న వారిలో సీఎం జగన్ తర్వాతే ఎవరైనా అని నినాదాలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించి వరుసగా మూడో ఏడాది ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ పాల్గొని మహిళలకు సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో జరిగిన ఉత్సవానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళ సుబ్బారావు నగర్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు, కృష్ణా జిల్లా గూడూరులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రాయితీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ మహిళలతో కలిసి ప్లకార్డు చూపుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సున్నా వడ్డీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెక్కులు పంపిణీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చెక్కుల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది. -
కోలాటాలు, ర్యాలీలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో ఒక పక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు, మరో పక్క వైఎస్సార్ ఆసరా సంబరాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 90 మండలాల్లో కోలాటాలు, ర్యాలీలు, నృత్యాల మధ్య వైఎస్సార్ ఆసరా సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. మహిళలు ఊరూరా సభలు పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల్లో మహిళల పేరిట ఉండే అప్పును ప్రభుత్వమే భరిస్తూ, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో వారికి డబ్బు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో విడతకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రభుత్వం సంబంధిత మహిళల పొదుపు సంఘాల ఖాతాలకు డబ్బులు జమ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ. 6,439.52 కోట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయగా.. బద్వేలు ఉప ఎన్నిక వల్ల ఎన్నికల కోడ్ కారణంగా ఆ జిల్లాలో పంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది. మిగిలిన 12 జిల్లాల పరిధిలోని 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 459 మండలాల్లో పంపిణీ పూర్తి ఆరు రోజులుగా 12 జిల్లాల పరిధిలోని 459 మండలాల్లో 4.74 లక్షల సంఘాలకు రూ.3,816.31 కోట్ల పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆయా మండలాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమాలు జరిగా యి. గతంలో డ్వాక్రాసంఘాల రుణాలన్నీ మాఫీచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మోసం చేసిన తీరు.. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయం ప్రధానంగా ఈ కార్యక్రమంలో చర్చకు వస్తోంది. జోరు వర్షంలో కదంతొక్కిన మహిళలు ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో జోరు వర్షాన్ని లెక్కచేయకుండా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. గూడూరులో వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. ► అనంతపురం జిల్లా రొద్దంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, గుంటూరు జిల్లా రేపల్లెలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం, చాగల్లు మండలం చిక్కాల, కలవలపల్లి, ఊనగట్ల, నందిగంపాడు గ్రామాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో ఎంపీ వంగాగీత, రాజవొమ్మంగిలో అరకు ఎంపీ జీ.మాధవి స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులుపంపిణీ చేశారు. ► శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గొల్లలవలసలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ► విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంపీ డా.భీసెట్టి సత్యవతి, విశాఖ తూర్పు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెక్కులు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి పాల్గొన్నారు. -
దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా
సాక్షి, అమరావతి: అమ్మవారిని కొలిచే నవరాత్రులు ప్రారంభమవుతున్న రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించడం దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలు, ఇబ్బందులు చూసి ఒక మాటిచ్చానని.. ఆ మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నానని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ ఆసరా పథకానికి మీ అందరి సమక్షంలో శ్రీకారం చుడుతున్నందుకు మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా ఉంది. స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే నవరాత్రుల ఆరంభం రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే నవరాత్రుల ఆరంభంరోజు అక్కచెల్లెమ్మల మధ్య #YSRAasara కార్యక్రమం ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి నేను మీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. 1/2 pic.twitter.com/mgoNDadg2C — YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2021 పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి నేను మీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ ఆసరా ద్వారా 7.97 లక్షల పొదుపు సంఘాల ఖాతాలకు రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని’ అందులో పేర్కొన్నారు. -
AP: రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం నవరత్నాల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబం ఆదాయాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెంది రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కాగలుగుతారన్నారు. ఇందుకోసం ఎంతటి కష్టాలనైనా అధిగమిస్తూ తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గురువారం వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత డబ్బుల పంపిణీ సందర్భంగా సీఎం జగన్ ఈమేరకు పొదుపు సంఘాల మహిళలకు నేరుగా లేఖలు రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఆ సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది ఈ పథకం కింద మలి విడత పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 7న సీఎం జగన్ ఒంగోలులో ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 17 వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను లబ్ధిదారులకు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ తెలిపారు. సీఎం జగన్ లేఖ పూర్తి సారాంశం ఇదీ.. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు.. మీ చల్లని ఆశీస్సులతో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వరుసగా రెండో సంవత్సరం ఈనెల 7వతేదీన పొదుపు సంఘాల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని ఎంతో సంతోషంగా తెలియచేస్తూ అక్కచెల్లెమ్మలందరికీ హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నా. చేతల ప్రభుత్వం.. గత ప్రభుత్వాల మాదిరిగా ఇది మాటల ప్రభుత్వం కాదు. మాది చేతల ప్రభుత్వం. మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. అదొక పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం. హామీల అమలుకు తేదీలవారీగా క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మొదటి రెండేళ్లలోనే 95 శాతం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. దయనీయ పరిస్థితులను చూశా.. గత సర్కారు రుణాలు మాఫీ చేస్తామని, వాటిని కట్టొద్దని హామీ ఇచ్చి మోసగించిన నేపథ్యంలో అక్క చెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. పొదుపు సంఘాలు ఛిన్నాభిన్నమై ‘ఏ’ గ్రేడ్‌లో ఉండే సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్లలోకి పడిపోయాయి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక ఇబ్బందులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూసి చలించా. ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారం 7.97 లక్షల సంఘాలలోని 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల అప్పు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా నేరుగా పొదుపు సంఘాల ఖాతాలకు అందించాలని నిర్ణయం తీసుకున్నా. దీన్ని మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలో చేర్చాం. అంతే కాకుండా 2016లో రద్దైన సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ పునరుజ్జీవింపచేశాం. గత ఏడాదే రూ.6,318.76 కోట్లు చెల్లించాం.. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ‘‘ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం’’ అన్న హామీని అక్షరాలా పాటిస్తూ ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు చెల్లించాం. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు మళ్లీ 78.76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మరో రూ.6,439.52 కోట్లు రెండో విడతగా అందిస్తున్నాం. ఆర్థికంగా ఎదగాలి.. మీ జీవితాల్లో మరిన్ని కాంతులు వెల్లివిరియాలని, మీ కుటుంబానికి సుస్ధిర ఆదాయం సమకూరాలని, మీకు మీరుగా సృష్టించుకునే వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు మీ కాళ్ల మీద మీరు సొంతంగా నిలబడేలా చేసి జీవనోపాధి మెరుగుపర్చుకొనేలా గతేడాది అమూల్, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలానా లాంటి వ్యాపార దిగ్గజాలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ ఏడాది అజియో – రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర – ఖేతి లాంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మీకు వ్యాపార మార్గాలు చూపించి ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి బాటలు వేశాం. ఈ డబ్బులు ఎలా వినియోగించుకుంటారో మీ ఇష్టం.. అక్కచెల్లెమ్మలకు అందే ఈ మొత్తాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ఎలాంటి షరతులూ లేవు. మన ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీ కుటుంబ ఆదాయాన్ని పెంచుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ కుటుంబ ఆదాయం పెరగడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర అభివృద్దిలో మీరు భాగస్వాములు కాగలుగుతారు. ఎంతటి కష్టాన్ని అయినా భరించి మీ తోబుట్టువుగా ఈ కార్యక్రమాలను చేస్తున్నా. జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మీ కోరికను నెరవేర్చే దిశగా నా ప్రతి అడుగు వేస్తున్నా. మీ అందరి ఆశీస్సులు నాతోపాటే ఉంటాయన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా. కుటుంబ అభివృద్ధి మీతోనే సాధ్యం పుట్టిన బిడ్డ నుంచి కాయకష్టం చేయలేని పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగిన పథకాలను అమలు చేయడంతో పాటు మహిళాభివృద్ధి ద్వారానే మన కుటుంబ అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. మహిళల కోసం తల్లులకు అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, పేదింటి ఆడపిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపు రేఖలను మార్చేలా మన బడి నాడు– నేడు, ఇంగ్లిష్ మీడియం, అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు, అన్ని నామినేషన్ పోస్టుల్లో 50 శాతం మహిళలకే కేటాయించడం, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ, దిశ పోలీసు స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రాష్ట్రం నుంచే ఆధునిక మహిళ 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ సాధికారతతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి కృషి చేస్తున్న మన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీ అండదండలూ ఉండాలని, మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు లభించాలని నిండు మనసుతో కోరుకుంటున్నా. మీ ఆత్మీయుడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి -
చదువు'కొనే' టైమొచ్చింది..!
స్వప్న 9వ తరగతి చదువుతోంది. ఆమె చదువుకు సంబంధించి తండ్రి రమేష్‌కు ఒక అంచనా ఉంది. ఏ తరగతికి వస్తే ఎంతవుతుందన్నది ముందే లెక్కలు వేసుకున్నాడు. దానికి తగ్గట్టే రకరకాలుగా పొదుపు చేస్తున్నాడు. కాకపోతే ఉన్నట్టుండి రమేష్‌కు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయింది. హైదరాబాద్‌లో ఇంటికి దగ్గర్లో ఉన్న మంచి ప్రయివేటు స్కూల్లో చేర్పించడానికి వెళ్లాడు. ఆ ఫీజులు చూసి మతిపోయింది. తను వేసుకున్న బడ్జెట్ తలకిందులయిందని అర్థమైపోయింది. ఇక 9వ తరగతికే ఇలా ఉంటే... టెన్త్, ఇంటర్ సంగతో..? ఆ తరవాత ఒకవేళ ఫారిన్‌కు పంపి చదివించాలనుకుంటే అప్పటి పరిస్థితో..? సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: చదువంటే ఇపుడు మాటలు కాదు. ఈ పరిస్థితి రమేష్ ఒక్కడిదే కూడా కాదు. టౌన్ నుంచి సిటీలకు బదిలీ అయిన వారిది మాత్రమే కాదు కూడా. నానాటికీ విద్యా వ్యయాలు పెరుగుతుండటంతో మధ్య తరగతి అందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. పిల్లల్ని అనుకున్న స్థాయిలో చదివించలేకపోతున్నారు కూడా. ఇక విదేశీ చదువుల సంగతి సరేసరి. కాబట్టి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకునే వారికి నెలవారీ నామమాత్రపు పొదుపు, మదుపులతో లాభం లేదు. విద్యా రుణాలు ఉన్నప్పటికీ వీటిలో గరిష్ఠ పరిమితి అనేది ఉండనే ఉంది. అంతకుమించి చేసే వ్యయాలకు సొంతంగా నిధులు సర్దుబాటు చేసుకోవాల్సిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అవసరాలను పిల్లలు చిన్న వయసులో ఉండగానే గుర్తించాలి. అందుకు తగ్గ ప్రణాళిక వేసుకోవాలి. ఆ మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే ఖరీదైన విద్యను సొంతం చేసుకునే ఆర్థిక వనరులు సమకూరుతాయి. అందుకోసం ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం... ఎంత మేర కావాలి? పిల్లల చదువు కోసం ఎంత నిధి కావాలన్న కచ్చితమైన అంచనా కష్టమే. అయితే, ఇందుకో మార్గం ఉంది. ప్రస్తుతం ఫలానా విద్యకు ఎంత మేర ఖర్చవుతుందో తెలుసుకుని దాన్ని ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్‌తో లెక్కించడమే. లేదా వీలైనన్ని వనరులను పక్కన పెట్టడం చేయాలి. ఉదాహరణకు మీ పాప లేదా బాబు వయసు రెండేళ్లు అనుకోండి. వీరికి 23 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకు డబ్బులు అవసరం అనుకుంటే... మాస్టర్స్ డిగ్రీకి ఇప్పుడు సగటున రూ.15 లక్షలు అయితే, వారు ఆ వయసుకు వచ్చే సరికి రూ.62 లక్షలు అవసరం అవుతాయి. 7 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన లెక్క ఇది. అందుకే లక్ష్యానికి అవసరమైన మొత్తం ఎంతో ఓ అంచనాకు వస్తే దానికి తగినట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఎండోమెంట్ ప్లాన్లు కూడా... ఎండోమెంట్ బీమా ప్లాన్లు మరో ఎంపిక. అయితే, ఇవి చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం రూపొందించినవి. పెట్టుబడి అవకాశంతో పాటు తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండేలా బీమా రక్షణనిస్తాయి. చిన్నారుల కోసం ఉద్దేశించిన పథకాలు అయినప్పటికీ వారికి ఇందులో బీమా ఉండదు. వారికి ఆధారమైన తల్లిదండ్రులకు ఇందులో బీమా ఉంటుంది. ప్రజాభవిష్యనిధి ఉండనే ఉంది... 15 ఏళ్ల కాలవ్యవధితో కూడిన పీపీఎఫ్ కూడా చక్కని సాధనమే. ఇందులో వార్షికంగా రూ.1,50,000 వరకూ పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఇందులో పెట్టుబడులకు, రాబడులకు కూడా పన్ను లేదు. వైవిధ్యం తప్పనిసరి... పిల్లల విద్య కోసం ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత వివిధ సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత రిస్క్ ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. రాబడులు ఏ స్థాయిలో కోరుకుంటున్నారు..? ఎంత మేర రిస్క్ భరించగలరు? ఎంత కాలంలో ఎంత మేర సమకూరాలి? ఇత్యాది అంశాల ఆధారంగా వేటికి ఎంత మేర కేటాయింపులు అన్నవి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీ పిల్లల ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ కోసం అయితే వివిధ కాల వ్యవధుల్లో గడువు తీరే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కాల వ్యవధిలో సరిపడేంత మొత్తం సమకూరాలంటే వచ్చే రాబడుల ఆధారంగా ప్రతి నెలా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయమవుతుంది. పక్కా ప్రణాళికతో భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన వచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మంచివే... చిన్నారుల ఉన్నత విద్య కోసం చాలా వ్యవధి ఉంటుంది. అందుకోసం అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంచుకోవాలి. అవి మెరుగైన రాబడులను ఇస్తాయి. 15–20 ఏళ్ల కాలంలో మార్కెట్లలో ఆటుపోట్లను ఎదుర్కొని మరీ మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఒక మార్గం. సిప్ ద్వారా 5–7 ఏళ్ల కాలంలో మోస్తరు రాబడులకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయా పథకాల్లోని పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా రిస్క్ తగ్గించుకోవడంతోపాటు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వీలుంటుంది. అయితే తాజాగా అమల్లోకి వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను పరిగణనలోకి తీసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన ఒకరిద్దరు కుమార్తెలున్నవారు వారి వయసు గనక 10 ఏళ్లలోపు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈక్విటీతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కాంపౌండింగ్ ప్రయోజనంతో కుమార్తె ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000 గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్ని సార్లయినా ఈ పరిమితికి లోబడి డిపాజిట్లు చేయొచ్చు. ప్రతి నెలా 10వ తేదీలోపు డిపాజిట్ చేస్తే దానిపై ఆ నెలకు వడ్డీ లభిస్తుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు చిన్నారుల పేరిటే ఖాతాలు తెరవగలం. దత్తత తీసుకున్న కుమార్తెలయినా పర్వాలేదు. ఖాతా తెరిచాక 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠంగా ఖాతా తెరిచాక 21 ఏళ్ల పాటు లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండి వివాహం అయ్యేంతవరకు ఖాతా మనుగడలో ఉంటుంది. 18 ఏళ్లు నిండినా లేక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఆ అవసరాల కోసం అప్పటి ఖాతా విలువలో 50 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అర్హత అవుతుంది. ఈ పథకంలో ప్రారంభంలో 9.2 శాతం వడ్డీ రేటు ఉండగా ప్రస్తుతం 8.1 శాతానికి తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే. ప్రతీ త్రైమాసికానికీ ఈ పథకంపై వడ్డీరేటును కేంద్రం సమీక్షిస్తుంటుంది. బాలికల బంగారు భవిత దృష్ట్యా వారి పేరిట పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మిగిలిన పథకాల కంటే దీన్లో కొంచెం అధిక వడ్డీ రేటును కొనసాగించాలన్నది కేంద్రం విధానం. ఇక ఈ పథకంలో చేసే పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలూ ఉన్నాయి. ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. పెట్టుబడులపై వచ్చే వడ్డీకి, కాల వ్యవధి తీరాక చేతికందే మొత్తానికి పన్ను లేదు. -
పుస్తకమూ విద్యార్థే!
ఒకప్పుడు అన్న చదివిన పుస్తకాన్నే తమ్ముడు చదివేవాడు, అక్క చదివిన పుస్తకాన్నే చెల్లెలు చదివేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక ఒక పుస్తకాన్ని మరొకరు చదవడానికి వాళ్లు పెట్టుకున్న నిబంధనలు అంగీకరించడం లేదు. ‘‘మా పెద్ద పిల్లాడు చదివింది కూడా మీ స్కూల్లోనే, మీ కౌంటర్లో కొన్న పుస్తకాలే ఇవి. చిన్న పిల్లాడిని ఈ పుస్తకాలతో చదువుకోనివ్వండి’’అని పేరెంట్స్ మొత్తుకున్నా సరే, ప్రైవేటు స్కూళ్ల రూల్స్ ఒప్పుకోవు. ‘‘అంతగా ఆ పుస్తకాలు బాగున్నాయనుకుంటే మీ చిన్న పిల్లవాడికి రెండో సెట్‌గా ఉంటాయి. ఇంట్లో ఉంచుకోండి. ఒకవేళ ఇప్పుడు కొన్న పుస్తకాల్లో ఏవైనా పోతే అవి పనికొస్తాయి’’ అని.. స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. పేరెంట్స్ ఇంకేం చేస్తారు? ఓ ఏడాది పాటు దాచి, అవీఇవీ అన్నీ కలిపి పాత పేపర్లు కొనేవాళ్లకు తూకానికి వేసేస్తారు! ప్రభుత్వ ఉద్యమం! ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల పుస్తకాల పొదుపు ఉద్యమం మొదలు పెట్టింది! వాడిన పుస్తకాలు వెళ్లాల్సింది పాత పేపర్ల దుకాణానికి కాదని, మరో పేద విద్యార్థికి అవి జ్ఞానాన్ని అందించాలనీ ప్రభుత్వం సంకల్పించి పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’ నుంచి ఢిల్లీలోని అన్నీ స్కూళ్లకు ఆదేశాలు వెళ్లాయి. వాటి ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థికి పెద్ద తరగతికి వెళ్లినప్పుడు కొత్త పుస్తకాలు ఇచ్చే టైమ్‌లో అతడికి గత ఏడాది ఇచ్చిన పాత పుస్తకాలను స్కూలు సిబ్బంది వెనక్కి తీసుకోవాలి. వాటితో ఓ బ్యాంకు తయారు చేయాలి. పాత పుస్తకాలలో జారిపోతున్న పేజీలను అతికించి, పెన్సిల్ రాతలను చెరిపేసి వాటిని మళ్లీ వాడుకునే విధంగా సిద్ధం చేయాలి. కొంతమంది పిల్లలు పుస్తకాలను పూర్తిగా పనికి రానంతగా చించేసినా సరే వాటిని మెరుగుపరచాలి. దీనివల్ల సగం పుస్తకాలైనా బుక్ బ్యాంకుకు చేరతాయి. అంటే ప్రభుత్వం తిరిగి పుస్తకాలు ముద్రించాల్సిన ఖర్చులో ఏటా çసగానికి సగం ఆదా అవుతుంది. అంతకంటే ముఖ్యంగా కాగితం తయారీకి అవసరమైన సహజ వనరులు ఆదా అవుతాయి. పేరెంట్స్ సహకారం తాజాగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వ పాఠశాల సిబ్బంది పాత పాఠ్య పుస్తకాలను విద్యార్థుల నుంచి సేకరించి ఒకచోట అందుబాటులో ఉంచుతారు. ఆ పుస్తకాలను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అలాకూడా కొనలేని పిల్లలకు వాటిని ఉచితంగా ఇస్తారు. ఈ విధానాన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఆచరిస్తే పేద తల్లిదండ్రులు ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు కొత్త పుస్తకాల ముద్రణ తగ్గుతుంది కనుక పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పేరెంట్స్ కూడా పూనుకుని తమ పిల్లలు చదివేసిన పాఠ్యపుస్తకాలను కాలనీలలో ఉండే లైబ్రరీలకు ఇస్తే.. పుస్తకాలు కొనలేని వాళ్లు వాటిని తీసుకుంటారు. ఏడాది మధ్యలో పిల్లలు పుస్తకాలు పోగొట్టినప్పుడు లైబ్రరీలో ఉండే ఈ పుస్తకాలు పెద్ద ఆసరా అవుతాయి. అక్షరం అమూల్యం టెక్ట్స్ బుక్ జీవితకాలం తొమ్మిది నెలలో ఏడాదో కాదు. వాటికి దక్కాల్సిన గౌరవం కాగితం తూగే బరువుతో కాదు. పుస్తకం విలువ వెలకట్టలేనంత విలువైన సమాచారం. అమూల్యమైన వాటిని అంతే అమూల్యంగా వాడుకోవాలి. ఢిల్లీలో మొదలైన ఈ బుక్ బ్యాంక్ ఉద్యమం అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలి. పాఠ్య పుస్తకాల జీవితకాలం ఎంత ఉంటుంది? ఏడాది అనుకుంటాం కదా! ఏడాది అన్నది విద్యాసంవత్సరానికి మాత్రమే కానీ, పుస్తకానికి కాల పరిమితి అంటూ ఉండదు. పాత విద్యార్థులు వెళ్లిపోయి, కొత్త విద్యార్థులు వచ్చినా మళ్లీ ఇదే పుస్తకాన్నే కదా చదవాలి. అందుకే జాగ్రత్తగా వాడుకున్నంత కాలం, వాడుకోవడం తెలిసినంత కాలం పాఠ్యపుస్తకాలు నిలిచి ఉంటాయి. సిలబస్ మారే వరకు పాఠ్యపుస్తకాలు కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విద్యార్థులే. -
కార్మికులూ.. త్రిఫ్ట్ పథకంలో చేరండి
సిరిసిల్ల: ప్రతీనేత కార్మికుడు త్రిఫ్ట్ పథకంలో చేరాలని, కుటుంబాలకు పొదుపు అలవాటు చేయించాలని సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు కోరారు. పట్టణంలోని మరమగ్గాల సాంచాల మధ్య కార్మికులకు త్రిప్ట్ పథకంపై ఆదివారం అవగాహన కల్పించారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి త్రిప్ట్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కార్మికులు తమ నెలవారి సంపాదనలో 8శాతం బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని, మరో 8 శాతం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇలా.. నెలకు రూ.800 జమ చేస్తే.. మరో రూ.800 ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మూడేళ్ల తర్వాత రూ.75 వేల వరకు కార్మికుడికి అందుతుందని వివరించారు. -
ఎంత సంపాదించామన్నది కాదు..పొదుపు
‘ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో జీవితాన్ని అనుభవిస్తాం’ అనే వాక్యం అప్పుడప్పుడు వింటూనే ఉంటారు. ఎక్కువ యువత నోటినుంచి వినపడుతుంది. అయితే సంపాదించి నాలుగు పైసలు దాచుకునే వయసు కూడా ఇదేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం చేసే కొత్తల్లోనే పొదుపుని అలవాటు చేసుకోవాలి. పెళ్లయ్యాక...పిల్లలు పుట్టాక బాధ్యతలు నెత్తినపడ్డాక నేర్చుకోవాలంటే కష్టం. ఉద్యోగం చేసే అమ్మాయికి తల్లిగా మీరు చెప్పాల్సింది చెప్పాలి. అమ్మాయిలు కొన్ని ముఖ్యమైన విషయాలు విని ఆచరణలో పెట్టాలి. మీ పిల్లలకి పాకెట్‌మనీ ఇవ్వడంతో పాటు పొదుపు మంత్రం కూడా చెప్పాలి. ఇచ్చిన డబ్బునంతా ఖర్చుపెట్టకుండా కొంత డబ్బుని పక్కన పెట్టుకోవడం అలవాటు చేయండి. పిల్లలు అడిగినపుడు అన్ని సమయాల్లో డబ్బులుండకపోవచ్చనే ప్రాక్టికల్ విషయాల్ని చెబుతుండాలి. పొదుపు అలవాటు కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎదుర్కొనే ఆర్థిక సమస్యల గురించి ముఖ్యంగా టీనేజ్అమ్మాయిలకు ఉదాహరణలతో వివరించి చెప్పండి. మీ అనుభవాలను పిల్లలకు చెప్పడం వల్ల వారికి అప్పటికి అర్థమవకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా గుర్తుకొచ్చి జ్ఞానం తెప్పిస్తాయి. పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలనే తల్లిదండ్రులు కలలు కంటారు కానీ, వారికి పొదుపు లక్షణాలు ఎంతవరకూ అలవడ్డాయనే విషయం గురించి పెద్దగా ఆలోచించరు. ఉద్యోగం వచ్చిన కొత్త కదా అని కొందరు తల్లిదండ్రులు మొదటి మూడు నాలుగు నెలలు జీతం గురించి పిల్లల్ని అడగరు. దీనివల్ల అప్పటికే వారికి సొంత ఖర్చులు అలవాటైపోతాయి. అవసరానికి మించి ఎక్కువగా ఖర్చుపెట్టుకోవడాన్ని తొలిరోజుల్లోనే ఖండిస్తే తర్వాత ప్రత్యేకంగా సాధన చేసే పనితప్పుతుంది. పెళ్లికి ముందు తర్వాత కూడా పర్సనల్‌గా కొంత డబ్బు ఉండాలన్న ఆలోచననను బలంగా మనసులో నాటుకునేలా అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయాలి. లేదంటే ‘ఏదన్నా అవసరమొస్తే...అమ్మానాన్న ఉన్నారుగా, భర్త చూసుకుంటారు కదా!’ అనే ధీమాలో ఉంటారు. ఉద్యోగం చేసుకునే మహిళలు కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలామంది అమ్మాయిలు పెళ్లయిన కొత్త కదా అని మూడునాలుగేళ్ల వరకూ పొదుపు మాటెత్తకుండా ఖర్చుపెడుతుంటారు. కానీ భవిష్యత్తులో వచ్చే బాధ్యతల వల్ల ఖర్చులే తప్ప ఆదాయానికి అవకాశం ఉండదని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలాంటి పొరపాట్లు జరక్కుండా ఉండాలంటే పెళ్లికి ముందే మీ సంసారాన్ని ఉదాహరణగా చూపుతూ ఆర్థిక విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతుండండి.